"గుహలో నాగఫణి క్రింద రెండు పెట్టెలున్నాయి. వెళ్లి తీసుకురండి. నాగేంద్రుడి విగ్రహం మాత్రం ముట్టకండి. క్రింది భూమిలో మణిశిల రూపంలో శివలింగం వుంది. అక్కడినుండి నాగేంద్రుడి ని తొలగిస్తే అరిష్టం దాపురిస్తుంది" చెప్పాడు స్వామి.
ఇంతకుముందే శ్రీచక్ర చెప్పమన్నాడలా.
"మణిశిల అంటే?' సిఎం ఆసక్తిగా అడిగాడు.
"ఆ శిలకు ఏ లోహం తగిలినా బంగారం అవుతుంది" చెప్పాడు స్వామి.
"రోజుకు ఎన్నో బారువుల బంగారం ఇచ్చే శమంతకమణిలా మన దగ్గిర మణిశిల వుంటే అది మన రాష్ట్రాన్నేకాదు. దేశాన్ని బంగారుమయం చేస్తుందికదా!"
"భూమిలో అదృశ్యరూపంలో వున్న ఆ శిలను మానవమాత్రులు చూడలేరు, తాకలేరు.
"అదృశ్యరూపంలో వుంటే అక్కడ శివలింగం వుందనేందుకు ఆధారం ఏముంది?"
"శివలింగం లేనిది అక్కడ నాగఫణి ప్రతిష్టింపబడదు. వేల సంవత్సరాల క్రితం ఏముని పుంగవులో ఆ గుహలో ఆ నాగవిగ్రహం ప్రతిష్టించారో?"
కొంతమంది పోలీసులు వెళ్లి రెండు పెట్టెలూ కొండ క్రిందకు తెచ్చారు.
అంతలో ఒక పోలీసు అన్నాడు.
"మేలిమి బంగారంతో చేసిన నాగేంద్రుడి విగ్రహమే చేస్తుంది కొన్ని కోట్లు. ఆ ఫడగలమీద మణులే చేస్తాయి కొన్ని వందల కోట్లు అక్కడ శివలింగం ఏదీ లేదు. ఆ నాగేంద్రుడి విగ్రహం కూడా తెచ్చేస్తే ఏమవుతుంది?"
"హద్దు మీరిన ఆశ మనిషి అంతాన్ని చూస్తుంది. చావుకి సిద్దపడ్డ వాళ్ళే ఆ నాగేంద్రుడిని అక్కడినుంచి కదిలించాలి" గంభీరంగా అన్నాడు స్వామి.
రెండు పెట్టెలూ వ్యానులోకి చేర్చారు.
ఈసారి గుహ ద్వారాన్ని మూయలేదు శ్రీచక్ర.
ప్రక్కకి జరిగిన బండరాయి అలాగే వుండిపోయింది.
గుహలోపల వుండిపోయిన బంగారు నాగేంద్రుడు మానవులను ప్రలోభపెట్టి ఏ కథలకు కారణం అవుతాడో భవిష్యత్తుకుగాని తెలీదు.
పెట్టెలో ఏముందో చూడటానికి సి. ఎం. మిగతావాళ్లు తహతహలాడిపోతుంటే స్వామి చేత్తో తాళాలను లాగి తీసివేశాడు.
తెరిచిన పెట్టెల్లో జిగేల్ మంటున్న నవరత్నాలు, నవరత్నాలు పొదిగిన నగలు, మేలిమి బంగారపు కడ్డీలు.
వారంరోజుల్లో నిపుణులను రప్పించి, పురప్రముఖులూ, పత్రికల వాళ్లనూ రప్పించి, వాళ్ళ సమకంలో గుప్తనిధికి వెల కట్టిస్తామని చెప్పి సి ఎం గట్టి బందోబస్తుతో రెండు పెట్టెల్నీ పోలీస్ స్టేషన్ లో వుంచాడు.
సి. ఎం ఆ ఏర్పాట్లలో వుండగానే -
పోలీస్ స్టేషన్ లో గదికి వేసిన తాళం వేసినట్లు వుండగానే మూసిన పెట్టెలు మూసినట్లు వుండగానే లోపలు్న గుప్తనిధి మాయమైపోయింది.
అర్దరాత్రిపూట ఒక పదహారేళ్ల కోయపిల్ల బయటికి వచ్చిందని, ఎవరు నీవని అడుగుతుండగానే మాయమైపోయిందని, అనుమానం వచ్చి గది తలుపులు తెరిచి చూస్తే అవి ఖాళీగా కనిపించాయని చెప్పారు అక్కడ కాపలా వున్న పోలీసులు.
ఈ వార్త ఇలా ప్రచారం అవుతుండగానే -
మరో వార్త వచ్చింది పత్రికల్లో.
