Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 35

 

    భవానీ నవ్వేశాడు.
    "సారీ రోజా! ఇదంతా మన చానెల్ క్రియేట్ చేసిన డ్రామా!"
    జైరాజ్ షాకయ్యాడు.
    "వ్వాట్! డ్రామానా?"
    "అవునంకుల్! ఆంజనేయస్వామి విగ్రహం పాలు తాగటం, చాముండిగా కాలీమాత అవతారమెత్తటం - ఇవన్నీ అబద్దాలు -- డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళతోనే నే ఈ డ్రామా ఆడించాను -"
    "అలా ప్రజల్ని మోసగించటం తప్పు కదూ?" హార్ట్ అయి అడిగింది రోజా.
    "యా! తప్పే! కానీ మనదేశంలో డబ్బు సంపాదించటం కోసం తప్పుడు పనులు చేయని వారేవరున్నారో చెప్పు! టెలికామ్ మంత్రే రెండు లక్షల కోట్లు ఫ్రాడ్ చేశాడు కదా! సురేష్ కల్మాడీ చేసిందేమిటి? అశోక్ చవాన్ ఎందుకు కక్కుర్తిపడ్డాడు? అందరిధ్యేయం అదే! పబ్లిక్ ని మోసం చేసి డబ్బు సంపాదించటం - మనదేశంలోని మెజారిటీ టీవీ చానెల్స్ చేస్తోంది కూడా అదే! రకరకాలుగా ఫ్రాడ్ చేస్తున్నాయ్ - బ్లాక్ మెయిల్ చేస్తున్నాయ్! అతి దారుణంగా ప్రజల్ని తప్పుడు వార్తలతో మోసగిస్తున్నాయ్. మనిషుల బలహీనతలను ఎక్స్ ప్లాయిట్ చేస్తూ నీతి నియమాలను గాలి కొదిలేస్తున్నాయ్. వీటిని గురించి మన సుప్రీంకోర్టు తప్ప ఎవడూ పట్టించుకోవటం లేదు. ఇలాంటి నికృష్ట వాతావరణంలో నెంబర్ వన్ చానెల్ అవాలంటే మనం ఇంకా , పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేయాలి. కొత్త రకం మోసాలు చేయాలి. నేను చెస్తుందదే!
    రోజా కొద్దిసేపు నిశ్సబ్దంగా ఉండిపోయింది.
    అతని చెప్పే ప్రతి మాటా ఎంతో అర్ధవంతంగా కనిపించిందామెకి. అంతవరకూ తను భారతదేశాన్ని తనలాంటి వాళ్ళు సంస్కరించాలనుకుంది. దేశానికి తనవంతు సేవ తను చేయాలనుకుంది. కేవలం నీతి నిజాయితీలను తన చానెల్లో ప్రచారం చేసింది. ఫలితం ఏమిటో తనకు తెలిసింది -
    'అయ్ ధింక్ యూ ఆర్ రైట్ రాకేష్" అంది నెమ్మదిగా.
    జైరాజ్ ఆశ్చర్యపోయాడు .
    "అదేంటి అలా అంటున్నావ్"
    "అవును డాడీ! ఇక్కడ దేశాన్ని ఉద్దరించాలనుకునే వాళ్ళకు ప్లేస్ లేదు. నీతిగా నిజాయితీగా , క్రమశిక్షతో వ్యవహరించే వాళ్ళను అడుగడుగునా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థలు నిర్వీర్యం చెస్తుంటాయ్. అందుకే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడే స్థిరపడుతున్నారు. ఈ దిక్కుమాలిన దేశంలో ఉండటం కంటే ఎక్కువ శాతం నీతి, నిజాయితీ , సంస్కారం ఉన్న విదేశాల్లోనే ఉండటం మంచిదనుకుంటున్నారు -"
    జైరాజ్ హాపీగా ఫీలయ్యాడు.
    తను పన్నిన వ్యూహం ఫలించింది.
    అల్టిమేట్ గా రోజాకీ, రాకేష్ కీ పెళ్ళి చేయాలని తనకూ, రాకేష్ తండ్రికీ చిరకాల కోరిక. అదిప్పుడు నెరవేరుతుంది. రాకేష్ తన ప్రియురాలిని మర్చిపోయి రోజా ప్రేమలో పడటం ఖాయం.
    

