"మేడమ్, దుగ్గిరాల దగ్గర గూడ్స్ ట్రెయిన్ పార్ట్ అయింది"
ఆ మాటలు బాంబ్ కన్నా శక్తి వంతంగా పని చేసినాయ్. అదిరిపడి కుర్చీలోనుంచి లేచి నిలబడిందామె. భయం వెన్నెముకలోనుంచి పాకుతున్న ఫీలింగ్-
గూడ్స్ ట్రెయిన్ స్టేషన్ల మధ్యలో రెండు భాగాలుగా తెగిపోయిందంటేదానర్ధం ఆమెకు తెలుసు. 8 డౌన్ మరికొద్ది సేపట్లో శరవేగంతో వెళ్ళి చిలువూరు దగ్గర మెయిన్ లైన్ లో వుండిపోయిన గూడ్స్ ట్రెయిన్ వెనుకభాగాన్ని ఢీ కొంటుంది. దాంతో అంతా సర్వనాశనం అయిపోతుంది. 8 డౌన్ కి ఘోర ప్రమాదం, ప్రయాణీకులకు మృత్యువు, గాయాలు, దాంతోపాటు తన భవిష్యత్తునాశనం-
డి.ఆర్.ఎమ్. కేవలం ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాడు.
తన కాన్ఫిడెన్షియల్ రిపోర్టు అంతా నాశనం చేసేస్తాడు.
* * *
టి.టి.యిల సహాయంతో కోచ్ కోచ్ కీ మధ్య వుండే వెస్టిబ్యూల్స్ అన్నీ కనెక్ట్ చేయించాడు భవానీశంకర్. ఇప్పుడు మొదటి బోగీనుంచి ఆఖరి కోచ్ వరకూ దారి ఏర్పడిపోయింది. అతనితోపాటు జయసుధ కూడా తరువాత కోచ్ లోకి నడిచింది. అక్కడ ఇంకా గందరగోళంగా వుంది.
"భాయియో! బహనో!" అంటూ సైడ్ బెర్తుమీద కెక్కి అందరికీ కనబడేట్టు నిలబడి అరచాడతను.
అందరూ మాట్లాడటం ఆపి అతనివేపు తిరిగారు.
"మన బండి కొన్ని అనివార్య కారణాలవల్ల అదుపుతప్పి గుడ్డెద్దుచేలో పడినట్లు పరుగెడుతున్న విషయం మీకందరికీ తెలుసు! మనందరం ప్రాణాలతో బ్రతికి బయటపడవచ్చు-లేదా పడకపోవచ్చు. కనుక మనకు చేతనయినవిధంగా మననుమనం రక్షించుకోవాలంటే అందరూ ఆఖరి నాలుగయిదు కోచీల్లోకి చేరుకోవాలి!"
అతని మాటలు పూర్తవకుండానే సామానులుతీసుకుని పరుగెత్తసాగారు జనం. ఆ మాటలు వింటూనే నాగరాజు గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్. నాగరాజు తల్లి అప్పటికప్పుడే ఏడుపు ప్రారంభించింది.
"ఈ ముదనష్టపు దానివల్ల మన ప్రాణానికేముప్పు వచ్చిందిరానాయనా- దేవుడా!"
భవానీశంకర్ ఆశ్చర్యంగా ఆమె వేపు చూశాడు.
"అమ్మా! ముందిక్కడినుంచి ఆఖరి కోచిల్లోకి వెళ్ళిపోదాంపదండి! మనకేమీ జరగదని ఆ పెద్దమనిషి చెప్తున్నాడు కదా" అన్నాడు నాగరాజు భవానీశంకర్ ని చూపెడుతూ
అందరూ లేచి సామానులు తీసుకుని బయల్దేరబోయిఅపుడు రజని వేపు చూశారు. ఆమె ఆ గొడవతో తనకేమీ సంబంధం లేనట్లు తన సీట్లోనే కూర్చుని కిటికీలోనుంచి బయటకు చూస్తోంది. అప్పటికే ఆమె నిర్ణయం తీసుకుంది.
"ఏయ్ పద- చెప్పేదినీక్కాదేమిటి?" అన్నాడు నాగరాజు కోపంగా. కానీ రజని అతని మాటల్ని వినిపించుకోనట్
నాగరాజు కోపం పెరిగిపోయింది.
"ఏయ్ రజనీ! చెప్పేది నీకే!" మరింత బిగ్గరగా అరిచాడతను.
అయినా ఆమెలో ఏమాత్రం చలనం కనిపించలేదు. నాగరాజు తల్లి ఇంక సహించలేక తన చేతిలోని పెద్ద టిఫిన్ కారియర్ సీట్ ముందుంచి వెళ్ళి రజని జుట్టుపట్టుకుని లేపి నుంచోబెట్టటానికి ప్రయత్నించింది.
