ఓరోజు ఉదయం ఎనిమిది గంటలవేళ అతనికేదో కావాల్సివచ్చి "దుర్గా, దుర్గా!" అని కేకేశాడు.
మాలతి పూజలో వుండబట్టి వినిపించలేదు.
మళ్ళీ పిలిచాడు.
వినబడింది.
"వస్తున్నా!" అనబోయి తమాయించుకుని పూజ ముగించుకుని లేచి నిలబడింది.
అతను అసహనంగా గదిలోంచి ఇవతలకు వస్తూ, ఎదురుగా వస్తోన్న మాలతిని గుర్తించలేక ఢీ కొన్నాడు.
"అబ్బ!" అనబోయి మళ్ళీ తమాయించుకుని మౌనంగా నిలబడింది.
అతని చేతులు ఆమె భుజాలను పట్టుకున్నాయి.
"దుర్గా! దెబ్బ తగిలిందా?"
అతనికి కనబదని తెలిసినా మాలతి అప్రయత్నంగా లేదన్నట్లు తల ఊపింది.
"నువ్వేదో సంజ్ఞతో జవాబు చెప్పేవుంటావు. నాకు కనబడదుగా వుండు....." ఆమెని విడిచిపెట్టి కుడిచేతిని ముందుకుచాపి వ్రేళ్ళు చూపెట్టాడు.
"దెబ్బ తగిలిందా? లేదా? ఇప్పుడు చెప్పు?"
మాలతి నవ్వుతూ అతని మధ్యవ్రేలును పట్టుకుంది మృదువుగా.
"తగల్లేదా? తగిలినా అలా చెప్పవు. దుర్గా! నాకాశ్చర్యంగా వుంది. నాతో ఒక్కమాట మాట్లాడకుండా నన్ను మళ్ళీ మనిషిని చేశావు. నీ రూపం తెలియదు, నీ గొంతు తెలియదు.....నీ అడుగులు చప్పుడు తెలుసు...." ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని "నీ స్పర్శ నాకు తెలుసు. నిన్ను తాకితే నువ్వు కొత్త దానివి కాదనిపిస్తోంది. ఎన్నో యుగాల పరిచయం వుందనిపిస్తుంది. నిన్నిక్కడికి తీసుకువచ్చినందుకు గోపయ్యమీద మొదట విసుగనిపించింది. కానీ గోపయ్య ఇప్పుడు దేముడనిపిస్తోంది."
గోపయ్య ఆ గదిలోకి వస్తూ వీళ్ళిద్దర్నీ ఆ స్ధితిలోచూసి ఆగిపోయాడు.
అడుగుల చప్పుడు విని శేఖర్ ఆమెను విడిచిపెట్టి "ఎవరూ? గోపయ్యా?" అన్నాడు.
"అవునయ్యగారూ, కూరలు తెచ్చాను. చేతిలోనిసంచి మాలతికందించాడు. అది తీసుకుని ఆమె లోపలికెళ్ళి వెళ్ళిపోయింది."
"గోపయ్యా! దుర్గ ఈ ఇంటికి వచ్చి ఎన్నాళ్లయిందంటావు?"
"మూడు నెలలయి వుంటుందయ్యగారూ!"
"ఈ మూడునెలలూ నా జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చాయో చూశావా?"
గోపయ్యకర్ధం కాలేదు.
"మూడు నెలలక్రితం నేను మూడు వారాలకంటే బ్రతకననుకున్నాను. మూడు నెలలక్రితం నేను ఆడదాన్ని తీవ్రంగా ద్వేషించాను. మూడు నెలలక్రితం నేను జీవితాన్ని చూచి గజగజమని వణికిపోయాను. కానీ ఇప్పుడు నేను కొత్త మనిషిని."
"మిమ్మల్నిప్పుడు చూస్తూంటే చాలా సంతోషంగా వుందయ్యగారూ!"
"..... ఈ ప్రపంచంమీద అసహ్యం మళ్ళీ ఆశగా మారింది."
"అయ్యగారూ!"
