Previous Page Next Page 
అష్టావక్ర పేజి 35


    "అది నా దగ్గిరా వుంది. నాక్కావలసింది మిగతా ఏమైనా వుంటే?"

    "సారీ డాక్టర్".

    రంగప్రసాద్ లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు.

    వంశీకృష్ణ ఉత్సుకతతో, "ఏమైంది? మీ ఊరి రహస్యం ఏమైనా బయట పడిందా" అని అడిగాడు.

    "లేదు. ఇంకొక్కజననం తరువాత అక్కర్లేదు కూడా" అని బయటకొచ్చేసేడు.

    అతడిని చూసిన నివేదిత పలకరింపుగా నవ్వింది. రంగప్రసాద్ ఆలోచన్లు ఇక్కడ లేవు. ఎంతో ఆశతో వచ్చిన పనికి చుక్కెదురైంది.

    "ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" ఆమె గదిలో కూర్చున్నాక అడిగింది. రంగప్రసాద్ తను వచ్చిన పని చెప్పి, "అసలు నేను వూహించినదే చాలా సత్యదూరమైనది. దానికితోడు ఇప్పుడు ఇక్కడ పూర్తిగా వివరాలు దొరక్కపోవటంతో ఇక ఈ ఆలోచనకి పూర్తి ఫుల్ స్టాప్ పెట్టెయ్యాల్సిందే".

    "అలాంటి వివరాలు నా దగ్గిరున్నట్టున్నాయి".

    రంగప్రసాద్ ఒక్కసారిగా చైతన్యవంతుడయ్యాడు. "మీ దగ్గిరున్నయ్యా" అని అడిగాడు ఎగ్జయిటింగ్ గా.

    "చిన్నపిల్లలకి స్టాంప్ కలెక్షన్ ఎలా హాబీనో అలాగే ఈ సైన్సు నా అభిమాన విషయం. మొన్న మొన్నటివరకూ ఇలాంటి విషయాలన్నీ నోట్సు వ్రాసి పెట్టుకొనే దాన్ని".

    "ఎక్కడుంది ఆ నోట్సు?"

    "బొంబాయిలో".

    కృంగిపోయాడు ఆ జవాబుకి. ఆమె గుర్తించి నవ్వుతూ, "ఫర్వాలేదులెండి. ఈ రోజు నేను బొంబాయి వెళుతున్నాను. నా సామాన్లు తెచ్చుకోవటానికి" అంది. "నేనీ ఇన్ స్టిట్యూట్ లో చేరి కొద్దిరోజులే అయింది".

    "మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు?'

    "వారంరోజులు పట్టవచ్చు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. వెళ్ళగానే ఫోన్ చేస్తాను. మీకు కావల్సింది పేర్లేగా!"

    "ఉట్టి పేర్లతో లాభంలేదు. కన్ జెనెటల్ మాల్ ఫార్మేషన్స్ కి కారణాలు ఏమైనా వున్నాయా- ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు, వెనీయల్స్ చరిత్ర, ఇలాంటివన్నీ కనుక్కోవాలి. ముందసలు మీరు పేరూ, అడ్రసూ చెప్పండి. మిగతావి నేను సేకరిస్తాను" అంటూ లేచి, చిన్న కాగితం మీద తన ఫోన్ నెంబరు రాసి ఇచ్చాడు.

    ఆమె అతడి దగ్గర్నుంచి ఫోన్ నెంబరున్న కాగితం అందుకుంటూ, "మరిన్ని వివరాలు ఇచ్చినందుకు నా ప్రజెంటేషన్?" అని అడిగింది.

    అప్పటివరకూ గంభీరంగా వున్న డాక్టరు, మెడికో అయి "ఏం కావాలి" అని అడిగాడు.

    "హెలికాప్టర్".

    "మైగాడ్! ఎక్కువలో ఎక్కువ ఐస్ క్రీమ్ ఇప్పించగలను".

    "నాకు బట్టర్ స్కాచ్ అంటే ఇష్టం".

