అతను జీవితంలో ఎక్కువ వినకుండా తప్పించుకోవాలనుకుంటున్నది అతని భార్య గొంతే. కాని అదే అతనెక్కడున్నా తరుముకుని వస్తూ వుంటుంది.
తండ్రి...కొడుకూ, తల్లి...కూతురూ, అన్నా...తమ్ముడూ, అక్కా...చెల్లెలూ, ఆఖరికి భార్యాభర్త, వీరందరి మధ్య ఎంత విడదియ్యకాని సంబంధమున్నా, నిరంతరం కలిసి వుంటున్నా, దినచర్యలో ఎంతో కొంతసేపు ఏకాంతం కావాలి. గుట్టు కావాలి. రహస్యమైనా, కాకపోయినా ప్రతి చిన్న విషయమూ రెండోవారికి చెప్పాలనిపించదు. కాని సీతాదేవికి అతని ప్రతి చేష్టా, ప్రతిచార్యా ఎప్పటికప్పుడు తెలుస్తూ వుండాలి. ఇంటికెవరయినా అతనికోసమొస్తే ఆమెకు సంబంధమున్నా లేకపోయినా ఎవరా అని ఎంక్వయిరీ చేస్తుంది. ఆమె అడిగిన చిక్కు ప్రశ్నలన్నిటికీ, వెధవ ప్రశ్నలన్నిటికీ అతను జవాబు చెప్పాలి. విసుక్కునే హక్కు లేదు. ఒకవేళ అనుకోలేక విసుగుదల ప్రదర్శించాడా! చచ్చాడన్న మాటే.
"టూత్ పేస్టు" అన్నాడు.
"లేదు" అంది.
"ఎందుకని?"
"అయిపోయింది కాబట్టి"
"తెప్పించకపోయావా?"
"ఆఁ మీరు సంపాదించే డబ్బుతో ఎప్పుడు పడితే అప్పుడు కొనటానికి రాశులు మూలుగుతున్నాయి.
ఆమెతో వాదన పెట్టుకుంటే, అలా పెరిగిపోతూ ఉంటుందని అటూ ఇటూ వెదికి, ఓ మూలపళ్ళపొడి ప్యాకెట్ కనబడితే, ఆ పూటకు దాంతో సరిపెట్టుకున్నాడు.
"కాఫీ యిస్తావా?"
"తెస్తున్నా అందుకనేగా నే వున్నది.
ఎత్తిపొడుపు లేకుండా మాట్లాడటం ఆమెకు చేతకాదు.
కాఫీ తెచ్చి ఇచ్చింది.
చల్లగా వుంది. డికాషన్ కూడా ఏమిటోగా వుంది. తాగాలనిపించటం లేదు.
కనీసం వెచ్చ పెట్టుకునైనా త్రాగుదామని కాఫీగ్లాసు తీసుకుని వంటింట్లోకి వెడుతున్నాడు.
"ఎక్కడికి వెడుతున్నారు?"
"కాఫీ చల్లగా వుంది. వెచ్చబెట్టుకుందామని."
"చల్లగా వుందా? పాలు మరగ కాగిపోతే, బలేవారండీ"
ఆమె ఇలా మాట్లాడుతుందనే, తనంతట తానే వెచ్చపెట్టుకుందామని లోపలకెళుతుంటే అదికూడా తప్పు పట్టుకొంటోంది.
నన్నడిగితే వెచ్చబెట్టి యిచ్చేదాన్నిగా. అక్కడి నేనేమో చెయ్యటంలేదని అంతా అనుకోవాలనా?"
ఏం జవాబు చెప్పాలో తెలీక బిత్తరపోయి చూస్తున్నాడు.
"ఇలా ఇవ్వండి" అంటూ అతని చేతిలోని గ్లాసు విసురుగా లాక్కుని వంటింట్లోకెళ్ళి అయిదు నిమిషాల్లో తిరిగొచ్చింది.
ఈసారి కాఫీ నోట్లో పెట్టుకోటానికి వీల్లేకుండా, నాలిక కాలిపోయేటట్లు మరిగిపోతోంది.
"ఏమిటలా మొహం వికారంగా పెడుతున్నారు? ఇంకా వేడి చాల్లేదా?"
"చాలింది" అంటూ కొంచం కొంచం తాగుతున్నాడు.
"అవునూ మీరీ సంగతి పట్టించుకుంటారా లేదా?" అంటూ ప్రక్కకి వచ్చి కూర్చుంది"
"ఏ సంగతి?"
"ఆస్తి పంపకాల సంగతి"
"నన్నేం చెయ్యమంటావు? ఎన్నిసార్లు పరిష్కారానికొద్దామన్నా, ఎవరూ రాజీకి రాకుండా వుంటే?"
"ఎందుకు రారు? ఈ యింటికి మీరు పెద్దవారు. నేను చెప్పినట్లు మీరు వినాల్సిందేనని తమ్ముళ్ళని శాసించాలంతే.
"పెళ్ళాన్నీ, కూతుళ్ళనీ శాసించటానికి తికానా లేదుగానీ, తమ్ముళ్ళని శాసించటం నా బొంద" అనుకున్నాడు మనసులో.