"ఆందోళన ఎక్కువై పోతోంది . ఎవరివవి?"
స్లిప్పర్స్ తొడుక్కుని కర్టేన్స్ దగ్గరకు నడిచి ఓ కర్టెన్ పక్కకు తొలగించి చూశాడు. గదంతా ఎత్తున కూలింగ్ గ్లాసెస్. వాటిల్లో నుంచి బయటి దృశ్యం మనోహరంగా కనబడుతోంది. తను ఆ భవనం తాలుకూ అయిదారు అంతస్తుల పైన వున్నాడు. తన చుట్టూ పూల మొక్కలూ, చెట్లు సూరంగా అందమైన భవనాలు.
ఎవరిది భవనం??
తనెలా వున్నాడిందులో?
వెనక్కు తిరిగి గదంతా మరోసారి చూశాడతను.
ఓ మూలగా తలుపు అవుట్ లైన్ కనబడుతోంది. మధ్యలో డోర్ నాబ్. పెద్ద అంగలతో వెళ్ళి తలుపు తెరచి లోపలకు చూశాడు. అది బాత్ రూమ్. లోపలకు చుసూనే వులిక్కి పడ్డాడతను.
గుండె ఝాల్లుమంది. ఓ వ్యక్తీ తన వేపే చూస్తూ కన్పించాడు ......గొంతు తడారిపోయింది. నోట్లో నుంచి మాట రాలేదు.
పెదాలు కదిలినాయి.
ఎదురుగ్గా వున్న వ్యక్తీ పెదాలు కూడా అచ్చం తనలాగే కదిలినాయి.
తనలాగే అతనూ అటువేపు నుంచి మరో తలుపు తెరచి తొంగి చూస్తున్నాడు.
"హలో" అన్నాడు అతి కష్టం మీద.
అదే సమయానికి అతనూ హలో అన్నాడు.
అప్పుడు వచ్చింది అనుమానం.
అదిరిపడ్డాడు. హై ఓల్టేజి షాక్ తగిలినట్లయింది. చటుక్కున లైట్ స్విచ్ వేశాడు. లైటు వెలిగింది. ఎదురుగ్గా వున్నది అర్ధం! నిజంగా మనిషి కాదు........మరో ఆలోచన మరింత భయంకరంగా చొరబడింది.
ఈసారి అద్దంలో తన ప్రతిబింబం కన్పించాలి కాని అతనెవరు? గిర్రున వెనక్కి తిరిగి చూశాడు.
తన వెనుక ఎవరయినా నిలబడి వున్నారేమోనని? ఎవరూ కనిపించలేదు. మరి ఆ అద్దంలో కన్పిస్తున్న ప్రతిబింబం ఎవరిది?
భయం వెన్నులో పాకుతోంది నెమ్మదిగా.
అతి భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్న ఫీలింగ్.
మరోసారి అద్దంలోకి చూశాడు. అదే వ్యక్తీ నోరు తెరచుకుని .....కంటిపాపలు బయటకు దూసుకొచ్చేట్లుగా.....
ఎదురుగ్గా నిలబడ్డ మృత్యువుని చూస్తున్నట్లు......
మెదడు మొద్దుబారి పోతోంది. నిశ్చేష్టుడయి పోయాడు కొద్ది క్షణాల పాటు. అది అద్దమే గానీ అద్దంలో ప్రతిబింబం తనది కాదు.... కనీసం తన పోలికలు కూడా లేవు...... మరి ఎవరతను...? ఎవరిదా ప్రతిబింబం?
పది అంతస్తుల భవనం మీద నుంచీ తలక్రిందులుగా పడిపోతున్నట్లన్పిస్తోందతనికి.
చెమటలు పట్టేసినయ్. చేత్తో ముఖం తుడుచుకున్నాడతను. ప్రతిబింబం కూడా అచ్చట తనలాగే ముఖాన్ని తుడుచుకుంటూ....
అసలది నిజంగా అద్దమేనా? ఫ్రేమ్ వెనుక ఎవరయినా......
అద్దాన్ని చేత్తో తడిమాడు.
