Previous Page Next Page 
అష్టావక్ర పేజి 36


    "ఎక్కడో కృష్ణాపురంలో జననాలకి- ఎప్పుడో ఒక వికృత శిశువుని కన్న ప్రతిమా అగర్వాల్ కి సంబంధం వుండి వుండదు. మనం మరీ చీకట్లో వెతుకుతున్నామేమోనని నా అభిప్రాయం".

    "అవును మరీ ఎక్కువగా వెతకొద్దు. మీ పని అయిపోగానే బాంబేనుంచి వచ్చేయండి. దీని గురించి ఆగవద్దు".

    కసిగా ఫోన్ పెట్టేశాడు.


                     *    *    *    *


    అవతార్ బాబా దగ్గిర్నుంచి ఉస్సోక్ కార్యాలయానికి వస్తూ షాడో ఆలోచించసాగాడు. అతడి మనస్సు ఇప్పుడు సగం క్లియర్ గా వుంది. బాబా దగ్గరికి వచ్చే భక్తుల్లో సగంమంది అక్కడి వాళ్ళే అని అర్ధమయ్యాక ఒక రహస్యం విడిపోయింది. ఇక ఉస్సోక్ విషయం తెలియాలి.

    ఆలోచన్లతోనే ఉస్సోక్ మెట్లెక్కాడు. అతడికి ఆశ్చర్యం కలిగింది. బయటకి ఇంత నిర్జీవంగా నిర్మానుష్యంగా కనపడే ఈ భవనం యొక్క మూసివున్న తలుపుల వెనక మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించే వ్యక్తి పుట్టుక కోసం అవిరామ కృషి జరుగుతుందని ఎవరూ కలలో కూడా వూహించలేరు.

    అతడు లోపలికి వెళ్ళాడు.

    అతడిని ఉస్సోక్ లో చేరినప్పుడు ప్రశ్నలడిగిన వృద్ధుడు అక్కడున్నాడు- అతడికోసమే వేచివున్నట్టు "ఏం చెప్పావా బాబాకి?" అని అడిగాడు, షాడో తలూపాడు.

    "నాతోరా" అంటూ వృద్ధుడు ముందుకు సాగాడు. షాడో అతడిని అనుసరించాడు. ఇద్దరూ చిన్న హాలులో ప్రవేశించారు. హాలులో అప్పటికే ఇరవై ముప్పైమంది సభ్యులు ఆసీనులై వున్నారు. ముందు ఒక వ్యక్తి నిలబడి వున్నాడు. అతడి నీడ స్టేజిమీద పొడవుగా సాగి పోయింది. చూడగానే భయం కొలిపేలా వున్నాడు.

    "అతడే మహాదష్ట" వెనుక వరసలో కూర్చున్నాక, నెమ్మదైన స్వరంతో అన్నాడు వృద్ధుడు. షాడో అతడినే చూస్తున్నాడు. మహాదష్ట చెప్పుకుపోతున్నాడు.

    "అష్టావక్రుడి జన్మ గురించి అతడి తండ్రి సిద్ధార్థకి ఒక సాధువు ద్వారా తెలిసింది. ఈ సాధువు స్వామి శివానంద శిష్యుడు. భిక్షాటన చేసుకుంటూ తిరిగేవాడు. అష్టావక్రుడి జననాన్ని ఆపుచేయటం కోసం శివానంద తనకు సాయం చేయగలడనే వుద్దేశ్యంతో సిద్ధార్థ హిమాలయాలకు బయలుదేరాడు. అయితే స్వామి శివానందని నేను చాలా రోజుల క్రితమే చంపేశానని సిద్ధార్థకి తెలీదు. ఆ మాటకొస్తే హిమాలయ గుహాంతర్భాగాల చీకట్లో శివానంద మరణించిన సంగతి ప్రపంచానికి తెలీదు. సిద్ధార్థ తిరిగి వెనక్కి నిరాశతో తిరిగిరాక తప్పదు. రాకేష్..."

    వింటూన్న షాడో ఉలిక్కిపడ్డాడు.

