"యస్! 8 డౌన్ ఎక్కడుంది?"
"కృష్ణా బ్రిడ్జి పాసయింది మేడమ్!"
"కృష్ణా కెనాల్ స్టేషన్ మాస్టర్ ని ఎలర్ట్ చేశారా?"
"చేశాం మేడమ్!"
"కృష్ణా కెనాల్ పాసవగానే అది విజయవాడ, కృష్ణా కెనాల్ మధ్య ఎంత రన్నింగ్ టైమ్ తీసుకుందో నాకు చెప్పండి. దానినిబట్టి ఎంత స్పీడ్ లో వెళ్తోంది కరెక్టుగా 'ఎసెస్' చేయడానికి వీలవుతుంది."
"అలాగే!" అతను వెళ్ళిపోయాడు.
అప్పుడే టేబుల్ మీది ఫోన్ మోగసాగింది.
"సీనియర్ డి.ఓ.యస్" అందామె రిసీవర్ తీసుకుంటూనే!
"హలో మిస్ మృదులా!" ఆ గొంతు ఎవరిదో తెలీలేదామెకి.
"ఎవరు మాట్లాడుతున్నారు?"
"గుర్తుపట్టలేదా? అయామ్ వినోద్!"
"ఓ! మిస్టర్ వినోద్! ఎర్లీగా నిద్రలేచినట్లున్నారే"
"అఫ్ కోర్స్! నేను రోజూ నాలుగున్నరకే నిద్రలేస్తాను. ఆ టైమ్ లో గంట, గంటన్నర ఫైల్స్ చూసుకుంటాను. మర్నాటికి ఒక్క ఫైల్ కూడా పెండింగ్ పెట్టడం నాకిష్టం ఉండదు."
"వెరీగుడ్ హాబిట్!"
"అదిసరే మీరింతపొద్దున్నే ఆఫీస్ కెళ్ళిపోయారేమిటి?"
"ఇక్కడ ఓ చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది. అందుకని రావాల్సి వచ్చింది."
"ఒక రాత్రనక, పగలనక లేడీస్ కిలాంటి జాబ్ ఒక 'కర్స్' అనుకుంటాను-"
"అయ్ డోంట్ థింక్ సో- ఐ లవ్ మై జాబ్!"
"ఓ! అఫ్ కోర్స్? వన్స్ ఓన్ ప్రిఫెరెన్సెస్- మీరు తిరిగి ఇంటికెప్పుడు రావటానికి వీలవుతుంది మిస్ మృదుల."
"అయ్ కాన్ట్ సీ! వన్ అవర్ లో రావచ్చు - సాయంత్రం వరకూ రాకపోవచ్చు."
"ఓ-ఇట్ మస్ట్ బి ఎ బిగ్ ప్రాబ్లెమ్!"
"ఇట్ డి పెండ్స్-"
"అయితే మరి మేం- మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాం-"
"అయామ్ సారీ! ఆ లోగా నేనురాగలనో లేదో తెలీదు. ఎనీవే- మీరు ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఎవైల్ చేసుకోండి. మా వంటవాడికీ, ఫ్యూన్ కీ మీక్కావలసినవన్నీ జాగ్రత్తగా చూడమని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాను. దయచేసి ఫాదర్ కీ, మదర్ కీ కూడా చెప్పండి మీతో ఇంకొద్ది గంటలు గడపదల్చుకున్నాను. కానీ అనుకోకుండా-"
"ఇట్స్ ఓ.కే. మిస్ మృదులా! జాబ్ అన్నాక మనచేతిలో ఏమీ ఉండదిక! అదీగాక ఈ రైల్వే జాబ్స్ మరీ హారిబుల్ అన్న విషయం నాకు తెలుసు."
మృదులకు అతనిమాటలు చిరాకు కలిగిస్తున్నాయ్.
"నిజానికి ఇప్పుడు మీకు ఫోనెందుకు చేశానో తెలుసా మిస్ మృదులా?"
"నో! ఐ కాస్ట్ గెస్!"
"రాత్రంతా మీరే కలలోకొచ్చారు. మీ అందం అంతగా లోబర్చుకుంది నన్ను."
ఆమెకు అతని మాటలుకంపరం కలిగించసాగాయ్.