చేతికి పక్షవాతం వచ్చినట్లు కదులుతోంది అద్దం మీద.
అద్దమే అది? సందేహం లేదు.
అందులో కన్పించేది కూడా తన రూపమే! కానీ తను మాత్రం కాదు. ముఖ్యంగా ముఖం!
ఇంకొద్ది క్షణాలు అలాగే చూస్తూ నిలబడితే గుండె ఆగి పోతుందేమో అన్పిస్తోంది. అంత వేగంగా కొట్టుకుంటుంది.
ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టిందతనికి.
వెనక్కు తిరిగివచ్చి మంచం మీద కూర్చున్నాడు. కాళ్ళు వణుకు తున్నాయి. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయింది.....అలోచించెంత శక్తి కూడా లేదు.
మరోసారి ముఖాన్ని తన చేత్తో తడుముకున్నాడు సురేష్.
అది వరలా లేదా స్పర్శ.
కొత్తగా, వింతగా , ఇంకెవరో వ్యక్తిని స్పర్శిస్తున్నట్లు....
ఏం జరిగిందసలు? ఎలా జరిగిందిది?
అద్దంలో కన్పించే వ్యక్తీ మొహంలా తన మొహం ఎందుకు మారింది?
అసలు తనెలా వుండేవాడు?
అతని కళ్ళముందు తన రూపం గజిబిజిగా కనబడుతోంది. కాని ఆ వ్యక్తీ మొహం కూడా కనబడుతోంది దాంతో బాటు.
పిచ్చెక్కిపోతుందేమో అన్న అనుమానం.....
ఉలిక్కిపడ్డాడతను.... అవును తన మానసిక పరిస్థితి సరిగ్గా వుందా అసలు? ఒకవేళ తనకు పిచ్చేక్కటం గానీ ......ఎక్కబోవడానికి గానీ......ఇది నాంది కాదు గదా?
మళ్ళీ లేచి నిలబడ్డాడతను కంగారుగా. గదిలో మరోమూలకు వున్న డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు.
లోలోపల ఎక్కడో ఆశ. ఎక్కడో .......కొంత ఆ అద్దంలోనయినా తన అసలు రూపం కనబడుతోందేమోనని.
అద్దం దగ్గర కొస్తూనే మొహం పాలిపోయింది.
"ఊహు " అంతకుముందు కన్పించిన ముఖమే. ఖచ్చితంగా తనది కాదది.
తనను తను గుర్తుపట్టలేని స్థితిలో లేడతను.
తలపోటు మొదలయిందతనికి. తల పేలిపోతుందేమో అన్పిస్తోంది. అక్కడే కుర్చీలో నిస్సత్తువుగా కూలబడిపోయాడు. ఏమిటి మిస్టరీ? ఏం జరుగుతోంది?
"గుడ్ మార్నింగ్ సురేష్" తీయని గొంతు సన్నగా .......వీణలా మోగింది.
ఎవరో హటాత్తుగా గాల్లోకి ఎగరేసినట్లుగా ఎగిరి నిలబడ్డాడు.
గోడలో కలిసిపోయినట్లున్న తలుపు తెరచుకొని ఓ యువతి లోపలి కొస్తోంది. తెల్లగా మిరుమిట్లు గోలిపెంత అందం.....
పెదాల మీద ఆకర్షనీయంగా చిరునవ్వు!
ఆమె వంకే కళ్ళప్పగించి చూస్తుండిపొయాడతను.
ఆమె చేతి మీద ఓ రంగురంగుల చిలక .....చిన్నది ....కూర్చుని వుంది. ఎవరీ దేవత? ఈ మిస్టరీలో మరో భాగమా?
"రాత్రి బాగా నిద్ర పట్టిందనుకుంటాను....." సోఫాలో కూర్చుంటూ అంది ఆమె. మాట్లాడుతున్నా ఆమె పెదాల మీద చిరునవ్వు అలానే వుంది.
"రాత్రి బాగా నిద్రపట్టిందనుకుంటాను?" అంది చిలుక కూడా.
