Previous Page Next Page 
8 డౌన్ పేజి 38

    అంటే తన డివిజన్లో మరో యాక్సిడెంట్ జరుగబోతోంది. అది యాక్సిడెంట్ కాదు. మేజర్ యాక్సిడెంట్!
    ఛటుక్కున కంట్రోల్ ఫోను అందుకున్నాడతను.
    "హలో పెదవడ్లపూడి!"
    "యస్సార్!"
    "డి.యస్.వో. హియర్! అక్కడ పి.డబ్ల్యూ.ఐ. ఉన్నాడా?"
    "ఉన్నారు సార్! ఇప్పుడే వచ్చారు."
    "పుట్ హింమ్ ఆన్ ఫోన్"
    వెంటనే ఫోన్ మీదకొచ్చాడతను.
    "హలో, రమణా!"
    "యస్సార్!"
    "8 డౌన్ సంగతి తెలిసింది కదా?"
    "అవున్సార్!"
    "మరి 'కాషన్ ఆర్డర్' వున్న ఆ బ్రిడ్జి సంగతేం చేశారు?"
    "అదే- పెదవడపూడి బ్రిడ్జి"
    "మైగాడ్! ఆ విషయం ఆలోచించనేలేదు!"
    "ప్లీజ్- డూ సమ్ థింగ్! బహుశా మీకు ఏమిచేయడానికయినా అయిదు నిముషాలకన్నా ఎక్కువ టైమ్ వుండదు."
    కంట్రోల్ ఫోన్ లో ఉన్న మృదులకు డి.యస్.వో. జయకర్ గొంతు వినగానే ప్రాణం లేచివచ్చినట్లయింది.  
    జయకర్, తనూ ఇద్దరూ ఒకటే బాచ్ కి చెందినా ఆఫీసర్లు తామిద్దరిమధ్యా మంచి స్నేహం వుంది. అతను ఈ కొద్ది సంవత్సరాలలోనూ చాలా డివిజన్లలో పని చేశాడు. కానీ అతడు డి.సి.యస్.గా పనిచేసినప్పుడు ఒక ఎం.పి.తో పేచీ పడటంవల్ల అతని రికార్డు పాడయింది. ఆ ఎం.పి. రైల్వే మినిస్టర్ కి అతి సన్నిహితుడు. ఆ కారణంగా అతనికింతవరకూ జె.ఏ.గ్రేడ్ రాలేదు.
    "హలో జయకర్!" పిలిచిందామె ఆత్రుతగా.
    "యస్ మృదులా! గుడ్ మాణింగ్!"
    "అఫ్ కోర్స్!"
    "మీరు కృష్ణా కెనాల్ కెలావెళ్ళారు?"
    "నైట్ ఇన్స్ పెక్షన్ కెళ్ళి వస్తూ ఇక్కడ ఆగాను. ఆగ్గానే 8 డౌన్ వచ్చింది."
    "ఇప్పుడో ప్రాబ్లెమ్ వచ్చింది."
    "ఏమిటది?"
    "8 డౌన్ ఎలాగోలా దుగ్గిరాలవరకూ వెళ్ళాక రైజింగ్ గ్రేడియెంట్ వుంటుంది కాబట్టి స్పీడ్ అరెస్ట్ అయి ఆగిపోతుందని ప్లాన్ చేశాను."
    "అఫ్ కోర్స్! మీ ప్లాన్ సెంట్ పర్సెంట్ బ్రిల్లియెంట్!"
    "కానీ అనుకోకుండా దుగ్గిరాల దగ్గర గూడ్స్ ట్రెయిన్ పార్ట్సు అయిందని ఇప్పుడే ఇన్ ఫర్మేషన్ వచ్చింది."
    "మైగాడ్! డిజాస్టర్ తప్పదు"
    "అవును!"
    "సెకండ్ పోర్షన్ త్వరగా క్లియర్ చేయాలన్నా అర్ధగంట పడుతుంది. అంత టైమెక్కడుంది? తెనాలి- విజయవాడ మధ్య ముప్పయ్ ఏడు నిమిషాల టైమ్ కంటే తక్కువే పడుతుంది సాధారణంగా. అలాంటిది షుమారు వంద కిలోమీటర్ల వేగంతో పోతున్న ట్రైన్ ఇంకా తక్కువ టైమ్ లోనే కవర్ చేస్తుంది."
