"విశ్శు తాతయ్య...అంటే నేను మనవడన్నమాట..."పరిచయాల వ్యవహారం పూర్తిచేసి ప్రసన్న చేతినందుకొని గర్వంగా నడిచాడు.
చీకటి చితిని కాల్చిన సూర్యుడు పూర్తిగా కాంతిని పుంజుకుంటున్నవేళ డి.సి.పి. ప్రసన్న జీపులో స్కూలుకి బయలుదేరాడు నానీ.
మరో పదినిముషాలలో జీపుదిగిన నానీ "థాంక్యూ అంకుల్" అంటూ ప్రసన్నకి టాటాచెప్పి క్లాస్ రూంవైపు పరుగెత్తాడు పిల్లల మధ్యగా...
అప్పటికే ఆలస్యమైనట్టు కిటికీవారగా ఉన్న తన సీటులో కూర్చున్నాడు.
ఆ కిటికీని ఆనుకుని చెట్టుకొమ్మపైనే చుట్టుకొని వుంది 'మాంబా' ఆఫ్రికన్ స్నేక్.
సరిగ్గా ఇదే సమయంలో...
బ్లాక్ మాంబా ముఠాలోని ఓ వ్యక్తి పరుగున భవంతిలోకి దూసుకొచ్చాడు.
"ఏమైంది...ఆచూకీ తెలిసిందా" చీకటిగదిలోని 'బ్లాక్ మాంబా' కంఠం బొంగురుగా పలికింది.
"యస్సార్...డాక్టర్ శృతి ఉదయాన్నే కారులో నాగార్జునసాగర్ వేపు వెళ్ళింది జయేంద్రతోసహా..."
"గుడ్...మన పని ఇంకా సులభం చేసిందన్నమాట" ఓ క్షణం సాలోచనగా చూస్తూ అన్నాడు. "పోయిన డ్రగ్ మనకి చేరాలీ అంటే జయేంద్ర అవసరంలేదు. శృతి బ్రతికుంటే చాలు...సో...జయేంద్రని అనుసరించండి. వాడి శరీరం సైతం నాకు కనిపించకుండా ముక్కలు చేయండి" ఇరవైనాలుగు గంటల్లో జయేంద్రని కడతేర్చబోతున్న నిజం తెలిసిన శృతి ఇలాంటి తెలివిని ప్రదర్శించిందని గ్రహించిన బ్లాక్ మాంబా ఆ తర్వాత ఇక మాట్లాడలేదు.
మరో నిముషంలో రంగంలోకి దిగిన ముఠాలో అతిముఖ్యమైన నలుగురు కారులో నాగార్జున సాగర్ వేపు దూసుకుపోతున్నారు.
* * * *
"రాత్రి బాగా నిద్ర పట్టిందా" అడిగింది శృతి జయేంద్రనే చూస్తూ.
ఉదయాన్నే బలవంతం చేసి నాగార్జునసాగర్ డేమ్ కి తీసుకొచ్చిన శృతి ప్రవర్తన జయేంద్రకి అర్ధం కావడం లేదు.
ఎవరో స్నేహితురాల్ని అర్జెంటుగా కలుసుకోవాలని తీసుకొచ్చి గెస్టుహౌస్ లో ఎకామడేషన్ సంపాదించగలిగిన శృతి ఇదే ప్రశ్నని ఓ వందసార్లయినా అడిగి వుంటుంది.
చాలాసార్లు నిలదీసాడు ఇలా రావడానికి కారణమేమిటని.
అడిగిన ప్రతిసారీ మాట మార్చుతూంది.
అదికూడా కాదు...
అదే పనిగా ప్రత్యర్ధి హెచ్చరిక గుర్తుకొస్తుంటే ప్రశాంతంగా ఉండలేకపోతూంది శృతి.
ఇరవై నాలుగు గంటల గడువిచ్చాడు బ్లాక్ మాంబా.
శక్తివంతమైన ప్రభుత్వ యంత్రాగాన్నే గడగడలాడించిన బలవంతుడైన ఆ ప్రత్యర్ధినుంచి జయేంద్రని రహస్యంగా కాపాడాలని ఇలా తీసుకొచ్చింది.
