Previous Page Next Page 
కళ్ళు పేజి 36


    హఠాత్తుగా డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. బేరర్ లా వుండి దగ్గరకు వస్తున్నాడు. రంజిత ఉలికిపడి పమిట భుజంనిండా కప్పుకుని అతనివంక తిరిగి కోపంగా చూసింది.

 

    "పర్మిషన్ లేకుండా లోపల కెందుకొచ్చావు?"

 

    "మీరు పిలిచారుగా?"

 

    తాను ఇందాక కాలింగ్ బెల్ కొట్టిన సంగతి గుర్తొచ్చింది.

 

    "సరే, నాకు టీ కావాలి తీసుకురా" అంది.

 

    అతను విని మెదలకుండా నిలబడ్డాడు.

 

    "వెళ్ళు."

 

    "వెళ్ళను."

 

    ఆమె అతనివంక ఆశ్చర్యంగా చూసింది.

 

    "నిన్ను..." అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు.

 

    రంజిత అతనివైపు పరీక్షగా చూస్తోంది.

 

    "ఇంత అందాన్ని వృధాగా పోనివ్వకూడదు. కనీసం ఒక ముద్దైనా పెట్టుకోకుండా..."

 

    రంజిత చెయ్యి మెరుపువేగంతో పనిచేసింది. అతను తన మీదకు వచ్చేలోపల ఆమె చేతిలో రివాల్వర్ నిగనిగలాడుతూ మెరిసింది.

 

    "జాగ్రత్త! ఒక్క అడుగైనా ముందుకు వేశావంటే..."

 

    ఆ మనిషి నిర్ఘాంతపోయినట్లే ఒక్కక్షణం నిలబడి తన చేతిని బలంగా ఆమె మీదకి విసిరి, తర్వాత డోర్ వైపు వేగంగా పరిగెత్తాడు. అతనూహించినట్లు ఆమె చేతిలోని రివాల్వర్ కిందపడిపోలేదు. అతను ద్వారం దగ్గరకు చేరుకోకముందే ధన్ మని ప్రేలింది. బులెట్ అతని పాదంలో జొరబడింది. అయినా ఆ మనిషి ఆగలేదు. కాలికి తగిలిన గాయాన్ని లెక్కచెయ్యకుండా డోర్ తెరుచుకుని బయటకు పరుగెత్తాడు. రంజిత అతన్ని వెంటాడుతూ చాలా వేగంగా బయటకు వచ్చింది. వరండాలో పరుగెడుతూ కొద్దిదూరంలో కనిపించాడు. ఆమె రివాల్వర్ ని ఇంకోసారి పేల్చింది. ఈసారి గురి తప్పింది. అతనప్పటికి లిఫ్ట్ దగ్గరకు చేరుకొని ఆమె మరోసారి రివాల్వర్ పేల్చబోతూ వుండగా లోపలికి దూరిపోయి బటన్ నొక్కేశాడు. లిఫ్ట్ క్రిందకు దిగిపోయింది.

 

    రివాల్వర్ మ్రోతలు ప్రక్కగదుల్లోని వారూ, దగ్గర్లోవున్న హోటల్ సిబ్బందీ విన్నారు. గబగబ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చేతిలో రివాల్వర్ తో నిలబడివున్న రంజితను ఆశ్చర్యంగా, భయంగా చూస్తూ వుండిపోయారు. క్రింద రిసెప్షన్ దగ్గర కూర్చునివున్న మేనేజర్ కు కూడా వార్త తెలిసి గబగబ పరిగెత్తుకుని ఆమె దగ్గరకు వచ్చాడు.

 

    మేనేజర్ ని వెంటరమ్మని ఆమె గదిలోకి నడిచింది.

 

    "సురేష్ ఎలా ఉంటాడు?"

 

    అతను గుర్తులు చెప్పాడు. ఇందాక తనమీద దౌర్జన్యం చెయ్యబోయిన వ్యక్తికీ, అతనికీ పోలికలు సరిపోయాయి.

 

    "ఇప్పుడతను మీ హోటల్లో పనిచెయ్యటం లేదన్నారు కదూ."

 

    "అవును."

 

    "ఈ సెక్షన్ లో పనిచేస్తోన్న బేరర్సు ఎవరు? అంటే కష్టమర్స్ పిలిచినా, కాలింగ్ బెల్ కొట్టినా ఎటెండయ్యేవారు."

 

    "ఈ సెక్షన్ లో ఇప్పుడు డ్యూటీలో ఇద్దరున్నారు. వాళ్ళనిప్పుడే పిలుస్తాను" అంటూ అతను వెంటనే వాళ్ళిద్దర్నీ అక్కడకు రప్పించాడు.