"మీకు క్షమార్పణ చెప్పుకోవడానికి వచ్చాను మిస్టర్ సురేష్.....మీ మీద సర్వాధికారాలు మేము కొనుకున్నా......మిమ్మల్ని సంప్రదించకుండా మిమ్మల్ని ఉపయోగించుకోవటం అంత భావ్యం కాదని తెలుసు.....అయినా తప్పలేదు.
సురేష్ గుండె ఝాల్లుముంది.
అంటే ......అంటే .......ఇది తను వప్పుకున్న వుద్యోగంలో ఒక భాగమా? ఇదంతా ఆ సహదేవ్ చేసినదేనా?
"ముందు నాకో విషయం చెప్తారా?" త్వరగా కోలుకుంటూ అడిగాడతను. అతని మాటలను పట్టించుకోనట్లు మాట్లాడిందామె.
"మీకు తెలీకుండా మిమ్మల్నిక్కడికి తీసుకురాక తప్పలేదు. మీరు చేయబోయే వుద్యోగానికి కది ముఖ్యం. మీరు అన్ని విధాల సహకరిస్తే మాకెంతో హాయిగా వుంటుంది."
సురేష్ కి అసహనంగా వుంది.
"ముందు నాకేం జరిగిందో చెప్పండి? నా మొహం ఎలా మారిపోయింది?" ఆందోళనగా అన్నాడతను.
ఆమె నవ్వింది.
"అదీ నీ వుద్యోగంలో ఒక భాగమే మిస్టర్ సురేష్! మీరు అర్జున్ ని పోలి వుండటం అవసరం. అందుకని మా డాక్టర్లు మీ మోహంలో కొన్ని ప్రాధమికమైన మార్పులు చేశారు....ప్లాస్టిక్ సర్జరీ."
సురేష్ కి కోపం ముంచుకొచ్చింది.
"నేను మీతో వుద్యోగం చేస్తానని చెప్పాను గానీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటానని చెప్పలేదు."
"బహుశా మీకు గుర్తులేదేమో - ఈ ఆరు నెలలూ మీ మీద సర్వాధికారాలు మాకే వుంటాయని సహదేవ్ గారు మీకు చెప్పారు."
అతనికేం మాట్లాడాలో తెలీలేదు.
"దానర్ధం - నా శరీరం కూడా మీకిచ్చేస్తానాని ఎలా అవుతుంది? మీ అర్జున్ ఎవరు? అతనిలాగా నన్నెందుకు మార్చటం?"
"అర్జున్ మావారు! కొన్ని కారణాల వలన ఆయనను పోలిన వ్యక్తీ మాకు అవసరమయ్యాడు. పూర్తిగా మా బిజినెస్ కు సంబంధించిన కారణాలు! అయినా మీరు అదివరక్కంటే స్మార్ట్ గా వున్నారని సహదేవ్ అంటున్నాడు......మరోసారి అద్దంలో చూసుకోండి."
చిలుక కూడా వెంటనే అందుకుంది......."మరోసారి అద్దంలో చూసుకోండి."
ఆమె చిలుకను ముద్దు పెట్టుకుంది.
"మీకు లక్ష రూపాయలు ఊరికే ఇవ్వలేదు. సురేష్ గారూ! మీ పూర్తీ సహకారాన్ని మేము కొనుక్కున్నాము."
ఆమె గొంతులో బెదిరింపు స్పష్టంగా తెలుస్తోంది.
తను చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ వుద్యోగానికి వప్పుకుని ఇదంతా ఏదో పెద్ద వల లాగుంది. తనను ఎలా ఉపయోగించుకొబోతున్నారో అర్ధం కావటం లేదు.
"మీరీ ఉద్యోగానికి వప్పుకున్నందుకు మాకెంతో ఆనందంగా వుంది" కొద్ది క్షణాల తర్వాత అందామె.
"మాకెంతో ఆనందంగా వుంది" అంది చిలుక కూడా.
"ఊరికే వప్పుకోలేదు , డబ్బు కోసం.......' కటువుగా అన్నాడు అతను.
'అప్ కోర్స్ మీకు డబ్బే ముఖ్యం అని తెలుసు."