వాటర్ బాటిల్ ను ఎత్తి మంచి నీళ్లు గడగడా నాలుగు గుక్కలు తాగింది. దాహం వేసికాదు, తనలోని టెన్ షన్ ను తగ్గించుకోవడానికి ఆ పని చేసిందామె. ఆమె డాక్టరు !
వైద్య రంగంలోనే కాదు, సామాజిక రంగంలో సయితం ఆమె డాక్టరే!
దూరాన వున్న రావి చెట్టుకు చేరువ కాగానే కారును ఆపింది.
అక్కడి నుంచి సుమారు కిలోమీటరుదూరం తను నడవవలసివుంది!
ఫోన్ లో వచ్చిన ఆదేశం అదే! దానినిప్పుడు తను అమలుపరచాలి!
టార్చిలైట్ తీసుకుని, కారు డోర్ లాక్ చేసి, వడివడిగా నడవసాగింది డాక్టరు సునంద.
కావలసిన సామగ్రితో ఒంటరిగా ముందుకు వెడుతున్నది ఆమె, ధైర్యంగ.
మెయిన్ రోడ్డునుంచి సుమారు కిలోమీటరు దూరం ఆ చోటికి నడచి వచ్చింది.
అది క్రైస్తవుల శ్మశాన వాటిక. అక్కడ నిలచి, పరికించి చూసింది.
రకరకాల సమాధులు. శిలాఫలకాలు. శిలువలు.
లిప్త కాలంపాటు ఆమె వళ్లు జలదరించింది.
మొండి ధైర్యంతో కదలి ప్రహరీగోడ గేటును సమీపించింది.
ఆమె గేటును తెరవబోయే లోగానే కళ్ళు జిగేల్ మనేట్టు లైట్ ఫోకస్ వచ్చి ఆమె ముఖంమీద పడింది.
తృళ్ళిపడింది డాక్టరు సునంద. హటాత్తుగా భయం ముప్పిరిగొన్నది. తన భయాన్ని తనలోనే కప్పిపుచ్చుకుని, కళ్ళు నలుముకుని చూసింది.
గుర్రుగా ఓరగా వారగా చూసింది.
అదే క్షణంలో అక్కడకు సమీపాన వున్న కొండ మీద కూడా లైటు వెలిగింది.
ఆ సిగ్నల్ ను అర్ధం చేసుకుంది డాక్టరు సునంద.
అటుగా కదలి మరల వడివడిగా నడుస్తూ కొండ ఎక్కసాగింది.
రాయిరప్పలలో, మిట్టపల్లాలలో నడిచింది.
కొండ చరియవద్ద తన స్టాప్ నర్స్ బందీ అయివుంది!
ఆమె కాళ్ళ సమీపాన స్విచ్ బోర్డు వుంది!
కొండ శిఖరాన చెట్టు. చెట్టు చిటారు కొమ్మన బల్బు....
చెట్టు మొదటి కొమ్మకు పంజరం. పంజరంలో పావురాయి.
పావురాన్ని పట్టుకుని పంజరంనుంచి బయటకు తీసింది డాక్టరు సునంద.
అది తెల్లటి పెంపుడు పావురాయి.
తన వేనిటీ బ్యాగ్ నుంచి ఒక కవరును తీసింది డాక్టరు సునంద.
పావురాయి కుడి కాలికి ఆ కవరును సుతారంగా చుట్టి, కట్టి దానిని ఎగురవేసింది.
పావురాయి సరాసరి దూరంగా వున్న కొండ మీదకు వెళ్ళింది.
అది వెళ్ళిన కొద్దిసేపటికి ఇరువురు వ్యక్తులు కొండ దిగారు.
మరి కొద్దిసేపటికి డాక్టరు సునంద, ఆమె స్టాఫ్ నర్సు కారు వద్దకు వచ్చారు.
కారు డోర్ తెరచిన డాక్టరు సునంద నిర్ఘాంతపోయింది.
ఆమెకు షాక్ తగిలినట్టయింది.
కారులో నవీన్, వెంకటేష్!
"సారీ...." నీళ్ళు నమిలింది డాక్టరు సునంద.
తడబడింది, తబ్బిబ్బయింది.
"బుల్ షిట్ ! మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకు ఒక మంచి అవకాశం కోల్పోయాం డాక్టర్!" నిష్ఠూరంగా అన్నాడు నవీన్.
సిస్టర్ కిడ్నాప్ గురించి పోలీసులకు చెబితే టెర్రరిస్టులు తన మీద కక్ష పెంచుకుంటారేమోననే అనుమానంతో ఆ పని చేయలేక పోయింది డాక్టరు సునంద.
నవీన్ కు ఈ విషయం ఎలా తెలిసిందో ఎంతగా ఆలోచించినా, ఆమెకు అంతుపట్టలేదు. దాచుకోలేక, ఆ మాటే పైకి అనేసింది.
నవ్వాడు నవీన్. "మేడమ్ ! సిస్టర్ తండ్రి_ అదే మీ హార్ట్ పేషెంట్_ తన కూతురును కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు రిపోర్ట్ చేశాడు. తీగ లాగితే డొంక కదిలింది!" అనుమాన నివృత్తి చేశాడు.
"ఒక్క విషయం డాక్టర్! ఆ మైక్రో ఫిల్మ్ మీ దగ్గర వున్నంత కాలం టెర్రరిస్టులు మిమ్ము కాని, మీ స్టాఫ్ నర్సును కాని ఏమీ చేసి వుండేవారు కాదు. దానిని మేము ఆయుధంగా ఉపయోగించుకుని వుంటే టెర్రరిస్టుల స్థావరాన్ని కనుగొనడానికి మార్గం సుగమం అయేది....చెడగొట్టారు....ప్చ్....
"అంతేకాదు, మీరు పోలీసు వ్యవస్థనే పరిహసించారు డాక్టర్ ! రెండు ఫోటోలు, రెండు నెగిటివ్ లు తీసి, మా బాధవదిలించుకోవడానికి మాకు ఒకటి ఇచ్చి, మరొకదానిని శత్రువులకు అందజేశారు. రక్తి కట్టేలా నటించారు డాక్టర్! ఎందుకిలా చేశారు?" విసురుగా అడిగాడు నవీన్.
నవీన్ ముఖంలోకి చూడలేక పోయింది డాక్టరు సునంద. బిక్కచచ్చిపోయింది.
ఇంత తేలికగా బయటపడతానని అనుకోలేదు తను....
"జరిగింది చాలు, ఇక వెళదాం పదండి...." దూరంగా వున్న తన కారు వైపుకు కదిలాడు నవీన్.
"రాను...." నిదానంగా అన్నది డాక్టరు సునంద, కొండ వైపుకు చూస్తూ.