 

    రంజిత వాళ్ళవంక చూసింది. వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతున్నారు. ఇందాక వచ్చిన వ్యక్తికీ వీళ్ళకూ పోలికేలేదు. పైగా ఇందాకటి వ్యక్తికి కాలుమీద దెబ్బ తగిలింది.

 

    "నేను కాలింగ్ బెల్ కొట్టడం వినిపించిందా?" అనడిగింది.

 

    "వినిపించింది. ఆ టైముకి నేను వేరే రూమ్స్ కి ఎటెండవుతున్నాను. వాళ్లు అవీ ఇవీ పురమాయిస్తూ ఉండేసరికి వెంటనే రావటానికి వీల్లేకపోయింది. తర్వాత వచ్చి బజర్ నొక్కాను. రెస్పాన్స్ లేదు. మీరు మళ్ళీ పిలుస్తారు కదా అని వెళ్ళిపోయాను" అన్నాడు వారిలో ఒకడు.

 

    "రూమ్ నెంబరు రెండువందల ఇరవై రెండులో వున్నవారు ఆమ్లెట్ తీసుకురమ్మని చెబితే నేను కిచెన్ సెక్షన్ లోకి వెళ్ళాను. మీరు కాలింగ్ బెల్ కొట్టిన సంగతి నాకు తెలీదు" అన్నాడు రెండవవాడు.

 

    "ఈ హోటల్లో పనిచేస్తోన్న వారందర్నీ అంటే కేవలం బేరర్సే కాకుండా, ఏ డిపార్టుమెంట్ కు చెందిన వారైనా సరే- నేను చూడాలి" అంది రంజిత.

 

    "అలాగే" ప్రస్తుతం డ్యూటీలోవున్న వారందర్నీ పిలిపించాడు. ఆమె వారందర్నీ చూసి పంపించేసింది.

 

    "నైట్ డ్యూటీలో వున్నవారు కొంతమంది ఇక్కడే వుంటారు. కొంతమంది బయట కాపురముండి వస్తూ వుంటారు" అని మేనేజర్ చకచక వాళ్ళందర్నీ రప్పించే ప్రయత్నాలు చేశాడు.

 

    రంజిత వాళ్ళందర్నీ కూడా చూసి పంపించేసింది. ఎవర్నీ ఒక్క ప్రశ్నకూడా వెయ్యలేదు.

 

    "వీళ్ళు కాకుండా సెలవులో ఉన్న వారెవరైనా ఉన్నారా?"

 

    "ఆరుగురు సెలవులో వున్నారు. స్వగ్రామాలకు వెళ్ళారు. వాళ్ళ ఫోటోలు నా దగ్గర వున్నాయి చూస్తారా?"

 

    "మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఫోటోలు ఉంచుతారేమిటి?"

 

    "ఎంత జాగ్రత్తగా వున్నా, అప్పుడప్పుడూ ఏదో క్రైం జరుగుతూ వుండటంవల్ల ఎవరికైనా ఉద్యోగ మివ్వగానే ఫోటో తీసుకొని, పూర్తి వివరాలు భద్రపరచి వుంచుతున్నాను."

 

    "గుడ్. ఆ ఫోటోలు ఒకసారి తెప్పిస్తారా?"

 

    అతను అసిస్టెంట్ మేనేజర్ని పిలిచి ఫోటోలు అంటించి వున్న పుస్తకం తీసుకురమ్మని చెప్పాడు. అసిస్టెంట్ మేనేజర్ వెళ్ళాడు.

 

    ఐదు నిమిషాలు గడిచాయి. పది నిమిషాలు గడిచాయి. పావుగంట కూడా దాటిపోయింది. అసిస్టెంట్ మేనేజర్ రావడంలేదు. మేనేజర్ చాలా అసహనంగా వున్నాడు. అసలే జరిగిన సంఘటనవల్ల అతనికి చాలా చిరాగ్గా వుంది. తాను ఎంతో డిసిప్లిన్ తో, క్షణాలమీద పనులు జరిగిపోయేటట్లుగా, హోటలుకు ఏ అప్రతిష్టా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వుంటాడు. అయినా ఏదో అఘాయిత్యం జరుగుతూనే వుంది.

 

    ఎదురుగా కనిపించిన బాయ్ ని పిలిచి అసిస్టెంట్ మేనేజర్ ని తొందరగా రమ్మని చెప్పమని అరిచాడు. మరో ఐదు నిమిషాలుపోయాక అసిస్టెంట్ మేనేజర్ వచ్చాడు. అతని మొహమంతా చెమటలు పట్టివుంది. గమనించి చూస్తే అతని చేతులు వణుకుతున్నట్లు తెలుస్తోంది.

 Previous Page Next Page