"ముందు మా అమ్మనోటి మీద నుంచి చేయి తీసేయ్!" కోపంగా అన్నాడు నాగరాజు.
"ఆల్ రైట్ తీసేస్తున్నాను. ఇక నువ్ తక్షణం వారినిక్కడినుంచి అదృశ్యం చేసే కార్యక్రమం ప్రారంభించు! ఒకవేళ అది నీకు కష్టమైతే చెప్పు- ఫేమస్ మెజీషియన్ షాడోనిపిలిపిస్తాను రెండు నిమిషాల్లో ఎవరినయినా సరే మాయంచేసేస్తాడు." నాగరాజుకేం చేయాలో తోచలేదు.
ఓ పక్క తెగించినభార్య-
మరో పక్క తనను ఎటాక్ చేయడానికి సిద్దంగా వున్న ఇద్దరు వ్యక్తులు-
"అమ్మా! మీ ఇద్దరూ ఇక్కడినుంచిపదండి! దానిని నేను తీసుకొస్తాను" అన్నాడు.
ఇద్దరూ టిఫిన్ కారియర్లు, బాగ్ లు తీసుకుని కోచ్ చివరకు నడవసాగారు.
భవానీశంకర్ ఆనందంగా చప్పట్లు కొట్టాడు.
"శభాష్ బ్రదర్! నువ్వూ షాడో కంటే తక్కువేమీ కాదు. క్షణాల్లో మీ అమ్మనూ, అక్కనూ అదృశ్యం చేశావ్! ఇప్పుడు అదే పద్దతిలో నిన్ను నువ్ కూడా అదృశ్యం చేసుకోబ్రదర్! మేమందరం కళ్ళు మూసుకుంటాము. వన్ - టూ - త్రీ- అని మేము కళ్ళుతెరిచేసరికి నువ్వీచుట్టుపక్కల ఎక్కడా కనిపించవన్నమాట!-".
"నేను దానిని తీసుకెళతాను- "మొండిగా అన్నాడు నాగరాజు.
రజని అంతకంటే మొండిగా అంది. "నేనురాను! రాను! రాను!"
"నేను నిన్నేమీ చేయను, అనను- వచ్చేసెయ్!"
"నేను రాను!"
"రాకుండా ఏం చేస్తావ్?"
"మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను!"
ఆ జవాబుతో భవానీశంకర్ కూడా ఉలిక్కిపడ్డాడు.
"ఏమిటీ- నీకు మళ్ళీ పెళ్ళి కావాలా?" రౌద్రంగా అడిగాడు.
"అవును నన్ను గోదావరి నదిలోముంచి చంపేసి ఇంకోపెళ్ళి చేసుకోవాలని నువ్వు అనుకోలేదూ? అందుకే నిన్ను వదిలేసినేనే ఇంకో పెళ్ళి చేసుకుంటాను."
"ఓహోహో! కథ పాకాన్న పడింది బ్రదర్! చాలా చాలా రహస్యాలు బయట పడుతున్నాయ్. అయితే నువ్వూ, మీ అమ్మా, మీ అక్కా కలిసి ఈ ఆడకూతుర్ని గోదావరిపాలు చేసి మళ్ళీకానుకలతో ఇంకో గంగిరెద్దు మెడలోతాళి కట్టాలని ప్లాన్ అన్నమాట! అహాహ! ఒండర్ ఫుల్ ప్లాన్! కమాన్ సిస్టర్! ఇంకాసేపు మాట్లాడు! వీడి మిగతా రహస్యాలన్నీ కూడా బయటికొచ్చేస్తాయి. వీడే కాకుండా వీడి ఫ్రెండ్స్ భార్యల్ని కూడా ఎలా తగలేసిందీ, వారి శవాలు ఎక్కడెక్కడపాతి పెట్టిందీ, వాళ్ళ అస్తిపంజరాల్ని ఏ మెడికల్ కాలేజీలో అమ్మిందీ-"
నాగరాజు పళ్ళుపటపట కొరుకుతూ భవానీశంకర్ వేపు చూశాడు.
"ఏయ్ మిస్టర్! నీకిది లాస్ట్ వార్నింగ్! నేను నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోకు."