    "ఓకే" అన్నాడు మెట్లు దిగుతూ.

    అతను కృష్ణాపురం వెళ్ళిన రెండురోజుల వరకూ ఫోన్ కోసం చూసేడు. రాలేదు. వస్తుందని వూహించలేదు కూడా. దగ్గరున్నప్పుడు మాటల ప్రవర్తన వేరు. దాన్ని ఆచరణలో పెట్టటం వేరు. నివేదిత కూడా అలాటి అమ్మాయే అనుకోవడం కాస్త బాధ అనిపించింది. కనీసం ఆమె ఫోన్ చేస్తే, ఆ తరువాత ఆమెని ఇంకొకసారి కలుసుకోవచ్చని చిన్న ఆశ! ఆమె ఈ పరిచయాన్ని ఏమాత్రం గుర్తుంచుకోలేదని, దీనికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదనీ గుండెల్లో బాధ అంతే.

    అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. రంగప్రసాద్ పక్కమీద నుంచి లేవలేదు. ఫోన్ మ్రోగింది. రిసీవర్ తీసుకొని 'హలో' అన్నాడు.

    దూరంగా ఎక్కడినుంచో వస్తూన్న శబ్దం "నేనూ...నివేదితిని".

    కప్పుకున్న రగ్గు విసిరేసి, పక్కమీద కూర్చుంటూ "ఏం? ఇంత ఆలస్యమైందేం" అని అడిగాడు. అతడి కంఠంలో ఉత్సుకతతో పాటు సంతోషం కూడా వుంది.

    "అలాంటి డెలివరీ కేసు ఒకటి కనుక్కున్నాను".

    "ఎవరు?"

    "అగర్వాల్....మిసెస్ ప్రతిమా అగర్వాల్...బొంబాయిలో ఓషన్ వ్యూ నర్సింగ్ హోంలో ప్రసవం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం...."

    "ఇది చెప్పటానికి మూడు రోజులు పట్టిందా!"

    "ఆగండాగండి! ఇది ఇక్కడితో ఆగలేదు. మీరన్నారుగా- ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు- వెనీరియల్స్ - చరిత్ర - అన్నీ కనుక్కోవాలని... ఎలాగూ ఈ కేసు బొంబాయిలో జరిగిన డెలివరీయే కాబట్టి ఆ పని నేను ఎందుకు చెయ్యకూడదా అనిపించింది. నిన్నంతా అదే పనిమీద వున్నాను. అగర్వాల్ భార్యకి అంటే మిసెస్ ప్రతిమా అగర్వాల్ కి ఈ ప్రసవం జరిగిన మూడు నెలలకి పిచ్చెక్కింది".

    ఎవరో చెర్నాకోలాతో కొట్టినట్టయింది.

    "వ్వాట్" అని అరిచాడు.

    "అవును. ఆమెని కపాడియా మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ ఆమె కొద్దికొద్దిగా బాగుపడుతున్న తరుణంలో రెండు కుక్కలు ఆమె మీదపడి మెడ కొరికి చంపేశాయి".

    "ఏమిటీ?"

    "అవును. వినటానికి నాకూ చిత్రంగానే అనిపించింది. కుక్కలు కరుస్తాయి. కానీ కొరికి చంపవు. ఈ కేసులో క్లియర్ గా అలాగే వుంది. నిన్న సాయంత్రమంతా పోలీస్ స్టేషన్ లో పాత రికార్డులు వెతికి ఫోటోల్తో సహా చూశాను".

    "పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళావా?"

    "మరొక విషయాన్ని చేపట్టాక చెయ్యాలికదా. అందులోనూ డాక్టర్ రంగప్రసాద్ తో కలిసి బట్టర్ స్కాచ్ తినటం కోసం..." ఆమె కంఠంలో ముందున్న సీరియస్ నెస్ పోయింది.

