ఇప్పుడు గోపీ విజ్రుంభిస్తున్నాడు-వాడి మాటలముందు రఘు మాటలు వినబడటం లేదు- నేను మానసికంగా లొంగిపోతున్నాను.
నా మనసామెవైపు లాగుతున్నది.
నేనెందుకు పవిత్రంగా వుండాలి? పవిత్రత ఉద్దేస్యమేమిటి?
న అపవిత్రత నా అర్ధాంగికోసం ఆమె పవిత్రంగా వుండాలని నేను కోరుకుంటూ ఆమెకోసం నా పవిత్రతను కాపాడుకుంటున్నాను.
కానీ నా అర్ధాంగి అందుకు అర్హురాలేనా?
మాధవరావు ఆల్బంలో పద్మిని!
నా మనసు పరిపరి విధాలా పోతున్నది.
నా కనులముందు గోపీ వామనుడైపోయాడు. రఘు బలిచక్రవర్తి అయిపోయాడు. వామనుడు బలిచక్రవర్తి శిరస్సుపై పాదాన్నుంచాడు.
నా కనులముందు నిన్నరాత్రి చూసిన స్లయిడ్స్... ఈ వుదయం చూసిన ఫోటోలు...ఎదురుగా శ్రీమతి విలాస్.
ఆమె నన్ను కోరుతున్నది.
ఆమె పవిత్రత ఎప్పుడో భంగమయింది. ఆమె ప్రతి వ్రతకాదు-
ఆమె నన్ను కోరివచ్చింది. నేను నిరాకరిస్తే భర్త ఆమెను హింసిస్తాడు.
ఒక ఇల్లాలిని అనవసరంగా కష్టపెట్టిన వాడినవుతాను.
ఆమె నా కారణంగా చెడిపోయేది లేదు. నేను పవిత్రతను కాపాడుకోవడం అనవసరం-
అంటువంటప్పుడు నేనెందుకు తటపటాయిస్తున్నాను?
అప్పటికామే నాకు దగ్గర్లో వున్నదని తెలియదు ఆమె స్పర్సకు ఉలిక్కిపడ్డాను. నన్ను మైకం కమ్ముతున్నది.
ఉన్నట్లుండి రఘు ఒక గావుకేకపెట్టాడు- అది కేక అనడంకంటె ఆక్రందన అనడం మంచిది.
"నీ పవిత్రత ఎన్నో ఏళ్ళుగా నిలుపుకుంటూ వచ్చినది. డాక్టర్ విలాస్ చాతుర్యంతో ఒక్క క్షణంలో దాన్ని హరించివేస్తున్నాడు. ఒక్క క్షణం ఆలోచించు....ఒక్కక్షణం ఆలోచించు"
అప్పటికామే నా చెంపలు నిమురుతున్నది.
చటుక్కున ఆమెను విడిపించుకుని దూరంగా జరిగి "మిసెస్ విలాస్! విచారించకు నాకు ఒక్కరోజు టైమియ్యి" అన్నాను.
ఆమె అంగీకరించలేదు. కానీ తప్పలేదు-
ఆ రాత్రి ఆమె వెళ్ళిపోయాక నాకింక రఘు కనపడలేదు. గోపీమాత్రం అదేపనిగా తిడుతున్నాడు. నేను ఆ తిట్లన్నీ భరించాను తప్పితే ఎదురు తిరగలేదు. ఆఖరికి మాత్రం "ఎందుకూరికే నన్ను తిడతావు? ఒక్కరోజు గడువు అడిగాను తప్పితే నీమాటే వింటున్నానుగా_" అన్నాను.
"పోయిన ప్రతిక్షణం ఎంత విలువైనదో నీకెప్పటికీ తెలుస్తుంది?" నిట్టూర్చి వెళ్ళిపోయాడు గోపీ.
ఆ రాత్రంతా పోగొట్టుకున్న క్షణాల విలువ ఫీలవుతూనే వున్నాను.
O O O O
వుదయం మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కింది-
కాలకృత్యాలు తీర్చుకున్నాను-ఈరోజు నాకు విలాస్ ఇంటినుంచి పిలుపు రాలేదు. అది నేను పట్టించుకోనూలేదు. కాఫీ యూనివర్సిటీ కాంటీన్లో తాగవచ్చు-
కానీ క్రమంగా రాత్రి జరిగిన అనుభవాలు వరుసగా నాకు గుర్తుకువచ్చాయి-నా శరీరం జలదరించింది.
నేను ఏ తప్పూ చేయలేదని మనసు తేలికగా లేదు. అది నన్ను ఈ రోజు చేయబోయే తప్పు గురించి హెచ్చరిస్తుంది-
నాకంతా ఏదోలాగుంది.
అసలు శ్రీమతి విలాస్ మా ఇంట్లోకెలారాగలిగింది? ఇవతలివైపు గడియ ఎవరు తీశారు? ఎలా తీశారు?
లేక నేను అది వేయడం మరిచిపోయానా?
ఆమె ఎంత సులభంగా మా ఇంటికి వచ్చిందో విలాస్ కూడా అంత సులభంగానూ రాగలడు-ఇది చాలా ప్రమాద కరమైన విషయం-
ఇప్పుడు నా ఆలోచనంతా ఆ డ్రాయింగ్ రూం తలుపు చుట్టే తిరుగుతున్నది-
ఇల్లు రెండు వాటాలు చేసినపుడు నేనటువంటి ప్రమాదాన్ని శంకించలేదు - అవకాశముంటే మంచివాడికి కూడా తప్పు చేయాలనిపించవచ్చు-
నేనా తలుపును మూసేద్దామనుకున్నాను-శాస్వతంగా ఇంకెప్పుడూ రానివిధంగా అది సీలుచేయాలి- కానీ ...
ఎందుకో ఆ పని తాత్కాలిక వాయిదా వేయాలనిపించింది.
రోజూకంటే ముందు ఇంట్లో బయల్దేరాను యూనివర్సిటీ కాంటీన్లో టిఫిన్ చేసి డిపార్టుమెంటుకి వెళ్ళి మావయ్య గారింటికి ఫోన్ చేశాను.
"ఈ రోజు రాత్రికిక్కడే భోంచేసి మనింటికి వెళ్ళిపోదాం" అని చెప్పింది పద్మిని-
"అలాగే" అని ఫోన్ పెట్టేశాను.
నా మనసు నన్ను హెచ్చరిస్తోంది- శ్రీమతి విలాస్ నన్ను కోరింది. నా మనసుకూడా ఆమెవైపు లాగింది కానీ ఒక్కరోజు అడిగాను.
ఈ రాత్రికి అవకాశం ఉపయోగించుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో శ్రీమతి ఫోన్ చేసింది.
ఇది దేవుడు నాకిచ్చిన వరమా? లేక నేను అవకాశం పోగొట్టుకుంటున్నానా?
డిపార్టుమెంట్లో నా గదిలోకూర్చుని ఆలోచిస్తున్నాను ఎదురుగా పుస్తకం ఉన్నది. అది తెరిచే వున్నది. కానీ నా కనులు అక్షరాలను చూడడంలేదు.