"ఏం ? ఇంకా ఏమైనా రాచకార్యం వుందా?" వ్యంగ్యంగా అడిగాడు నవీన్.
"అవును. పావురాయిని వెంబడిస్తూ నా మైనాను పంపాను. అది రావాలి. అది రాగానే వాళ్ళ స్థావరం గుట్టుమట్టులన్నీ తెలిసిపోతాయి ! దాని కాలికి లిప్ స్టిక్ కెమెరాను కట్టాను...." రహస్యంగా చెప్పింది డాక్టరు సునంద.
ఆమె మోమున ఉద్విగ్నత.
ఈసారి తెల్ల బోవడం నవీన్ వంతు అయింది. అతను అర్ధం చేసుకున్నాడు.
డాక్టరు ప్రతి వ్యూహాన్ని అభినందించకుండా వుండలేకపోయాడు.
వెంకటేష్ కు ఇదంతా గమ్మత్తుగా వుంది. అంతా అవాస్తవికంగా వున్నదనుకున్నాడు నవీన్.
ఏం జరగబోతుందోనన్నట్టు ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు వెంకటేష్.
* * *
ఏ వ్యక్తినైనా చట్టపరంగా అరెస్టు చేసే హక్కు పోలీసులకు వుంది.
అయితే, ఆ వ్యక్తి నేరం చేసినవాడైనా అయివుండాలి లేదా నేరం చేయడానికి సంసిద్దుడైనా అయివుండాలి.
అలా కాని మరే వ్యక్తినైనా కస్టడీలోకి తీసుకుంటే అది అతని ప్రాథమిక హక్కును హరించడమే అవుతుంది.
సరిగ్గా ఈ అంశం మీదనే పోలీసు లాకప్ లో వున్న ఆ వ్యక్తిలో ఆవేశం పెల్లుబికింది.
అన్ని చట్టాలను అధ్యయనం చేసిన వ్యక్తి అతను!
"నన్నెందుకు అరెస్టు చేశారు? ఎందుకు సెల్ లో వుంచారు?" సూటిగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి.
"ఏం చట్టం కింద నన్ను అరెస్టు చేశారో నాకు కావాలి....!"
"యూ బ్లడీ క్రిమినల్! ఎంత ధైర్యం నన్నే ప్రశ్నించడానికి?" ఇన్ స్పెక్టర్ వెంకటేష్ ఆవేశంగా అంటూ లాఠీ అందుకున్నాడు.
అందుకోవడమే తడవు....
అయిదు నిమిషాలపాటు సెల్ లో ఆర్తనాదాలు. ఆ తరువాత లాఠీ విరిగిన చప్పుడు.
ఆ వ్యక్తి స్పృహ తప్పి ధడాలున కింద పడిపోయిన శబ్దం.
అదే క్షణం__
నవీన్ కారు దిగాడు.
వినయంగా సెల్యూట్ చేశాడు వెంకటేష్
"సర్ ! ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతనిచేత ఒక్క ముక్క కూడా చెప్పించలేకపోతున్నాను...." కొంచెం అభిమానపడుతూ చెప్పాడు వెంకటేష్.
"ఐ.సీ!" నవీన్ ముద్దాయి వంటి మీద దెబ్బల వాతలను నిశితంగా చూస్తూ నొచ్చుకున్నాడు వెంకటేష్ బయటకు వెళ్ళమన్నాడు.
ఆ వ్యక్తిని ఉరిమురిమి చూస్తూనే బయటకు నడిచాడు వెంకటేష్.
ఆ వ్యక్తి మెల్లిగా కదలి కూర్చోవడానికి ప్రయత్నించాడు.
కానిస్టేబుల్ ను పిలిచి, స్టూల్ తెప్పించాడు నవీన్.
ఆ వ్యక్తిని లేపి దానిమీద కూర్చోబెట్టిన తరువాత, కానిస్టేబుల్ ను వెళ్ళి కాఫీ తెమ్మన్నాడు.
నవీన్ ను చూసిన ఆ వ్యక్తి భృకుటి ముడిపడింది. ఆయాసపడుతున్నాడు. ఆరాటపడుతున్నాడు. అయినా అదేపనిగా నవీన్ ను చూస్తూనే వున్నాడు!
కానిస్టేబుల్ కాఫీ తేగానే రెండు కప్పులలో పోయించి, ఒకటి తను తీసుకుని, రెండవదానిని అతనికి ఆఫర్ చేశాడు. అతను మొహమాటపడ్డాడు.
"ఫరవాలేదు. కాఫీయే. తీసుకో!" అతను అందుకున్నాడు.
"వెల్ మిస్టర్! నేను పోలీస్ ఆఫీసరుగా నిన్ను ఇంటరాగేట్ చేయడానికి రాలేదు. మా వాళ్ళు కొంచెం దూకుడుగా వ్యవహరించారనుకుంటాను. సారీ!" అనునయంగా అన్నాడు నవీన్.
సెల్ లో ఒక మూలగా విసిరేసి వున్న అతని బట్టలను చూస్తూ, "వాటిని వేసుకో!" అన్నాడు నవీన్.
అతను మాట్టాడకుండా తొడుక్కున్నాడు. కొద్దిగా తేరుకున్నాడు.
"బై_ద_బై_నీ పేరు ?" తెలిసి వున్నా, మాటలు కలపాలి కనుక, అడిగాడు నవీన్.
అతను అనుమానంగా నవీన్ వైపుకు చూశాడు. మౌనం వహించాడు.
"నేనే చెబుతాను. నీ పేరు వినయకుమార్. ఎలియాస్ విప్లవకుమార్ ఎలియాస్ భగత్ ఎలియాస్ వి.కె.! ఎం. ఎస్ సి. చదివి, పి.హెచ్ డి. చేశావు. యూనివర్శిటీ స్వర్ణ పతకాన్ని పొందావు!" నిదానంగా చెప్పాడు నవీన్.
అతను తెల్లబోయాడు. తన బయో_డేటా మొత్తం తెలుసుకునే వచ్చాడన్నా మాట!
"అంతేకాదు? రాజ్యాంగాన్ని, అన్ని చట్టాలనూ ఔపోసన పట్టావు కూడాను. అవునూ, అంత చదువూ చదివి. ఆ మారుమూల కుగ్రామంలో ఎందుకు వున్నట్టు?"
అతను మౌనంగా వుండిపోయాడు.
అతని మెదడు చురుగ్గా పనిచేస్తున్నది.