అది ఎంత అసాధ్యమైన విషయమో ఆమెకూ తెలుసు. అయినా ఎండమావిలాంటి నమ్మకంవెంట అపనమ్మకంగానైనా పరుగెడుతూంది.
ఒక అద్భుతమైన నెట్ వర్క్ గల ప్రత్యర్ధి ఈపాటికే తమ ఉనికి గ్రహించివుంటాడు.
ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకురాక తప్పదు.
మనసు తడబడుతూంది. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది.
ఉదయం వీలైనంత వరకూ టూరిస్టుల మధ్యనే జయేంద్రతో సహా నడుస్తూంది తప్ప ఏకాంతంగా వెళ్ళాలని ప్రయత్నించడంలేదు.
జయేంద్ర కొద్దిగా వూహించగలిగాడు. ఒక ఫోన్ కాల్ తర్వాత ఆమె ఇలాంటి ప్రయాణానికి సిద్ధం చేయడం అతడికీ అనుమానాన్ని కలిగిస్తూంది.
"ఏంటి? మూడ్ లోకెళ్ళినట్టు అలా సీరియస్ గా నడుస్తున్నావు?"
తన మూడ్ సంగతి జయేంద్ర గుర్తించకూడదని యధాలాపంగా అంది.
ఆమె మామూలుగా నవ్వుతున్నా ఆ నవ్వులో ఎప్పటిలా జీవం లేదు.
"అర్ధమైంది."
"ఏమని?"
"తెలివిగా నన్నింత దూరం రప్పించావని."
వాస్తవాన్ని గ్రహించగలుగుతున్నాడని తెలుసుకున్న శృతి ముందు తత్తరపడింది.
"అది కాదు."
"ప్రమాదమే తప్పనిసరైతే అది దూరంగా పరుగెత్తుకొచ్చినంత మాత్రాన తప్పదు శృతీ! బ్లాక్ మాంబా ముఠా గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు" నిర్లిప్తంగా చూస్తూ అన్నాడు.
ఆమె తల వంచుకుంది, అతడంతా గ్రహించినందుకు ఆందోళన పడుతూనే.
అభ్యంగన స్నానం చేసిన శృతి యామినీకుంతలాలు చిరుగాలి అలల తాకిడికి అందంగా నర్తిస్తుంటే వంగపండు రంగు షిపాన్ శారీలో శృతి అప్పుడే విరిసిన నూరువరాల పుష్పంలా అనిపిస్తూంది.
కొన్ని క్షణాలపాటు దృష్టి మరల్చుకోలేకపోయాడు. "ఇదంతా నేనెలా వూహించానూ అని ఆశ్చర్యపోకు శృతీ! రెండు దశాబ్దాల నా జీవితం నాకు నేర్పింది మౌనమే అయితే నీ పరిచయం నా మనసు తట్టిలేపింది. నేను లౌకికంగా ఆలోచించగల సమర్ధుడ్నో, కాదో నాకు తెలీదు. కాని హేతువాదిలా ఆలోచించగల నీకు నేను చెప్పేది ఒక్కటే. ప్రమాదం తప్పనిసరి అని నుదుట రాసివుంటే మనం ఎంతదూరం పరుగెత్తినా మృత్యువు తప్పదు. పరీక్షితుడి కథ నీకు తెలుసనుకుంటాను."
ఉద్విగ్నంగా తల పైకెత్తిన శృతి కంటిపాపలు అలజడిగా కదిలాయి.
ఆమె కనుపాపల లోగిళ్ళలో ఎప్పటి బాధాశకలాలు మెదిలి మొదలయ్యాయో, పొందాలనుకున్నది పోగొట్టుకోవడమో జీవితమన్న ఏ తాత్వికత కదిలి కళ్ళను కోనేటిగా మార్చిందో అతడి చేయి తలని స్పృశించేసరికి కళ్ళు తుడుచుకుంటూ "అయామ్ శారీ" అంది.
కారణం అడగలేదు.
