చేతిని ముందుకు జాచాడు.
"సమాధానం చెప్పు. నేను వినడానికి తహతహలాడే సమాధానం. భయంగా వున్నా తెలుసుకుని తీరాల్సిన సమాధానం. చెప్పు దుర్గా, చెప్పు? నేను మూడంకెలు లెక్కపెట్టేలోగా చెప్పేయాలి. ఒకటి....రెండు....."
మాలతి సిగ్గును పారద్రోలుకుని చప్పున అతని చూపుడువ్రేలు పట్టుకుంది.
శేఖర్ ఉత్తేజితుడయ్యాడు. "దుర్గా" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మాలతి శరీరం పులకరించినట్లయి ఆమెతల అతనిహృదయంమీద వాల్చి కళ్ళు మూసుకుంది.
అలా....ఆ దశలో రెండునిముషాలు గడిచాయి. అడుగులు చప్పుడయ్యేసరికి అతన్ని వదిలి దూరంగా జరిగింది. గోపయ్య చేతులతో రెండు పూలదండలు పట్టుకుని లోపలకు వచ్చాడు.
"అయ్యగారూ! ఇవి పట్టుకోండి."
"ఏమిటి గోపయ్యా? ఓ, పూలదండా! అవును. మేళాలక్కరలేదు, మంత్రాలక్కరలేదు, మా మనస్సులే మాకు సాక్షి. ఆమెని చూడలేని నా చూపులే, నాతో పలకలేని ఆమె పలుకులే మంత్రాక్షరాలు. రా దుర్గా!"
మాలతి గోపయ్య అందించిన పూలదండ పట్టుకుని అతనికెదురుగా నిలబడింది. ఇద్దరూ ఒకరిమెళ్ళో మరొకరు దండలు వేసుకున్నారు. గోపయ్య ఈ దృశ్యంచూసి ఒళ్ళంతా గగుర్పొడిచినట్లయి, కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. మాలతి అతనివైపు తిరిగి చప్పున అతనిపాదాలమీదకు వంగి దణ్ణం పెట్టింది.
గోపయ్య వణికిపోయినట్లయిపోయి "అమ్మా! ఏమిటది?" అంటూ ఆమెను భుజాలు పట్టుకుని లేవదీసి గుండెలకదుముకున్నాడు.
ఇంతలో బయట కారాగిన చప్పుడయింది.
గోపయ్య మాలతిని వదిలి బయటకు తొంగిచూసి "డాక్టరుగారు" అన్నాడు.
"ఏమిటి? చూస్తే అందరూ ఆనందసాగరంలో ఓలలాడుతున్నట్లున్నారు?" అన్నాడు డాక్టర్ లోపలకు ప్రవేశిస్తూ.
శేఖర్ జరిగింది చెప్పాడు. "మా దాంపత్య జీవితంలో మీరింక అడ్డుపుల్లలు వెయ్యకూడదు డాక్టర్" అన్నాడు.
డాక్టర్ నవ్వుతూ "బాగుంది. చివరకు నింద నామీదే వేశారా?" అన్నాడు.
మళ్ళీ తనే "అయినా ఇప్పుడు మీ ఆరోగ్యం ఇతరులు అసూయపడేంత బాగుంది. అయితే ఇందులో నాదేంలేదు. ఈ గొప్పతనమంతా దుర్గ కొట్టేసింది" అన్నాడు.
"డాక్టర్! మీరు నాకు పూజ్యులు. మీమీద నాకెప్పుడూ గౌరవం వుంటుంది. నేను లోపలకు వెళ్ళి బట్టలు మార్చుకునివస్తాను, కూర్చోండి డాక్టర్! రా గోపయ్యా!"
గోపయ్య సాయంతో శేఖర్ లోపలకు వెళ్లాడు.
డాక్టర్ మాలతి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా అన్నాడు. "నీకో సంగతి చెప్పాలమ్మా! శేఖర్ ఆరోగ్యం ఇప్పుడు నిజంగా బాగుంది. ఇన్నాళ్ళూ నీకు చెప్పని విషయం ఒకటుంది. ఆయనకు కళ్ళొచ్చే అవకాశముంది."
మాలతి త్రుళ్ళిపడింది.
