"అంటే సాయంత్రం పార్టీయా?"
"అన్నీ ఉంటాయి. మీరు మాత్రం సిద్ధంగా ఉండండి! ఓకే?"
"సరే..." తలూపింది సీత.
"మరో విషయం చెప్పడం మర్చిపోయాను. బహుమానాలు చెల్లనేరవు" నవ్వుతూ అన్నాడతను. సీతక్కూడా నవ్వగాలేదు.
ఆ సాయంత్రం మాధవరావు ఆఫీసునుంచి వచ్చేసరికి సీత హడావుడిగా ముస్తాబవుతూ కనిపించింది.
"ఇవాళ ఎక్కడికి ప్రోగ్రామ్?" అడిగాడతను నవ్వుతూ.
"డిన్నర్ కి"
"అబ్బ! మినిష్టర్లకంటే కూడా నీకు ప్రోగ్రామ్ లు ఎక్కువయిపోయాయి..."
"అలా వెక్కిరించకపోతే మీరూ రాకూడదూ? మిమ్మల్ని రావద్దన్నదెవరూ?" కోపంగా అందామె.
"వద్దు బాబూ! నీతో చస్తే నేనే ప్రోగ్రామ్ కీ రాను..."
"ఎందుకని?" నవ్వాపుకొంటూ అడిగింది సీత.
"ఇవాళ నా బర్తుడే!" నన్ను సీత మొగుడు అంటూ సీత ఇంటికొస్తూనే. ఆమె మాధవరావు భార్య" అనే వారొకరు. "హ్యాపీ బర్తుడేకు చెడ్డ చిరాకు" ఆమెని దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను.
బయటకు కారు హారన్ వినిపించింది.
"ఈ జీవితం నీకు సంతృప్తికరంగా ఉందేమోగాని సీతా, నాకు మాత్రం ఏమీ నచ్చలేదు. మనం మళ్ళీ ఆ పాత ఇంట్లోకెళ్ళి, నువ్వు కథలు రాయడం మానేస్తే ఆ జీవితం ఎంత బావుంటుందో అనిపిస్తుంటుందప్పుడప్పుడూ..." నిరుత్సాహంగా అన్నాడతను.
"ఇంకా నయం! అసలు మన వివాహానికి పూర్వమున్న జీవితం తిరిగివస్తే బావుండునన్నారు కాదు" మరోసారి అద్దంలో చూసుకొని బ్యాగ్ తీసుకొని బయటకు నడవబోయిందామె.
"రాత్రి భోజనానికి రావు కదూ?" అడిగాడతను.
"ఊహు! వర్ధనరావుగారి పుట్టిన్రోజివాళ నేనే. ముఖ్యఅతిథినట" నవ్వుతూ బయటకు వచ్చేసిందామె.
కారు ఆమెను తీసుకెళ్ళి ఖరీదయిన ఓ హోటల్ ముందాగింది.
అంతకుముందు ఆ హోటల్ ముందునుంచీ వెళ్ళింది గాని లోపలకు మాత్రం వెళ్ళలేదు.
తనకోసమే ఎదుర్చూస్తున్నాడు వర్ధనరావక్కడ. అతని వేషం పూర్తిగా మారిపోయిందావేళ. లాల్చీ, పైజామా వేసుకున్నాడు. డ్రైవర్ ని పంపించివేసి తనే కారు నడపసాగాడతను. సీత ఫ్రంట్ సీట్లో అతనిపక్కనే కూర్చుంది.
"అలా కాసేపు సరదాగా తిరిగివద్దాం!" అన్నాడతను.
"మీ ఇష్టం" అంది సీత.
కారు నెమ్మదిగా పోతోంది టాంక్ బండ్ మీద నుంచి! చల్లనిగాలి విసిరికొడుతోంది. ఆహ్లాదంగా ఉందక్కడ వాతావరణం.
కబుర్లు చెప్పుకుంటూ ఆనందంలో తేలిపోతూ నడుస్తున్న యువతీ యువకులు. బెంచీలమీద కూర్చుని మైమరచి చుట్టూ ఉన్న లోకాన్నే మర్చిపోతున్న జంటలూ__
అంతటి ఆనందం తనెందుకు పొందలేకపోతోంది? మాధవరావు లోపమా అది? లేక తన లోపమా? తామిప్పుడు కొంచెం డబ్బున్న వారే కావచ్చు. అంతమాత్రాన ఇలాంటి సుఖాలు ఎందుకు దూరమవుతాయి. సుఖం అనేది మొదట్లో తామున్న లాంటి పెంకుటిళ్ళల్లోనే దొరుకుతుందా? "లేమి"లోనే అన్ని సుఖాలూ ఉన్నాయా? ఊహు! తను ఒప్పుకోలేదు. అదంతా డబ్బులేని వాళ్ళందరూ తమని తాము మభ్యపెట్టుకోడానికి వాడుకొనే మాటలు. అంతే వాటిల్లో అర్థంలేదు. ఆకలితో మాడుకుంటూ ఆనందా లెక్కడినుంచి వస్తాయి?
చీకటి!
కారు రోడ్డుమీద పాములా జారిపోతోంది కారు. నిర్మానుష్యంగా ఉందా రోడ్డు.
"ఎక్కడున్నాం మనం?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
"రామచంద్రాపురం రోడ్డిది" నవ్వుతూ అన్నాడు వర్ధనరావు.
చల్లనిగాలి మరింత ఎక్కువగా వీస్తోందక్కడ.
కారు నెమ్మదిగా రోడ్డుపక్కకు తీసి ఆపాడతను.
"మీరు కారెప్పుడు కొంటున్నారు?" అడిగాడతను సిగరెట్ వెలిగించుకుంటూ.
సీత గలగలా నవ్వేసింది.
"నవ్వుతారెందుకూ?"
"అవును మరి! ఒక్కసారిగా కారెప్పుడు కొంటారని అడిగితే నవ్వకేం చెయ్యాలి?"
"ఇందులో నవ్వేందుకేముందో"