ఫర్లాంగు రెండు ఫర్లాంగుల దూరంలో ఎవరో టార్చిలైట్లు వేసి చూస్తున్నట్లుగా అనిపించింది. అటువైపు వున్నది శిధిలావస్థలో వున్న పాతకోట అని తెలుసు వికీకి అక్కడున్న పాతకోట బాగా పాతబడిపోతుంటే, దాన్ని రిపేర్లు చేయించడం ఇష్టంలేక ఇక్కడ క్రొత్తగా అధునాతనంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తండ్రి కట్టించిన సంగతీ తెలుసు.
పాతకోటను వదిలిపెట్టి ముప్పై నలభై ఏళ్ళవుతున్నది.
ఆ పాడుబడిన ప్రదేశంలో ఇంత రాత్రివేళ టార్చిలైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.
బంగళా చుట్టూ తిరుగుతున్న వాచ్ మెన్ అటువైపు రాగానే, వికీ చేతులు చరిచి చప్పుడు చేసి, "వాచ్ మెన్ వాచ్ మెన్" అని పిలిచాడు.
వాచ్ మెన్ చేతిలో చుట్ట చప్పున క్రిందవేసి కాలిచెప్పుతో నలిపి, "పిలిచారా సాబ్?" అన్నాడు.
"అటువైపు చూడు. టార్చిలైట్లు వెలుగుతున్నాయి."
"పాతకోటలోనా సాబ్?"
"అవును అక్కడే!"
"గోడ, చెట్లు అడ్డమౌతున్నాయి సాబ్! నాకేం కనిపిస్తలేదు"
"పైకి వచ్చి చూడు."
పైకి వచ్చాడు వాచ్ మెన్.
దూరంగా పాతకోటలో మంచి పవర్ ఫుల్ లైట్లు వెలగడం అతడూ చూశాడు.
"అక్కడ ఆంజనేయస్వామి గుడి వున్నది. సాబ్! పూజలు పునస్కారాలు లేకుండా పాతబడ్డది. దొంగనాయాళ్ళు ఆ గుడికాక ఏం చేస్తున్నారబ్బా! విగ్రహం కింద నిధి వుంటదని తవ్వుతున్నారో ఏమో. ఈ చుట్టుప్రక్కల ఏదో గాంగ్ పనిచేస్తున్నది సాబ్. ధనం వుంటదన్న ఆశతో విగ్రహాలను పెకిలించేస్తున్నారు. మరి ఆ దేవుడికి అంత శాంతమెందుకో అర్ధంకాదు. తనను పీకినా, డైనమెట్లు పెట్టి పేల్చినా ఏం చెయ్యడు ఆ దుర్మార్గులను" వాపోయాడు వాచ్ మెన్ "గేటు దగ్గర గూర్ఖా వున్నాడు. ఇద్దరం కల్సిపోయొస్తాం. గూర్ఖా దగ్గర తుపాకీ వుంటది. భయముండదు" వాచ్ మెన్ పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు.
వికీ అక్కడే నిలబడి చూస్తున్నాడు.
కొంచెం సేపటికి గూర్ఖా, వాచ్ మెన్ కలిసి పాతకోటవైపు వెడుతున్నట్టుగా వాళ్ళు చేతుల్లో వెలుగుతున్న టార్చీలైట్లు చెప్పాయి.
అరగంట తరువాత తిరిగివచ్చారు ఇద్దరూ.
"నా ఊహ కరెక్టే సాబ్! ఆంజనేయస్వామి గుడిముందు త్రవ్వుతున్నారు దొంగనాయాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయారు" చెప్పాడు వాచ్ మెన్.
"పట్టుకోలేకపోయారా?"
"మమ్మల్ని దూరం నుండే చూసి పారిపోయారు సాబ్"
మరునాడు ధర్మలింగం ఆఫీసుకు రాగానే. అక్కడే వున్న వికీ రాత్రి సంఘటన గురించి చెప్పాడు.
ధర్మలింగం కూడా వాచ్ మెన్ అభిప్రాయాన్నే బలపరిచాడు. "నిధుల అన్వేషణలో త్రవ్వుతున్నట్టున్నారు. పాతకోటలో చాలా ధనముందని ఇక్కడ జనంలో వాడుక. ముఖ్యంగా ఆ పాడుబడ్డ బంగళాలో వుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం వల్లే పాతకోటనీ, బంగళానీ త్రవ్వి త్రవ్వి నాశనం చేస్తున్నారు. ఎవరికేం దొరుకుతుందో ఆ భగవంతుడికి తెలుసు."
"మరి అలా త్రవ్వి పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకొన్నారా?"
"పగలైతే చూడొచ్చు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో ప్రాణాలకు తెగించి వచ్చేవాళ్ళను ఎవరడ్డుకోగలరు?"
"అయితే పాతకోటని దొంగలు అలా నాశనం చేయవలసిందేనా?"
"అక్కడ కరెంట్ పోల్స్ వేయించి, ఇద్దరు ముగ్గురు వాచ్ మెన్లని పెడితే పాతకోట రక్షింపబడుతుంది"
"అయితే అందుకు ప్రయత్నాలు చేయండి"
"కాని, అనవసరం ఖర్చేమోనని నా ఉద్దేశం"
"అనవసరమని అనుకొంటే ఎలా? అక్కడ చిన్న మట్టి పెడ్డ కూడా ఎవరూ త్రవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. మన పూర్వీకుల వైభవానికి గుర్తులవి"
ఆ రాత్రి కూడా వికీకి సరిగా నిద్రపట్టలేదు. అస్థిమితంగా పక్కమీద దొర్లసాగాడు.
అంతటా అలుముకున్న నిశ్శబ్దంలోంచి ఎవరో మెత్తగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపించింది. చెవులు రిక్కించి వినసాగాడు వికీ. కిటికీ దగ్గర సరసరమని శబ్దం కాసాగింది.
తలగడ క్రింద వున్న రివాల్వర్ చేతిలోకి తీసుకుని, మంచం దిగుతూ "ఎవరదీ?" అన్నాడు. కిటికీ దగ్గరి నుండి గబగబా పరిగెడుతున్నట్టుగా అడుగులు శబ్దం అయింది.
గది తలుపులు తెరిచి బయటికి వచ్చాడు వికీ. గది ముందు వరండాలో రాంసింగ్ గాఢ నిద్రలో వున్నాడు.
"రాంసింగ్! రాంసింగ్!"
"..............."
"రాంసింగ్"
దిగ్గున లేచి కూర్చున్నాడు రాంసింగ్. "సాబ్"
"ఎవరో ఇందాక నాగది దగ్గరికి వచ్చారు. కిటికీ అద్దం కోయాలని చూశారు. ఇదో ఈ వైపుకే పరిగెత్తాడు. పరిగెత్తి పట్టుకో. నేనీ వైపునుంచి ట్రై చేస్తాను"
ఆ రాత్రి ఆ ఇద్దరే కాక ఈ అల్లరికి లేచిన నౌకర్లు. మరో వాచ్ మెన్ ప్యాలెస్ అంతా అంగుళం అంగుళం గాలించారు గాని ఎవరూ దొరకలేదు. వికీ చెప్పిన కిటికీ దగ్గరమాత్రం కిటికీ అద్దాన్ని కోయడానికి ఉపయోగించిన పరికరాలు కనిపించాయి.