అతనన్నట్టు జరిగినా జరగకపోయినా శ్రీప్రియను ముందు వెదుకుదాం. అడగడంతో జగపతికి విపరీతమైన ఆనందం ముంచుకొచ్చింది.
"అలాగే చేద్దాం రాణా....కాని అది ఎక్కడుందని వెదుకుదాం"
"ఆ పాయింట్ కే వస్తున్నాను. గతంలో ఆమె ఎక్కడుండేది?"
"తెలియదు"
"తెలియకుండానే ఆ పిల్ల నీకెలా పరిచయమయింది?"
"మా అమ్మాయి అలేఖ్య తీసుకొచ్చింది"
"అంటే ఆమెను గురించి మా అమ్మాయికి తెలిసివుండాలి."
"ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ....ఉద్యోగంలో చేరకముందు ఆమె ఉన్న ప్లాట్ ఏదో తెలుసుకోగలిగాను. అక్కడకు వెళ్ళి ఎంక్వయిరీ చేసినా ఇపుడు ఆమె ఎక్కడ వున్నదో వాళ్ళకు తెలియదని తెలిసింది.
శ్రీప్రియకు సొంత ఇల్లుగానీ, బంధువులుకానీ ఎవరూ లేరని మా అమ్మాయిద్వారా తెలుసుకున్నాను."
"పోనీ....ఉద్యోగంలో చేరినపుడు నీకు ఏదయినా అప్లికేషన్ యిచ్చిందా?"
"యిచ్చింది. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంటుంది?" జగపతి ఆశ్చర్యంగా రెట్టించాడు.
"ఎందుకుండదు ఆ అప్లికేషన్ లో శ్రీప్రియ ఫోటో వుందేమో చూడు...."
రాణా ఆలోచన ఏమిటో జగపతికి అపుడు అర్ధమయింది.
"అంటే మీ ఉద్దేశం...."
"చెబుతాను....ముందు ఆ ఫోటో తీసుకురా...."
"ఉందో లేదో సరిగా గుర్తులేదు."
"గుర్తులేదా? ఏం మనిషివయ్యా నువ్వు....అప్లికేషన్ చూసుకోకుండా ఉద్యోగం ఎలా యిచ్చావు అసలు?" విసుగ్గా ప్రశ్నించాడురాణా.
"అదంతా ఆ వగలాడిమీద వున్న మోజువలన జరిగింది...."
"పోనీ ఆ అప్లికేషన్ అయినా ఎక్కడుందో గుర్తుందా?"
"వెదికితే దొరుకుతుంది...."
"భలేవాడివయ్యా నువ్వు....అర్జంటుగా వెళ్ళి ఆ అప్లికేషన్ పట్టుకునిరా...."
రాణా హెచ్చరించడంతో జగపతి ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు.
అర్ధగంట తరువాత....
టేబుల్ మీద ఆఫీస్ స్టాప్ పర్సనల్ ఫైల్స్ అన్నీ ముందువేసుకుని వెదుకుతున్నాడు జగపతి.....
పావుగంట తరువాత అతని ప్రయత్నం ఫలించింది.
శ్రీప్రియ అప్లికేషన్ చేతికి దొరకడంతో సంబరపడ్డాడతను.
తీరా అప్లికేషన్ పరిశీలించాక ఏ క్లూ దొరకలేదు.
ఆమె ఫోటో అందులోలేదు.
అంతేకాదు....
శ్రీప్రియ చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో ఎక్కడా ఆమె తల్లిదండ్రుల పేర్లుకానీ, పర్మినెంట్ అడ్రసు కానీ ఏదీ ఇవ్వలేదు....
రాణాకు ఆ విషయాన్ని వెంటనే ఫోన్ లో చెప్పాడు.
"డామిట్" ఉన్న ఆధారాన్ని చేజేతులా చేజార్చుకున్నావు రాణా కోపంగా అన్నాడు.
"ప్చ్....ఇక శ్రీప్రియను వెదకడం సాధ్యం కాదంటావారాణా...."
"కానేకాదు...."
"మరేం చేద్దాం...."
"కనీసం ఆమె ఫోటోకూడా లేకుండా ఎలా వెదకగలం?" అని ఫోన్ పెట్టేశాడు రాణా.
జగపతిలో నిరాశ మొదలయింది.
తనను నమ్మించి తనచేత తన భార్యను సయితం చంపించి తనను అతిదారుణంగా మోసంచేసిన శ్రీప్రియను తలచుకుంటూ కసిగా పెదవులు బిగించాడతను.
ఇపుడతని మెదడుని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే అసలు శ్రీప్రియ ఇపుడు ఎక్కడ ఉన్నదో?
* * *
బంజారాహిల్స్!
రెండవ వీధిలోని ఒక అధునాతనమైన భవంతి.
తొలిపొద్దు పొడవకముందే ఆ భవంతిలోని వ్యక్తులు నిద్రమేల్కొని హడావిడిగా తిరుగుతున్నారు.
శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరిలో తమ బంధువుల మేరేజ్ సందర్బంగా జరుగుతున్న హడావిడి అది.
సుహాసిని స్నానం ముగించుకొని, మేకప్ చేసుకోవడానికి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు తన బెడ్ పై పడుకుని యింకా నిద్రలేవని స్నేహితురాలివైపు చూశాయి.
రాత్రి పదకొండు గంటలవరకు తనతో కబుర్లుచెప్పి నిద్రపోయిన స్నేహితురాలు ఇంకా ముసుగు తన్ని పెట్టి పడుకొని వుండడంచూసి తనలోతాను నవ్వుకున్నది.
"ఏయ్...." అద్దంముందు కూర్చుంటూ అరిచింది. నిద్రపోతున్న స్నేహితురాలిలో ఏ చలనంలేదు.
"ఏయ్....లేవవే" మరొకసారి అరిచింది.
ఆ ముసుగులో చిన్న కదలిక.
ఇబ్బందిగా కదిలి అవతలకు తిరిగిపడుకున్నదామె.
ఈసారి సహనం కోల్పోయిన సుహాసిని లేచివెళ్ళి ఒక్కసారి ఆమె ముసుగునిలాగింది.
దుప్పటిలాగిందన్న కోపంతో విసురుగా ఇవతలకు తిరిగిందామె
ఆమె శ్రీప్రియ....!
ముగ్గురు వ్యక్తులు పట్టుదలగా నిమిషాలు లెక్కకట్టి వెదుకుతున్న శ్రీప్రియ....!
"అబ్బా....కాసేపు నిద్రపోనీయవే...." మత్తుగా అన్నది శ్రీప్రియ.