"అవును గోపయ్యా! అప్పుడు ఆడదాని ఉనికిని భరించగలనా అనుకున్నాను. కానీ అదే ఆడది మాలతి, అదే ఆడది దుర్గా అని తెలుసుకున్నాను."
గోపయ్యకు ఏవో సత్యాలు అర్ధమవుతున్నాయి.
"స్త్రీలోని రెండు విభిన్న మూర్తులను ఇద్దరిలోను చూశాను గోపయ్యా! మాలతి వల్ల కరుడుగట్టి పాషాణంగా మారిన నా హృదయం, దుర్గవల్ల మంచుగా మారి, హాయిగా కరిగింది. మూడునెలల అవతల మాలతి - ఇవతల దుర్గ - మధ్యలో మారిన నేనూ. చిత్రంగా వుందికదూ?"
"అయ్యగారూ! దుర్గ నా మనమరాలు. ఏళ్ల తరబడి ఈ ఇంటి ఉప్పు తిన్న గోపయ్య మనమరాలు. మిమ్మల్ని కాపాడుకోవటం దాని విధి."
"కేవలం విధే అయితే నా చరిత్ర ఎప్పుడో సమసిపోయేది గోపయ్యా! దుర్గ నాకు కావాలి......!"
"అయ్యగారూ!.......మీరు?......"
"అవును. దుర్గను నేను పెళ్ళి చేసుకుంటాను."
గోపయ్యకి ఆనందంతో మాటరాలేదు.
"ఏం గోపయ్యా! మాట్లాడవేం?......" శేఖర్ ముఖం నల్లబడిపోయింది. అర్ధమయింది. నా ఆనందంలో, వెర్రి ఆశతో అసలు స్ధితి మరచిపోయాను. దుర్గలాంటి ఉత్తమురాల్ని పెళ్ళిచేసుకునే అర్హత నాకులేదు. ఈ విషయం నాకెలా చెప్పటమా అని ఆలోచిస్తున్నావు కదూ."
"లేదయ్యగారూ! లేదు..." గోపయ్య గొంతు వణికింది. "ఇంత మంచి మాట వినగానే ఆనందంతో నాకు మాట రాలేదంతే. దుర్గని మీరు చేసుకుంటానంటే అంతకన్నా అదృష్టమేముంది బాబూ?"
శేఖర్ కి కళ్ళు చమర్చినట్లయాయి. "అయితే గోపయ్యా! నువ్వు ఒప్పుకున్నావా?"
"ఒప్పుకోవటమేమిటి అయ్యగారూ? మా అదృష్టానికి పొంగిపోతున్నాను."
"గోపయ్యా! నువ్వెంత మంచివాడివి!" అంటూ శేఖర్ తడుముకుంటూ ముందుకు నడచి అతన్ని కౌగిలించుకున్నాడు.
గోపయ్య కాళ్ళనుండి ఎదతెగకుండా కన్నీటిధారలు.
"ఉండండి బాబుగారూ! ఇప్పుడే వస్తాను" అని అతన్ని మెల్లగా విడిపించుకుని బయటకు వెళ్ళిపోయాడు.
శేఖర్ నిలబడి ఆలోచిస్తూన్న వాడల్లా ఏదోతోచి, కుచించుకుపోయినట్లయ్యాడు. తానెంత తొందరపడ్డాడు ? దుర్గని అడక్కుండా, ఆమెతో సంప్రదించకుండా గోపయ్యముందు బయటపడిపోయాడు. ఆమెకు ఇష్టమందో లేదో.....అసలు తనగురించి ఆమె అభిప్రాయమేమిటి.....?"
"దుర్గా!" అని పిలిచాడు. భయంతో గొంతు వణికింది.
మాలతి లోపలినుండి వచ్చింది.
"చూడూ! తొందరే పడ్డాననుకో, కానీ గోపయ్యతో మాట్లాడేశాను. ఇన్నాళ్ళూ నన్ను కంటికి రెప్పలా కాపాడావు. కానీ నా కనురెప్పవి అవుతావా దుర్గా? ఇది నా దురాశ. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఇష్టమేనా దుర్గా?"