సంకేతిని ఐ స్పెషలిస్టు దగ్గరకు వెళ్ళటానికి బద్దకించి, వాయిదాలు వేసుకుంటూ తానుపడే ఇబ్బందితో రాజీపడసాగింది.
ఒక్క నిముషం చీకట్లో అలాగే నిశ్శబ్దంగా నిలబడి స్విచ్ బోర్డుమీదకి, ట్యూబ్ లైట్ స్విచ్ ఎక్కడుందో ఊహించుకుంటూ చెయ్యి జాపింది. ప్రక్కనే ఏదో అలికిడయినట్లయింది.
ఏమిటిది? బెడ్ రూం డోర్ లోపల లాక్ చేసుకునే పడుకుంది. లోపలకు ఎవరూ ప్రవేశించటానికి వీల్లేదు.
ఒక్కక్షణం తటపటాయించి చెయ్యి స్విచ్ బోర్డుమీద వేసింది. అదే సమయానికి స్విచ్ ని గట్టిగా అదమబోయింది. కాని ఆమె వ్రేలు స్విచ్ మీద కాకుండా ఆ బోర్డ్ లోనే ప్రక్కగా ఉన్న ప్లగ్ మీదపది అదిమింది.
శరీరమంతా అదిరిపోయేటట్లుగా షాక్ కొట్టింది. చెయ్యి ఎలా వెనక్కి తీసుకోగలిగిందో తెలీదు. ఒక్క కేకపెట్టి వెనక్కితూలి స్పృహ తప్పి పడిపోయింది. అలా జరగటంతో తనతోబాటు ఇంకో పురుషుడికి కూడా విద్యుద్ఘాతం తగిలి, గావుకేకతో క్రిందపడిపోయిన విషయం ఆమెకు తెలీదు.
14
రంజిత జగన్మోహనరావుగారి ఆఫీసుకెళ్ళింది. ఆయన ఆఫీసు బాధ్యతంతా మేనేజర్ సాయినాథ్ అనే అతను చూస్తున్నాడు. రంజిత అతన్ని కలుసుకొని జగన్మోహనరావుగారి గురించి వివరాలు అడిగింది. ఇక్కడ్నుంచి సరాసరి స్టేట్స్ వెళ్ళారనీ, అక్కడో పదిరోజులుండి స్విట్జర్లాండ్ వెళ్ళారని తెలిసిందనీ, అక్కడ్నుంచి ఉత్తరమొస్తే తప్ప కరెక్ట్ ఎడ్రస్ తెలీదని! తాను కాంటాక్ట్ చేద్దామని శతవిధాలా ప్రయత్నించి ఫెయిలయ్యాననీ చెప్పాడు.
రంజిత ప్రాణం ఉసూరుమన్నట్లయి వెనక్కి తిరిగింది.
మూడురోజుల తర్వాత రంజిత ఊటీకి వెళ్ళి, హేమసుధ చెప్పిన హోటల్లో అడుగుపెట్టి అక్కడే ఓ రూమ్ తీసుకుంది.
ఆ సాయంత్రం హోటల్ మేనేజర్ని కలుసుకుని తన ఐడెంటిటీ చెప్పి అడగదల్చుకున్నది అడిగింది.
"ఆ సర్వర్ పేరు సురేష్, అతను అన్నివిధాలా మంచివాడేగాని, అందమైన ఆడవాళ్ళని చూస్తే మైమరచిపోయే బలహీనత అతన్లో ఉంది. హేమసుధది కళ్ళు చెదరగొట్టే సౌందర్యం. ఆమెనుచూసి అతను పిచ్చెత్తి పోయివుంటాడు. తలుపులు మూసి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నమాట నిజమే. ఆ సంఘటన జరిగాక అతన్ని తీవ్రంగా మందలించటమేగాక ఉద్యోగంలోంచి తీసేశాను."
"ఆ సురేష్ ని ఉద్యోగంలోంచి తీసేస్తానన్నప్పుడు అతనేమన్నా ప్రతిఘటించటం జరిగిందా?"
"ఏదో అన్నాడులెండి."
"అలాకాదు- ఏమన్నాడో చెప్పండి."