    రంగప్రసాద్ మాత్రం ఆలోచిస్తూనే వున్నాడు. అతడి ఆలోచన్లు ఒకచోటే ఆగిపోయాయి...కుక్కలు...కుక్కలు.

    ప్రతిమా అగర్వాల్ ని కూడా కుక్కలే చంపాయి!


                          26


    ప్రక్కనున్న స్కెలిటన్ తోపాటు నడుస్తున్నాడేగానీ, షాడో మనసులో ఆలోచన్లు తూనీగల్లా ముసురుకుంటున్నాయి. ఎన్నో అనుమానాలు.

    ఉస్సోక్ సభ్యులు అవతార్ బాబాని కలుసుకోవటానికి మిగతా జనంలా క్యూలో వెళ్ళనక్కరలేదు. ఆ విషయం షాడోకి ముందే చెప్పబడింది. షాడో గృహాంతర్భాగంవైపు వెళ్ళి అట్నుంచి మెయిన్ హాలులోకి వచ్చాడు. పట్టుబాలీసులకీ ఆనుకొని అటువైపు తిరిగి కూర్చుని వున్నాడు బాబా. అది ఉచిత దర్శనకాలం అవటంతో క్యూలో ఒక్కొక్కరే వచ్చి కానుకలు సమర్పించి ముందుకు సాగిపోతున్నారు.

    బాబా చెయ్యెత్తాడు. క్యూ ఆగిపోయింది. ఆయన తల తిప్పకుండానే "రా షాడో రా" అన్నాడు.

    షాడో శిలాప్రతిమే అయ్యాడు.

    వెనక్కి చూడకుండానే పిలిచినందుకు కాదు. తనని అసలు పేరుతో గుర్తించినందుకు!

    ఇక తన పని ఆఖరు అనుకున్నాడు. అంతమంది అనుచరులతో పోరాడి తప్పించుకొని పోవటానికి తనేమే సినిమా హీరో కాదు. అయినా అనుచరులవరకూ అక్కర్లేదు. బాబా చిన్న సైగచేస్తే ఈ జనమే విరుచుకుపడి, ఏ కీలుకా కీలు విరిచేస్తారు. "జోన్స్" తాలూకు ప్రజల్లా వున్నారు ఈ ప్రజలు "భక్తి" అన్న మత్తులోపడి.

    మనసులో భావాలు మొహంలో ప్రతిబింబించకుండా జాగ్రత్త పడుతూ దగ్గరికి వెళ్ళాడు.

    "తెలుసుగా! నీ చెల్లికి అష్టావక్రుడు జన్మిస్తున్నాడు" అన్నాడు బాబా.

    షాడోకి ఆశ్చర్యం వేసింది. తన దగ్గిర అతడామాట చెప్పటం.

    "పుట్టగానే తల్లినీ, తండ్రినీ చంపుతాడు".

    షాడో మాట్లాడలేదు. జాగ్రత్తగా చూస్తే అతడి పిడికిళ్ళు మూసుకోవటం తెలుస్తుంది.

    అంతలో తిరిగి బాబా అన్నాడు- "అయినా సరే- నువ్వు ఉస్సోక్ లో చేరావూ అంటే అది నీ దూరదృష్టిని తెలుపుతూంది. భవిష్యత్తు సర్వసౌఖ్యాలూ అనుభవించ బోతున్నావు. చెల్లీ, బంధువులూ- ఇవన్నీ చాలాచిన్న విషయాలు. 'కాష్మోరా' ఒక్కటే చివరికి మనల్ని రక్షించేది. నువ్వు అది తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా వుంది".

    షాడోకి ఒక విషయం అర్ధమైంది. తను ఉస్సోక్ లో చేరినట్టు బాబాకి వార్త వచ్చేసింది. తనని చూడగానే తను కేదారగౌరి అన్నయ్య అని గుర్తుపట్టాడు... అయినా తనని ఏమీ చెయ్యకపోవటానికి కారణం. ఉస్సోక్ మీద బాబాకి వున్న నమ్మకం!! ఉస్సోక్ లో చేరబోయే ప్రతివాడూ తప్పక మనసులో విషయాలన్నీ చెపుతాడనీ వీళ్ళకి చాలా బలమైన నమ్మకం వున్నట్టుంది. అందుకే తను చెల్లెల్ని కూడా వదులుకొని నిజంగానే ఉస్సోక్ లో చేరినట్టే నమ్ముతున్నారు. వాళ్లు తమవాడు అనుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే వీళ్ళు వుండటం మంచిది.