అసలు ఆమె కోరుకుంటున్నది ఇంకా పూర్తిగా అర్ధంకాని అతడి గురించే అని అతడూ గ్రహించలేదు. "అలా వెళ్దామా?" అన్నాడు వాతావరణాన్ని తేలికపరచాలనుకుంటూ.
అతడి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశంకోసం ఎదురుచూస్తున్న శృతి నిర్మానుష్యంగా వున్న అరణ్యమార్గంలోకి నడుస్తూంటే కాదనలేకపోయింది.
అతడి అంతచ్చేతనలో వున్న చాలా వాస్తవాల్ని ఆ నిర్జీవ ప్రదేశంలో అతడిద్వారా వినాలనుకుంది తప్ప ఇదే అవకాశంకోసం ఎదురుచూస్తున్న నలుగురు వ్యక్తులు రహస్యంగా వారిని అనుసరిస్తున్న నిజాన్ని గ్రహించలేకపోయింది.
మరో అయిదునిముషాల వ్యవధిలో మనుష్య సంచారమే లేని దట్టమైన అడవి మధ్యభాగంలోకి చేరుకున్నారిద్దరూ.
దూరంగా అప్పుడప్పుడూ క్వారీలో కొండరాళ్ళను పగలగొట్టే చప్పుడులో, సమీపంలో ఎండుటాకులు నలుగుతున్న వ్యక్తుల పాదాల సవ్వడి ఆమెకు వినిపించడంలేదు.
కీకారణ్యాన్ని గుర్తుచేసే పొదల మధ్యగా పక్కన ఆగింది శృతి.
"జయేంద్రా."
ఆమె నిశిత దృక్కుల్ని తాళలేనట్టు చూపుల్ని మరల్చాడు.
"నీకు చీకటంటే అయిష్టమా?"
ఈ ప్రశ్న ఎందుకు అడిగిందీ అతడూహించలేదు.
"ఏం" తత్తరపడుతున్నాడు జయేంద్ర. ఒక నిగూఢమైన విషయాన్ని ఇక్కడ ఇప్పుడే తెలుసుకోవాలన్నంత ఉద్విగ్నతతో ఆమె తన మనసు పొరల్ని సుతిమెత్తగానైనా స్పృశించాలని ప్రయత్నిస్తూంది.
"ఏం...ఎందుకలా అనిపించింది."
"నీ గురించి ఇంకా పూర్తిగా తెలియాల్సిన..."
ఆమె చెప్పడం ఇంకా పూర్తికానేలేదు. అమాంతం నేలపైకి ఒంగొని "ఇవి చూసావా" ఓ పొదచాటున తెల్లని గుడ్లని అందుకున్నాడు. "ఒక డాక్టరుగా వీటి గురించి నీకు తెలిసే వుండాలి."
అర్ధంకానట్టు చూసింది.
ప్రసక్తి మళ్ళించాలన్న ఆలోచనలో చెప్పుకుపోయాడు. "సుమారు అరవై మిల్లీమీటర్ల పొడవు ముప్పై మిల్లీమీటర్ల వెడల్పు వున్న ఈ గుడ్డు ఏ ప్రాణిదో తెలుసా.....హిమాలయా ప్రాంతాల్లో అప్పర్ బర్మా, దక్షిణ చైనా, ఫిలిప్పీన్, మలయా దేశాల్లోనూ, మనదేశంలో కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రాలో అడవిప్రాంతాల్లోనూ దొరికే గుడ్లవి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో వెదికితే ఒకచోట ముప్పైనుంచి నలభైదాకా వుంటాయి. వీటిని క్రింది పొరల్లో దాచే ఆ ప్రాణి ఎత్తయిన ప్రదేశంలో మాటువేసి తన గుడ్లని రక్షిస్తూ వుంటుంది."
మనసు కీడు శంకిస్తుంటే "అవి...అదే ఆ ప్రాణి..."
"మీరు శాస్త్రీయంగా దీన్నేమంటారో నాకు తెలీదు కాని నా భాషలో దీనిపేరు కళింగనాగు. ఈ గుడ్డు సైజుని బట్టి అది కనీసం పది అడుగుల పొడవుంటుంది."