Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 36


    అతనితోపాటు బయటకు నడిచి ఎదురుగా ఉన్న గదిముందు నిలబడింది సీత. రూము తాళం తెరచి బోయ్ ని పిలిచాడు వర్ధనరావు.
    అతనికేవేవో ఆర్డరిచ్చి "త్వరగా తీసుకురావాలి!" అన్నాడు తను గదిలోకి నడుస్తూ. సీత అతన్ని అనుసరించింది.
    లోపల రెండు మంచాలూ, తెల్లని దుప్పట్లూ, ఓ సోఫా, కుర్చీలూ_ఎయిర్ కండిషన్ మిషన్ స్విచ్ నొక్కాడతను.
    "కూర్చోండి!" అన్నాడతను సోఫా చూపిస్తూ.
    "ఇక్కడెందుకు?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
    "ఏకాంతంగా ఉంటుందని! డైనింగ్ హాల్లో రష్ ఎక్కువ"
    అనేకరకాల పదార్థాలతో భోజనం తెచ్చి వారిముందుంచాడు కుర్రాడు.
    ఇద్దరూ భోజనం చేయసాగారు.
    "మిమ్మల్ని ఎప్పట్నుంచో ఓ మాట అడగాలనుకుంటున్నాను సీతగారూ!" అన్నాడతను.
    "ఏమిటది?" నవ్వుతూ చూసిందామె.
    "మీరు ఇంత అందంగా ఉండి కూడా సినిమాల్లో వేషాలకి ఎందుకు ప్రయత్నించలేదు?"
    "బావుంది! నా అందాన్ని మీరే పొగడాలి..." తీసిపారేస్తూ అందామె.
    "అంతేలెండి! ఎవరి సంగతి వాళ్ళకు తెలీదుట. నాకు మిమ్మల్ని చూడగానే అనిపించింది. మీరు సినిమాల్లో నటిస్తే బావుంటుందని అఫ్ కోర్స్ సినిమాల్లో చేరడం వల్ల మంచీ చెడూ రెండూ ఉంటాయి. అందుకే అడగలేక పోయాను..."
    సీత అతని పొగడ్తకి పొంగిపోయింది.
    తనకు సినిమాల్లో నటించాలని ఎప్పుడూ లేదు. అంతటి అందగత్తె కాదని కూడా తెలుసు! కాని అతను తన అందానికి అంతటి కాంప్లిమెంట్ ఇస్తాడనుకోలేదు. అది అమితమైన ఆనందాన్ని కలిగించింది.
    భోజనం ముగిసింది.
    బోయ్ వచ్చి అంతా క్లీన్ చేసి ప్లేట్లన్నీ పట్టుకెళ్ళిపోయాడు.
    టైము చూసుకుంది సీత. పది దాటింది.
    "ఇప్పుడే వెళ్ళిపోదామా?" అడిగాడతను.  
    "ఫరవాలేదులెండి. కాసేపు కూర్చుని వెళ్దాం" మర్యాద కోసం అందామె.
    అంతకుముందు కారు కొనిస్తానని అతనన్న మాటలే ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయ్. ఇంకా నమ్మలేకపోతోంది ఓ పట్టాన. కాని అది మాట్లాడింది మరొకరూ మరొకరూ కాదు. మాట కోసం నిలబడే వర్ధనరావు.
    "సీతా!"
    కొత్తగా వినిపించిన సంభోధనకి ఆశ్చర్యంగా అతనివేపు చూసింది సీత. అతను తలుపుకి లోపల్నుంచీ తాళం వేసి తిరిగి ఆమె దగ్గరకొచ్చాడు.
    "మీకో రహస్యం చెప్పనా?" ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు.
    "ఏమిటి?"
    "మిమ్మల్ని చూసిన మొదటిరోజు నుంచే మీ రూపం నన్ను వేటాడుతోంది. మీ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు"
    అతని చేతులు ఆమెను చుట్టివేశాయి.
    సీత బిత్తరపోయింది.
    ఏమిటిలా జరుగుతోంది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఊహించుకున్న వర్ధనరావేనా ఇలా ప్రవర్తిస్తోంది తనకోసం ఎంతో అభిమానంతో అవకాశాలిచ్చిన ఆయనేనా ఇలా మాట్లాడుతోంది?
    "సీతా! డార్లింగ్! ఎన్నాళ్ళనుంచో ఈ కోరిక నన్ను దహించి వేస్తున్నా ఇవ్వాళ్టివరకూ అతికష్టంమీద నెట్టివేస్తూ వచ్చాను. కారణమేమిటో తెలుసా? ఇవాళ నా పుట్టినరోజు. ఈ రోజే మనం ఒకటవ్వాలని అనుకున్నాను. నా జీవితంలో మరపురాని రోజు కావాలని కోరుకున్నాను..."
    ఆమెను అమాంతం లేవనెత్తి మంచంమీదకు చేర్చి మీదకు ఒరిగిపోయాడతను. సీతకు స్పృహ కోల్పోతున్నట్లు అనిపించసాగింది. అతన్ని తనెందుకు ప్రతిఘటించలేకపోతోందో అర్ధంకావటం లేదు. ఏమిటో తనలో ఈ బలహీనత? అతను వల్ల తను సినీ రచయిత్రి అయిందనా? అతను అందజేస్తున్న ధన సహాయం మూలానా? అతనిమీదున్న గౌరవం చేతా? అతనికీ, తనకీ మధ్య ఏర్పడ్డ స్నేహం వల్లా...
    "సీతా! మిమ్మల్ని బాధిస్తున్నానా నేను" కళ్ళల్లో కళ్ళుంచి అడిగాడతను.
    సీత కళ్ళ వెంబడి నీళ్ళు జారిపోయాయి. అప్రయత్నంగా అతనిని తన గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుంది.

 Previous Page Next Page