వికీ అనుమానం నిజమే! ఎవరో వచ్చారు. అదీ అతడి గదిలోనే ప్రవేశింపజూశారంటే, వికీ మీద హత్యా ప్రయత్నానికే వచ్చి వుంటారని నిర్ధారణకు వచ్చారు.
"చూశారు కదా చినబాబూ. నేను మీకు బాడీగార్డ్స్ ని ఎందుకు పెట్టానో? మీరు అజాతశత్రువుకాదు. ఆ విషయం గుర్తు పెట్టుకుని నాతో సహకరించండి" అన్నాడు ధర్మలింగం
నాలుగైదు రోజుల తర్వాత ఉదయకాంతారావు ఇప్పించిన కోర్టు నోటీస్ కూడా వచ్చింది.
వికీ వారసత్వం చెల్లదని.
సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినట్టుగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వికీ.
ఈ ఎస్టేట్ తన చేయి జారితే ఒక గుదిబండ తనను వదిలినట్టుగా హాయిగా ఊపిరి పీల్చుకోగలడు. కాని వారసత్వం చెల్లదన్న తీర్పుకు తను తల ఒగ్గితే తను అక్రమసంతానంగా ప్రపంచం ముందు నిలబడాల్సి వస్తుంది. అంతకంటే మరణం మేలుకదా?
వికీ పోరాటానికే నిశ్చయించుకొన్నాడు.
కాని ఇంత బరువూ తనొక్కడు మోయలేడు. తనకి ఆసరా కావాలి.
ఎవరు........ఎవరున్నారు తనకు?
"మీరు వెళ్ళి అన్నగారిని తీసుకురండి, ధర్మలింగంగారూ! ఆయన వస్తే బ్రతికిపోతాను."
"ఆయన వస్తే ఏ సమస్య అయినా చిటికెలో తీర్చగలరు. ఆయన మంచి వ్యవహారదక్షులని, కడు సమర్ధులని విన్నాను. కాని వస్తారా అని."
"నా అభ్యర్ధనగా పిలిచి చూడండి."
"ఆయన మీ నాన్నగారి పెద్ద కుమారుడు. ఇప్పుడంటే అలిగి వెళ్ళిపోయినందుకు ఆస్తిపంచుకోడానికి రాలేదుగాని ఆయన్ని మనం పిలిస్తే ప్రాపర్టీ చెరిసగం చేయమనవచ్చు. అందుకు మీరు."
"చెరిసగం కాదు. అసలు భాగాలే లేకుండా తననే తీసుకొమ్మంటాను. నాలాంటి సున్నిత మనస్కులకి ఈ తగాదాలూ, ఈ బరువు బాధ్యతలూ మోయాలంటే ఊహూ నావల్లకాదు. ఈ ఎస్టేట్ తో పాటు నా బరువు బాధ్యతలు, మంచిచెడ్డలు తననే తీసుకొమ్మంటాను."
"ఆయన వస్తే ఆయనే ఒక సమస్యగా మారరు కదాని ఆలోచిస్తున్నాను"
"సమస్య ఏం కాదు. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పుడు వచ్చేది."
"మరీ ఇంత మంచితనం ఉంటే నెగ్గుకు రాలేరు చినబాబుగారూ!"
"మంచిగా వుండడం తప్పా?"
"మంచితనం కొన్నిసార్లే మంచిది. అన్నిసార్లూ కాదు. కార్యదక్షతకి కావలసినంత మంచితనం కాదు. కరుకుదనం. కాఠిన్యం. మీరు నేర్చుకోవాల్సింది చాలా వుంది 'ఈ ఆస్తి నన్నొదిలితే చాలు' అనుకోవడం తప్పు ఆస్తి వున్నప్పుడు వచ్చే సమస్యలు ఎక్కువ. అవి చాలా దుర్భరమైనవి. మనిషి తట్టుకోలేనివి. డబ్బుంటే ఏదైనా సహించవచ్చు. ఆ శక్తి డబ్బిస్తుంది. డబ్బు లేకపోతే చాలా చిన్న సమస్య కూడా సహించలేం. మనకున్న శక్తియుక్తిల్ని డబ్బు లేకపోవడం అనేది హరించివేస్తుంది అందుకని, ఆస్తిమీద, ఐశ్వర్యంమీద మనిషికి ఆశ వుండడం తప్పుకాదు."