    "నువ్వు వెంటనే బయల్దేరు. సిద్ధార్థని కలుసుకో. అతను ప్రస్తుతం హరిద్వార్ నుండి హృషీకేష్ వెళ్ళే దారిలో వున్నాడు. నువ్వు చేయవలసిన పనల్లా, దగ్గరుండి సిద్ధార్థకి శివానంద ఆశ్రమం చూపించి, శివానంద మరణించిన విషయం తెలియబర్చడమే. ఆ తరువాత అతడికి మంచి మాటలు చెప్పి తిరిగి ఇక్కడకు తీసుకురా! అష్టావక్రుడి జనన సమయానికి సిద్దార్థ మరణం ఇక్కడే జరగాలి".

    ముందు వరసలో వ్యక్తి తలూపాడు.

    "వెంటనే బయల్దేరు".

    ఆ వ్యక్తి ద్వారం దగ్గిర కొచ్చేసరికి వెలుతురు అతడిమీద పడింది. షాడో అతడిని గుర్తించాడు.

    తన బావ రాకేష్!!!

    షాడో దిగ్భ్రాంతుడై పోయాడు.

    ఆ క్షణమే కుర్చీల మీదుగా దూక్కుంటూ వెళ్ళి అతడి ప్రాణాలు తీద్దామా అన్న ఆవేశం వచ్చింది. 'నమ్మకద్రోహి' అనుకున్నాడు. మనుష్యుల్లో రాక్షసుల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇంతకాలం తమ మధ్య వున్న రాకేష్ ఇలాంటివాడా?

    "రాకేష్" అని ఇంతలో మహాదష్ట అన్నాడు.

    "ఒక వేళ నువ్వు సరియైన సమయానికి సిద్ధార్థని ఇక్కడికి తీసుకురాలేకపోతే, అతడిని పర్వతాల మధ్యే చంపెయ్యి. ఇక్కడ అష్టావక్ర పుట్టగానే ఆ విషయం నీకు తెలియపర్చబడుతుంది. వెంటనే అక్కడ అతడిని చంపాలి. అర్ధమైందా?"

    రాకేష్ తలూపి బయటకు నడిచాడు.

    షాడో కర్తవ్యహీనుడయ్యాడు.

    తను బయటపడే సమయం ఇది కాదు.

    అక్కడ సిద్ధార్థ ప్రాణం అపాయంలో పడుతూంది.

    మహాదష్ట దూరంగా స్టేజిమీద ఉపన్యాసం కొనసాగించటానికి ఆయత్తమవుతున్నాడు. ఒక్కో నిమిషం గడిచేకొద్దీ ప్రమాదం మరింత దగ్గరవుతూంది. ఇక ఏదైతే అది అయిందని షాడో లేచి నిలబడ్డాడు. మహాదష్ట దృష్టి అతడిమీద పడింది. ప్రశ్నార్ధకంగా చూశాడు. దాంతో షాడో ముందున్న సభ్యుల తలలన్నీ వెనుదిరిగాయి.

    "ఏమిటి" అని ప్రశ్నించాడు మహాదష్ట ఈసారి ప్రకాశంగా.

    "రాకేష్ తో కలసి నేనూ వెళతాను".

    "ఎందుకు?"

    షాడో గొంతు సవరించుకున్నాడు. "సిద్ధార్థమీద పగ తీర్చుకోవాలని నాకెప్పటినుంచో వుంది. ఈ విధంగా అది తీరుతుంది".

    "ఎందుకు నీకు పగ?"

    "కేదారిగౌడ నా చెల్లెలు కాబట్టి".

    సభ్యులందరూ ఒక్కసారిగా తమలో తాము మాట్లాడుకోవటం ప్రారంభించటంవల్ల ఆ హాలంతా గుసగుస శబ్దంతో నిండిపోయింది! మహాదష్ట చెయ్యి ఎత్తాడు. సభ్యులు నిశ్శబ్దం వహించారు.

    "నాకు నా కుటుంబానికి అసలు సంబంధంలేదు. చిన్నప్పుడే నేను నా కుటుంబంనుంచి విడిపోయాను. నా తండ్రి మరణం గురించి పేపర్లో చదివి, కేవలం ఆస్తి తీసుకోవటం కోసం వచ్చాను. అప్పటికే నా చెల్లెలికి వివాహం-" షాడో చెప్పటం ఆపి సభకలియచూశాడు. తరువాత అన్నాడు- "నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. డబ్బు కోసం ఏదైనా చేస్తాన్నేను. చివరికి చెల్లెలినైనా చంపుతాను. ఉస్సోక్ కోసం నాప్రాణాలనయినా వదులుకుంటాను".

