" కాశీ మజిలీ కధల్లో అందాల రాకుమారైల వర్ణన అలాగే వుంటుందండి!" అన్నాడు అబ్బులు.
" కానీండి, కానీండి సవరాలు కట్టేదాని కధ."
" సరే, అందాల రాకుమారి బిందురేఖ..."
కీచుమని అరచింది బిందురేఖ.
కిల కిలా నవ్వింది జయచిత్ర.
" ఒరేయ్! రాజకుమారై పవరు హిమబిందు" అన్నాడు వ్యాకర్ణ.
అబ్బులు నాలిక్కొరుక్కుని " సారీ!' అని భూతద్దాలు సరిచేసుకుని కధలో కొచ్చాడు.
" హిమబిందు పెళ్ళీడు కొచ్చింది.
దేశ దేశాల రాకుమారులూ హిమబిందుని పెళ్ళాడాలని వువ్విళ్ళూరుతున్నారు.
ఇలా వుండగా ఓ రోజు రాత్రి హిమబిందు ఆరుబైట పడుకుంది."
" ఎందుకు?" అంది జయచిత్ర.
" గాలి లేక."
" ఫ్యానేసుకోవచ్చుగా!"
" ఆ కాలంలో ఫ్యాన్లు లేవు.
" పోనీ కరెంటు వుందా?" యీదఫా బిందురేఖ అడిగింది.
" కరెంటు వుంది. కాని కరెంటు కట్ రోజులవి" అన్నాడు వ్యాకర్ణ.
" ఇలా అయితే నే కధ చెప్పను. ఆ...అంతే" బెదిరించాడు అబ్బులు.
" ఏదయినా అనుమానం కధ మధ్యలో వస్తే అది అడగడం తప్పా! కధ చెప్పటం కళ కాదు.
అనుమానం తిర్చాటం, విమర్శకు తట్టుకోటం కధకీడు లక్షణం" అంది జయచిత్ర.
" కధకుడికి కళ్ళజోడుంటే అభ్యంతరమా?" కల్పించుకుని అడిగాడు వ్యాకర్ణ.
" లేదు."
" రక్షించారు.ఊఁ ! కానియ్యరా అబ్బునాధాం ."
" బిందురేఖ, ఓ... సారీ! హిమబిందు ఆరుబయట పడుకుంది కదా! చల్లగాలికి కమ్మని నిద్ర పట్టింది.
అప్పుడు పెద్ద కొండంత రాక్షసుడు ఆకాశమార్గాన వెళుతూ హిమబిందుఉని చూశాడు...
" రాక్షసుడు ఆకాశమార్గాన ఎలా వెళుతున్నాడు? విమానం ఎక్కా? రెక్కలు కట్టుకునా?" అంది జయచిత్ర.
" ఇలాంటి అడ్డదిడ్డం ప్రశ్నలడక్కండి. ఎట్టాగో అట్టా వెళుతున్నాడు."
" ఎటాగోఅట్టా వింటాం కానియ్యండి" అంది బిందురేఖ.
" ఆ రాక్షసుడు హిమబిందు మేడ మిదకు వచ్చి, హిమబిందు సౌందర్యానికి మురిసి అమాంతం మంచంతో సహా హిమబిందు ఎత్తుకుని గాలిలో లేచి ఆకాశమార్గాన మళ్ళీ తనింటికి బయలుదేరాడు.
" సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్లు వెళ్ళాడు కామాలు? వీడమ్మా కడుపుకళా?" అంది జయచిత్ర.
" హిమబిందు ఏం చేస్తుంది. మొద్దునిద్ర పోతున్నదా? మంచం మిదనుంచి దొర్లి పడలేదా ఏ రావుగారి మూడంతస్తుల మేడమిదనైనా?" అంది బిందురేఖ.
" ఇట్లా అయితే నే కధ చెప్పను" బెదిరించాడు అబ్బులు.
" ఊ... ఎట్టాగోఅట్టా కానీండి" ఓ మూల్గు మూల్గి ఆజ్ఞ యిచ్చింది జయచిత్ర.
" హిమబిందుని రాక్షసుడు తన యింట్లో దాచి పెట్టాడు.
మెలుకువ వచ్చిన రాజకుమారి రాక్షసుడిని చూసి భయంతో గజ గజ... గజ గజ... గజ గజ... గ...
" చాల్లేండి అర్ధమయింది."