"అందమైన ఆడదాన్ని ముద్దుపెట్టుకుంటే తప్పా? నాకు కోరిక కలిగింది. తీర్చుకోవాలనుకున్నాను. ఒక్క ముద్దేకాదు. ఆమెను ఎప్పటికైనా పూర్తిగా అనుభవించి తీరతాను. నా కోరిక తీరకపోయిందా జీవితంలో ఎందుకూ పనికిరాకుండా చేసివేస్తాను" అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడు.
"ఇప్పుడతను ఎక్కడున్నారు?"
"తెలీదు."
"అతని బంధువులుకానీ, స్నేహితులుకానీ, అతన్ని గురించి తెలిసిన వాళ్ళుకానీ ఎవరైనా వున్నారా?"
మేనేజర్ కొంచెంసేపు ఆలోచించాడు "తెలీదు" అన్నాడు. తర్వాత అతని మొహంలో కనిపించిన చిన్న కలవరపాటు ఆమె కళ్ళు కప్పలేక పోయింది. అతనెందుకో అబద్ధం చెబుతూన్నట్లుగా ఆమె గ్రహించింది.
మేనేజర్ వెళ్ళిపోయాక ఆమె చాలాసేపు వంటరిగా పడుకుని ఆలోచించింది. మొదట చాలా తేలిక అనుకున్న ఈ సమస్య క్రమక్రమంగా చాలా కఠినంగా తయారవుతోంది. ఇది కేవలం ఓ వ్యక్తికి సంబంధించిందా లేక ఒకరికంటే ఎక్కువగా ఇన్ వాల్స్ అయివున్నారా అని తెలుసుకోవటం కష్టంగా వుంది.
సాయంత్రం ఆరుగంటలదాకా రంజిత అలా పడుకొని ఆలోచిస్తూనే ఉంది. మధ్యలో అనుకోకుండా ఓ అరగంట నిద్రపోయింది. మెలకువ వచ్చాక కూడా బద్ధకంగానే ఉంది. తర్వాత లేచి టీ తెప్పించుకుని త్రాగుదామని కాలింగ్ బెల్ నొక్కింది. బేరర్ ఎవరూ రాలేదు. ఈ పెద్ద హోటల్స్ లో ఇదో న్యూసెన్స్. బెల్ కొట్టగానే ఎవరూరారు. పైగా అదేపనిగా పిలిస్తే తప్పుచేసినట్లు కస్టమర్ వంక కోపంగా చూస్తారు. తీసుకునే డబ్బు తీసుకుంటూ, టిప్స్ తీసుకుంటూ ఊరికినే పనిచేస్తున్నట్లు ప్రవర్తిస్తారు.
బేరర్ ఎంతకూ రాకపోతే విసుగుపుట్టి ఈలోపల స్నానంచేసి వద్దామని బాత్ రూమ్ లోకి వెళ్ళింది. వేసవికాలమైనా విపరీతమైన చల్లగా వుంది. చిన్నప్పుడెప్పుడో స్కూల్ పిల్లలతో ఎక్స్ కర్షన్ కని ఊటీ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాలేదు. ఇక్కడి వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఆమెకెంతగానో నచ్చింది. ఉద్యోగధర్మం లేకపోతే ఇంకా కొన్నాళ్ళపాటు ఇక్కడే వంటిగా ఉండిపోయి మనసారా తనకు నచ్చిన నవలలు చదువుకుంటూ, సాయంత్రాలు గార్డెన్స్ లో రకరకాల పూలమొక్కల మధ్య తిరుగాడుథూ గడపాలని ఉంది.
ఆ చలిలో వేన్నీళ్ళతో స్నానం చేస్తోంటే ఎంతసేపయినా అలా వుండిపోదామనిపిస్తోంది. అప్పుడప్పుడూ వేధించే వంటరితనం, స్త్రీ సహజమైన దిగులు అన్నీ తొలగిపోయాయనిపించింది. దాదాపు అరగంటసేపు తనివితీరా స్నానం చేసింది. స్నానం మనిషికి గొప్ప తోడు. స్నానం మనిషికి గొప్ప వరం. గొప్ప ఆహ్లాదం. తర్వాత బయటకు వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చీరె మార్చుకుంటోంది.
ఉన్నట్లుండి డోర్ దగ్గర అలికిడైంది. ఆమె డోర్ లాక్ చేశాననుకుని, చీర కట్టుకోవటం పూర్తయ్యాక తలుపు తీయవచ్చునని, గబగబ కుచ్చెళ్లు పెట్టుకుంటోంది.