డేనియల్ మెక్ నాటన్ అనే వ్యక్తి అప్పటి ప్రధానమంత్రి అయిన రాబర్ట్ పీల్ ను చంపాలనుకున్నాడు. కానీ పొరపాటున ఆయన సెక్రటరీ అయిన ఎడ్మండ్ ను చంపాడు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం విక్టోరియా మహారాణి. "అతను అపరాధి. అతను పిస్తోలుతో కాల్చడం నేను స్వయంగా చూశాను" అని ఆమె చెప్పింది. కానీ డేనియల్ మానసిక రోగి అని విడుదల చేయబడ్డాడు. ఈ కేసు ఇంగ్లాండులో పెద్ద సంచలనాన్నే రేపింది. న్యాయసూత్రాల గురించి ఘర్షణ జరిగింది. దానితో పదిహేను మంది లాలార్డ్ (ఇంగ్లండులో జడ్జీలు) ఈ విషయం గురించి చర్చలు జరిపి ఒక నిర్ధారణకు రమ్మని కమిటీ వేశారు. నికోలాస్ టిండెల్ అనే చీఫ్ జస్టిస్ అందరి తరపునా ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.
6. (సి) "ఒక వ్యక్తి నేరం చేసిన సమయంలో తను చేస్తున్నది తప్పు అనీ, చట్టానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాననీ తెలిసి చేస్తే అతను శిక్షార్హుడే. కాని అతనా సమయంలో మానసిక వ్యాధితో బాధపడుతూ తను ఏంచేస్తున్నదీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ పని గురించి శిక్షవేయడానికి ఆలోచించాలి. ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి నేరాన్ని చేస్తే అతను శిక్షార్హుడుకాదు. ఈ విషయమై జూరీ ఆలోచించాలి" అన్నాడు.
అప్పట్లో ఈ న్యాయసూత్రాలు ఉండి వుంటే డేనియల్ కు శిక్ష పడేదేమో. తర్వాత మానసిక రుగ్మత, పిచ్చి అనే పదాలు జూరిస్టులను కూడా కలవరపరచాయి. ఇంగ్లండు, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో ఈ సూత్రాల విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. వైద్యశాస్త్రంలో, మానసికశాస్త్రంలో ఈ పదాలకు అర్ధంలేనివని కొట్టిపడేశారు. ఇప్పటికీ ఈ పదాలకు సమయానుకూలంగా వాడుకోవడమే తప్ప సరియైన నిర్వచనం ఇవ్వడం జరగలేదు.
6. (డి) స్కాట్లండ్ లో ఈ 'రుగ్మత' క్షమార్హం కాదు. ఈ దేశంలో 'బాధ్యతారాహిత్యం' అనే పదాన్ని వాడతారు. అక్కడ మెక్ నాటన్ రూల్స్ ను వాళ్ళు న్యాయసూత్రాలుగా పరిగణించలేదు. ఇంగ్లాండ్ లో కూడా ఈ సూత్రాల గురించి ఘర్షణపడి వాళ్ళు కూడా స్కాట్లాండ్ సూత్రాలనే అనుకరించడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో మెక్ నాటన్ రూల్సును చాలా ఉపయోగించుకున్నారు.
దాదాపు వంద సంవత్సరాల నుండి అమెరికాలో మెక్ నాటన్ రూల్సు గురించి వాగ్వివాదాలు జరుగుతూనే వున్నాయి. 26 రాష్ట్రాల్లో ఈ రూల్సును తీసివేశారు. 22 రాష్ట్రాల్లో యింకా యివి అమల్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ విషయంలో ఎలాంటి క్షమా చూపించరు. ఎనిమిది రాష్ట్రాల్లో నిందితుడు నేరస్థుడేకాని మానసిక రుగ్మతతో బాధపడుతున్నవాడు కాబట్టి శిక్ష తగ్గించవచ్చునని నిర్ధారణ చేశారు. కావాలని ఉద్దేశ్య పూర్వకంగా హత్య చేయడమూ, ఒక ఆవేశంలో, ఉన్మాదంలో హత్యచేయడమూ వేరువేరని చర్చించడం జరుగుతోంది. 'అమెరికన్ మాడల్ పీనల్ కోడ్' లో ఈ చర్చ చేర్చబడింది. దీనిలో ఇన్ సేవిటీ అన్న పదానికి అర్ధం 'ఒక నేరం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తను చేస్తున్నది చట్టరీత్యా నేరం' అని తెలుసుకోలేని స్థితిలో లేనట్లయితే అతను యిన్ సేన్ అన్నారు.
