Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 36

 

    ఎలా తెలుసు ?" ఆశ్చర్యంగా అడిగింది శ్రీస్మిత.
    "ఎట్లానంటే నేనూ అదే హోటల్లో - అదే డైనింగ్ హల్లో -- నీ టేబుల్ కి దగ్గరలోనే ఉన్నా గనుక -"
    శ్రీస్మిత కంగారు పడుతూ పక్కకు చూసింది.
    శ్రీరాం కనిపించాడు. అతను చిరునవ్వు నవ్వుతుంటే చప్పున తల తిప్పుకొంది - శివ చూస్తున్నాడేమో అన్న భయంతో -- అయితే అప్పటికే శివ శ్రీరామ్ ని గమనించాడు.
    "అతను శ్రీరామ్ కదూ?" అడిగాడు స్మితను.
    "అవును -"
    "మరి పలుకరించలేదే? పరిచయం లేదా?"
    నిజం చెప్పడానికి స్మిత భయపడింది.
    "పెద్దగా పరిచయం లేదు -- అదీ గాక చాలా గాప్ వచ్చింది - " అందామె అబద్దమాడేస్తూ.
    నిజానికీ తనకూ, శ్రీరామ్ కీ మధ్య చాలాకాలం ఎఫైర్ ఉండేది. తనకు శివతో మారేజ్ సెటిలయాక - అతనిని ఎవైడ్ చేసింది. ఎందుకంటే తను నెంబర్ వన్ హీరోయిన్ అయే అవకాశం లేదని తనకు తెలుసు.
    తెలుగు సినిమా ఫీల్డులో నెంబర్ వన్ అవాలంటే కావలసింది మంచి నటన, సెక్సీ రూపం కాదు. హిందీ సినిమా ఫీల్డ్ లో ఏదొక సినిమాలో హీరోయిన్ గా నటించి ఉండాలి -- తెలుగు వచ్చి ఉండకూడదు .
    అలాంటి పరిస్థితుల్లో బాగా ఆస్తి పాస్తులున్న వాడెవడినయినా పెళ్ళి చేసుకుంటే లైఫ్ సెటిలయిపోతుందని ఆలోచించింది. అనుకోకుండా ఒక సినిమా పార్టీలో శివ తనను చూసి ప్రేమలో పడ్డాడు. అతని గురించి పూర్తీ వివరాలు సేకరించింది తను. కనీసం అయిదు వందల కోట్ల ప్రాపర్టీ ఉంటుందతని కుటుంబానికి. పైగా రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబం . అతనిని చేసుకుంటే జీవితమంతా హాపీగా లగ్జరియస్ గా గడిచిపోతుంది -
    అంతా అనుకున్నట్లే జరిగింది. పెళ్ళికి ముందు తనకు ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో శారీరక సంబంధం ఉండేది. అవన్నీ గోప్యంగా ఉంచింది శివ దగ్గర.
    అందుకే సినిమా ఫీల్డుకి దూరంగా ఉంటుంది వీలయినంత వరకూ - శ్రీరామ్ పలుకరిస్తాడెమో అన్న భయంతో త్వరత్వరగా ఆ హోటల్ నుంచి బయట పడిందామే. కానీ అప్పటికే శివ వారిద్దరినీ క్లోజ్ గా అబ్జర్వ్ చేశాడు -
    అందుక్కారణం అంతకుముందు రోజు తన కొచ్చిన ఆకాశరామన్న ఉత్తరం . అందులో ఎవరో శ్రేయోభిలాషి స్పష్టంగా రాశాడు.
    శ్రీస్మితకూ శ్రీరామ్ కీ ఆమె పెళ్ళికి ముందు సంబంధం ఉందనీ ఇప్పుడు మళ్ళీ శివను చీట్ చేసి శ్రీరామ్ ని శ్రీస్మిత రహస్యంగా కలుసుకుంటుందని భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ కలుసుకుంటుందీ ఏమేం మాట్లాడుకుంటుంది అన్నీ ఎప్పటి కప్పుడు తెలియజేస్తూంటాననీ రాశాడతను.
    శివకి అనుమానం మొదలయింది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ సెల్ లో తనేదురుగ్గానే మాట్లడుకోవటం- తనను చూడగానే శ్రీస్మిత కంగారు పడటం .
    అంటే - ఆ శ్రేయోభిలాషి రాసింది కరెక్టేనా?