    మహాదష్ట చెయ్యిఎత్తగానే సభ్యుల హర్షధ్వానాలు ఆగిపోయాయి.

    అంతలో మహాదష్ట అన్నాడు... "సిద్ధార్థని చంపటానికి నువ్వు వెళ్ళనవసరంలేదు రవీ! సిద్ధార్థ అష్టావక్రుడి జన్మ ముహూర్తానికి ఇక్కడికే వస్తాడు. తనే స్వయంగా అష్టావక్రుడి చేతుల్లో చస్తాడు".

    ఇక ఆ ప్రసక్తి అక్కడితో అయిపోయినట్లు మహాదష్ట సభ్యుల వైపు తిరిగి సూచన్లు ఇవ్వసాగాడు-

    "హరినామ్!"

    రెండో వరుసలో వున్న సభ్యుడు లేచి నిలబడ్డాడు.

    "అష్టావక్రుడు పుట్టే సమయం ఆసన్నమయింది. అందుకు ప్రతిబంధకంగా వున్న ఒక అడ్డుని నువ్వు తొలగించాలి".

    హరినామ్ ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్నాడు.

    "పట్టణపు నడిబొడ్డున పెద్ద గుడి వుంది. ఆంజనేయస్వామి గుడి అది! దానిని సమూలంగా నాశనం చేయాలి! ఈ పరిధిలో ఆ దేముడి గుడి వుండడానికి వీల్లేదు. నీతోపాటు మరో నలుగురిని తీసుకువెళ్ళు. ఈ రాత్రికిగాని రేపు రాత్రికిగాని ఈ పని జరిగిపోవాలి".

    హరినామ్ తలూపాడు.

    వింటున్న షాడో రక్తం ఉడికిపోయింది. గుడి గురించి కాదు. గుడి ప్రాంగణంలో ఏం జరిగినా హిందువులు వూరుకోరు. వారి అనుమానం ముస్లిమ్ ల మీదకే వెళుతుంది. అందులో- సమూలంగా!

    ఇంతలో మహాదష్ట ఆజ్ఞ ననుసరించి మరొక నలుగురు సభ్యులు లేచి నిలబడ్డారు.

    "శ్రీలంక నుంచి సమర్ధనే అనే అతను మనదేశం వస్తున్నాడు. అతడి ప్రోగ్రాం ప్రకారం మద్రాసులో దిగుతాడు రేపు" -మహాదష్ట ఆగి చెప్పటం మొదలుపెట్టాడు-

    "...విమానంలోంచి దిగి బయటకు వస్తూన్న సమర్ధనేని మీరు అక్కడే చంపెయ్యబోతున్నారు" అన్నాడు.

    వాళ్ళు తలూపారు.

    షాడోకి మతిపోయింది. ఏమిటి వీళ్ళ సాహసం అనుకున్నాడు. వర్దనే మరణంతో ఏర్పడే జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి ఆలోచించటం లేదు అతడు. అవి ఎలాగూ నాశనమవుతాయి. కానీ ఈ ముగ్గురి ధైర్యం... నిండు ఎయిర్ పోర్టులో... జనం మధ్యనుంచి...

    "మీరు ముగ్గురూ మరణిస్తారు" మహాదష్ట కంఠం అకస్మాత్తుగా పలికింది. "...బహుశా గార్డులు అక్కడికక్కడే మిమ్మల్ని కాల్చి చంపవచ్చు. లేదా పోలీసులు నానా హింసలూ పెట్టి మీ దగ్గిర్నుంచి విషయం రాబట్టటానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు సమాధానం చెప్పరు. ఉస్సోక్ కోసం మీరు ప్రాణాలు అర్పిస్తారు! మీ శవాల్ని బయటికి తీసి తిరిగి ప్రాణం పోయటానికి అష్టావక్రుడిని అర్ధిస్తాను. ఒకవేళ అది జరగక పోయినా, వచ్చేజన్మలో ఉస్సోక్ కోసం తిరిగి జన్మించి అత్యున్నత స్థానాలు పొందుతారు మీరు".

    వాళ్ళ మొహాలు అదోలాంటి క్షుద్రభక్తితో ఉప్పొంగటం చూశాడు షాడో. వాళ్ళని చూస్తూంటే అతడికి కోపం రావటం లేదు. జాలేస్తుంది. ఈ మత్తులో పడిన తరువాత వారికి జ్ఞాపకం వుండేవి రెండే పదాలు 'ఆవేశం', 'త్యాగం'!!  

