Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 35


    "ఏమిటవి?"
    "వెస్టరన్ కల్చర్ జొరబడటానికి అవకాశం వుంది. దానివలన మోరల్ వాల్యూస్ ఎంత ఘోరంగానయినా దిగజారిపోవచ్చు"
    ఆ సబ్జెక్టు అతనితో చర్చించాలంటే యిబ్బందిగా ఉందామెకు.
    "ఈ కట్నాల చావుల సంస్కృతికంటే అదే మంచిదేమో."
    అతను ఆలోచనలో పడ్డాడు.
    ఇద్దరూ 'టీ' తాగి బయటికొచ్చారు.
    "సారీ_మీ టైమ్ వేస్ట్ చేస్తున్నాను"
    "ఫర్వాలేదులెండి."
    "అయితే మళ్ళీ శాంతగారు వెళ్ళిపోయాక యింటికి వస్తాను."
    "మీ ఇష్టం ఎప్పుడయినా రావచ్చు"
    అతను వెళ్ళిపోయాడు.
    అనుకొన్నట్లే శాంత శనివారం ఊరికి బయలుదేరింది. వాళ్ళ ఆఫీసర్ సలహాపై వుద్యోగానికి రాజీనామా చేయకుండానే ఆరు నెలలపాటు శలవు పెట్టేసింది.
    సామానంతా తీసుకొని ఇద్దరూ బస్ స్టాండ్ చేరుకున్నారు. సామానంతా పైన వేయించి శాంత తన సీటులో కూర్చుంది__సావిత్రి బయట కిటికీ దగ్గర నిలబడింది... ఆమెకు మనసంతా దిగుల్తో నిండిపోయింది. కళ్ళవెంట నీళ్ళు రావడమే తరువాయి.
    "నేను చెప్పిన విషయాలు మర్చిపోకు. ఆ శంకర్ త్వరగా వివాహం ప్రసక్తి తీసుకురా, అసలే స్పోర్ట్సు అంటున్నావు. పెళ్ళి కూడా ఒక స్పోర్ట్సు అనుకున్నారు, కష్టం."
    "నువ్వు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటావా.
    "అదేమిటి పెళ్ళికి రానన్నట్లే మాట్లాడుతున్నా ఎగగొట్టదల్చుకున్నావా ఏమిటి?"
    "పరిస్థితంతా చెప్పాను కదా! అన్నీ సవ్యంగా వుంటే వస్తాను" నవ్వుతూ అంది సావిత్రి.
    "నీ యిష్టం నిన్ను బలవంతం చేయాల్సిన అవసరం నాకు లేదు." కొంచెం కోపంగా అంది శాంత.
    "వెళ్ళేటప్పుడు అలా కోపంగా ఉండకే" అని చేయి పట్టుకుని నొక్కుతూ అంది సావిత్రి.
    కండక్టర్ బెల్ కొట్టాడు.
    "ఓ.కే. ఇక ఉండనా మరి?"
    "విష్ యూ హ్యాపీ జర్నీ..." చేయి ఊపింది సావిత్రి.
    బస్ బయలుదేరింది. ఇద్దరి కళ్ళు నిండుగానే నీరు నిండినయ్! ఇదే స్నేహమంటే. స్నేహానికెప్పుడూ అంతరాని కన్నీళ్ళే మిగలాలి.
    ఇంటికి తిరిగి వచ్చేసింది సావిత్రి. మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది టైము. ఆరోజూ, ఆ మర్నాడు కూడా ఆఫీసుకి శలవే! ఇల్లంతా ఖాళీగా కనబడుతోంది... ఎటు చూసినా శాంతే గుర్తుకొస్తోంది. ఆమె గుర్తుకొస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది...ఊహు! శాంతలేని ఈ ఇంట్లో తనుండలేదు, అనుక్షణం ఆమెనే గుర్తుచేసుకొంటూ బ్రతకలేదు. ఇల్లు మార్చేయాలి.
    "సావిత్రిగారూ!" కళ్ళవెంబడి జారుతున్న కన్నీరు తుడుచుకొని గడప దగ్గరకొచ్చి నిలబడింది.
    శంకర్ నవ్వుతూ లోపలికొచ్చాడు.
    "మీ శాంతగారు వెళ్ళిపోయినట్లున్నారు"
    "అవును. మీకెలా తెలుసు?"
    "ఇందాక ఆటోలో మీ ఇద్దరూ సామాను వేసుకొని వెళ్ళటం చూశాను... కొద్దిసేపటి క్రితం మీరు రిక్షాలో తిరిగి రావడం కూడా చూశాను."
    "మీరు గదిలోనే వున్నారా అప్పుడు" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి. ఆ రెండుసార్లూ అతని గదికి తాళం కనిపించింది.
    "ఊహు! మన సందు మొదట్లోని ఇరానీ హోటల్లో వున్నాను..."
    "ఓహో..."
    "మీరు మీ స్నేహితురాలి గురించి బాగా దిగులుపడి పోతున్నట్టున్నారు" సముదాయింపుగ అన్నాడతను.
    "సావిత్రి మాట్లాడలేదు."
    "పదండి! కాసేపలా తిరిగి వద్దాం...కొంతవరకయినా మీకు ఉపశాంతిగా వుంటుంది..."
    "ఎక్కడికి?"
    "ఎక్కడికో నాకు మాత్రమేం తెలుసు! పోనీ మీరు చెప్పండి. ఫలానా చోటకని! అటే వెళ్దాం..." నవ్వుతూ అన్నాడతను.
    ఆ సమయంలో అతనిని కాదనాలనిపించలేదామెకు.
    "ఒక్క నిమిషం కూర్చోండి!" అని చెప్పి లోపలకు వెళ్ళి మొఖం కడుక్కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత రెడీ అయ్యి పదండి అంది బయటకు నడుస్తూ.
    ఇద్దరూ రోడ్డుమీదకొచ్చారు. ఆ సమయంలో అతను తన సర్వస్వం అయినట్లు అనిపించిందామెకు. నిజమే...శాంత చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేయడం తన అవివేకమే అవుతుంది. శంకర్ కీ తనకూ మధ్య బలపడుతున్న అనుబంధాల ధ్యేయం నిర్ణయించాలి. అందుకే అతనికి మరింత చేరువ కాదల్చుకొంది. అతని దగ్గర మరింత చొరవ తీసుకోడానికి నిశ్చయించుకొంది.
    కోఠీ చేరుకొన్నారు.
    "అడగడం మర్చిపోయాను__మీరు భోజనం చేశారా..." ఆత్రుతగా అడిగాడతను.

 Previous Page Next Page