"ఓహ్! ఎంత విపరీతంగా ఆలోచిస్తారు మీరంతా?"
గ్లాసు కడిగిందే కడిగి అందులో టీ తీసుకువచ్చింది తుంగభద్ర.
శబరి ఎంగిలి పళ్ళను శ్రీరాముడు తిన్నంత తృప్తిగా తుంగభద్ర ఇచ్చిన టీ త్రాగాడు వికీ.
టీ త్రాగుతుంటే మంచం ప్రక్కన గుడ్డకప్పి వుంచిన హార్మోనియం పెట్టెమీద అతడి దృష్టిపడింది. "అరే! ఇక్కడ హార్మోనియం పెట్టె వుందే. ఎవరు వాయిస్తారు?"
"ఇంకెవరున్నారీ ఇంట్లో వాయించడానికి? మా అమ్మ నాకు చిన్నప్పుడు ఆటా పాటా నేర్పించింది. ఆడపాపలం కదా?అవే మాకు బ్రతుకుదెరువు అన్నమాట."
"ఓహ్! అయితే నీకు సంగీతం నృత్యం వచ్చన్నమాట. "వికీ లేచి వెళ్లి కుతూహలంతో హార్మోనియం మెట్లు నొక్కసాగాడు.
"నన్నిప్పుడు డాన్స్ చేయమనరు కదా?" భయం వ్యక్తం చేసింది తుంగభద్ర.
"మరి నీ డాన్స్ నేను చూడొద్దా?"
"నడుం డబ్బాలా ఊరిపోయి, కండలు పెద్ద తేనెతెట్టెల్లా జారిపోయి ఈ ఏభై ఏళ్ళ వయసులో నేను డాన్స్ చేస్తూంటే - మీరే చూడాలి" ఒకనాటి విలాసవంతమైన నవ్వు తుంగభద్ర పెదవులమీద నర్తించింది.
"అయితే ఒక పాటైనా పాడు."
"నా గొంతు ఎప్పుడో పూడుకుపోయింది. ఇప్పుడు పాట కూడా సరిగారాదు."
"అయితే నీ పర్సనల్ విషయాలైనా చెప్పు. ఎంతమంది పిల్లలు నీకు. మీ ఆయన ఏం చేస్తుంటాడు?"
"నాకు ఒక్కతే కూతురు. దాన్ని నా తమ్ముడికే ఇచ్చి చేశాను. అదిగో! ఆ గోడ మీదున్నది వాళ్ళ పెళ్ళినాటి ఫోటో, వాళ్ళు పట్నంలో ఉంటున్నారు కాపురం. ఇక మా ఆయన శిలావిగ్రహం ఉలక్కుండా పలక్కుండా భక్తుల పూజలు మాత్రం స్వీకరిస్తుంటాడు."
"అంటే మీ ఆయన చచ్చిపోయాడా? ఆయన శిలావిగ్రహం నిలబెట్టారా?"
"అపచారం, చినబాబుగారూ, అలా మాట్లాడకూడదు. ఆయనకీ మరణం ఏమిటి? చావుపుట్టుకలు లేనివాడు ఆ పరమాత్ముడు."
"పరమాత్ముడు మీ ఆయనా? ఓహ్! మొన్నే భవాన్స జర్నల్ లో గోదాదేవి కథ చదివాను. అయితే నువ్వు గొప్ప భక్తురాలివన్నమాట"
"అపచారం, అపచారం" తన చెంపల్ని టపటప వాయించుకుంది తుంగభద్ర. "ఆ జగన్మాతకూ మాకూ పోలికేమిటి బాబుగారూ? మురికి పురుగుల్లాంటి జన్మమాది. ఎంత పాపం చేశామో ఈ కులంలో పుట్టాము. తండ్రెవరో తెలియకుండానే పిల్లల్ని కంటాము." తుంగభద్ర కళ్ళలో కన్నీటి తెర ఛెమక్ మంది.
"నాకర్ధం కావడంలేదు. సరిగా చెప్పు."
తుంగభద్ర కళ్ళు తుడుచుకొని నవ్వింది. "అందుకే అన్నాను. పాలేవో, నీళ్ళేవో తెలియని వట్టి అమాయక చక్రవర్తులని. కాని. నాకంతా తెలుసునని బడాయికిపోతారు."
"నువ్వు సరిగా చెబితే నాకెందుకు అర్ధం కాదు?"
"మా బ్రతుకులు మరీ అంత విప్పి చెప్పాల్సినవి కావు. మీకెంత అర్ధంకాకుండావుంటే అంతమంచిది. ఇక బయల్దేరుదాం, లేవండి, చినబాబుగారూ!
* * *
రాత్రి చాలా గడచిపోయింది.
వికీకి నిద్రపట్టలేదు.
అతడి మనసులో ఆ సాయంత్రం వేదప్రకాశం చేసిన అవమానమే మెదులుతూంది.
ఆ కుటుంబానికి తానేమీ ద్రోహం చేయకపోయినా తనపట్ల వాళ్ళు ఎంత ద్వేషాన్ని ఏర్పరచుకొన్నారు. ఎంత విషం కక్కుతున్నారు. తన నీడ కూడా ఆ ఇంటిమీద పడకూడనంత పాపిష్టివాడా?
ఆ వ్యధ ఓ వైపు.
మరోవైపు ఇంకొక చింత.
ఇంతపెద్ద ఎస్టేట్ నిర్వహణ బాధ్యతను తను స్వీకరించగలడా? తన చదువు అర్ధాంతరంగా ఆగిపోదూ! అవసరమైన సలహా లివ్వడానికి మామయ్యలైనా దగ్గరలేరు.
తల్లీతండ్రీ -నా అన్నవాళ్ళెవరూ తనకు లేరు. మనసుకు వేదన కలిగితే ఏ తుంగభద్రకో చెప్పుకోవాలి. ధర్మలింగానికో చెప్పుకోవాలి. వాళ్ళకీ తనకీ మధయ్ వున్న సంబంధం పనివాళ్ళకీ, యజమానికీ వున్న సంబంధం. అంతకుమించి ఏముంది.
ఆత్మీయత అన్న పన్నీరు చిలికేవాళ్ళెవరూ లేరు.
బాధ కలిగితే అక్కున జేర్చుకొనేవాళ్ళు అసలు లేరు.
వికీ మనస్సంతా దిగులు దిగులుగా తయారు అయ్యి పక్కమీంచి లేచాడు.
రెండో అంతస్తు బాల్కనీలో పచార్లు చేయసాగాడు.
కృష్ణపక్షపు పంచమి చంద్రుడు ఎవరో అవమానపరచినట్టుగా ముఖం ఎర్ర జేసుకొని దిగిపోతున్నాడు. గాలికి కొబ్బరాకులు గలగలమంటున్నాయి కొబ్బరాకుల కదలిక చేసే సవ్వడితప్ప అంతటా నీరవనిశ్శబ్దం అలుముకుంది.
పచార్లు చేస్తున్న అతడు టక్కున ఆగిపోయాడు.