రజని లేస్తూనే ఆమెను బలమంతా ఉపయోగించి విసురుగా తోసింది. అనుకోకుండా ఎదురయిన ఆ ప్రతిఘటనకు వెనుక నిలబడ్డ కూతురి మీద పడిందామె. దాంతో తల్లీ, కూతురూ ఇద్దరూ కింద పడిపోయారు. నాగరాజు నిశ్చేష్టుడయ్యాడు.
తన భార్య అంత సాహసం చేసిందంటే అతనికి నమ్మశక్యం కావటం లేదు.
రజని అతనివేపు దెబ్బతిన్నపులిలా చూస్తోంది.
"మర్యాదగా నన్నొదిలేసిపోండి! నేనెక్కడికీరాను! ఇక్కడే వుంటాను. యాక్సిడెంట్ అయితే ఇక్కడే చస్తాను. మీతోపాటు పరుగెత్తి ప్రాణాలు రక్షించుకున్నా నాకేం ఉపయోగంఉంది? ఎలాగూ మీరు నన్నుతీసుకెళ్ళి గోదావారిలో ముంచి చంపేస్తారు- "తెగించిన దానిలా మాట్లాడుతోందామె.
నాగరాజు తల్లినీ, అక్కనూ లేపి నుంచోబెట్టాడు వాళ్ళనలా పరాభవించినందుకు రజనిని చిత్రహింసలు పెట్టాలనుంది. తనే స్వయంగా రజని దగ్గరకు నడిచాడు. అమాంతం ఆమె జుట్టు దొరకబుచ్చుకుని బలంగా చెంపమీద కొట్టాడు.
"ఏమే- నీకింత పొగరెక్కిందా? నువ్విక్కడే వుంటానంటోంది ఎందుకో నాకు తెలుసే! అదుగో, వాడికోసం!" అంటూ ఎదుటి సీట్ లో కూర్చున్న విశ్వం వేపు చూపించాడు.
"నీ యిష్టం, ఏమయినా అనుకో! నీకూ నాకు ఇంకే సంబంధమూ లేదు. నేను ఇక్కడినుంచి కదలను".
"ఎలా కదలవో నేను చూస్తానే" అంటూ మళ్ళీ ఆమెను గొడ్డును కొట్టినట్లు కొట్టసాగాడు. ఆమె అతని దెబ్బల్ని లెక్క చేయకుండా కిటికీ చువ్వల్నిగట్టిగా పట్టుకుని కూర్చుండిపోయింది.
"అయితే మొండికేస్తున్నావన్నమాట! చూస్తాను! నువ్ మొండికేస్తే నేనుఇంకా మొండికేస్తానే- నీ ప్రాణం ఇక్కడే తీస్తాను" ఆవేశంగా ఆమె తలను ఇనుప కమ్మీకేసి కొట్టసాగాడతను.
అంతవరకూ నిశ్శబ్దంగా ఆ దృశ్యం చూస్తున్న భవానీశంకర్ చప్పున అతని దగ్గరకు నడిచి భుజం తట్టాడు.
"శభాష్ బ్రదర్! కసాయి భర్త పాత్రను అద్భుతంగా పోషిస్తున్నావ్! మన ప్రభుత్వం నీ కసాయితనాన్ని గుర్తించి త్వరలో నీకు "కసాయి విభూషణ్" అనే బిరుదు ప్రధానం చేయక తప్పదు అన్నట్లు నీ ఇతర హాబీలేమిటి బ్రదర్! కేవలం పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టడమేనా లేక హత్యలు చేయుట, శవాలను పెరట్లో పాతిపెట్టుట, అస్తిపంజరములను అమ్ముకొనుట లాంటివేయమయినా ఉన్నాయా?" నాగరాజుభవానీశంకర్ చేతిని విదిలించుకుని కొట్టాడు.
"మా ఇంటి గొడవలునీ కనవసరం! వెళ్ళిక్కడినుంచి!
"మా కనవసరమా? అజ్ఞానంలో వున్నావ్ బ్రదర్! టి.వి. చూసే అలవాటు నీకు లేనట్లుంది. అందులో వచ్చేస్లోగన్స్ ఒక్కసారి గుర్తుతెచ్చుకో! ఆ బొంగురు గొంతు తెరవెనుకనుంచి టి.వి.వాళ్ళిచ్చే అరవైరూపాయల కోసం చదువుతూంటే తెరమీద అద్భుతమైన హాండ్ రైటింగ్ స్లోగన్స్ వస్తుంటాయి.
అక్షర దీపం వెలిగించండి- అజ్ఞానాన్ని తొలగించండి!
ప్రతి ఒక్కరూ చదువుకోవాలి- చదువురాని వారిని చదివించాలి!
