డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ జయకర్ కృష్ణాకెనాల్ స్టేషన్ చేరుకున్నాడు. ఆ స్టేషన్ లో ఏ.ఎస్.ఎమ్.కి నిద్రపోయే అవకాశం వుండదని అతనికి తెలుసు. అయినాగానీ అతను రూల్స్ ప్రకారం రైళ్ళు నడుపుతున్నాడాలేదా అన్న విషయంచూడదల్చుకున్నాడతను. ఫ్లాట్ ఫారంమీదనిలబడి ఎవరో ప్రయాణీకుడిలా నటించసాగాడు. కొద్ది క్షణాల్లో ఏ.ఎస్.ఎమ్ పరుగుతో బయటకు రావటం- పాయింట్స్ మెన్ కి ఏదో చెప్పటం- మళ్ళీ పరుగెత్తుకుని లోపలికెళ్ళటం గమనించాడు జయకర్.
సరిగ్గా అప్పుడే దూరంగా ఏదో ఎక్స్ ప్రెస్ వస్తూ కనిపించింది అతనికి. చిన్న స్టేషన్సు లో ఆగని ట్రెయిన్స్ ని స్టేషన్ మాస్టర్, పాయింట్స్ మెన్ చెరోవేపునా నిలబడి జాగ్రత్తగా పరిశీలించాలన్న నిబంధన ఒకటి వుంది. అలా పరిశీలించటం వల్ల యాక్సిల్స్ కి గానీ, వీల్స్ కి గానీ సంబంధించిన 'డిఫెక్ట్సు' ఏమయినా ఉంటేకనిపెట్టి గార్డుకీ, డ్రయివర్ కీ హాండ్ సిగ్నల్స్ ద్వారా హెచ్చరికచేసిబండిని ఆపేందుకు ఉద్దేశించబడిందారూల్! కానీ వాళ్ళిద్దరూ ఆ నిబంధన విషయం మర్చిపోయినట్లే నిలబడివస్తోన్న ట్రెయిన్ వేపు చూస్తున్నారు. ఇద్దరి చేతుల్లోనూ రెడ్, గ్రీన్ కలర్ జెండాలులేవు.
హఠాత్తుగా మరో విషయం కూడా జయకర్ దృష్టికి వచ్చింది.
స్టేషన్ ని సమీపిస్తోన్న ఆ ట్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వబడలేదు.
అంటే ఆ ట్రెయిన్ సిగ్నల్స్ ఆన్ పొజిషన్ లో పాస్ అయి వస్తోంది. అతనికేమీ అర్ధం కావడంలేదు.
ఏం జరుగుతోందక్కడ?
అతను చూస్తుండగానే ఆ ట్రెయిన్ వేగంగా స్టేషన్ దాటేసి వెళ్ళిపోసాగింది.
తనతోపాటు ఏ.ఎస్.ఎమ్. పాయింట్స్ మెన్ కూడా తెల్లబోయిచూస్తున్నారు దానివేపే! జయకర్ మరింత కన్ ఫ్యూజ్ అయిపోయాడు.
ఆ ట్రెయిన్ మీద 8 డౌన్ గోదావరి ఎక్స్ ప్రెస్ అని బోర్డు ఉంది. అదే నిజమయితే ఆ ట్రెయిను మద్రాస్ డైరెక్షనులో ఎందుకు వెళుతున్నట్లు? అదీ సిగ్నల్ ఆన్ లో పాస్ అయి-
చకచక ఏ.ఎస్.ఎమ్ దగ్గరకు నడిచాడతను.
"వాట్ హాపెన్డ్? ఏం ట్రెయినది? సిగ్నల్స్ డేంజర్ పొజిషన్ లో దాటి వెళ్లిపోతున్నాడు కదా!" అడిగాడు ఆతృతగా.
ఏ.ఎస్.ఎమ్. అతనిని చూసి ఉలిక్కిపడ్డాడు.
"గుడ్ మాణింగ్ సర్!" అన్నాడు వినయంగా.
"ఫార్మాలిటీస్ అన్నీ తర్వాత! ముందు నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి."