"పిచ్చివాగుడు వాగకు బ్రదర్! ఆ పిల్ల నువ్ తన భర్త కాదని స్టాంప్ పేపరుమీద రాసిస్తానంటోంది."
"ఏమే! నువ్ నాతో రావుకదూ?" రజనివేపు మింగేసేలాచూస్తూ అడిగాడు మళ్ళీ-
"రానని ఒకసారి చెప్పాను.
"అంటే నిన్ను సపోర్టు చేసేవాడి నెవడినోముందే వెతుక్కున్నావన్నమాట!"
"అవును! నీలాంటిదగుల్భాజీని పెళ్ళి చేసుకున్నాక మనిషి' అనేవాడిని వెతుక్కోకతప్పదు. ఇదుగో- ఇతనితోనేనేను వెళ్లిపోతున్నాను" అంటూ విశ్వం చేయి పట్టుకుందామె.
భవానీశంకర్ మళ్ళీ నిశ్చేష్టుడయ్యాడు.
నాగరాజు అమాంతం విశ్వంమీద కలబడ్డాడు.
"మీ ఇద్దరూ పొద్దున్న గుసగుసలాడుతున్నప్పుడేనాకు అనుమానం వచ్చిందిరా రాస్కెల్! ఎన్నేళ్ళనుంచి సాగుతోంది మీ వ్యవహారం!"
భవానీశంకర్ చప్పున నాగరాజుని వెనక్కులాగి నిలబడ్డాడు.
"ఇదిగో చూడు బ్రదర్! నీ పేరేమిటి?"
"నాగరాజు."
"ఫెంటాస్టిక్ నేమ్! ఎవరుపెట్టారునీకీపేరు?"
"అదంతా నీకనవసరం."
"అవసరం బ్రదర్! నీకు పేరు పెట్టినవాళ్ళు తప్పకుండా ఆ తరువాతనయినా, ముందయినాగాని మెంటల్ హాస్పిటల్లో చాలాకాలం గడిపి వుంటారు. లేకపోతే నీలాంటిచీమూ, నెత్తురులేని వెధవలకు అంత మంచిపేరు పెట్టరు."
"ఏయ్-మాటలుతిన్నగా రానీ!"
"తిన్నగానే వస్తున్నాయ్ బ్రదర్! నీలో నిజంగా చీమూ, నెత్తురుఉన్నట్లయితే ఇంకా ఇంకోడితో వెళ్ళిపోతాననే భార్యను కౌగలించుకుని నువ్విక్కడే వుండాలంటూ ఏడవకు."
నాగారాజుకి ఆ మాటలు ఈటెల్లా తాకుతున్నాయ్. విశ్వం భవానీ దగ్గరకొచ్చాడు. "చూడండి సార్! ఒకరికి దేవతలా కనిపించిన యువతి మరొకరికి రాక్షసిలా కనిపించవచ్చు. అది ఆ దృష్టి లోపమే కాని ఆ యువతి లోపం కాదు. రజని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆమెను నేనే వివాహం చేసుకోవాలనుకున్నాను-కానీ కుదరలేదు. ఆమె ఈ రాక్షసుల చేతిలో అనుభవిస్తోన్న బాధలు తెలుసుకునికూడా ఏమీచేయలేకపోయాను. ఎందుకంటే నా కప్పటికే పెళ్ళయిపోయింది" అన్నాడు విశ్వంభవానీశంకర్ తో.
భవానీ మళ్ళీ షాక్ తిన్నాడు.
"అయితే ఇతనికి పెళ్ళయిందని నీకు తెలుసా సిస్టర్?" రజనిని అడిగాడతను.
"తెలుసు!"
"తెలిసి కూడా అతనితోవెళ్ళిపోతానంటున్నావా?"
"అవును."
"అదేమిటి సిస్టర్! అతనికోభార్య వుందికదా?"
"ఫరవాలేదు. ఆమెకూడా వప్పుకుంది. ఒకవేళవాళ్ళింట్లో నన్ను నౌఖరుగా చూసినా ఫరవాలేదు. ఈ రాక్షసుల దగ్గర జీవితాంతం ఉండటం కంటే నన్ను మనిషిగా చూసేవాడి దగ్గర కొద్దిరోజులున్నా చాలు."