అలా ఒక్క రాత్రిలో కలలోకిరావడం అసాధారణం! వచ్చినా ఆ విషయం ఏమాత్రం పరిచయంలేని వ్యక్తి దగ్గర చెప్పటం అతని మెచ్యూరిటీలేని వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.
"నేను కొంచెం బిజీగా వున్నాను మీరు డిస్కనెక్టు చేస్తే!"
అతను హర్ట్అయినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది.
కొద్దిక్షణాలు మాట్లాడలేకపోయాడు.
"ఓ.కే మిస్ మృదులా అయామ్ సారీ!"
ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
* * *
గార్డు ద్వారకా నాథ్ కి 8 డౌన్ విజయవాడ వెస్ట్ కాబిన్ పాసవుతుండగా ముందు అనుమానం వచ్చింది.
ఆ స్పీడ్ లో విజయవాడ స్టేషన్ లో కెళితే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు.
ఒకసారి తను గార్డుగా పనిచేస్తున్న ట్రెయిన్ లూప్ లైన్ ల
తనకు ఛార్జిషీట్ వచ్చింది. సంవత్సరంపాటు నాన్ క్యూమిలేటివ్ ఎఫెక్టుతో ఇంక్రిమెంట్ ఆపేశారు.
అప్పటినుంచి ట్రెయిన్ వేగం ఏమాత్రం ఎక్కువనిపించినా వాక్యూమ్ వేసి రెగ్యులేట్ చేస్తూండటం అలవాటయిపోయింది.
వెంటనే లేచి వాక్యూమ్ గేజ్ హాండిల్ నొక్కాడు.
ఎలాంటి శబ్దం వినిపించలేదు-వాక్యూమ్ డిస్టర్బ్ అయినప్పుడు గాలి వేగంతో జొరబడటానికి చేసే శబ్దం!
అప్పుడు చూశాడు వాక్యూమ్ గేజ్. నీడిల్ ఎప్పుడో జారిపోయింది. అతనిగుండె ఆగిపోయినంత పనయింది.
ఏమిటీ వింత? వాక్యూమ్ ఏమయింది? కనీసం నీడిల్ ఇండికేషన్ కూడా లేదు. అతను మరో రెండుసార్లు హాండిల్ నొక్కాడు. ఎలాంటి శబ్దమూ వినిపించటంలేదు. బండి వేగం ఏమాత్రం తగ్గినట్లుకూడా లేదు. త్వరగా డోర్ దగ్గరకొచ్చి బయటకు తొంగి చూశాడు. దూరంగా రెడ్ కలర్ లో ఉన్న సిగ్నల్ కనబడుతోంది. అప్పుడే మొదటిటర్నవుట్ ని దాటుతూండటంవల్ల అతని కోచ్ ఎగిరి కిందపడుతుందేమో అన్నట్లు జర్క్ ఇచ్చింది. తననుపైనున్న రాడ్ ని పట్టుకుని నిలబడకపోయినట్లయితే కోచ్ లో నుంచి విసిరిపారేయబడేవాడు.
అతనికి కొద్ది క్షణాలపాటు యేమీ అర్ధంకాలేదు.
ఏం జరిగినట్లు? వాక్యూమ్ సిస్టమ్ ఫెయిలయిందా? లేక డ్రయివర్ నిద్రపోయాడా? లేక ఇంకేదయినా జరిగిందా?
అక్కడే నిలబడి పరీక్షగా యింజన్ వేపే చూడసాగాడతను. కనీసం డ్రయివరయినా తనకుఏదన్నా సంకేతం ఇస్తే బావుంటుంది. అతనికి రైల్వేమీద కోపం రగిలిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఉపయోగపడతాయనే తను ప్రతి ఎక్స్ ప్రెస్ గార్డుకీ, డ్రయివర్ కీ వైర్ లెస్ సెట్స్ ఇవ్వడం మంచిదని రైల్వే బోర్డుకి సజెషన్ ఇచ్చాడు. కానీ తనలాంటి వాళ్ళ సజెషన్ లు యెవరు లెక్క చేస్తారు? అదీ రైల్వే సిబ్బంది సజెషన్ లు రైల్వే అసలు పట్టించుకాదు. విదేశాల్లో ప్రతిట్రెయిన్ కీ గార్డుకీ, డ్రయివర్ కీ మధ్య కమ్యూనికేషన్ వుంటుంది.