శ్రీశైలంనుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో లారీ ఒకటి వ్యానును ఢీకొట్టిన సంఘటనలో వ్యాను పల్టీ కొట్టిందని, వ్యాను నడుపుతున్న డ్రయివరు, మరో ఇద్దరు చనిపోయారని, పోలీసులు వ్యాన్ ను సోదా చేస్తుంటే అయిదు శఇరసులు కలిగిన నాగేంద్రుని విగ్రహం కనిపించిందని, దాన్ని స్వాధీనపరుచుకుని విచారణ కొనసాగిస్తున్నారనీ.....
పత్రికల్లో వచ్చిన ఈ రెండు వార్తలు కలవర పెట్టాయి స్వామిని.
ఎక్కడో కొండ గుహలో నిక్షిప్తమైన నిధిని దేశాభివృద్దికి ఉపయోగించాలని సాహసించి గుప్తనిధిని వెలికితీస్తే - ఇలా జరిగిందేమిటి అనిబాధ పడ్డాడు.
శ్రీచక్రని కలిశాడు.
"ఈ వార్తలేమిటి ఇలా వచ్చాయి? మన కొండ గుహలోంచి తరలించిన గుప్తధనం కన్నెపిల్లగా మారడం ఏమిటి? వాళ్లు చెప్పేది నిజమా?
బెయిల్ మీద ఇంటికి వచ్చిన మారుతీరావు చెప్పాడు
ఆ గుప్తనిధిని చేజిక్కించుకోవాలని ఎన్నో పథకాలు వేసింది మేం. ఎన్నో వ్యయప్రయాసలు పడింది మేం. అత్యాశ బుడం నాస్తి అన్నట్లుగా అది మాకు దక్కకపోగా హత్యానేరంలో చిక్కుకున్నాం. మీకేమో గొప్ప దేశభక్తి, జాతిగౌరవం పెల్లుబికింది.
ఎక్కడో అడవిలో వున్న గుహలో చొరపడి గుప్తనిధి కదిలించి రాష్ట్రాన్ని అభివృద్ది పరచండి అని సిఎం చేతికిస్తే వాడు లోలోపల మాయం చేసి తన ఇంటి భూగృహంలో దాచుకున్నాడు. పోలీసు వున్నతాధికారులు కొందరు ఆయనతో లాలూచీపడ్డారు.
దొంగతనం గుట్టురట్టు కాకుండా వుండిపోవడానికి ఆ నిధికి సంబంధించి ప్రచారంలో వున్న కథనే ఆ కోయపిల్ల కథనే వీళ్ళూ వాడుకున్నారు. గుప్తనిధఇ కోయపిల్లగా మారి మాయమైపోయిందని, అదనీ, ఇదనీ కథలల్లి జనంలోకి వదిలేసారు.
అదేదో మనింటికి తెచ్చినా ఎన్నితరాలు కూర్చుని తిన్నా తరగని సిరిసంపదలతో రాజభోగాలకు అనుభవిస్తూ బ్రతికేవాళ్లం. ఉత్త పుణ్యానికి సిఎం కొట్టుకుపోయాడే అని నా బాధ"
"ఇదంతా మీకెలా తెలుసు డాడీ?"
బెయిల్ మీద బాషా ఇంటికి వచ్చాడుకదా? వాడు వూరికే చేతులు ముడుచుకొని కూర్చునే రకంకాదు. వాడి మనుషులు పోలీసువాళ్లలోనూ వున్నారు.
వీడు మెల్లగా నిధిని దాటిద్దాం అనుకుంటుండగా సిఎం మనుషులు వీడికంటే ముందు జాగ్రత్తపడ్డారు."
"ఇదంతా నిజమేనా?" ఖిన్నుడయ్యాడు స్వామి.
"ఇప్పుడు ఏం చేస్తారో ఇద్దరు మంత్రవేత్తలూ కలిసి" ఎత్తిపొడుపుగా అన్నాడు మారుతీరావు.
"గురుదేవులను తలచుకుని అంతర్ దృష్టిలో చూడండి స్వామీ! అంతా అవగతం అవుతుంది" గంభీరంగా అన్నాడు శ్రీచక్ర.
స్వామి కళ్లు మూసుకుని కాస్సేపు ధ్యానముద్రలో కూర్చుని తిరిగి కళ్లు తెరిచాడు.
అతడి ముఖం మ్లానమైంది.
"గుప్తనిధఇని వెలికితీసి పొరపాటు చేశాం శ్రీచక్రా. దేశంలో సంక్షోభము ఏర్పడి ప్రజలు కరువు కాటకాలలో చిక్కుకున్నప్పుడు దేశానికి ఉపయోగపడాలనే సంకల్పంతోనే ఆ ధనాన్ని నిక్షిప్తం చేసినా ఆమె బూైట పడే సమయమింకా రాలేదు. నీ తొందరపాటు చర్యవల్లే ఈ అనర్దం జరిగింది. అందుకే అనుకున్నట్లు సక్రమంగా జరగలేదు" స్వామి సుదీర్ఘంగా నిట్టూర్చాడు.
