Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 35


    "ఏడుగంటలు అవుతుంది. లేవనే మొద్దూ....మమ్మల్ని పంపించేశాక ఇంట్లో ఒక్కదానివే తీరికగా నిద్రపోవచ్చు"

    "అపుడే రడీ అయిపోయారా?" నిద్రకళ్ళను నులుముకుంటూ అన్నది శ్రీప్రియ.

    "ఆ....నువ్వు నిద్రలేవడమే ఆలస్యం...."

    "లేచి నేనేం చెయ్యాలే...."

    "ఏమీ చేయవద్దు. మాతోబాటు కాస్త బ్రేక్ ఫాస్ట్ తీసుకుని కంపెనీ యిస్తేచాలు"

    "నేనెందుకులేవే....నువ్వు చేసెయ్...."

    "అదిగో....అదే వద్దన్నది....నువ్వులేకుండా నేను ఏ రోజయిన టిఫిన్ చేశానాచెప్పు....అదేమిటో ఈ మధ్య నువ్వులేకుండా బయటకు కూడా వెళ్ళడానికి ఇష్టం ఉండడంలేదు."

    "అంత డీప్ గా ఫీల్ కావడం నీకే ఇబ్బంది....ఇపుడంటే ఫరవాలేదు....కానీ రేపు మీ ఆయనొచ్చి నిన్ను తీసుకెళితే...."

    "అసలు నేను పెళ్ళిచేసుకుంటే కదా?"

    "అంటే....అసలు నువ్వు పెళ్ళేచేసుకోవా?"

    "జీవితాంతం కాదు. నీ పెళ్ళి జరిగేవరకూ...."

    "నాకు పెళ్ళా?" ఉన్నట్టుండి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శ్రీప్రియకు.

    "అదేమిటే....ఆ కన్నీళ్లేమిటి?" సుహాసిని ఆశ్చర్యంగా అడిగింది.

    "కన్నీళ్ళుకాక మరేం వస్తాయే ఈ జీవితానికి...." వేదాంత ధోరణిలో అన్నదామె.

    "అదేమిటే....ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నావు?"

    "సుహాసిని....నా జీవితంలో నేను సుఖంగా వుండాలనుకోలేదు. ఆ ఆశ నాకు ఎప్పుడో పోయింది. మొదటినుంచి ఒక ఆశయంతో పెరిగాను. ఆ ఆశయం కోసమే నేను ముళ్ళబాటను ఎన్నుకున్నాను. కానీ నాలాంటి ఆడది ఒంటరిగా పోరాటం సాగించలేక ఎదురుదెబ్బలు తిని ఇలా అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. "తాత్కాలికంగా నా ప్రయత్నాలకు భంగం కలిగినా ఎప్పటికయినా నా ఆశయం నెరవేర్చుకోకుండా వుండను. అప్పటి వరకూ పెళ్ళిఅనేమాట కలలో కూడా తలచుకోను."

    "ఏమిటోనే మొదటినుంచీ నువ్వింతే. ఎప్పుడూ నా కర్ధంకావు. విషయం ఏమిటో పూర్తిగా చెప్పవు.... అసలు నీ ఆశయం ఏమిటి? నువ్వు ఎందుకిలా ఎవ్వరితోనూ కలవకుండా సమాజానికి దూరంగా ఉంటున్నావు? చెప్పు ప్రియా....నిజం ఏమిటో కనీసం నాకయిన చెప్పు?....మొన్ననువ్వు కావాలని ఫోన్ చేసింది ఎవరు? నువ్వు వుండికూడా లేనని ఎందుకు చెప్పమన్నావే?" సుహాసిని ఆశ్చర్యంగా అడిగింది.

    "సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను....నీవుకాక నాకున్న ఆత్మీయులు ఇంకెవరున్నారే...." ఒకింత బాధ ధ్వనించింది శ్రీప్రియ కంఠంలో.

    "ఆ సమయం ఇంకెపుడు వస్తుందే"

    క్రిందనుంచి "సుహాసినీ...." అన్న పిలుపు.

    "వస్తున్నానమ్మా...." సుహాసిని అన్నది.

    "ముందు ఇక్కడనుంచి నువ్వు వెళ్ళే టైమ్ అయినట్టు వున్నది. వెళ్ళవే....తరువాత మాట్లాడుకుందాం...." శ్రీప్రియ స్నేహితురాలి వైపు చూస్తూ అన్నది.

    సుహాసినితోపాటు  శ్రీప్రియ క్రిందకు వచ్చింది.

    "నువ్వు కూడా రావచ్చుకదమ్మా...." సుహాసిని తండ్రి అన్నాడు శ్రీప్రియతో.

    "లేదు డాడీ....ప్రియకు ఆరోగ్యం సరిగాలేదు. రాత్రి కూడా తల నొప్పితో బాధపడింది" సుహాసిని సర్దిచెప్పింది.

    ఆమె కుంటుంబ సభ్యులు ఇక ఎలాంటి ప్రశ్నలు వేయలేదు.

    సుహాసిని, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళు కార్లో కూర్చున్నారు.

    వాళ్ళకారు కదులుతున్నంత వరకూ వుండి, చెయ్యివూపుతూనే వున్నది శ్రీప్రియ. ఆమెను ఒంటరిగా విడిచి వెళ్ళలేకనో, ఎందుకనో సుహాసిని కళ్ళనుంచి అప్రయత్నంగానే కన్నీరు ఉబికింది.


                                                                   *    *    *


    జగపతికి దాదాపు పెచ్చెక్కేలా వున్నది.

    రాణాను రోజుకు రెండుసార్లు కలుస్తూనే వున్నాడు.

    శ్రీప్రియకోసం వాళ్ళు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడము లేదు.
 
    సిటీలో వున్న రౌడీ షీటర్లందరకూ శ్రీప్రియ పోలికలు చెప్పి ఆమె ఆచూకీ తెలిసినవాళ్ళకు రివార్డు యిస్తామని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.

    శ్రీప్రియను ఎలా కనిపెట్టాలా అని విపరీతంగా ఆలోచిస్తున్న జగపతి గదిలోకి ప్యూన్ వచ్చాడు.

    "సార్....మీకోసం పోలీసులు వచ్చారు."

    ఒక పెద్ద బండరాయి తెచ్చి నెత్తిమీద మోదినట్టు ఉలిక్కిపడ్డాడు.

    పోలీసులు తనదగ్గరకు....

    ఇకపై ఆలోచించలేకపోయాడు.

    బహుశా చక్రవర్తి గురించి కూపీలాగడానికి వచ్చారేమో?" ఇన్స్ పెక్టర్ రంజిత్ ను చూడడంతో మరింత ఖంగారు పడిపోయాడతను.

    రంజిత్ గురించి జగపతికి బాగా తెలుసు.

    నీతి....నిజాయితీ....శాంతి....సహనం....సిన్సియారిటీలకు ప్రతిరూపం....రంజిత్..

    "రండి ఇన్స్ పెక్టర్ గారూ...." రాని నవ్వును తెచ్చుకుంటూ స్వాగతం పలికాడు జగపతి.

    కుర్చీలో కూర్చుంటూ అతనివైపు పరిశీలనగా చూశాడు ఇన్స్ పెక్టర్ రంజిత్.

    "చెప్పండి సార్....ఏమిటి ఇలా వచ్చారు?"

    జగపతి మాటలలో వణుకు స్పష్టంగా కనిపిస్తున్నది.
 

 Previous Page Next Page