Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 35


    "మేము మీరనుకొంటున్నంత ధనవంతులం కాదండోయ్ అది గుర్తుంచుకొని మాట్లాడండి"
    "ధనవంతులు కాదని నాకూ తెలుసు. కాని మరో సినిమా ఛాన్స్ దొరికితే కూడా కారు కొనలేరా?"
    "అఫ్ కోర్స్ అప్పుడు అంత కష్టమేం కాదులెండి అయినా అప్పుడే మరో సినిమా ఛాన్సెవరిస్తారని?" నిరాశగా అంది సీత.
    "ఒకరిచ్చేదేమిటి? నేనే ఇస్తాను" ఆమెవంక చూస్తూ అన్నాడతను.
    "ఇది పూర్తికాకుండానా!" గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయామెకి.
    "బావుంది మీరు చెప్పేది! ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో పిక్చర్ టేకప్ చేయగూడదా ఏమిటి? మీకు నా పుట్టినరోజునాడే చెప్పాలని దాచివుంచానీ విషయం. నా నెక్ట్స్ పిక్చర్ కి కూడా మీ నవలే ఎన్నుకొన్నాను."
    "ఏ నవల?" ఆనందోత్సాహాలు ముప్పిరి గొన్నాయామెని.
    "క్రిందిటి నెలలో మాసపత్రికలో ముగిసిన సీరియల్ ఉంది చూడండి! దానిపేరు "మంచు మనుషులు" అనుకుంటాను..."
    "అవునవును"
    "కొత్తరకంగా ఉందా కథ. అందుకని నాకు నచ్చింది. ఈసారి మీకు డబ్బేమీ ఇవ్వదల్చుకోలేదు. ఒక కారు కొనిస్తున్నాను. దాని బదులు! మీరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా సరే"
    సీతకేం జవాబు చెప్పాలో తెలీలేదు.
    ఏమిటది? ఈ మనిషి మరీ ఇంత మంచి వారేం? ఇంత మంచి మనిషికి తాను ఏ విధంగా ఋణం తీర్చుకోగలదు?
    చాలాసేపు ఆ నవల గురించే మాట్లాడాడతను.
    కారు మళ్ళీ వెనక్కు తిరిగింది.
    మళ్ళీ అదే హోటల్_కమ్ బార్.
    "మీరెప్పుడయినా కాబరే నృత్యాలు చూశారా?" అడిగాడతను.
    "ఊహు!" సిగ్గుపడుతూ అంది సీత.
    "ఓసారి చూడాలి! మీరు రచయిత్రి కాబట్టి చూడడం అవసరం. అందుకే తీసుకొచ్చానిక్కడికి."
    ఇద్దరూ కారు దిగి లోపలకు నడిచారు. లోపల టేబుల్స్ అన్నీ పూర్తిగా నిండలేదు. తమకు రిజర్వ్ చేసిన టేబిల్ దగ్గర కూర్చున్నారిద్దరూ. అప్పటికే డాన్స్ మొదలయింది గుండెల మీదా, మొలమీదా జానెడు బట్టలున్న అమ్మాయి స్టేజి మీద పిచ్చిదానిలా ఊగుతోంది. అలాంటి నృత్యాలు సినిమాలో చూసేప్పుడు ఏమీ అనిపించదు కాని ఇలా ఎదురుగా కూర్చుని చూడాలంటే సిగ్గుగా ఉంది సీతకు.
    "మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను విస్కీ తీసుకుంటాను..." అన్నాడు వర్ధనరావు.
    సీత నవ్వింది "మీరు తీసుకుంటే నాకేం అభ్యంతరం?"
    అతని ముందు ఓ గ్లాసు_అందులో సగానికి విస్కీ ఉంచాడు బేరర్. షోడా కలిపి నెమ్మదిగా తాగసాగాడు వర్ధనరావు. సీతకదే మొదటిసారి తాగుడును ప్రత్యక్షంగా చూడటం కూడా! డాన్స్ చేసే అమ్మాయి లోపలికెళ్ళిపోయింది. లైట్లు డిమ్ అయిపోయాయి ఇప్పుడు. లోపల్నుంచి మరుక్షణంలో రెండు ఆకారాలు స్టేజిమీద కొచ్చాయి. లైట్లు మరింకా డిమ్ అయ్యాయి. మొలమీద గుడ్డలు తప్పితే ఇంచుమించు నగ్నంగా ఉన్నాయి రెండు ఆకారాలూ, ఇద్దరిలో ఒకరు స్త్రీ, మరొకడు పురుషుడు అని గుర్తించింది సీత. ఇద్దరూ నృత్యం ప్రారంభించారు. వాళ్ళ నృత్యం చూస్తుంటే ఒళ్ళు జలదరించిందామెకి. ఇంచుమించుగా కామ క్రీడల్లా ఉన్నాయా భంగిమలు! సిగ్గుతో శరీరం కుంచించుకు పోతోందామెకి. క్రీగంట వర్ధనరావు వంక చూసింది. అతను నవ్వుతూ తన వంకే చూస్తున్నాడు.
    "మీకు నచ్చకపోతే వెళ్ళిపోదాం పదండి" నవ్వుతూ అన్నాడతను.
    "వెళ్ళిపోదాం!" అంది సీత నెమ్మదిగా.
    అతను గ్లాసులో మిగిలిన ద్రావకాన్ని ఒక్క గుక్కలో తాగేసి బేరర్ కి డబ్బిచ్చి ఆమెతోపాటు బయటకు నడిచాడు.
    కారు నెమ్మదిగా పోతోంది.
    "మరీ ఘోరంగా ఉంది వాళ్ళ డాన్స్. అసలది డాన్సేమిటి నా మొఖం..." ఇంకేదో అనాలనుకొని సిగ్గుపడి వూరుకుండి పోయింది.
    "మీరు ఇదే మొదటిసారి కదూ చూడటం అందుకని అలా అనిపిస్తుంది" నవ్వుతూ అన్నాడు వర్ధనరావు.
    కారు మరో ఖరీదయిన హోటల్ ముందాగింది.
    "పదండి! మనకి డిన్నర్ ఇక్కడే" అన్నాడతను.
    ఇద్దరూ లోపలికి నడిచి లిఫ్ట్ లో నుంచున్నారు. మసక చీకటిగా ఉన్నచోట ఆగింది లిఫ్ట్.

 Previous Page Next Page