"అది 8 డౌన్ సర్! వాక్యూమ్ సిస్టమ్ ఫెయిలయి విజయవాడ స్టేషన్ లో కొచ్చేసింది. అందుకని ఇటు డైవర్టు చేశారు."
జయకర్ కి అర్ధమయింది.
ఆ బండి వెళుతోన్న స్పీడ్ చూస్తుంటే ఇంకో రెండు స్టేషన్ల వరకూ దానిని ఎవరూ ఆపలేరు. ఆ రెండు స్టేషన్ల తర్వాత స్టార్టయే రైజింగ్ గ్రేడియంట్ లో కెళితేగానీ స్పీడ్ తగ్గిపోదు. అప్పుడింక ఆగక తప్పదు. ఈ లోగా దానికేమయినా ప్రమాదం జరగదుకదా!
త్వరగా త్వరగా స్టేషన్ లోని కంట్రోల్ ఫోన్ తీసుకున్నాడతను.
స్పాట్ లో వున్న ఆఫీసర్ గా తనకు చాలా బాధ్యతలుంటాయ్!
"హలో కంట్రోలర్!" అన్నాడతను.
* * *
మృదుల మరోసారి తన ప్లాను సక్రమంగా అమలు జరుగుతోందీలేనిదీ తెలుసుకోవాలనుకుంది.
కంట్రోలర్ ఫోన్ లో కొచ్చాడు.
"గుడ్ మానింగ్ మేడం!"
"గుడ్ మానింగ్! 8 డౌన్ కృష్ణా కెనాల్ పాస్ అయిందా?"
"ఇంకా లేదు మేడమ్."
"ఎన్నింటికి పాస్ అవవచ్చు?"
"విజయవాడ- కృష్ణాకెనాల్ మధ్య రన్నింగ్ టైమ్ ఎనిమిది నిమిషాలు వుంటుంది."
"డోంట్ బాదర్ ఎబౌట్ రన్నింగ్ టైమ్- డిస్టెన్స్ ఎంతుంది?"
"ఆరు కిలోమీటర్లు మేడమ్-"
"లాస్ట్ రిపోర్టు ప్రకారం 8 డౌన్ వందకిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆరు కిలోమీటర్లు కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఒకవేళ స్పీడ్ కొంత తగ్గినాగానీ అయిదు నిమిషాలు పడుతుంది. 8 డౌన్ విజయవాడకు ఎన్నిగంటలకు వదిలింది?"
"సిక్స్ బై ఫైవ్ మేడం!"
"అంటే సిక్స్ టెన్ కి కృష్ణా కెనాల్ పాసవుతుంది-"
"మోస్ట్ ప్రాబబ్లీ మేడమ్-"
"ఓ.కే! లక్నో-మద్రాస్ ఎక్స్ ప్రెస్ పొజిషనేమిటి? పెదవడ్లపాడులో రెగ్యులేట్ చేశారా?
"ఇప్పుడే పెదవడ్లపాడు లూప్ లైనులో ఎంటరయింది మేడమ్. సిక్స్ బై సెవన్ టైమిస్తున్నాడు ఏ.ఎస్.ఎమ్."
"వాటెబౌట్ దిగూడ్స్ ట్రెయిన్?"
"చిలువూరు పాసయినట్లు చెప్తున్నారు మేడమ్-"
"అంటే దుగ్గిరాల ఎప్పటికి చేరుకోవచ్చు?"
"సిక్స్ టెన్ కి చేరుకోవచ్చు."
"అంటే అప్పటికే 8 డౌన్ పెదవడ్లపూడి వదులుతుంది, అయినా ఫర్లేదు. సరిపోయేంత మార్జిన్ వుంటుంది. సేఫ్ గా దుగ్గిరాల చేరుకుంటుంది. అక్కడికి చేరుకునే సరికల్లా రైజింగ్ గ్రేడియెంట్ వల్ల స్పీడ్ పూర్తిగా తగ్గిపోతుంది-దాంతో ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది" స్వగతంగా అందామె.
ఫోను డిస్కనెక్ట్ చేసింది సంతృప్తిగా.
