Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 36

 

    "నాకీ విషయం చెప్పండి......మళ్ళీ నా ముఖం ఒరిజినల్ గా మారే అవకాశం వుందా?"
    "సాధ్యం కాదని డాక్టర్లు అన్నారు...... ఇంతకుముందు ఇంకో అతను ....అతని పేరు వినయ్ - కూడా మీలాగే తన ఒరిజనల్ రూపం కావాలని పేచీ పెట్టుకున్నాడు. వీలుకాదని ఎంత చెప్పినా వినకుండా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.......పోలీస్ రిపోర్టు ఇవ్వటానికి! కాని ఏం లాభం? పోలీస్ స్టేషన్ కి చేరుకోకముందే చచ్చిపోయాడు."]
    మళ్ళీ భయం శరీరమంతా పాకింది సురేష్ కి.
    "చచ్చిపోయాడా?"
    'అవును! అన్నట్లు మా విష్ణు గది బయటే వుంటాడు. మీకెలాంటి భోజనం కావాలో అతనికి చెప్తే ఆ విధంగానే ఎరేంజ్ చేస్తాడు."
    సురేష్ కి దృష్టి భోజనం మీద లేదు.
    "ఆ వినయ్ ఎలా చచ్చిపోయాడు?" అడిగాడు అనుమానంగా.
    "అదా! నవ్విందామే. "మాములు యాక్సిడెంట్! ఒక నల్లని కారు దొంగ నెంబరు ప్లేట్ తో అతని మీద నుంచి వెళ్ళి పోయింది. అక్కడి కక్కడే చనిపోయాడు."
    సురేష్ నోరు తెరచుకుపోయింది.
    'అక్కడికక్కడే చచ్చిపోయాడు" అంది చిలుక.
    ఆమె మళ్ళీ చిలుకను ముద్దు పెట్టుకుంది.
    అతను తెరుకునేసరికి ఆమె గదిలో లేదు.
    