    "జయకర్!"
    "యస్!"
    "అనుకోకుండా ఈ గూడ్స్ ట్రెయిన్ టు పార్ట్సు అయిందన్న ఇన్ ఫర్మేషన్ వచ్చేసరికి నా బ్రెయిన్ పనిచేయటం లేదు. కెన్ యూ డూ సమ్ థింగ్ ఎబౌటిట్?"
    "నేనా? నేనేం చేయగలను? అదీగాక అయామ్ హియర్ ఇన్ కృష్ణా కెనాల్"
    "ఏమో! జయకర్! ఐ డోంట్ నో! టెన్షన్ ఫ్రీగా వున్నప్పుడు బెటర్ అయిడియాస్ రావచ్చు. అదీగాక యూనో అవర్ డి.ఆర్.ఎమ్. అయామ్ పానిక్!"
    "ఓ.కే. మృదులా! నాకేదయినా తడితే డెఫినెట్ గా కాంటాక్టు చేస్తాను."
    "థాంక్యూ!"
    జయకర్ చకచక ఆలోచించసాగాడు. టేబుల్ మీదున్న ట్రెయిన్ రిజిష్టర్ తీసుకుని బ్లాంక్ పేజీ ఒకటి చింపి పెన్సిల్ తో ప్లాన్ గీసుకోసాగాడు.
    మృదుల ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే ఎ.వో.యస్ ఇంకో ఫోన్ ఆమె చేతికిచ్చాడు.
    "యస్" అందామె.
    "హలో మిస్ మృదులా! అయామ్ వినోద్ ఎగైన్!"
    మృదులకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది. అతను ఇలాంటి సమయంలో తనను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమిటో తెలీటంలేదు.
    "యస్ వినోద్!"
    "ఇక్కడ ఇంతవరకూ మీ వంటతను రాలేదు మృదులా! మాకేమో ఎర్లీ మాణింగ్ అయిదుగంటలకే కాఫీ అలవాటు! డాడీ మమ్మీ కూడా బెడ్ కాఫీ తాగుతారు."
    "ప్యూస్ నడిగారా! వంట వాడెందుకురాలేదో?"
    "అడిగాను. పిలుచుకొస్తానని వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఇంతవరకూ రాలేదు."
    "ఐసీ! అయామ్ సారీ మిస్టర్ వినోద్! మీకు సహాయం చేయలేనిస్థితిలో వున్నాను. ప్లీజ్! హెల్ప్ యువర్ సెల్ఫ్!"
    "ఇట్సాల్ రైట్!" ఫోన్ డిస్కనెక్ట్ చేశాడతను.
    మృదుల అతి కష్టంమీద కోపం అణుచుకుంటూ రిసీవర్ పెట్టేసింది. అప్రయత్నంగా ఆమె నోటివెంబడి 'మేనర్ లెస్' అన్న పదం వెలువడింది.
                                                                 * * *
    డాక్టర్ ఫణి ఆదుర్దాగా కిటికీలోనుంచి బయటకు చూశాడు.
    ట్రెయిన్ అప్పుడే కృష్ణా కెనాల్ స్టేషన్ దాటుతోంది.
    అతనిలో మొదటిసారిగా ఆదుర్దా కలిగింది.
    తను ఇంతవరకూ ఎన్నో పథకాలు అమలుపరచాడు. వాటిల్లో ఏ ఒక్కటికూడా విఫలం కాలేదు. అన్నీ అత్యంత ప్రతిభావంతంగా విజయవంతం చేయగలిగాడు. కానీ ఈసారి- పరిస్థితులన్నీ వరుసగా తమ వశంలో లేకుండా పోతున్నాయి. ఎయిర్ కండిషన్ కోచ్ లో ఇంకా గందరగోళంగానే వుంది. ప్రయాణీకులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతూ అరుస్తూ కేకలు పెడుతున్నారు. ప్రమాదం జరగటం ఖాయమనే అనిపిస్తోంది.
    జమదగ్ని, చంద్రిక ఫణి వేపే చూస్తున్నారు. వాళ్ళ మొఖాల్లో కూడా కలవరం కనబడుతోంది. ఇప్పుడు తామేం చేయాలో వారికీ తోచడం లేదు.
