"ఆ మానసికమైన వత్తిడిలో ముద్దాయికి తనేం చేస్తున్నదీ తెలిసే అవకాశం వున్నదా ?"
"లేదు"
"థాంక్స్ డాక్టర్ ! దట్సాల్" డిఫెన్స్ లాయర్ తన వాదన వినిపించటం ప్రారంభించాడు.
* * *
ఆరోజే జడ్జి తీర్పునిచ్చేది.
క్రింద కోర్టులో జడ్జి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు వుండదని కొందరూ, కాని ఈసారి డిఫెన్స్ లాయరు వాదన బలంగా వుంది కాబట్టి జడ్జిమెంటు వేరుగా వుంటుందని కొందరూ వాదించుకున్నారు. అసలు ఫలితం తెలుసుకోవటం కోసం జనం కోర్టులో నిండిపోయారు.
జడ్జి తన సుదీర్ఘమైన తీర్పు చదివాడు.
హైకోర్టు జ్యూరిస్ డిక్షన్
ఆంద్రప్రదేశ్ _ హైద్రాబాద్
ప్రజెంట్ : ది ఆనరబుల్ జస్టిస్ : థర్మదాస్
గిరి అప్సలెంట్ (అక్యూజ్ డ్)
వర్సెస్
ది స్టేట్ రెస్పాండెంట్ (కాంప్లెయిట్)
జడ్జిమెంట్
1. గిరిధర్ పద్మజను కోరి వివాహం చేసుకున్నాడు. పెళ్ళికి ఆతనే ముందుగా ప్రతిపాదించినట్టు రుజువయింది. వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలూ లేవనీ, వారిద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవారనీ తెలిసింది. వివాహం అయిన రాత్రి గిరిధర్ ప్రవర్తన కాస్త వింతగా వుందని పద్మజ, స్నేహితుడయిన డాక్టర్ రామకృష్ణకు తెలియజేసింది. వారి వివాహం అయిన కొద్దిరోజుల తర్వాత ఒక పార్టీలో గిరిధర్ అందరి ఎదుట ఏదో విదేశంలో జరుగుతున్న విషయం గురించి ముందుగానే చెప్పగలిగాడు. ఆ తర్వాత అలాంటి విషయాలెన్నో అతనీ విధంగానే చెప్పేవాడు. అవన్నీ నిజంగా జరిగేవని తెలిసింది. అతనికీ శక్తి ఎలా వచ్చింది ? ఇది జవాబులేని ప్రశ్న. దీనినే ఆత్మ ఆవహించడం, దెయ్యంపట్టటం అన్నారంతా. అయితే కోర్టు వీటిని ఆ పేరుతో కాకుండా స్కిజోఫ్రెనియా అని వ్యవహరిస్తుంది.
2. పద్మజ పుట్టినరోజున గిరిధర్ డిన్నరు ఏర్పాటు చేయించాడు. అందరూ భోజనాలుచేసి కూర్చున్నాక గిరిధర్ ఎందుకో పైన గదిలోకి వెళ్ళాడు. హతురాలు కూడా కాస్సేపయ్యాక వెళ్ళింది. వారి మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. గిరిధర్ ఆవేశంతో పద్మజను మెట్లమీద హత్య చేయడం అందరూ చూశారు. గిరిధర్ స్పృహతప్పి పడిపోయాడు. తెలివి రాగానే ఇనస్పెక్టరుకు అతను తను చేసిందేదీ గుర్తులేదని చెప్పాడు.
3. తెలిసే చేజేతులా భార్యను హత్యచేశాడని క్రింద కోర్టు అతనికి సెక్షన్ 302 ఐ.పి.సి. ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, సెక్షన్ 324 ఐ.పి.సి. ప్రకారం రెండున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది....రెండూ ఏకకాలంలో అమల్లో పెట్టేటట్లుగా.... అందువల్లనే ముద్దాయి హైకోర్టుకు అప్పీలు చేసుకోవటం జరిగింది.
4. హత్య జరిగిన సమయంలో అక్కడే వున్న డాక్టర్ రామకృష్ణ మెంటల్ హాస్పటల్ డిప్యూటీ సూపరింటెండెంట్. ఆయన వెంటనే ముద్దాయిని పరీక్షచేసి అతను పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో బాధపడుతున్నాడని చెప్పారు. ఆ జబ్బుతో బాధపడే వ్యక్తికి ఏవేవో స్వరాలు వినిపించడం. ఎవరో తననేదో చేయబోతున్నారనే భావన కలగటం సహజం అని డాక్టర్లు చెప్పారు.