    నెమ్మదిగా మోకాళ్ళమీద కూర్చుని "ఎల్లుండి ఉస్సోక్ సమావేశం వుంది. ఆ కబురు మీకు తెలియజేయటానికి పంపేరు నన్ను..." అన్నాడు.

    "మంచిది".

    "వెళ్ళొస్తాను" అంటూ లేచాడు షాడో. బాబా చేతి సైగతో క్యూ మళ్ళీ మొదలైంది.

    వెనుదిరగబోయిన షాడో షాక్ తగిలినట్టు ఆగిపోయాడు. ఎక్కడో ఏదో చిన్న మెరుపు!!! 

    కొన్నాళ్ళ క్రితం తన కళ్ళముందే బాబా స్వహస్తాలతో బాగు చెయ్యబడిన 'గూనిపిల్ల'...క్యూలో నెమ్మదిగా ముందుకు వస్తూంది.

    ఆమెకు గూనిలేదు.

    అయితే ఆమె ఈసారి గుడ్డిదానిలా తడుముకుంటూ ముందుకు వస్తూంది.


                                            *    *    *    *


    "హల్లో"

    అప్పటివరకూ ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు వున్న రంగప్రసాద్, వెంటనే "చెప్పండి. ఏమైనా ప్రోగ్రెస్ వుందా?" అని అడిగాడు.

    "కాస్త వున్నది. కాస్త లేదు. ఉన్నది ముందు చెప్పనా- లేనిది ముందుచెప్పనా?"

    "విషాదవార్త ముందు చెప్పి, వున్నదేదో చివర చెప్పండి. కనీసం ఆ సంతృప్తి అన్నా వుంటుంది".

    "ప్రతిమా అగర్వాల్ భర్త అయిన సేఠ్ అగర్వాల్ మనం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకీ సరియైన సమాధానం చెప్పకపోయాడు. అది అతడి తప్పుకాదు. అతడికి బిజినెస్ తప్ప మరో విషయం తెలీదు. కాబట్టి ఆ విషయం అక్కడ ఆగిపోయింది".

    "మంచివ్వార్త ఏమిటి? అది చెప్పండి" అన్నాడు రంగప్రసాద్ హతాశుడై.

    "ప్రతిమా అగర్వాల్ తెలుగమ్మాయి. అగర్వాల్ ని పెళ్ళి చేసుకున్నాక ప్రతిమా అగర్వాల్ అయింది".

    రంగప్రసాద్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. "ఆమెది... ఆమెది కృష్ణాపురమా?" అన్నాడు వణికే గొంతుతో.

    "కాదు" అని అట్నుంచి వినిపించింది తాపీగా.

    రంగప్రసాద్ నిస్పృహతో ముందుకు వంగిపోయి, "మరేమిటి..... వార్త వార్త అని వూరించింది ఇదేనా? అని అడిగాడు.

    "ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అవటం వార్త అనుకున్నాను".

    "నా మొహంలా వుంది" అనబోయి, మళ్ళీ ఆమె చిన్నబుచ్చుకుంటుందని "ఇంకేమైనా ప్రోగ్రెస్ వుందా?" అని అడిగాడు.

    "మళ్ళీ ఇంకొకసారి అగర్వాల్ దగ్గరికి ఈ రోజు వెళుతున్నాను. ఏదైనా దొరుకుతుందేమో ఆఖరిసారి ప్రయత్నిస్తాను. అయినా నేనొక విషయం చెప్పనా?"

    "ఏమిటి?"

 Previous Page Next Page