అతడు చెప్పడం ఇంకా పూర్తికానేలేదు. దూరంగా పొద చప్పుడైంది.
అక్కడ నిజానికి జయేంద్రపై తిరుగుబాటుకి 'బ్లాక్ మాంబా' ముఠా వ్యక్తులు సిద్ధపడుతున్నారు.
వారి ప్రయత్నం ఇక ఓ అరక్షణంలో మొదలవుతుందనగా ఆ పొద చప్పుడు వాళ్ళకీ వినిపించింది.
రహస్యంగా పొంచివున్న ఆ వ్యక్తులతోపాటు ఉలికిపాటుగా తల తిప్పిన శృతి కట్టెలా బిగుసుకుపోయింది.
సుమారు పది అడుగుల పొడవుగల 'కింగ్ కోబ్రా' గండి పడిన నదిలా బుసకొడుతూ దూసుకొస్తూంది.
"జయేం..." ఆమె ఆర్తనాదం గొంతు దాటిరాక ముందే, వేగంగా శృతిని సమీపించింది నాగు.
క్షణం ఆలస్యమైతే కోరలు శృతి గుండెల్లో దిగబడేవి.
కాని ప్రమాదాన్ని పసిగట్టిన జయేంద్ర చేయి ఒడుపుగా నాగు పడగని అందుకోబోయి విఫలమైంది.
అంతే...
సూర్యరశ్మిలో నల్లని మృత్యువులా మెరుస్తున్న కోబ్రా గిరుక్కున వెనక్కి తిరిగింది. అది అరలిప్త మాత్రమే.
ఉద్వేగంగా జయేంద్ర వెనక్కి తిరగబోయేంతలో నాగు కోరలు అతడి మోచేతిలో చొచ్చుకున్నాయి.
ఒకసారి కాదు...రెండు...మూడుసార్లు.
ప్రపంచానికి సుదూరంగా వున్న ఆ నిర్జీవ ప్రదేశంలో జయేంద్ర గొంతునుంచ్ ఓ సన్నని మూలుగు.
రెప్పపాటులో నాగు అదృశ్యమైంది.
కాని...
అప్పటికే కళ్ళు నీటికుండలై డాక్టర్ శృతి మరోమారు తన ప్రాణాల్ని కాపాడబోతూ ప్రమాదంలో చిక్కుకున్న జయేంద్రని చేరుకుంది. "ప్రమాదం తప్పనిసరే అయితే దాన్నుంచి మనం తప్పించుకోలేం శృతీ! పరీక్షితుడి కథ నీకు తెలుసనుకుంటాను" జయేంద్ర అన్నమాటలు సమ్మెట పోట్లలా మనసు పొరలపై ప్రతిధ్వనిస్తుంటే సహాయంకోసం చుట్టూ చూసింది.
అప్పటికే తమ పని మరో విధంగా నెరవేరినట్టు బ్లాక్ మాంబా ముఠా వ్యక్తులుసైతం అదృశ్యమైపోయారు.
* * * *
సరిగ్గా ఇదే సమయంలో...
బేగంపేట 'డేఫోడిల్స్' స్కూల్ క్లాస్ రూమ్ లోని పిల్లలు నర్సరీ రైమ్స్ ని లయబద్ధమైన పాటలా వల్లెవేస్తున్నారు.
"హికరీ డికరీ డాక్
ది మౌస్ ర్యాన్ ఆప్ ది క్లాక్"
నానీ అందమైన ఆంగికంలా చేతులు తిప్పుతున్నాడు.
ఆ చప్పుడు శబ్దతరంగాలై కిటికీ అంచున వున్న చెట్టుకొమ్మని చేరుకుంది. కొమ్మని చుట్టుకుని వున్న పధ్నాలుగు అడుగుల 'మాంబా' రోషంగా తలని కిటికీవేపు జరిపింది.
"ది క్లాక్ స్ట్రక్ వన్
ది మౌస్ రేన్ డౌన్
హికరీ డికరీ డాక్"
ఆకుల చప్పుడుకాని, మాంబా బుసకానీ వినిపించని పిల్లల ఉత్సాహం క్రమంగా ఉధృతమైంది.
నోరు తెరిచిన మాంబా కిటికీలోనుంచి రెండడుగులు లోపలికి వచ్చింది.
ముందు ఆ విషసర్పాన్ని గమనించింది నానీయే!!
కాని భయంతో గొంతు పెగల్లేదు.
మరో అరలిప్త వ్యవధిలో తన సహజ వేగాన్ని చూపుతూ పూర్తిగా లోపలికి దుమికింది.
ముందొక పసివాడి ఆర్తనాదంతో స్కూలు భవంతి ప్రతిధ్వనించిపోయింది.
ఆగిన నర్సరీ రైమ్ స్థానంలో హాహాకారాలు మిన్నుముట్టాయి.
'మాంబా' కాటుతో ఇద్దరు పిల్లలు నేలకొరిగారప్పటికే.
జరుగుతున్నదేమిటో గ్రహించింది క్లాస్ టీచర్, ఏ తల్లి మనస్సు కదిలిందో 'మాంబా' నుంచి ఓ పసివాడ్ని రక్షించాలని ముందుకురికింది. మెరుపు వేగంతో కదిలిన మాంబా కోరలు ఆమె వెన్నులో గుచ్చుకున్నాయి.
లిప్తపాటులో విషం మెదడును చేరింది. రక్తాన్ని పుక్కిలించినట్టు ఆమె భళ్ళున వాంతి చేసుకుంది.