    ఉస్సోక్ మీదా, అష్టావక్రుడి మీదా ఇంత భక్తివున్న ఈ అనుచరులకి, చాలా జాగ్రత్తగా పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ ఇస్తున్నాడు మహాదష్ట! ఆ భక్తిని కాష్ చేసుకుంటున్నాడు!! ఎయిర్ పోర్ట్ లో వీళ్ళ ప్రాణాలు పోవటం కూడా ఖాయం! అయినా లెక్క చేయరు వాళ్ళు.

    సభ్యులందరూ లేచి నిలబడటంతో సమావేశం ముగిసిందని గ్రహించాడు అప్పుడే ఆలోచన్ల నుంచి తేరుకున్న షాడో.

    ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు.

    షాడో కూడా బయల్దేరాడు. చెయ్యవలసింది చాలా వుంది. ముఖ్యమ్గా ఆంజనేయుడి గుడి విషయం చూడాలి. రెండ్రోజుల్లో ముస్లిమ్ ల పండుగ వస్తూంది. రక్తపాతం జరగబోతూంది.

    హాలు ఖాళీ అయ్యింది. అతడే ఆఖరివాడు. అతడు గుమ్మందాటబోతూ వుంటే వెనుకనుంచి వినబడింది- 'షాడో' అని. అతడు ఆగాడు. స్టేజీ మీద అక్కడే అదే స్థానంలో నిలబడి వున్నాడు మహాదష్ట. 'ఇలారా' అని పిలిచాడు. షాడోకి ఆశ్చర్యం వేసింది. అతడు తనని ఎందుకు రమ్మంటున్నాడో అర్ధంకాలేదు. అయినా మాట్లాడకుండా అనుసరించాడు. ఇద్దరూ వెనుకవైపు చీకటి వరండాలో హాలువైపు నడవసాగారు.

    ఆ హాల్లో వెలుతురు దేదీప్యమానంగా వుంది. చాలా విశాలమైన హాలు అది. అంత హాలులోనూ మధ్యలో ఒకే కుర్చీవుంది. ఆ కుర్చీలో వున్న మనిషిని చూసి, షాడో అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి, "రంజితా" అన్నాడు కంపిస్తున్న గొంతుతో.

    రంజిత తలెత్తలేదు. డీప్ షాక్ లో వున్నట్టుంది. రక్తం తోడేసినట్టు ఆమె మొహం తెల్లగా పాలిపోయివుంది. ఏ క్షుద్రగణాల స్వరాలయితే ఉస్సోక్ సభ్యుల అంతరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రహస్యాల్ని వెలికి తీస్తాయో, ఆ గణాలే ఆమెనుంచి రహస్యాలు రాబట్టినట్టున్నాయి. నిస్సహాయురాలిలాగా, తనతోపాటూ తన ప్రియుడినీ ప్రమాదంలో ఇరికించినందుకు కృంగిపోతూన్నట్టు ఆమె అచేతనావస్థలో వుంది.

    షాడో శిలాప్రతిమలా నిలబడి వున్నాడు. వెనుకనుంచి మహాదష్ట కంఠం తాపీగా వినపడింది.

    "రాకేష్ టేప్ రికార్డర్ సంగతి చెప్పాడు. ఉస్సోక్ రహస్యం ఏ సభ్యుడూ బయటికి చెప్పలేదు. కానీ మితిమీరిన అతడి ఆవేశం అతడిని హద్దులు దాటించింది. రంజిత ఈ విషయాన్ని మర్చిపోయిందనీ, అందువల్లే ఆమెని చంపకుండా వదిలేననీ రాకేష్ అన్నప్పుడే అంత సులభంగా ఆమె ఎలా మర్చిపోతుందని నాకు అనుమానం కలిగింది. రంజితని ఇక్కడికి తీసుకురమ్మని మా వాళ్ళని పంపాను. పాపం చిన్నపిల్ల గణాల పర్యవేక్షణలో రెండు నిమిషాల్లో అంతా చెప్పేసింది. ఆ తరువాత నేను సమావేశానికి వచ్చాను. అక్కడ నువ్వు అమాయకత్వం నటిస్తూ అడిగే కోర్కెల్ని చూస్తూంటే నవ్వొచ్చింది" అంటూ నవ్వేడు.

 Previous Page Next Page