                            ***

    భవానీ, మల్లిక అతని చాంబర్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
    "ఇప్పుడు మన చానెల్ -- సంపూర్ణ చానెల్ రేటింగ్స్ సమానంగా ఉన్నాయ్" అంది మల్లిక హాపీగా రేటింగ్ చార్ట్ చూస్తూ.
    'అవును మల్లికా! ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా- సంపూర్ణను ఓవర్ టేక్ చేయలేకపోతున్నాం ! అదే నాకు అనీజీగా ఉంది -"
    "అందులో వర్రీ అవాల్సిందేమీ లేదు రాకేష్! ఓవర్ టేక్ చేయడానికి ఇంకొంచెం టైం కావాలి -"
    "అంటే ఎంతకాలం!"
    "సుమారు నాలుగు నెలలు-"
    "కానీ ఇంకో నెలరోజులే నాకు గడువుంది. అది దాటితే - 20 కోట్లు ఓడిపోతాను -"
    "అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్?" జాలిగా అడిగింది మల్లిక'.
    'చానెల్ చేతిలో ఉండగా డబ్బుకేమీ సమస్య లేదు మల్లికా! బ్లాక్ మెయిలింగ్ చేయటం మొదలుపెడితే పది రోజుల్లో 20 కోట్లు సంపాదించగలను - అయితే అది కొంచెం రిస్కీ కూడా - ఏదేమయినా నాక్కవాలసింది విజయం! ఎలాగయినా విజయం సాధించి తీరవలసిందే -"
    "అయితే ఇంకేమేం కొత్త ప్రోగ్రామ్స్ చేయాలో నేనూ ఆలోచిస్తా-"
    "థాంక్యూ! నాకు 24 గంటలు టైమివ్వు! ఏదొక బ్లాక్ బస్టర్ అయిడియా దొరక్కపోదు -" అన్నాడు భవానీ.


                                    ***

    ఆ రెండో రోజునే మల్లిక కేస్ హియరింగ్ కి వచ్చింది.
    ఆ కేస్ మల్లికకు జైలు తప్పదని మొదటి రోజే తెలిసిపోయింది.
    ఒక్కసారిగా నిరాశా నిస్పృహలామెని ఆవహించినయ్.
    "మల్లికా! నీమీద పూచికపుల్ల కూడా పడకుండా నేను చేస్తా! నువ్వేం వర్రీ అవకు" చెప్పాడు భవానీ.
    మల్లిక నవ్వింది.
    "నాకు ధైర్యం చెప్పడానికి మాట్లాడుతున్నావ్ గానీ -- నాకు జైలు తప్పదని నీకూ తెలుసు -"
    "ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ-"
    ఆ మాట మల్లికకు అనందం కలిగించింది.
    అవును! రాకేష్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదెవరూ!

                                            ***

    అదేరోజూ సాయింత్రం శ్రీస్మిత , శివ ఒక పార్టీలో డిన్నర్ చేస్తుండగా శ్రీస్మిత సెల్ మోగింది. ఫోన్ తీసి నెంబర్ చూసిందామె. ఎవరిదో కొత్త నెంబరు -
    "శ్రీస్మితా హియర్ -" అంది ఫోన్ అన్ చేసి.
    "హాయ్ స్మితా! ఎలా వున్నావ్?"
    ఆ గొంతు వెంటనే గుర్తు పట్టింది స్మిత. అతను శ్రీరామ్! తను సినిమా ఫీల్డ్ లో కొచ్చిన కొత్తలో పరిచయమయిన ఫిలిమ్ ఇన్ స్టిట్యుట్ ఆర్టిస్ట్!
    కానీ అతన్తో - తన భర్త శివ ఎదురుగ్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
    "హాయ్! హౌ ఆర్ యూ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ -" అందామె.
    "యా! ఈ మధ్య ఎందుకో బాగా యాద్ కొస్తున్నావ్- దాన్దిక్కు కెళ్ళి ఫోన్ జేసినా!"
    "థాంక్యూ! రైట్ నౌ నేను బిజీగా ఉన్నా! తర్వాత మాట్లాడనా?"
    "నువ్వూ నీ హజ్ బెండ్ కలిసి డిన్నర్ చేస్తున్నారని నాకు తెలుసు. మీ ఇద్దరూ హోటల్ త్రిరంగ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నారని కూడా నాకు తెలుసు-"

 Previous Page Next Page