"ఆ...! శాంత వెళ్ళిపోతోందని పెందలాడే ముగించేశాం..."
"సరే! అలాగయితే మన హోటల్లోకి వెళ్ళి మీ కార్నర్ సీట్లో కూర్చుందాం పదండి. కాఫీ తాగుతూ కార్యక్రమం ఆలోచించుకోవచ్చు."
అతని వెనుకే నడిచిందామె. ఫ్యామిలీ రూమంతా ఖాళీగా వుంది. ఆ సమయంలో ఎప్పుడూ ఆ హోటల్ కి రాలేదు తను.
రెండు కాఫీ ఆర్డరిచ్చాడతను. కిటికీ అద్దాల్లో నుంచి కిందకు చూసిందామె. రోడ్డంతా ఇంచుమించుగా ఖాళీగా వుంది. సాయంత్రం పూట కనిపించే జన ప్రవాహానికీ, ఇప్పుడు కనబడుతున్న రద్దీకి పోలికే లేదు. బస్ స్టాపుల దగ్గర మాత్రం జనం అలాగే నిలబడి వున్నారు, ఎక్కువగా షాపింగ్ కోసం వచ్చిన స్త్రీలు.
"మీరేం ఆలోచిస్తున్నారో కొంచెం చెప్పకూడదూ. నేనూ అదే ఆలోచిస్తాను..." నవ్వుతూ అన్నాడు శంకర్.
"ఏమీలేదు..." నవ్వుతూ అంది సావిత్రి.
సర్వర్ కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీదుంచాడు.
"ఇవాళ్టి నుంచి రోజూ మీతో కాసేపు గడపొచ్చు కదాని చాలా సంతోషంగా వుందండీ నాకు..." ఆనందంగా అన్నాడు శంకర్.
సావిత్రి చిరునవ్వు నవ్వింది.
"మీరు నమ్ముతారో నమ్మరో గాని మీరు రెండురోజులు కనిపించక పోయేసరికి నాకు పిచ్చెక్కినట్లయిపోయింది. ఒక మనిషిని మరీ అంతగా ఆరాధించడం కూడా తప్పేననుకొంటాను..." అతను నవ్వుతూ అన్నా సావిత్రి అతని మాటలకు చలించిపోయింది.
"శంకర్...మీకు ఎలా వుందో...మీరు కనిపించకపోవడం నాకూ అలాగే వుంది..." అంది ఉద్వేగంతో... అని చటుక్కున అతని చూపుల్నుంచి దృష్టి మరల్చేసుకొంది_అతను ఆశ్చర్యం, ఆనందం నిండిన మొఖంతో తనవంక చూస్తున్నాడని తనకు తెలుసు...చాలాసేపు నిశ్శబ్దం...!"
కాఫీ తాగేశారిద్దరూ.
"ఇప్పుడు చెప్పండి...! ఎక్కడికెళ్దాం...?" అడిగాడతను.
"ఏమో! మీరే చెప్పండి!"
"మీకేమీ అభ్యంతరం లేకపోతే మాట్నీ షోకెళ్దాం! ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయించుకోడానికి సినిమా హాల్లో అయితేనే మూడు గంటలు టైముంటుంది. ఇద్దరూ నవ్వుకొని హోటల్నించి బయటికొచ్చారు.
ఆటోలో థియేటర్ చేరుకొన్నారు. కొత్త సినిమా కాబోలు చాలా రష్ గా వుంది.
"టిక్కెట్లు నేను తెస్తానుండండి...మా లేడీస్ క్యూ చాలా చిన్నది గదండీ..." తనే క్యూలో నిలబడుతూ అంది సావిత్రి.
ఆమెకు ఇరవై రూపాయల నోటు అందించబోయాడు.
"ఊహు! నా దగ్గర వుంది లెండి!" అంటూ తన పర్సులో నుంచి ఓ పదిరూపాయలనోటు తీసిందామె.
ఎప్పుడూ శాంతా తనూ లేకపోతే ఎవరయినా తన స్నేహితురాలూ, అంతే. అనేకసార్లు సినిమాహాల్లో కూర్చుని ఆనందంతో మునిగితేలుతూ రహస్యంగా మాట్లాడుతూ, నవ్వుకుంటూ కూర్చునే స్త్రీ పురుషుల మాటల్ని చూచి అసూయపడేది తను.
టిక్కెట్లు తీసుకొని ఇద్దరూ రిజర్వ్ డ్ లో కెళ్ళి కూర్చున్నారు. అతని ప్రక్కనే కూర్చోవడం ఓ విధమయిన భయం కలుగజేస్తోంది. తన ఆఫీస్ వాళ్ళెవరయినా చూస్తారేమో! చూస్తే మాత్రమేం? తనేం తప్పుచేయటం లేదుకదా! వివాహమయిన స్త్రీలుకూడా మరో ప్రియుడిని వెంటేసుకుని సినిమాలకు తిరుగుతూండటం తను ఎన్నోసార్లు చూసింది. అంతటి కానిపని కాదుగా ఇది?
"మీకు మొదటి చూపులో ప్రేమ మీద నమ్మకం లేదా?" అడిగాడతను రహస్యంగా.
సావిత్రి సిగ్గుపడింది... "ఇప్పుడా అనుమానం ఎందుకొచ్చిందసలు?"
"మన పక్కనున్న జంట ఆ బాపతేనంట! అతడు ఆ అమ్మాయితో అంటుంటే విన్నాను..."
'నాకు నమ్మకం ఉంది" అంది సావిత్రి.
"నాకసలు ఉండేది కాదు...మిమ్మల్ని చూసేవరకూ!"
"తరువాత?" అని అడగబోయి ఠక్కున ఆగిపోయింది సావిత్రి.
లైట్లారిపోయినాయి.
ఎడ్వర్టయిజ్ మెంట్ ఫిల్మ్ లు వేస్తున్నారు.
"వీటిని చిత్రవథ ఫిలిమ్స్" అంటారు. అంటే ప్రేమలని అసలు సినిమా మొదలయ్యేలోపల చిత్రవథ చేసేస్తాయి అన్నమాట. నోరు మెదిపిన అరగంటకి, మాట రాదు, మాట వచ్చిన అరగంటకి పాట రావడం...ఆ తర్వాత అర్ధంకాని లిపిలో లేని తెలుగు వినిపించటం...ఇక ముగిశాక కూడా ఇంకా ప్రేక్షకులు మిగిలితే అసలు సినిమా మొదలయి వారిని హతమార్చేస్తుందన్న మాట."
సావిత్రి అతికష్టంమీద నవ్వాపుకొంటోంది.
అసలు సినిమా మొదలయి పోయింది.
తనకు దగ్గరగా జరిగి మాట్లాడుతున్నప్పుడల్లా అతని భుజాలు తగిలి వళ్ళంతా జల్లుమంటోంది సావిత్రికి. హీరో హీరోయినూ వర్షంలో తడుస్తూ, కౌగలించుకొనే దృశ్యాలు ఆమెకు ఇబ్బంది కలగజేసినయ్. అతనివంక చూడపోతుంది.