అక్కడ సంగతెలా వున్నా ఇండియాలోనే దాని అవసరం ఎక్కువ. ఎందుకంటే ప్రతిరోజూ యెన్నో చిన్నచిన్న యాక్సిడెంట్స్ అవుతూనే వుంటాయ్-ఎక్కడో చోట.
సాధారణంగా వాటిల్లో మెజారిటీ గూడ్స్ ట్రెయిన్స్ కి సంబంధించినవే! అయితే ప్రయాణీకుల ట్రెయిన్స్ కి యాక్సిడెంట్ జరగనంతకాలం వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఆ వార్తలు న్యూస్ పేపర్స్ కి కూడా ఇవ్వరు. నిజానికి డ్రయివర్ కీ, గార్డుకి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయగలిగితే ఇప్పుడు జరిగే ప్రమాదాల్లోకొన్ని తేలిగ్గా అరికట్టవచ్చు.
ఆ సజెషన్ గురించి రైల్వే పట్టించుకోకపోయేసరికి తను ఆ విషయం వివరంగా రాసి ఓ దినపత్రిక ఆఫీస్ కెళ్ళాడు-ప్రయాణీకుల దృష్ట్యా ఆ లెటర్ పబ్లిష్ చేయమని కోరుతూ.
"పాలిటిక్స్ పబ్లిక్ చేయడానికి ప్లేస్ చాలదని మేము ఛస్తుంటే మీ రైల్వే ప్రాబ్లమ్స్ ఎవడిక్కావాలండీ బాబూ! వెళ్ళండి, వెళ్ళండి" అంటూ విసుక్కున్నాడు సబ్-ఎడిటర్.
"చూడండి సార్! రైల్వే ఒక ఆఫీస్ కాద్సార్! రోజు లక్షలమంది ప్రయాణం చేసే సంస్థ! అంటే మీరూ, మీ భార్యా, మీ పిల్లలు, మీ బంధువులు అందరూ క్షేమంగా నడిచేందుకు రైల్వేలు గానీ, సిబ్బందిగానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏయే సందర్భాల్లో ప్రయాణీకుల ప్రాణాలకు ప్రమాదం కలిగేంత అజాగ్రత్తగా బళ్ళు నడుపుతున్నారు! ఏయే సందర్భాల్లో సేఫ్టీ నిబంధనలన్నీ పక్కకు నెట్టి ప్రమాదాలు జరిగేందుకు దోహదం చేస్తున్నారు-అనే విషయాలు మీ న్యూస్ పేపర్లు, జర్నలిస్ట్ లు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు?" అంటూ ఆవేశంగా లెక్చర్ ఇచ్చాడు తను.
తన గొడవ పడలేకతను రాసిచ్చిన కాగితం తీసుకున్నాడతను.
కానీ అది ప్రచురింపబడదని తనకు తెలుసు.
ప్రచురించలేదు కూడా!
ద్వారకానాధ్ చూస్తుండగానే ట్రెయిన్ విజయవాడ ఫ్లాట్ ఫారం మీదనుంచి వేగంగా వెళ్ళిపోసాగింది. జనమంతా నిశ్చేష్టులైచూస్తున్నారు. ఫ్లాట్ ఫారంనిండా రైల్వే అధికారులు-పోలీసులు-
అప్పుడర్ధమయిందతనికి.
వాక్యూమ్ ఫెయిలయింది.
ఇంక బండిని ఆ భగవంతుడే రక్షించాలి.
క్షణాల్లో కృష్ణాకెనాల్ వేపు పరుగెడుతూంటే అతనికి మతిపోయినట్లయింది. కోచ్ లో నుంచి తలబయటకు పెట్టి తన పక్కనే వున్న లేడీస్ కోచ్ వేపు చూశాడతను. చాలామంది తనవేపు చూస్తూ అరుస్తున్నారుగానీ ఏం అరుస్తున్నారో వినిపించడంలేదు.
"బ్రేక్స్ ఫెయిలయినయ్-బ్రేక్స్!" బిగ్గరగా అరిచాడతను-లేడీస్ కంపార్ట్ మెంట్ లో కూర్చున్న ఓ స్టేషన్ మాస్టర్ భార్యకు మాత్రమే అతని మాటలు అర్ధమయినాయి.
మిగతావారంతా ఇంకా బండి ఆపమని అరుస్తూనే వున్నారు.
* * *