తనింకా డి.ఆర్.ఎమ్. రంగనాధన్ కి భయపడనక్కరలేదు.
అప్పుడు గుర్తుకొచ్చింది మృదులకి.
8 డౌన్ ఎలాంటి ప్రమాదానికి గురికాదని తనకు నమ్మకం ఉన్నా తను "డిజాస్టర్ మేనేజ్ మెంట్" కి సంసిద్దమవాలి.
అందులో ముఖ్యమైనవేవో తనకు గుర్తున్నాయి.
సత్వర వైద్య సహాయం, గాయపడిన వారిని వీలయినంత త్వరగా సమీపంలోని హాస్పిటల్ కి గానీ డిస్పెన్సరీకి గానీ చేరవేయటం, ప్రమాదం స్థలానికి అవసరమయిన వస్తువులన్నీ అతి వేగంగా చేర్చటం, ప్రమాదం తాలూకూ వివరాలన్నీ అతి వేగంగా అవసరమయినవారందరికీ అందించటం, ప్రమాదానికి సంబంధించిన 'క్లూ' లేమయినా దొరికితే వాటిని పదిలపరచటం-
వీటి ప్రకారం, ఏ.ఆర్.టి. (యాక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్), ఎమ్.ఆర్.టి. (మెడికల్ రిలీఫ్ ట్రెయిన్స్)ని స్టార్ట్ చేసేయటం మంచిది. వాటిని అంతకుముందే ఆర్డర్ చేసేయమని ఆదేశించింది తను.
యాక్సిడెంట్ సైట్ కి దగ్గరలో వున్న స్టేషన్ లో ఎంతమంది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లు వున్నాయోచూడాలి.
డెఫ్టీ కంట్రోలర్ హడావిడిగా వచ్చాడామె ఛాంబర్ లోకి.
"మేడమ్ ఏ.ఆర్.టి,ఎమ్.ఆర్.టి ఆర్డర్ చేశామ. ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు!"
"ఇంకో పదిహేనునికిశాలు వెయిట్ చేద్దాం!"
"పోలీస్ ఆఫీసర్లు కూడా అడుగుతున్నారు మేడమ్-ఫర్దర్ ఏం చేయాలని?"
"వాళ్ళను కూడా పావుగంట వెయిట్ చేయమనండి!"
అప్పుడు మోగింది హాట్ లైన్ రింగ్.
చటుక్కున రిసీవర్ అందుకుందామె. అది డి.ఆర్.ఎమ్.డైరెక్ట్ ఫోన్.
"హౌ థింగ్స్ ఆర్ మూవింగ్ మిస్ మృదులా?"
"లక్నో ఎక్స్ ప్రెస్ పెదవడ్లపాడులో రెగ్యులేట్ చేసి మెయిన్ లైన్ ఖాళీగా వుంచానుసార్! అలాగే గూడ్స్ ట్రెయిన్ ని కూడా దుగ్గిరాలలో రెగ్యులేట్ చేస్తే తెనాలి వరకూ పాసేజ్ వుంటుంది. పెదవడ్లపాడు నుండే రైజింగ్ గ్రేడిఎంట్ వుంది గనుక 8 డౌన్ దుగ్గిరాల, కొలకలూర్ మధ్యలోనే ఆగిపోవచ్చనుకుంటున్నాను."
"అండ్ వేరీజ్ 8 డౌన్ నౌ?"
"ఏ క్షణంలో నయినా కృష్ణా కెనాల్ పాసవవచ్చు"
"స్పీడ్ ఎంతవరకూ కిల్ అవుతూందో కొంచెంవాచ్ చేస్తూండండి...."
"యస్సార్-"
"సో- మీరు ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతోందంతా!"
"యస్!"
"ఓ.కే! లెటజ్ సీ!"
అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
సరిగ్గా అదే సమయంలో కంట్రోలర్ పరుగుతో వచ్చాడు. భయం, ఆందోళన అతని మొఖమంతా కనబడుతున్నాయ్.
"వాట్ హాపెన్డ్?" అనుమానంగా అడిగిందామె.