    ఆమె కదలికలు కొన్ని రోజులు నిశితంగా అబ్జర్వ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు శివ.
    ఆ మర్నాడే శ్రీస్మితకు మళ్ళీ శ్రీరామ్ సెల్ ఫోన్ వచ్చింది. ఆ టైం కి తను బెడ్ రూమ్ లోనే ఉంది. శివ అప్పటికే స్నానానికి బాత్ రూమ్ కెళ్ళాడు. ఫోన్ అన్ చేసిందామె.  
    "హాయ్ స్మితా-" అన్నాడు శ్రీరామ్.
    "శ్రీరామ్ - దయచేసి నాకు ఫోన్లు చేయకు! శివకు మనం ఫ్రెండ్స్ అని తేలీటం కూడా నాకిష్టం లేదు. ఎందుకంటే శివ అదో టైప్! ఏం చేసినా చాలా కూల్ గా చేసే టైప్! మర్డర్స్ కూడా! అందుకే ఇంతగా చెప్తున్నా-"
    "నాకు తెలుసు శ్రీస్మితా! నేనూ తప్పనిసరి పరిస్తితుల్లోనే ఫోన్ చేస్తున్నా" శ్రీస్మిత భయపడింది .
    "ఏంటది?"
    "మనం అర్జంటుగా ఒకసారి కలుసుకుని ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడాలి -"
    "కలుసుకోవడమా? ఇంపాజిబుల్ - శివ వెనుక పొలిటికల్ పార్టీ ఉంది. అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తుంటారు ."
    "తప్పదు స్మితా! ఎంతో ముఖ్యమయిన విషయం కాబట్టే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నా! నీ మారేజ్ అయాక ఒక్కసారయినా నిన్ను డిస్టర్బ్ చేశానా చెప్పు !"
    స్మితకు భయం ఇంకా ఎక్కువయింది.
    "సారీ శ్రీరామ్  - శివ నన్నెంతగా ప్రేమిస్తున్నాడో అంత అనుమానం నామీద. అందుకే నేను ఎలాంటి రిస్కూ తీసుకోలేను -"
    "కానీ మనం కొద్ది నిమిషాలయినా మాట్లాడుకోకపోతే మనిద్దరం ప్రాబ్లమ్స్ లో పడతాం స్మితా! నాకంటే ఎక్కువ నీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటె నీకు సినిమా బాక్ గ్రౌండ్ కాదు- శివ వల్ల పొలిటికల్ బాక్ గ్రౌండ్ కూడా ఉంది నీకు - ఇవన్నీ ఆలోచించే కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేయాలనుకున్నాను-"
    స్మిత భయం ఇంకా పెరిగిపోయింది.
    "సరే! ఎక్కడ కలుసుకోవాలి ?"
    "హోటల్ ఖత్రియా , సోమాజీగూడ తెలుసుకదా! అందులో రూమ్ నెంబర్ త్రీ టూ సిక్స్ -"
    "ఓకే - ఎన్ని గంటలకి?"
    "మాణింగ్ లేవనో క్లాక్?"
    "ఓకే! నేను ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండలేను -"
    'చాలు!"
    "ఓకే- ఫోన్ డిస్కనెక్ట్ చేసి వెనక్కు తిరిగేసరికి శివ నిలబడి ఉన్నాడు. గుండె వేగంగా కొట్టుకుంది శ్రీస్మితకు.
    "ఎవరు ఫోన్లో -- ' తాపీగా అడిగాడతను.
    "మా ఫ్రెండ్ - వినీత -"
    "ఓకే - నేను వెళ్తున్నా- ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి రాలేను -- బిజినెస్ లంచ్ ఎటెండవాలి -"
    "ఓకే - బై-"
    "బై -' అతను వెళ్ళిపోయాడు.


                          ***

    సడెన్ గా రోజా తన రూమ్ లో కొచ్చేసరికి భవానీ శంకర్ ఆశ్చర్యపోయాడు. "వెల్ కమ్ ! ఉరుములేకుండా మెరుపు రావటం అంటే ఇదేప" అన్నాడు హాపీగా.
    "నీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను -"

 Previous Page Next Page