5. ఇన్ సేవిటీ లేదా తెలుగులో చెప్పాలంటే పిచ్చి అనే పదానికి సరయిన నిర్వచనం లేదు. ఇది ఒక మానసిక రుగ్మత అన్న విషయం అందరూ ఒప్పుకున్నదే. ముద్దాయిని కొద్దికాలం మెంటల్ హాస్పిటల్ లో వుంచటం జరిగింది. అక్కడ కూడా అతని ప్రవర్తన అప్పుడప్పుడు కాస్త అసాధారణంగా వుండేదని, అతను సరిగా భోజనం చేసేవాడు కాదనీ, చాలా నిర్లిప్తంగా వుండేవాడనీ, అక్కడ అతనికి వైద్యం చేసి డాక్టర్లు చెప్పారు. వారు కూడా అతని జబ్బును పారనాయిడ్ స్కిజోఫ్రెనియాగా గుర్తించారు.
ఈ ఆధారాల్నిబట్టి ముద్దాయి మానసిక రోగంతో బాధపడుతున్నాడని రూడిగా తెలుస్తోంది. అయితే ఈ ఇన్ సేనిటీ అన్న పదానికి వైద్యశాస్త్రంలోగాని, న్యాయశాస్త్రములోగాని సరైన నిర్వచనం లేదు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా లేదు. అందువలన ఈ మానసిక రోగగ్రస్తులైన నేరస్తుల విషయంలో విదేశాల్లో న్యాయస్థానాల్లోని కేసులను ఉదహరిస్తాను.
6 (ఎ) క్రీ.శ. పదమూడవ శతాబ్దిలో జూరిస్టుగా పనిచేసిన హెన్రీ బ్రాక్టన్ అనే వ్యక్తి తను చూసిన కేసులన్నింటినీ ఒక సంపుటంగా వెలువరించాడు. మహారాజు అయినా సరే చట్టానికి అతీతుడుకాదని వాదించిన మొదటివ్యక్తి అతను. మానసిక రుగ్మతలు న్యాయవిచారణలో ఎలాంటి అవరోధాలను కల్పిస్తున్నదీ అతను వివరించాడు.
6 (బి) 17వ శతాబ్దంలో లార్డ్ హేట్ అనే న్యాయాధికారి మానసిక జాడ్యంతో బాధపడే వ్యక్తి తను చేసిన నేరాలకు బాధ్యుడు కాదని మొదటిసారిగా తీర్పునిచ్చాడు. 1724లో జస్టిస్ ట్రేసీ, ఆర్నాల్డ్ అనే వ్యక్తి కేసులో 'పిచ్చి' అనేది మనిషి వివేకాన్ని లోపింపజేస్తుందనీ, అతను ఏం చేస్తున్నదీ, ఎందుకు చేస్తున్నదీ ఆలోచించే శక్తిని కోల్పోయి ఒక పశువులా ప్రవర్తిస్తాడనీ అన్నాడు. దీన్ని 'వైల్డ్ బీస్ట్ టెస్ట్' అన్నారు. 1800లో జార్జి చక్రవర్తిమీద అఘాయిత్యం జరిగినపుడు అప్పటి ముద్దాయి తరపున వాదించింది అప్పట్లో ప్రఖ్యాతి పొందిన లాయరు థామస్ ఎరిస్కిన్. మానసిక జాడ్యం ఉన్న మనుషులు అందరూ జంతువుల్లా ప్రవర్తిస్తారనే నమ్మకాల్ని ఎదిరించాడు. ఒక రకమైన భ్రమలో వున్న మనుషులూ మానసికరోగులే అని అతని వాదన. దాంతో 'వైల్డ్ బీస్ట్ టెస్ట్' అధ్యాయం ముగిసింది. ఈ భ్రమ అన్నది కూడా ఒక భ్రమగా కొద్దికాలం మాత్రమే గుర్తించబడింది. తర్వాత 1843లో మెక్ నాటెన్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈనాటికి ఈ సూత్రాలమీదే న్యాయం పరిశీలించబడుతోంది.