Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 36

    గది గుమ్మానికి కుడిపక్కన చటుక్కున గోపీ ప్రత్యక్షమయ్యాడు. వాడిప్పుడు ఎప్పటికిలాలేడు. కండలు తరిగిన వస్తాదులావున్నాడు. బుగ్గమీసాలు, నున్నగా గుండుకూడా చేయించుకున్నాడు.
   
    "ఏమిటి గోపీ ఈ వేషం?" అన్నాను.
   
    "ఈ రోజు నిన్ను చావదన్న బోతున్నాను" అన్నాడు గోపీ.
   
    "ఎందుకు?" అన్నాను.
   
    "కొందరు పిల్లలు బడికివెళ్ళరు. అప్పుడు పెద్దలేం చేస్తారు? తన్ని బడికి పంపిస్తారు" అన్నాడు గోపీ.
   
    "నువ్వు నాకంటే పెద్దకాదు."
   
    "జ్ఞానముచేత వృద్దులుకానీ ఏండ్లు మీరిన వారావృద్దులు" అంటూ హుంకరించాడు గోపీ.
   
    "నువ్వు నన్ను తన్నకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?"
   
    "నేనింకేమీ చెప్పను. అన్నీ నీకు తెలుసు" అన్నాడు గోపీ.
   
    "నిజంగా నాకేమీ తెలియదు" అన్నాను.
   
    గోపీ కోపంగా చెయ్యెత్తాడు.
   
    నాకు భయంవేసింది. వాడి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి సహాయం కోసం తలుపుకు ఎడమపక్కన చూశాను అక్కడ రఘు లేడు.
   
    "రఘు కోసం చూస్తున్నావా? వాడ్ని చీమగా మార్చేశాను. నీకింక కనపడడు" అన్నాడు.
   
    గది గుమ్మానికి ఎడమ పక్కన చీమ ఒకటి అటూ యిటూ హడావుడిగా తిరుగుతున్నది రఘూయే అయుండాలి.
   
    "పాపం రఘు" అనుకున్నాను బాధగా, జాలిగా.
   
    "నీకూ అలాంటి గతేపడుతుంది నా మాట లక్ష్యం చెయ్యకపోతే" అన్నాడు గోపీ వాడి కంఠం ఇప్పుడు బొంగురుగా రాక్షస కంఠంలా ధ్వనిస్తోంది.
   
    నేను చటుక్కున లేచాను.
   
    గోపీ నా వంకనే చూస్తున్నాడు.
   
    గదిలోంచి బయటపడ్డాను.
   
    "అమ్మయ్య....గోపీ....నన్నింక వేధించడు" అనుకున్నాను.
   
    "నేను నీ వెనుకనే ఉన్నాను" గోపీ స్వరం నా చెవిలో గుసగుసమంది. వాడి ఊపిరికూడా నాకు తగుల్తున్నది.
   
    నేనింక మరో ఆలోచన లేకుండా స్కూటర్ ఎక్కాను.
   
    అప్పుడు టైము యింకా పన్నెండు కూడా కాలేదు.
   
    ఒంటి గంటన్నరకు మామయ్యగారింటికి భోజనానికి వెళ్ళాలి కానీ ముందే వెళ్ళిపోయాను.
   
    అక్కడ ఆదరాబాదరాగా భోజనంచేసి, "సాయంత్రం ఆరింటికి వస్తాను మళ్ళీ...." అనిచెప్పి పన్నెండు పావయ్యేసరికి అక్కడ నుంచి బయట పడిపోయాను. తిన్నగా ఇంటికి వెళ్ళాను.
   
    తలుపు తీశాను.
   
    బట్టలు మార్చుకున్నాను.
   
    అప్పుడు డ్రాయింగ్ రూం తలుపు వద్దకు వెళ్ళాను.
   
    మా గడియ వేసి లేదు. తలుపు తోశాను. రాలేదు. నా వేపుకి లాగాను. వెంటనే అవతల పక్క నిలువుగా ఉన్న గడియ క్రింద పడిన చప్పుడయింది.
   
    తలుపు తోయగానే తెరుచుకుంది.
   
    నా వంట్లో అదో రకం వణుకు...
   
    "ఏమిటిలా తయారయ్యాను?" అనిపించింది. కానీ అడుగు ముందుకే పడుతున్నది.
   
    ఈ ఆకర్షణ చాలా బలమైనది తట్టుకోవడం కష్టంగా వున్నది. తట్టుకోవడం అనవసరమనీ అనిపిస్తోంది.
   
    గోపీ నన్ను అడుగడుక్కీ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు.
   
    "అదీ మగాడి లక్షణం" అని మెచ్చుకుంటున్నాడు.
   
    నిన్న ఆమె నా కోసం వచ్చింది. ఈ రోజు నేను ఆమె కోసం వచ్చాను.
   
    ఆమె అందమైనది, తెలివైనది.
   
    అయినప్పటికీ భర్తకు విధేయురాలు. భర్త కోరికపై నాకు లోబడనున్నది.
   
    డాక్టర్ విలాస్ కు జీవితంలో మరపురాని పాఠం చెప్పాలి.
   
    నేనతడి భార్యను వశపర్చుకోవాలి. నా భార్య అతడికి దూరంగా ఉంటుంది. అతడి పథకం తెలియనట్లే నటిస్తూనే అడుగడుగునా అతన్ని దెబ్బ తీస్తాను ఈ విషయంలో నాకు కోమలి సాయం కూడా ఉంటుందేమో!
   
    అప్పుడు నా మదిలో మళ్ళీ కోమలి మెదిలింది.
   
    శృంగారమంటే తెలిసీ తెలియని రోజుల్లో, మనసు శరీరాన్ని అదుపు చేయడానికి కష్టపడే రోజుల్లో, స్త్రీగురించి కుతూహలం, ఆత్రం పెరిగిపోతున్న రోజుల్లో, యుక్తా యుక్తాలు ఆలోచించడానికి వయసుచాలని రోజుల్లో-కోమలి నన్ను పిలిచింది. నా కెంతో దగ్గరగా వచ్చింది. తొలి అనుభవం కోసం తహతహలాడే ఆ రోజుల్లో కూడా ఆమె పిలుపులోని ఆకర్షణ నెదిరించి ఆమె సామీప్యంలోని ప్రలోభాన్ని అదిగమించాను.
   
    ఆ తర్వాత కోమలి కొద్ది రోజుల క్రితమే నన్ను మళ్ళీ ప్రలోభపెట్టింది. అప్పుడూ నేనునన్ను నిగ్రహించుకోగలిగాను.
   
    మరి ఈ రోజు నాకేమయింది?
   
    కోమలి పిలుపులోని లోపమేమిటి?

 Previous Page Next Page