"అద్బుతం సిస్టర్! కొత్తరకం లవ్ ట్రయాంగిల్! ఆలస్యం లేకుండా ఎక్స్ పరిమెంట్ ప్రారంభించండి! విష్ యూ బెస్టాఫ్ లక్! ఏమోయ్ నాగరాజూ! టి.వి. సీరియల్ చూస్తున్నట్లు ఏమిటా పిచ్చి చూపులు? త్వరగా వెళ్ళి అమ్మనూ, అక్కనూ కలుసుకో! ముగ్గురూ కలిసి 'సారే జహాసె అచ్చా ఆంద్రప్రదేశ్ హమారా' అనే పాటపాడుకోండి. పొండి! వాడ్డు యూసే మిస్ జయసుధా?"
"అదే కాకుండా నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఇంకేదో పాట కూడా టి.వి.లో వస్తూంటుంది. అదిపాడుకున్నా ఫరవాలేదు" అంది జయసుధ.
నాగరాజు కోపంగా చూశాడు.
"సరే! వాడితో పోతున్నావ్ కదా! మళ్ళీ నా యింటి మొఖం చూశావంటే అక్కడే నరికిపారేస్తాను" అని వడివడిగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
రజని మొఖంలో ఆనందం, దుఃఖం రెండూ కనిపించినయ్.
కన్నీరు తుడుచుకుంటూ భవానీశంకర్ వేపు చూసింది.
"థాంక్స్ అన్నయ్యా! మీరు సమయానికి అడ్డుకోపోయినట్లయితే నా ప్రాణాలు పోయివుండేవి."
"బైదిబై- మీ కార్యక్రమం ఏమిటి సిస్టర్?"
"తెలీదు- ఇదంతా ఏమాత్రం ఆలోచనలేకుండా సడెన్ గా జరిగిపోయిన విషయం."
"అంటే-మీరిద్దరూ కావాలని ఈ ట్రెయిన్ లో కలుసుకాలేదా?"
"లేదు-ఉదయంనిద్ర లేచేవరకూ తెలీదసలు. ఇద్దరం పక్క పక్కన బెర్తుల్లోనే వున్నామని-"
"మరింత హఠాత్తుగా ఎలా నిర్ణయం తీసుకోగలిగారు?"
"ఈ ట్రెయిన్ కి ప్రమాదం జరగబోతోందని అందరూ గగ్గోలెత్తే సరికి ఒక్కసారిగా తెగింపువచ్చింది. ఎలాగూ చావబోతున్నప్పుడు ఇంకెందుకు వాళ్లకి భయపడాలి? కనీసం ఈ కొద్దిసేపయినా నన్ను ప్రాణంగా చూసుకునే విశ్వానికి ఎందుకు భార్యగా మసలగూడదు? కనీసం ఆఖరి క్షణాల్లో నయినా వాళ్ళకు గుణపాఠం ఎందుకు చెప్పకూడదు?-అందుకే...."
"ఆల్ రైట్! కమాన్-మాతో పదండి- ఇంకా మిగతా కోచ్ లలో కూడా నిద్రపోతూన్న చాలా మందిని నిద్రలేపాలి" అన్నాడు భవానీశంకర్.
అందరూ ముందుకి నడిచారు.
డివిజినల్ సేఫ్టీఆఫీసర్ జయకర్ కంట్రోలర్ చెప్పిన ఇన్ ఫర్మేషన్ వింటూనే షాక్ తిన్నాడు. 8 డౌన్ యాక్సిడెంట్ అవకతప్పదని అతనికి అర్ధమయింది. ఎందుకంటే పెదవడ్లపాడు దగ్గరున్న ఓ చిన్న బ్రిడ్జిమీద ఇంజినీరింగ్ వర్కు జరుగుతోంది. రాత్రింబవళ్ళు ట్రెయిన్సు అన్నీ వేగంనిబంధనలు పాటించాల్సి వుంది.
ఏ ట్రెయిన్ అయినాగానీ 30 కిలోమీటర్లవేగం దాటితే ఆ బ్రిడ్జి మీద రైల్వే ట్రాక్ తొలగిపోయే అవకాశం వుంది.