    హోమ్ మినిష్టర్ రఘునాథ్ కి క్షణక్షణానికీ ఆదుర్దా పెరిగిపోతుంది. తన ప్రాణానికి ఈ వారంలో అపాయం అని వారఫలాల్లో రాశారుగానీ తను 'చెడు'కి సంబంధించినంతవరకూ వారఫలాలను రాసినప్పుడే నమ్ముతాడు. అందుకే పట్టించుకోలేదా శకునాన్ని.
    కానీ ఇప్పుడు ఖచ్చితంగా నిజమయ్యే క్షణం దగ్గరకొచ్చింది. ఏ విధంగా చూసినా తను బ్రతకటం కష్టం. నక్సలైట్స్ కి తోడు ఇప్పుడు ఈ ట్రెయిన్ కి బ్రేక్స్ ఫెయిలవటం- అంతటి విపత్కర పరిస్థితిలోనూ రఘునాథ్ కి నవ్వు వచ్చింది...
    తను ఈ ప్రయాణంలో ప్లాన్ చేసిందేమిటి? జరిగిందేమిటి? హోమ్ సెక్రటరీ విజయకుమార్ ని అంతం చేయాలనుకుంటే అతను రక్షింపబడి తనే అంతం కాబడేస్థితికొచ్చాడు.
    రఘునాథ్ విజయ్ కుమార్ వేపు చూశాడు. విజయ్ కుమార్ దీనంగా కూర్చుని వున్నాడు. అతని పక్కనే కూర్చున్న సంగీత పిల్లలిద్దరినీ తన దగ్గరకు తీసుకుని ఆందోళనగా చూస్తోంది.
    "డాడీ! ఎందుకు అందరూ అలా అరుస్తూ పరుగెడుతున్నారు?" అడిగాడు విమల్.
    "ఏమో! మనకేం తెలుసు?"
    "ఈ ట్రెయిన్ కి యాక్సిడెంట్ అవుతుందా మమ్మీ?" అడిగింది సుష్మ.
    "అవదు" అంది సంగీత.   
    "మరి టి.టి.యి. ఇందాక అవుతుందని చెప్పాడు కదా?"
    "ఊరికే అన్నాడు."
    "ఒకవేళ యాక్సిడెంటు అయితే మనందరం చచ్చిపోతాం కదూ?"
    "సుష్మా! ఏమిటా మాటలు?" కోపంగా అంది సంగీత. కానీ ఆమె మనసులో ఆ ప్రశ్న సముద్ర కెరటాల్లా ఒకదానిమీద ఒకటి విరుచుకుపడే భావాలను వదిలినట్లయింది. అవును! ఇవి తామందరికీ ఆఖరి ఘడియలు కావచ్చు. తనకూ, సుష్మాకూ, విజయ్ కుమార్ కి, విమలకూ...
    పూర్తి కుటుంబం తుడిచిపెట్టుకుపోవచ్చు!
    ఆమె విజయ్ కుమార్ వేపు చూసింది.
    సరిగ్గా అప్పుడే అతనూ ఆమెవేపు చూశాడు.
    ఇద్దరి కళ్ళల్లోనూ ఒకటే భావన! చావు వెలికితీస్తోన్న జ్ఞాపకాలు. తీపి, చేదు స్మృతుల సమ్మేళనం!
    పెళ్ళిచూపులకు కలుసుకున్నప్పుడూ, హనీమూన్ కి ఎన్నెన్నో నగరాలు తిరిగిన జ్ఞాపకాలు.
    పిల్లల్ని పెంచే విషయంలో ఎన్నెన్ని సరదాలు, ఎన్నెన్ని మధుర స్మృతులు...కోపాలు, తాపాలు, ఒకర్ని ఒకరు ప్రాణంకన్నా ప్రేమించిన రోజులూ... ఎంతగా ఒకరిలో ఒకరు లీనమయిపోయినవారు- ఒక చిన్న విషయం కారణంగా అదీ వైవాహిక జీవితానికి పూర్వపు జీవితానికి సంబంధించిన విషయంలో ఎందుకంత పట్టింపులకు పోయారు?

 Previous Page Next Page