"ఈరోజు నేనొక క్రొత్త సూ్కతి విన్నాను" వికీ చిన్నగా నవ్వాడు. "సమ్మెటపోటు ఇప్పుడిప్పుడే పడుతున్నాం. మంచితనం చెప్పకుండా పారిపోయి కరుకుదనం గట్టిదనం అదే వచ్చేస్తుంది లెండి."
ఇరవయ్యేళ్ళ క్రితం భర్తనూ, సంసారాన్నీ త్యజించి పుట్టింటికి వచ్చాక ప్రపంచం మీదే ఒక విధమైన విరక్తిని పెంచుకొంది రాజ్యలక్ష్మీదేవి. పూజలు, పునస్కారాలు, ఏకాదశి శివరాత్రి అంటూ ఉపవాసాలు, సాధు సన్యాసుల సేవ ఒక భక్తి ప్రపంచంలోకి అడుగుపెట్టి ఐహిక సుఖాలకు దూరందూరం కాసాగింది. అయితే కొడుకు హనుమాన్ ప్రసాద్ పెంపకంలో మాత్రం ఆమె నిర్లక్ష్యం చేయలేదు. చక్కటి నడవడిక, మంచి చదువు అబ్బేలా జాగ్రత్తలు తీసుకొంది. అయిదారేళ్ళక్రితమే ఇహలోక యాత్ర చాలించిన ఆమె తల్లిదండ్రులు, తండ్రి ప్రేమకు దూరమైన మనుమడిని చాలా అపురూపంగానే చూశారు. వాళ్లకు రాజ్యలక్ష్మి ఒక్కతే సంతానం కావడంవల్ల మనుమడిని దత్తత తీసుకొని తమ ఎస్టేట్ కు అతడిని వారసుడిని చేసిపోయారు.
హనుమాన్ ప్రసాద్ ఇరవై ఆరేళ్ళ యువకుడు. మంచి కార్యదక్షుడుగా, గొప్ప వ్యాపారవేత్తగా అతడు అప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అతడికి పిల్లనివ్వడానికి క్యూ కట్టి వున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. అతడు పెళ్ళికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల క్యూ అలాగే నిలిచిపోయింది.
"నాకిక ఒక్కటే కొరత ఉంది. తీర్ధయాత్రలు చేస్తూ చేస్తూ మనసుకు నచ్చినచోట ఆగిపోయి అక్కడే రాలిపోవాలని వుంది. నీకు పెళ్లయ్యి కోడలు వస్తే ఈ కాస్త బంధమూ త్రెంచుకొని పక్షిలా ఎగిరిపోవాలని వుంది" రాజ్యలక్ష్మి.
"అందుకే , అమ్మా నేను పెళ్లి చేసుకోకుండా వున్నది. నా పెళ్లితో నిన్ను పోగొట్టుకోవడమే జరిగేట్టు అయితే ఆ పెళ్ళిని నేను జీవిత పర్యంతం పరిత్యజిస్తాను" అంటాడు కొడుకు.
"అలా అంటే ఎలా? తల్లికి భవబంధ విమోచనం కలిగించడం కొడుకుగా నీ ధర్మంరా! నీ మాతృప్రేమకు నన్ను బందీని చేయాలని చూడకు" అంటూందామె.
ఆ తల్లీ కొడుకుల అనురాగాన్ని చూసి అక్కడున్నవాళ్ళ కళ్లు చెమర్చుతూంటాయి.
చాలా ఏళ్ళ తరువాత కనిపించిన ధర్మలింగాన్ని సాదరంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. యోగక్షేమాలు విచారించింది.
"నా యోగక్షేమాలు. సుఖ దుఃఖాలు రాజాసాబ్ కుటుంబంతో పెనవేసుకుపోయి వుంటాయి అమ్మగారూ. వారి క్షేమమే నా క్షేమం. ప్రస్తుతం ఒక గడ్డుసమస్య పడింది."
అంటూ వి,యం చెప్పబోయిన ధర్మలింగానికి అడ్డుపడింది రాజ్యలక్ష్మి. "ముందు మీరు భోజనానికి లేవండి, మేనేజరుగారూ, తరువాత అన్నీ మాట్లాడుకోవచ్చు"