                                                     *    *    *    *

    ఆమె వెళ్ళిపోయినా తర్వాత కొద్దిసేపటి వరకూ చలనం లేకుండా గది మధ్యలో నిలబడి వుండిపొయాడతను. హటాత్తుగా తలుపు తెరచుకుంది మళ్ళీ.
    రాక్షసుడి లాంటి ఆకారం లోపలి కొచ్చింది. ఆరడుగుల కన్నా ఎక్కువే ఎత్తుంటాడు. వెయిట్ లిప్టర్ లా పొంగిన చాతీ, తిరిగిన కండరాలు, కనుబొమ్మలు రెండూ కలిసిపోయి అతని ముఖం అత్యంత భయంకరంగా కనబడుతోంది. లావు ముక్కు, ఎర్రటి కళ్ళూ, సన్నని పెదాలు తను చూసిన ఓ ఇంగ్లీసు సినిమాలో గొరిల్లా గుర్తుకొచ్చింది సురేష్ కి.
    అతని విషపూరిత మయినట్లున్న చూపు సురేష్ ని చీల్చి చెండాడుతున్నట్లుంది. ఏదో మాట్లాడాలనుకున్నాడు సురేష్. కానీ గొంతు పెగలడం లేదు.
    "భోజనానికేం కావాలో చెప్పండి! ఏర్పాటు చేస్తాను" అన్నాడతను. అతని ఆకారం తనను పూర్తిగా భయభ్రాంతుడిని చేసేసింది.
    "ఏదొకటి! ఏదయినా సరే" తన భయం భయటకు కనబడకుండా చెప్పాడు.
    అతను నవ్వాడు . నిజానికది ఏ మాత్రం నవ్వులా లేదు. పెద్దపులి నవ్వితే ఎలా తెలుస్తుంది?
    నాలుగడుగులు  ముందుకు వేసి సోఫాలో కూర్చున్నాడు.
    మళ్ళీ నవ్వాడతను. ఈసారి అతని తెల్లని పళ్ళు - వాటి మధ్యలో ఓ  పెద్ద బంగారపు పన్ను కనిపించినాయ్.
    "ఈ అరునెలలూ మనిద్దరం కలసి గడపాలి బ్రదర్! అంచేత నిరోదులుగా గడపడం కంటే స్నేహంగా గడపడం మంచిది ఏమంటారు?"
    "అవునవును......" తడబడుతూ అన్నాడు సురేష్.
    "నాకు స్నేహమంటే చాలా ఇష్టం సురేష్! స్నేహం కోసం ప్రాణం ఇస్తాను. మనం స్నేహంగా వుండటం చాలా తేలిక. ఓకే ఒక్క సూత్రం ఫాలో అయితే చాలు! నేనేది చెప్తే మీరది ప్రశ్న వేయకుండా చేయటం. నేను రాత్రి పన్నెండింటికీ మిమ్మల్ని నిద్ర లేపుతాను. కాఫీ తాగమని చెప్తాను. మీరు కాఫీ తాగాలి. వెంటనే ఐస్ క్రీం తినమంటాను . మీరు తినాలి. వెంటనే మళ్ళీ కాఫీ తాగమంటాను మీరు తాగాలి. అర్ధమయిందనుకుంటాను."
    'అయింది . రాత్రిళ్ళు కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీం, ఐస్ క్రీం వెనుకే కాఫీ తాగాలి అంతేగా?"
    అతని తల వూగింది.
    "ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే కాఫీ స్థానంలో మరోటి, ఐస్ క్రీం స్థానంలో ఇంకోటి చెప్పవచ్చు. అవి తినుబండారాలు కాకపోవచ్చు. మరేదయినా పని కావచ్చు. అంతే తేడా. ఇప్పుడు వివరంగా తెలిసిందనుకుంటాను."
    "సెంట్ పర్సెంట్" అన్నాడు సురేష్.
    "వెరీ గుడ్! ఇంతకుముందు వినయ్ అనే అతనిక్కూడా ఇదంతా చెప్పాను. కానీ అతనికి అర్ధం కాలేదు" చిరునవ్వుతో చూశాడతను. మనషుల్ని తినే జాతివాళ్ళు. అప్పుడే ఓ మనిషిని కనుక్కున్నట్లుంది అతని చూపు.
    "అది వినయ్ దురదృష్టం" తిరిగి అన్నాడతను.
    సురేష్ కి  మళ్ళీ చెమటలు పట్టసాగినాయ్.
    'అతనికి కారు యాక్సిడెంట్ అయిందని చెప్పారు" అన్నాడు తడారిపోయిన గొంతుతో.
    "తప్పదు! ఆ మాత్రం అర్ధం చేసుకొని వాళ్ళు ఏదొక రోజు కారు యాక్సిడెంట్ కి బలి అవక తప్పదు."
    సురేష్ ముఖం పాలిపోయింది. రాక్షసుడు అతనిని గమనించాడు.
    "మీరు తేలిగ్గా అర్ధం చేసుకున్నారు. కనుక మీకు ప్రమాదం జరగదు" సురేష్ మాట్లాడలేదు. గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు.
    ఆ రాక్షసుడి మాటల్లో హెచ్చరిక స్పస్ష్టంగా అర్ధమవుతోంది.
    వినయ్ అనేవాడు వాళ్ళు చెప్పినట్లు చేయడానికి నిరాకరించటం వల్ల మర్డర్ చేయబడ్డాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్!