"ఆమెను మళ్లీ కొండ గుహకు చేరిస్తే తప్ప అనర్దాలు ఆగవు."
"సిఎం ఇంటి భూగృహంలో రహస్యంగా దాచబడిన నిధిని మీరెలా కొండగుహకు తరలిస్తారు? ఆయన ఇంటికి సెక్యూరిటీ అదీ వుంటుంది" అన్నాడు మారుతీరావు.
"ఒక వాస్తవం చెప్పనా? ధనలక్ష్మి, తలచుకుంటే ఎక్కడికయినా కదిలి పోగలదు. మంట మందుతూ దొర్లిపోగలదు. మీ ఇంట్లో, ఏ పూర్వీకులో దాచిన లంకెబిందెలు మీకు ప్రాప్తంలేక మీ ప్రక్కింటికో, ఇంకే ప్రాప్తమున్న ఇంటికో తరలిపోగలదు. ప్రాప్తంలేనివాడు పట్టుకుంటే పచ్చటి బంగారం సైతం పాములుగా, తేళ్లుగా మారిపోగలదు. దురాశకు లోనైన సి ఎం కి ప్రస్తుతం పట్టుకోబోతున్న గతి అదే!"
"అయితే భలే తమాషాగా వుంటుందన్నమాట సి ఎం పరిస్థితి?"
"అంతేనా? ఆమె కొండ గుహకు చేరేలోగా ఆశ్చర్యకరమైన కథలనేకం వింటాం. ఎక్కడో కొండగుహలో నిక్షిప్తమైన నిధిని కదిలించి నగరంలోకి తెస్తే అది దేశాభివృద్దికి వినియోగించి వుంటే ఖర్చయిపోయి శక్తిహీనం అయ్యేది. అది యధాప్రకారం భూగృహంలో నిర్భంధించబడింది. ఒకచోట కుప్పగా పడిన ధనలక్ష్మి ధనశక్తిగా మారుతుంది. చంచలంగా నగరంలో రాత్రివేళ తిరుగుతూ ఎదురుపడ్డ వాళ్ళని 'కూతురినై రానా? కోడలినై రానా?' అని అడుగుతుంది.
ఆశతో కోడలివై రమ్మన్నవాళ్ల ఇళ్లకు వెళ్లి నానా భీభత్సం సృష్టిస్తుంది. అష్టకష్టాలకు గురిచేస్తుంది. స్వార్దపరుల భరతం పడుతుంది. తిరిగి కొండగుహకు చేరితేగానీ ఆమె శాంతించదు. ... " భవిష్యద్వాణి చెబుతున్నట్లుగా చెప్పాడు స్వామి.
"ధనలక్ష్మి ధనశక్తిగా మారి భీభత్సం సృష్టించకముందే మీరు అదుపు చేయొచ్చుకదా?"అన్నాడు మారుతీరావు.
ఆ గుప్తసంపదను ఆశించినవాళ్లలో తనూ వున్నాడు, తనకేం మూడుతుందేమోనని భయపడుతూ.
"భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు భూమ్మీద అవతరించి పాపాన్ని ప్రక్షాళన చేసినట్టే ఈ ధనశక్తి స్వార్దపరుల భరతం పడుతుంది. అమాయకుల జోలికి వెళ్లదు. ఆమెను ఆపడం ఎందుకు?"
"మరి పోలీసుల స్వాధీనంలో వున్న నాగేంద్రుడి కథ ఏమిటి?"
"ఇన్నేళ్లూ ధనలక్ష్మి కాపుకాసిన నాగేంద్రుడు ఎప్పుడూ ఆమెకు తోడుగా వుంటాడు. దుర్మార్గులకు గడసర్పంలా కనిపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తాడు. స్వార్దంతో కరుడుకట్టిన దుర్మార్గులను అంతమొందిస్తాడు. ఎందరి చేతులో మారి చివరికి భైరవుని కొండ చేరుతాడు!"
"విన్నారుగా డాడీ? ఇప్పటికయినా ఆ నిధి మీద ఆశ వదులుకొని 'నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సుఖమా?" అని పాడుకొంటూ శేష జీవితం గడిపితే బాగుంటుంది కదా?"
"ఇహ ఆ పాటే నాకు మిగిలిందిరా....!" అన్నాడాయన నీరసంగా.
మొన్నటిదాకా మామూలుగా వున్న కొడుకులో ఇటీవల అలౌకిక శక్తులు వెల్లడికావడం మారుతీరావుకు ఆశ్చర్యంగా వుంది. ఆందోళనకూడా కలుగుతోంది. ఈ మార్పు ఎటు దారితీస్తుందోనని!