"ఏమిటి మాట్లాడరు?"
"అలాగే అలాగే" అన్నాడు.
"ఏమిటలాగే"
"శాసిస్తాను"
"ఊరికినే కబుర్లు కాదు. ఈ సాయంత్రం నలుగురు తమ్ముళ్ళనీ కూర్చోపెట్టండి. వ్యవహారమేదో తేల్చి పారెయ్యండి."
"అలాగే అలాగే"
"ఏమిటలాగే"
"అలాగే"
ఆ సాయంత్రం రాజశేఖరం తమ్ముళ్ళు నలుగురుని సమావేశం కమ్మని కబురంపాడు. ఆరుగంటలకు అందరూ పెళ్ళాలతో సహా వచ్చి చేరారు.
"నాన్నగారు పోయి చాలా రోజులయింది" అన్నాడు రాజశేఖరం ఉపోద్ఘాతంలా.
"ఆ విషయం అందరకూ తెలుసు" అన్నాడు మూడోవాడు అతను కొంచం ర్యాష్ గా వుంటాడు.
"ఆయన మనకు పెద్దగా డబ్బూ, దస్కం మిగిల్చింది లేదు ఈ యిల్లు తప్ప"
"ఉన్న డబ్బూ, నగలూ మూడోకంటికి కనబడకుండా దాచేస్తే ఎలా మిగులుతాయి?" అన్నది రెండో కోడలు వినిపించీ వినిపించనట్లు.
"మనమందరం పెద్దవాళ్ళమైనాం. మన పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. అందుకని ఎవరికివారు భాగాలు పంచేసుకుంటే బావుంటుంది"
"ఈ సమస్య మనం చాలాసార్లు చర్చించుకున్నాం." అన్నాడు నాలుగోవాడు.
"కాని యిప్పుడు గట్టిగా చర్చించుకుని తేల్చుకుందాం"
"గట్టిగా అంటే..."
"అటో యిటో తేల్చేసుకుందాం"
నిజానికి రాజశేఖరానికి తేల్చేసుకుందామనే వుంది. కాని ఆ ఇల్లు ముక్కలు ముక్కలుగా విభజించినప్పుడు కొందరు రాజీపడక తప్పదు. ప్రతివారికీ రోడ్డువైపు భాగం కావాలి" రోడ్డువైపు భాగమొచ్చినవారికి సౌకర్యం బావుంటుంది. సైట్ వాల్యూ కూడా పెరుగుతుంది.
"ముందు రెండొందల గజాలూ నేను తీసుకుంటాను. ఈ యింటికి పెద్దవాడ్ని. నాన్నగారు పోయినప్పట్నుంచీ మీ కష్టసుఖం నేను చూశాను, చదువులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు. నాకున్న బాదరబందీలు మీకు లేవు"
"నీ సంపాదనలో ఖర్చు పెట్టలేదుకదా. నాన్నగారిచ్చిపోయిన డబ్బులో ఖర్చు పెట్టావు" అన్నాడు నాలుగో కొడుకు.
"అందులో సగందాకా మిగుల్చుకుని..." అంది అతని భార్య వినిపించీ వినిపించనట్లు.
కాని సీతాదేవి పాము చెవులకి ఆ శబ్దం సోకింది. "ఆయనిచ్చిన డబ్బుతోనే వీళ్ళందరికీ చదువులూ, పెళ్ళిళ్ళూ అయ్యాయంటావా? వీళ్ళందరికోసం నా పుట్టింది వారిచ్చిన బంగారమంతా అమ్మేశాను" అంది.
"నేనేమీ అనకుండానే ఉడుక్కుంటారెండుకు. అసలేమన్నానని?" అంది నాలుగో తోటికోడలు.
"నువ్వన్నావు. నేను స్పష్టంగా విన్నాను"
ఏం విన్నారు?"
"ఇందులో మేమేదో మిగిల్చుకుని బావుకున్నామని"
"మీ ఛండాలపు చెవులకలాగే వినిపిస్తుంది లెండి"
"నన్ను ఛండాలమంటావా?"
"మిమ్మల్ననలేదు. మీ చెవుల్నన్నాను"
"నా చెవుల్నంటే నన్నుట్టు కాదా? అవి నా శరీరంలో భాగం కాదా? ఈవేళ చెవుల్నంటావు. రేపు వేరే భాగానంటావు"
"వేరే భాగాలంటే?"
"అనదల్చుకుంటే చాలా వున్నాయి"
"అన్నీ వుడిగిపోయిన యీ వయసులో వాటి జోలికి ఎందుకులెండి?"