    "మనం రేపు ఉదయం నుంచీ ఉద్యోగం ప్రరంభిందాం బ్రదర్! ఈ రోజంతా విశ్రాంతి తీసుకోండి! ఆ అల్మారాలో రకరకాల బుక్స్ వున్నాయ్. ఏ టు జెడ్! తీసుకోండి! అవసరయితే ఆ కర్టెన్ పక్కకు లాగి అద్దాల లోంచి చూడండి. అద్భుతమైన సీనరీ - అన్నట్లు చెప్పటం మరిచిపోయాను. నాకు సీనరీ చూడటం కూడా చాలా ఇష్టం! మీకూ ఇష్టమనుకుంటాను?"
    "ఆ....అవును......."
    "చూశారా! మనిద్దరికీ ఒకే విధమైన అభిరుచులున్నాయ్. మనం తప్పకుండా మంచి స్నేహితులయే అవకాశం వుంది. ఏమంటారు?"
    "ఆ...అవును...."
    "వెరీ ఫైన్! ఇప్పుడు అద్భుతమైన భోజనం ఏర్పాటు చేస్తాను. బహుశా మీరింతకు ముందెప్పుడూ కనీ వినీ ఎరుగని ఖరీదైన భోజనం."
    అతను లేచి తలుపు దగ్గర కెళ్ళి తలుపు తెరచి వెనక్కు తిరిగి నవ్వాడు మళ్ళీ.
    "ఏ మాత్రం ఆందోళన పడకు బ్రదర్! పూర్తిగా రిలాక్స్ డ్ గా వుండటం హెల్త్ కి మంచిదని డాక్టర్స్ చెప్తారు.'
    అతను బయటికి నడిచి తలుపు మూసివేశాడు.
    సురేష్ సోఫాలో కూలబడ్డాడు. తలంతా గిర్రున తిరుగుతున్నట్లుంది.
    వినయ్ ని కావాలనే చంపెశారా?
    ఆ విషయం ఆలోచించటానికే భయంగా వుంది.
    తను నిజంగానే చాలా పెద్ద ట్రాప్ లో ఇరుక్కుపోయాను. వీళ్ళు చెప్పినట్లు చేయకపోతే తనూ వినయ్ లాగానే కారు యాక్సిడెంట్ లో చంపబడతాడు.
    తానిప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు.
    వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు.
    వాళ్ళు చెప్పినట్టల్లా చేయడానికి వప్పుకున్నాడు.
    మళ్ళీ చెమటలు పట్టసాగినాయ్ అతనికి.
    భోజనం అయ్యాక కొద్దిసేపు పచార్లు చేశాడు సురేష్.
    తను జన్మలో తినలేనంత అద్భుతమైన వంటకాలు. తన కింతటి దశ పడుతుందని కలలో కూడా ఊహించలేదు.
    అంతలోనే గుండె ఝాల్లుమంది. ఇందులో ఏదో కాంప్లెకేషన్ వుంది. లేకపోతె తనలాంటి వాడికింత డబ్బిచ్చి , అంత ఖరీదయిన ప్లాస్టిక్ సర్జరీ చేయించి....
    తనెందుకు అర్జున్ అనే కోటీశ్వరుడుగా కనిపించాలి? అలా కనిపించడం వల్ల వాళ్ళకేమిటి లాభం? తననెందుకు ఈ గదిలో బంధించారు ?
    ఆ ఆలోచనకు ఉలిక్కిపడ్డాడు సురేష్.
    తనను బంధించారా? ఏమో! తనకు తెలీదు. ఎవరూ తనకలా చెప్పలేదు. అప్పటికప్పుడే ఆ విషయం తెలుసుకోవాలనుకున్నడతను.
    నెమ్మదిగా తలుపు దగ్గరి కొచ్చాడు. నెమ్మదిగా డోర్ నాబ్ ,మీద చేయి వుంచి తలుపు తెరిచాడు. సగం తెరుచుకోగానే తల బయటకు పెట్టబోయి ఎదురుగ్గా చిరునవ్వుతో , క్రూరత్వంతో తనవంక చూస్తోన్న విష్ణుని చూసి నిశ్చేష్టుడయ్యాడు.
    అతనిని తలుపు బయటే కాపలా వుంచుతారని తెలీదు.
    "ఏం కావాలి మిస్టర్ సురేష్? ఎనీ ప్రాబ్లం?" చిరునవ్వుతో అడిగాడతను.
    "ఏమీ లేదు. గదిలో బోర్ కొట్టి."
    "కొద్ది రోజులు భరించక తప్పదు. ఉద్యోగం అలాంటిది!"
    సురేష్ తలుపు మూసుకుని లోపలికొచ్చేశాడు.
    రాత్రి భోజనం చేస్తుండగా ఆ యువతి వచ్చింది మళ్ళీ. ఇప్పుడామె డ్రస్ మారిపోయింది. అంతా నీలం. పల్చని బట్టలూ, జాకేట్టూ చెప్పులూ. కనుబొమలూ, దుస్తులూ, గాజులూ.
    సురేష్ నిశ్చేష్టుడై చూస్తుంటే సోఫాలో కుర్చుందామే.   
విష్ణు చెప్పదు మిస్టర్ సురేష్! మీకు యిక్కడ బోర్ గా వుందని" అందామె నవ్వుతూ.
    సురేష్ తడబడ్డాడు. "ఆ ......అవును- అలా అనిపించింది!"
    "విష్ణు తో చెప్పాను! మీరు బోర్ కలగకుండా చూడమని! మీకు విడియో ఏర్పాటు చేస్తున్నాడతను. ఆఫ్ కోర్స్! ఆ సినిమా చూడటం కూడా మీ వుద్యోగంలో భాగమే. అది చూసి చాలా నేర్చుకోవాల్సి వుంది మీరు."

 Previous Page Next Page