Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 37


                               13

    వారికి స్పృహ వచ్చేసరికి రాత్రి రెండయింది.
    "ఇంక వెళ్దామా?" అడిగాడతను.
    "ఊ!" అంది సీత అయోమయంగా.
    ఇద్దరూ బట్టలు కట్టుకొన్నారు. లిఫ్ట్ లో కిందకు దిగి కారులో కూర్చుంది సీత. కారు బయల్దేరింది.
    ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె ఇల్లు చేరేంత వరకూ.
    కారు దిగి నుంచుంది సీత. ఆమె చేతిని అందుకొని పెదాలతో స్పర్శించాడతను.
    గుడ్ నైట్"
    "గుడ్ నైట్..." అస్పష్టంగా గొణిగింది సీత. కారు స్టార్ట్ చేశాడతను.
    మేడ మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కిందామె. మాధవరావు తలుపు తెరచి ఆమెవంక చూశాడు.
    అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది సీత.
    "చాలా ఆలస్యమయిందే?" అన్నాడు మాధవరావు మళ్ళీ పక్కమీదకు చేరి కళ్ళు మూసుకొంటూ.
    "అవును" అంది సీత.
    త్వరగా బట్టలు మార్చుకొని మంచం మీద అతనికి దూరంగా పడుకొని లైట్ తీసేసింది. గుడ్డిగా వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిని కూడా ఆమె భరించలేకపోతోంది. అది కూడా తీసేసి చీకట్లోకి చూస్తూ పడుకొంది. జరిగిందంతా నమ్మబుద్ధి కావడం లేదు. అదంతా కలగా తేలిపోతే బావుండునని కూడా వుంది. అలా అది అబద్ధమయిపోతే ఇకముందు అలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి దిగజార కూడదని అనుకుంది. కానీ దురదృష్టవశాత్తూ అది పచ్చినిజం. తను వర్ధనరావుతో వ్యభిచరించింది. అతని వెనక వున్న డబ్బు తనలోని నీతిని కొనుక్కుంది. ఇప్పుడు తన మనసు, తన పెదాలూ, తన కళ్ళూ, తన సర్వస్వం మలినమయిపోయాయి. తెల్లారేవరకూ నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతూనే ఉంది. మాధవరావు నిద్రలేవటం ఆఫీసుకెళ్ళడానికి సిద్ధమవటం అవేమీ తెలీదు తనకి. వెళ్ళేముందు గదిలోకొచ్చి ఆమెను చూచి ఆశ్చర్యపోయాడతను.
    "ఏమిటి నిద్రలేవడంతోనే ఆలోచనలో పడ్డావ్?" అడిగాడు.
    ఎంత ప్రయత్నించినా అతనివైపు చూడలేకపోతోంది. ఇద్దరూ కళ్ళు కలుసుకోవడం భరించలేదు తను.
    "ఏమీలేదు" అతి కష్టంమీద నవ్వు తెచ్చుకొంటూ అంది.
    "నీతో మాట్లాడ్డానికి కూడా టైము దొరికేట్టులేదు. మరీ బిజీ అయిపోతున్నావ్. కొంతకాలం పోతే నిన్నేమయినా అడగాలంటే నాలుగు రోజుల ముందే "ఇంటర్వ్యూ"కి ఫర్మిషణ్ తీసుకోవాల్సి వచ్చేట్లుంది."
    అతను వెళ్ళిపోయాడు.
    లేచి మొఖం కడుక్కొని మళ్ళీ పడుకుండిపోయిందామె. వంటమనిషి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. కాఫీ తాగాక కొంచెం చలనం కలిగిందామెలో, అయిందేదో అయిపోయింది. ఇంక దాన్ని గురించి ఆలోచించి కూడా నిష్ప్రయోజనమే. కొన్ని తప్పులు, అవి తప్పులని తెలుసుకొన్న తరువాత సరిదిద్దుకోవచ్చు. మరికొన్ని తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ తరువాత సరిదిద్దుకోలేనివి అయి వుంటాయి.
    ఆలోచనలతో ఎంత సమయం గడిచిపోయింది ఆమెకు తెలీనేలేదు.
    "లోపలకు రావచ్చా" అన్న గొంతు విని ఆలోచనల్లోంచి బయటపడింది. ఎదురుగా వర్ధనరావు నుంచుని కనిపించాడామెకు.
    "ప్రొద్దుట్నుంచీ లేవనే లేదని మీ పనిమనిషి చెప్పింది. ఎందుకని? ఒంట్లో బావుండలేదా?" అడిగాడతను.
    "ఉహుఁ అదేమీ లేదు" పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ అందామె. లేచి కూర్చుంది మంచం మీదే.
    అతను ఆమె ప్రక్కనే కూర్చున్నాడు.
    "ఏమిటలా ఉన్నావ్?" ఆమెను దగ్గరకు లాక్కొంటూ అడిగాడు.
    "ఎలా వున్నాను?" అతనివేపు చూడకుండానే అడిగింది సీత.
    "ఏమో! అదివరకులా మాత్రం లేవు" ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడతను.
    అతని కౌగిలి నుండి సున్నితంగా తప్పించుకుందామె.
    "వచ్చే గురువారం నాడే మన సినిమాలో ఆఖరి సీన్లు షూట్ చేస్తున్నాము. దాంతో షూటింగు పూర్తయినట్లే" చెప్పాడతను.
    ఆ మాటలు ఆమెలో కొంత ఉత్సాహాన్ని కలిగించాయి.

 Previous Page Next Page