ఈ రకమైన కేసుల్లో మాయ, భ్రమలాంటి పదాలను సరిగ్గా నిర్వచించలేం. ఉదాహరణగా గాలిచేసే శబ్దాలను స్వర్గాన్నుంచి వచ్చే పిలుపుగా భ్రమపడేవాళ్ళున్నారు. ప్రపంచ భవిష్యత్తు తన అరచేతిలో వుందనే వ్యక్తి మాయలో ఉన్నాడన్నమాట. మూడో విషయం భ్రాంతి. ఇవన్నీ స్కిజోఫ్రెనియా లక్షణాలు.
1981లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ముద్దాయి మానసిక జాడ్యంతో బాధపడుతున్నాడన్న కారణంగా విడుదల చేయబడ్డాడు. ఒకనాడు ఇంగ్లండులో డేనియల్ మెక్ నాటన్ కేసులో జరిగినంత గొడవా యీ కేసు గురించి అమెరికాలో జరిగింది.
ఇది కామన్ వెల్తు దేశాలలో అమెరికాలో ఇలాంటి కేసుల గురించి సంగ్రహంగా చెప్పబడ్డ చరిత్ర. ఈనాడు అన్ని దేశాలలో మెక్ నాటన్ రూల్సు పూర్తిగా నిషేధించబడ్డాయి.
7. సైకాలజిస్టు ప్రొఫెసర్ ఆలామ్ దిర్షోవిజ్ చెప్పినా ప్రకారం "ఇన్ సేవిటీ" అంటే అది వైద్యశాస్త్రానికి సంబంధించినది. మానసిక శాస్త్రానికి సంబంధం లేనిది. అమెరికాలోనే రిచర్డు లారెన్స్ అనే వ్యక్తి 1835లో అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ ను కాల్చి చంపాడు. జాన్ ఫ్రాంక్ అనే వ్యక్తి అధ్యక్షుడు రూజ్ వెల్టుమీద హత్యాప్రయత్నం చేశాడు. జాన్ హింక్లీ రీగన్ ను హత్య చేయాలని ప్రయత్నించాడు. వీళ్ళిద్దరూ మానసిక రోగులుగా శిక్ష నుండి తప్పించుకున్నారు.
ఈ విధంగా అనేక దేశాల్లో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు తెలివిగల వ్యక్తులు ఈ రకమైన వంకతో శిక్ష నుండి తప్పించుకుంటున్నారు. కాబట్టి ఏదో న్యాయమో, కాదో తీర్పునివ్వడం కష్టసాధ్యమవుతోంది. గారట్ ట్రాప్నెల్ అనే వ్యక్తి ఇరవై సార్లు శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నదీ ఒక పుస్తకంలో వివరించాడు.
రీగన్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి దగ్గర ఈ పుస్తకం ఒకటి దొరికింది.
ఇండియన్ పీనల్ కోడ్ ను సమీక్షించిన లార్డ్ మెకాలేకు మెక్ నాటన్ రూల్సు గురించి బాగా తెలుసు. ఆయన కూడా "మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి తనుచేసిన నేరానికి బాధ్యుడు కాదు" అన్నాడు. ఈ విషయంలో మన న్యాయవేత్తలు ఏ నిర్ణయానికీ రాలేదింతవరకూ. మనం విదేశాలలోని కేసులనే ఉదాహరణగా తీసుకుంటాం. ప్రఖ్యాత రచయిత నిరాద్ చౌదరి చెప్పినట్లు మనం సెకండుహాండు వస్తువులకు అలవాటుపడ్డ వాళ్ళం. మానసిక రోగులకు ఎలాంటి శిక్షనివ్వాలో యింతవరకు ఒక నిర్ణయానికి మనం రానేలేదు. క్వీన్ ఎంప్రస్ వెర్సెస్ లక్ష్మణ్ దాగూ, క్వీన్ ఎంప్రస్ వెర్సస్ వెంకటస్వామి వగైరా కేసులలో ఈ విషయం చర్చించబడింది. ఆవేశపూరితమయిన కుటుంబ వివాదాలలో హత్యలు జరగడం ఎక్కువయినకొద్దీ వీటిని ఎలా పరిగణించాలో వాగ్వివాదాలు జరగడం మొదలయింది.