వయసుతో నిమిత్తంలేదు - విద్య ప్రతి ఒక్కరి సొంతం
ఎంత అద్భుతమయిన సలహాలివి! పైగా ప్రాసలతో తయారుచేసిన నీతి వాక్యాలివి ప్రాసలతో వాక్యాలు తయారుచేయటం ఎవరి తరం బ్రదర్! కేవలం.
దూరదర్శన్ వాళ్ళు మాత్రమే ప్రాసల్లో ఎక్స్ పర్ట్శ్! అందుకే వారేం చేసినా, ఏం చదివినా, 'ప్రాస' తొణికిసలాడుతూంటుంది! అడపా దడపా ఆ స్లోగన్స్ ద్వారా వాళ్ళు ప్రేక్షకులను నరకయాతనకు గురిచేయటం ఎందుకనుకున్నావ్ బ్రదర్? ఇతరుల విషయంలో జోక్యం కల్పించుకోండి అని చెప్పటమేవారి ప్రధానోద్దేశ్యం. 'ఎక్కడ, ఎప్పుడు సందు దొరికితే అక్కడ జోక్యం చేసుకొనుము'అంటున్నారు. కనుక నువ్ ఆ ప్రశ్నను జాబులు-జవాబులు శీర్షికకు పంపించావంటే ప్రేమామాన్వి అందరికి చదివినిపిస్తుంది."
"ఏయ్ మిస్టర్! మా విషయంనీ కనవసరం అని చెప్తున్నాను-అది నా భార్య! దానిని నేను తీసుకెళుతున్నాను".
అతని మాటలువింటూనే రజని ఒక్కసారిగా చీత్కరించింది.
"ఛీ! నేను నీ భార్యనని చెప్పటానికి సిగ్గుండక్కర్లేదూ? భార్య అంటే అర్ధం తెలీని మృగానివి నువ్వు! పెళ్ళిలో ఆ పురోహితుడు చదివే సంస్కృతశ్లోకాలవల్లే నీలాంటిమృగాలకు అర్ధం తెలీటంలేదు. భార్యంటే నీ దృష్టిలో కామధేనువులాంటి గొడ్డు! కోరికలన్నీ కోరి, ఆ గొడ్డునుంచి రాబట్టుకున్నవిరాబట్టుకున్నాక- అప్పుడుదాన్ని కబేళకు పంపాలి! ఇంతే నీకు తెలిసింది."
భవానీశంకర్ చప్పట్లుకొట్టాడు.
"సూపర్బ్- సెన్షేషనల్ డైలాగ్స్ సిస్టర్! కీపిటప్! ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ మరికొన్ని ప్రయోగిస్తే గానీ ఆ మనిషిలోని జంతువు మరణించదు!"
నాగరాజు మరింత మండిపడుతూ రజని జుట్టు పట్టుకోబోయాడుగానీ ఈసారి అతనినివిశ్వం ఆపాడు.
"ఏయ్! ఇందాకటినుంచి నీ వాగుడు, నీ తల్లివాగుడూ, నీ అక్క వాగుడూ అన్నీ సహించి ఊరుకుంటున్నాను. ఎందుకో తెలుసా! నేను తొందరపడితే ఆ అమ్మాయిని ఇంకా హింసిస్తారని! కానీ ఆ అమ్మాయిని ఇంత రాక్షసంగా హింసిస్తూంటే సహించలేకఇప్పుడు కలుగజేసుకోడానికి నిశ్చయించుకున్నాను. మర్యాదగా ఆమెను వదిలినీ దార
దాంతో నాగరాజు తల్లిపెద్దగా అరవటం ప్రారంభించింది.
"మా అబ్బాయిని ఒక్కడినిచేసి అందరూ కలిసిబెదిరిస్తున్నారు దేవుడోయ్! ఇదంతా నీ వల్లేనే రాక్షసి ముండా! నువ్ వీళ్ళిద్దరితోనూ తైతక్కలాడిపిలిపించుకుని వుంటావ్! అందుకే ఇద్దరూ నిన్ను ఆదుకోటానికొస్తున్నారు-"
భవానీశంకర్ చప్పున ఆమె నోరు మూసేశాడు తనచేత్తో.
"చూడు మిస్టర్! వీళ్ళిద్దరినీ తీసుకుని తక్షణం ఇక్కడనుంచి వెళ్ళకపోయావంటే, నీ భార్యను చంపటానికి ప్రయత్నిస్తున్నావని ఈ రైల్లోనే వున్నట్రావెలింగ్ రైల్వే కానిస్టేబుల్ కి రిపోర్టు చేస్తాను. విట్ నెస్ నెంబర్ వన్- ఈ జెంటిల్ మెన్! నెంబర్ టూ- మిస్ జయసుధ! అర్ధమయిందా? నీకు తెలుగు అర్ధమవుతుందనుకుంటాను-" నాగరాజు తో చెప్పాడతను.