కకావికలౌతున్న పిల్లల మధ్య కోరలుసాచిన 'మాంబా' బుస భూకంపపు ఢంకాధ్వానంగా మారింది!
ఒక ప్రచండ ఝంఝాప్రభంజనంలా రివ్వున కదుల్తూ ఉక్రోషంగా స్ప్రింగ్ లా తలపైకెత్తిన సర్పం తల ఇప్పుడు ఆరడుగుల ఎత్తుకులేచి కోరల్ని పిల్లల ఒంటిపై సూదుల్లా గుచ్చుతూంది!!
అదో మృత్యువుచేసే కరాళ నృత్యం.
సుప్త భుజంగమే లోహ విహంగమైనట్టు కదులుతున్న మాంబా కోరలచుట్టూ నెత్తుటి చుక్కలు!
కాలిపోతున్న చిన్నమొక్కల్లా, రాలిపోతున్న లేతచిగుళ్ళలా కాటుకు గురైన పసిపిల్లలు ముందు అరిచి, వెంటనే విల్లులా ఒరిగిపోతున్నారు. న్యూరోటాక్సిన్ ప్రభావానికి బలవుతున్న పిల్లల వెన్నెముకలు ఫళుక్కున విరిగిపోతున్నాయి.
ఏ ఇంట పుట్టినా, మరే యింట పెరిగినా యిలా సమసిపోవడం ఏ దుర్విధి శాపమో తెలీని పాలకుండలు పగిలి నేలకొరిగి, ఒక విషకుంభపు పొత్తిళ్ళలో తునకలౌతున్నారు.
స్కూలు తరలి వచ్చింది. కాని ఎవరూ లోనికడుగు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు.
అదేం సర్పమో అసలెటునుంచి వచ్చిందో అంత వేగంగా తన మానవహోమాన్ని ఎలా నిర్వర్తించ గలుగుతుందో దూరంనుంచి చూస్తూనే ఉన్నారు. ఊపిరి బిగపట్టి అరుస్తున్నారే తప్ప ఆ మృత్యు గహ్వారంలోకి అడుగు పెట్టలేకపోతున్నారు.
కొందరు స్పృహ తప్పిపోయారు.
మనసు ద్రవించని మృత్యువులా 'మాంబా' ఓ మూలకి దూసుకుపోతోంది.
సరిగ్గా అక్కడే కట్రాడలా బిగుసుకున్న నానీ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు "అమ్మా" అంటూ.
* * * *
"జయేంద్రా"
శృతి కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలుతున్నాయి.
అప్పటికే జయేంద్ర కళ్ళు అరమోడ్పులౌతున్నాయి.
ఏ దేవుడూ రక్షించలేని ఈ మారుమూల తనిప్పుడు చేస్తున్నది ప్రధమ చికిత్స మాత్రమే అని ఆమెకీ తెలుసు.
బ్రతికే నమ్మకం లేకపోయినా తన చీరచెరగుని చించి దుఃఖాన్ని అదిమిపెడుతూనే కాటుకి ఎగువగా కట్టింది. చేతులు తడబడుతున్నాయి. మొత్తం నిలువునా కంపించిపోతూంది.
చేతికున్న గాజు పగలగొట్టి గాయంపై క్రాస్ మార్కులా లోతుగా గంటు పెట్టగానే రక్తం ఉబికింది.
నోటితో పీల్చాలని ఆమె ముందుకొరుగుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన జయేంద్ర వద్దన్నట్లు మరో చేత్తో వారించాడు బడలికగా.
"ప్రాణాలమీదికి తెచ్చుకోకు శృతీ..." నిస్త్రాణగా అన్నాడు. "దీనికి నిజంగా కోరలున్నాయి" మృదువుగా నవ్వే ప్రయత్నం చేశాడు.
మొన్న కాటేసిందనుకున్న సముద్ర సర్పం 'ఎన్' హైడ్రినా'కి కోరలు లేవని తేల్చి చెప్పిన శృతికి యిప్పుడు కౌంటర్ గా మాటాడుతుంటే నిభాయించుకోలేకపోయింది.
"నన్నాపకు జయా...ప్లీజ్"
"ప్రాణానికి ప్రాణం పణంగా పెట్టడం నీ ధ్యేయం కాకూడదు శృతీ!"
"నాకు కాదు. ఈ సంఘానికి నీ అవసరం చాలా వుంది."
పదాలను కూడగట్టుకుంటూ యిక శృతికి రక్తం పీల్చే అవకాశమివ్వనట్టు బాధతో మెలికలు తిరిగిపోతూ బోర్లా దొర్లిపోయాడు.
"జయా...జయా..." అతడ్ని నెట్టాలని తన చికిత్స కొనసాగించాలని బలాన్ని కూడగట్టుకుంటూ చాలా ప్రయత్నం చేసింది...
జయేంద్రలో కదలిక లేదు.
అక్కడ గాలి స్థంభించిపోయింది.
శాశ్వత మనుకున్న చెలిమికి ఇంత స్వల్ప వ్యవధిలో విఘాతమేర్పడినందుకు బాధో లేక ఒక డాక్టరు అయ్యుండీ ఆ క్షణాన ఏమీ చేయలేని నిస్సహాయతకి దుఃఖమో నిశ్శబ్దంగా వెక్కిపడుతూంది.
అయిదు నిముషాలపాటు ఆమె ఎందరి దేవుళ్ళకు మొక్కుకుందో! ఇదంతా ఓ స్వప్నమైతే బాగుణ్ణని ఎన్ని శక్తుల్ని వేడుకుందో ఆమెకే గుర్తులేదు.
నెమ్మదిగా కదిలాడు జయేంద్ర.