"అవునమ్మా! క్రితంసారి ఎక్సరేకోసం తాను వెళ్ళినప్పుడు స్పెషలిస్టు ఒకరు ఇతన్ని చూడటం తటస్ధించింది. చాలా ఇంటరెస్టింగ్ కేసు అవటంచేత ఆయనంతట ఆయన అతన్ని ఎగ్జామిన్ చేశారు. గుండెకి బలం పట్టాక కళ్ళకి ఆపరేషన్ చేస్తే చూపు తప్పకుండా వస్తుందన్నారు."
మాలతి కాళ్ళక్రింద భూమి కంపిస్తోంది. ముఖమంతా స్వేదబిందువులు అలుముకున్నాయి. కళ్ళలో కాంతి నశించింది.
చివరకు నిర్ణయం తీసుకుంది. "వీల్లేదు డాక్టర్! ఆయనకేమైనా సరే కళ్ళు రావటానికి వీల్లేదు" అంది.
"మాలతీ!?"
"అవును డాక్టర్! ఆయనకు తిరిగి చూపువస్తే - ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇల్లు మళ్ళీ నరకమౌతుంది. వద్దు. కావాలంటే నన్ను శాశ్వతంగా మూగదాన్ని చేసెయ్యండి. ఆయన అంధత్వం - నా మూగతనం వీటి కలయికే నాకన్నిటికన్నా ఆనందాన్నిస్తున్నాయి. ఈ ఆనందాన్ని చేరిపేయకండి డాక్టర్!"
"కానీ....కానీ....ఈ సంగతి అతనికి తెలుసమ్మా!"
"డాక్టర్!?"
"అవునమ్మా! ఆ స్పెషలిస్ట్ స్వయంగా శేఖరంతో ఇవన్నీ మాట్లాడాడు."
మాలతికి ఆవేశం వచ్చింది. "వీల్లేదు, ఏమయినా సరే ఆయనకి ఆపరేషన్ జరగడానికి వీల్లేదు. కావాలంటే ఆ స్పెషలిస్టుతో నేను మాట్లాడతాను. ఆయన కాళ్ళమీద పడి వేడుకుంటాను. నామీద దయ చూపించండి డాక్టర్!"
మాలతి ఏడుస్తోంది.
డాక్టర్ ఆమె తలమీద చేయివేసి నిమురుతూ "నీ బాధ నేనర్ధం చేసుకున్నానమ్మా" అన్నాడు.
ఇద్దరూ ఆ స్ధితిలో ఒకటి రెండు క్షణాలుండిపోయారు. లోపల అడుగులు చప్పుడయేసరికి మాలతి దూరంగా జరిగి నిల్చుంది.
శేఖర్ లోపలినుండి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు కొత్త పెళ్ళి కొడుకులా కనిపిస్తున్నాడు.
గోపయ్య సాయంతో టెలిఫోన్ డయల్ చెయ్యటం అతను ప్రాక్టీస్ చేశాడు.
మెల్లగా ఓ నెంబరుకి డయల్ చేశాడు.
"హాలో! నమస్తే డాక్టర్! నేను శేఖర్ ని, డాక్టర్ కృష్ణారావుతో ఎక్స్ రే క్లినిక్ లో మనం కలిశాం.....ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మా డాక్టర్ గారితో ఇప్పుడే వస్తున్నాను...."
రిసీవర్ పెట్టేశాడు.
మాలతి నిర్ఘాంతపోయి చూస్తోంది. ఆమె ముఖంలో నెత్తురు చుక్క లేదు.
శేఖర్ మాలతి దగ్గరకు వచ్చాడు. "దుర్గా! నేనెవరితో మాట్లాడానోనని ఆశ్చర్యంగా వుందా? అంతా తర్వాత చెబుతాను.....పదండి డాక్టర్!"
డాక్టర్ గారు కూడా ఏమీ చెయ్యడానికి తోచనిస్ధితిలో పడిపోయాడు. మలతివంక చూశాడు.
తరువాత శేఖర్ డాక్టరుగారివెంట బయటకు వెళ్ళిపోయాడు.
గోపయ్య సంచీ తెచ్చుకుని "అమ్మగారూ! నేనలా బజారు వెళ్ళొస్తాను" అని వెళ్ళిపోయాడు.
మాలతి శిలావిగ్రహంలా అలాగే నిలబడి వుంది. ఒంటరిగా, శూన్యంలో వున్నట్లుగా, దిక్కు తోచనిదానిలా ఉండిపోయింది.