"అబ్జెక్షన్ యువర్ ఆనర్! లాయరుగారు సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలిగాని యిది శ,సమస్యల గురించి చర్చించాల్సిన ప్రదేశం కాదని మర్చిపోతున్నారు."
"అబ్జెక్షన్ సస్టెయిన్డ్. మీరు సాక్షిని అడగాల్సిన ప్రశ్నలు మాత్రం అడగండి."
"యస్, యువర్ ఆనర్! మిస్ హిమజా, మీ అక్కయ్య అబద్ధం చెప్పిందని మీరనుకున్నారా ?"
"లేదు. అక్కయ్యకు అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు."
"అంటే అదంతా నిజంగా జరిగిందే అయుండవచ్చుగా. ఇప్పటి వరకు సాక్ష్యం చెప్పిన వాళ్ళంతా అతని ప్రవర్తన కళ్ళారా చూశామని చెప్పారు. అందరూ చదువుకున్న విద్యావంతులే అంటే ఇది ఒక మానవాతీతశక్తి అనే విషయం రుజువయినట్లే కదా? వాళ్ళందరూ అబద్ధం చెపుతున్నారని మీ అనుమానమా ?"
"నేనలా అనలేదు. వాళ్ళు భ్రమపడి వుండవచ్చు. నేను ప్రత్యక్షంగా చూడలేదు గాబట్టి నమ్మలేను."
"ముద్దాయి మీ అక్కతో కలిసి సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళేవారని, తగిన ట్రీట్ మెంట్ తీసుకునేవాడని మీకు తెలుసా ?"
"విన్నాను."
"హత్య జరిగినప్పుడు ముద్దాయి ప్రవర్తన కాస్త అసాధారణంగానే ఉందని మీరు అన్నారు గదా!"
"అయి వుండవచ్చు, కాని హత్య చేసింది మాత్రం అతనే."
"థాంక్యూ మిస్ హిమజా! దట్సాల్."
తర్వాత సాక్షిగా శివయ్య ప్రవేశపెట్టపడ్డాడు.
* * *
"నీ పేరు ?"
"శివయ్య."
"వారింట్లో నువ్వెంతకాలం నుంచి పని చేస్తున్నావు ?"
"పదిహేను సంవత్సరాల్నుంచి బాబూ!"
"అయ్యగారూ అమ్మగారూ తరచు దెబ్బలాడుకునేవారా ?"
"లేరండి. అయ్యగారు అమ్మగార్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ అయ్యగారికి దెయ్యం పట్టిందండి. ఆ మాట నేను చెప్పినా ఎవరూ వినిపించుకోలేదండి."
"ఏ దెయ్యం? కొరివి దెయ్యమా?" (నవ్వులు)
"కాదండి. సోమశేఖరంగారు దెయ్యమయి పగ పట్టారండి."
"శివయ్యా! నీకు దెయ్యాల్లో నమ్మకం వుందా ?"
"నేను కళ్ళారా చూశాక నమ్మకుండా ఎలా వుంటానండి బాబూ !"
"ఏం చూశావు నువ్వు ?"
"నేనాండీ_?" అకస్మాత్తుగా శివయ్య కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా శూన్యంలోకి చూశాడు. క్రమక్రమంగా అతడి కనుగుడ్లు వెనక్కి తిరిగి పోయాయి. అతడి స్వరం మారిపోయింది. డబ్బాలో గులకరాళ్ళు వేసినట్లు బొంగురు స్వరం అతడి కంఠం ద్వారా వినిపించసాగింది.
"శివయ్యే కాదు....మీరు కూడా చూడాలంటే చూడవచ్చు....నేనే సోమశేఖరాన్ని....! నా కాంక్ష తీరింది.... నా ప్రియురాలి ఆత్మతో కలిసి నేను దిగంతాలకి వెళ్ళిపోతున్నాను"
చారిత్రాత్మకమైన ఆ కేసు వినటం కోసం దేశం నలుమూలల్నించీ వచ్చిన ప్రజానీకం కోర్టుహాలు లోపల కోర్టు బయట నిశ్చేష్టులై వుండగా సాక్షి శివయ్య శరీరం బోనులో క్రిందికి జారిపోయింది.
"మీ పేరు?"
"రామకృష్ణ"
"మీరెక్కడ పనిచేస్తున్నారు ?"
"మెంటల్ ఆస్పత్రిలో _ డిప్యూటీ సూపర్నెంట్ గా"
"ముద్దాయి మానసిక పరిస్థితిమీద మీ అభిప్రాయం ?"
"అతడు పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో బాధపడుతున్నాడని నా ఉద్దేశం"
"దాన్నే తెలుగులో దెయ్యంపట్టడం అంటారా ?"
జవాబు చెప్పటానికి రామకృష్ణ ఆగాడు. కోర్టులో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అన్నాడు__
"వెల్ _తెలుగులో దాన్ని దెయ్యం అంటారేమో నాకు తెలీదు. ద్వంద్వ ప్రవృత్తి అనేది సరైన పదం అనుకుంటాను. మీరు దాన్ని భ్రాంతి అని కూడా అనవచ్చు."
"మీరిప్పుడు మీ కళ్ళముందే - బోనులో సాక్ష్యమిస్తున్న ఆ ఇంటి నౌఖరు శివయ్యని దెయ్యం ఆవహించడం చూశారు. దీనికి మీరే కారణం చెపుతారు ?"
"సోమశేఖరం ఆత్మహత్య చేసుకుని మరణించాక దెయ్యమయ్యాడని శివయ్య మనస్పూర్తిగా నమ్మేడు. తన ఇంటి యజమానిని ఆ దెయ్యం అప్పుడప్పుడు ఆవహిస్తూండటం అతడు కళ్ళారా చూశాడు. అందువల్ల కోర్టులో అతడిని 'నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూశావా' అని ప్రశ్నించగానే ఆ భ్రాంతికి తనే స్వయంగా లోనయ్యాడు. చనిపోయిన సోమశేఖరం కోర్కేమిటో శివయ్యకు తెలుసు. అతడి ప్రియురాలు మరణించాలనీ, ఆ ఆత్మ కూడా తనలో కలిసి స్వర్గానికి రావాలని సోమశేఖరం కోర్కె. శివయ్య స్వర్గాన్నీ, దేవుణ్ణీ నమ్ముతాడు. కాబట్టి అసంకల్పితంగా - సోమశేఖరం ఆత్మ తనని పూనినట్టు కోర్టులో ప్రవర్తించాడు."
"ముద్దాయి కూడా హత్యకి ముందు దెయ్యం పట్టినట్టు అప్పుడప్పుడు ప్రవర్తించేవాడా ?"
"అవును. ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ తరచు అతడిని ఆవహించేది. తన ప్రియురాలి ఆత్మకి ఆమె శరీరం నుంచి విముక్తి కలిగించమని అతడిని మానసికంగా వత్తిడిచేసేది. దాన్నే దెయ్యం పట్టటం అని అనుకున్నారు"
"కానీ ఒక డాక్టరుగా మీరుమాత్రం దాన్ని పారనాయిడ్ స్కిజో ఫ్రెనియా అంటారు"
"అవును"