రాధా చమేలీ మొఖం అవమానంతో ఎర్రబడింది. చటుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది గానీ మల్లిక అడ్డుపడింది.
"హలో - వన్ మినిట్! మిస్టర్ రాకేష్! నాకు క్రియేటివ్ హెడ్ పోస్ట్ అవసరం లేదు . నేనే వర్క్ అయినా చేస్తాను - ఆ మేడమ్ నే క్రియేటివ్ హెడ్ గా ఉండనీండి!"
"ఏంటి? తొక్కలో క్రియేటివ్ నెస్ - ఆ మేడమ్ క్రియేట్ చేసింది? తెలుగు, హిందీ సినిమాలని కాఫీ కొట్టి సీరియల్స్ తీయటం -- అమెరికా టీవీ చానెల్స్ ని కాఫీ కొట్టి రియాలిటీ షోస్ , గేమ్ షోస్ చేయటం - ఇదా క్రియేటివ్ హెడ్ లు చేసే పని! అసలా పోస్టే ఎబాలిష్ చేస్తున్నా! మనం చేసే చిల్లర ప్రోగ్రామ్స్ కి మళ్ళీ క్రియేషన్ ఒకటా! హలో - ఇవాళ్టి నుంచీ మన చానెల్లో ఎవడికీ డిజిగ్నేషన్ లుండవ్ - ఎవడు చేసే పని వాడు చేయటమే - ఇష్టమున్నోళ్ళు ఉండొచ్చు - లేనోళ్ళు పోవచ్చు --"
రాధా చమేలీ ఇంకా మండి పడింది.
"నాకీ బోడీ జాబ్ అవసరం లేదు" అనేసి వెళ్ళిపోయింది.
"ఇంకెవరైనా వెళ్తే త్వరగా వెళ్ళండి" అన్నాడు భవానీ.
ఎవ్వరూ మాట్లాడలేదు.
థాంక్ యూ బ్రదర్స్! ఇప్పుడు మన చానెల్ గురించి డిస్కస్ చేద్దాం-" అన్నాడతను.
***
మర్నాడు ఒక మారు మూల గ్రామంలో ఒక కొండ మీదున్న ఆంజనేయ స్వామి విగ్రహం పాలు తాగుతోందని బృందావనం చానెల్లో వచ్చిన వార్త ప్రజలందరిలోనూ ఆసక్తి కలిగించింది.
ఆ వింత చూడ్డానికి ఆ చుట్టూ పక్కలున్న జనం విరగబడిపోతున్నారన్న విషయం కూడా దృశ్యాలతో సహా చూపించింది చానెల్ -
ఆ విగ్రహం ప్రతి కార్తీక మాసంలో నెలరోజులు అలా పాలు తాగుతుందనీ, తర్వాత మానేవేస్తుందనీ ఆ పక్కనే మఠంలో నివాసముండే మఠయోగి బృందావనం చానెల్ తో చెప్పటం మరో అట్రాక్షన్ అయింది. మిగతా చానెల్స్ అన్నీ వాళ్ళ జర్నలిస్ట్ లను ఆ కొండకు పంపించడానికి 24 గంటల టైము పట్టింది. తీరా అన్ని చానెల్సూ ఆలస్యంగా ఆ వార్తా దృశ్యాలు టెలికాస్ట్ చేయటం మొదలు పెట్టేసరికి బృందావనం చానెల్ ఇంకో సెన్సేషనల్ న్యూస్ టెలికాస్ట్ చేయటం మొదలు పెట్టారు -
ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఆరేల్ల బాలిక తను అమ్మవారిననీ లోకకళ్యాణార్ధం అవతరించాననీ చెప్తోంది. చెప్పటమే కాకుండా గాల్లో నుంచి కుంకుమ తీసి స్త్రీలందరికీ ఇస్తోందట. నిజంగానే ఆ బాలిక గాల్లో నుంచి కుంకుమ తీసి భక్తురాలి నుదుట పెట్టటం బృందావనం చానెల్లో కనిపించేసరికి కొద్ది గంటల్లో ఆ బాలిక ఉంటున్న ఇల్లు పుణ్యతీర్ధంగా మారిపోయింది. కార్లల్లో, బస్సుల్లో స్త్రీలు విరగబడిపోయారు. బృందావనం చానెల్ హెడ్ స్వయంగా ఆ పాపతో న్యూస్ రూమ్ నుంచి సంభాషించాడు.
"పాపా! నీ పేరెంటమ్మా?" అడిగాడు భవానీ.
"నా పేరే తెలీదు రానీకు? మహంకాళిని రా!"
"క్షమించు తల్లీ! మా ప్రేక్షకుల కోసం ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది -"
"కాళీమాతా! నువ్వీ మానవావతారంలో ఎందుకు అవతరించావ్ తల్లీ!"
"ఈ భూమ్మీద స్త్రీల పట్ల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి రా! రుచిక', జెస్సికా , అయేషా, లాంటి అభాగినులకు జరిగిన అన్యాయం నాకు దుఃఖం కలిగించింది. అలాంటి అరాచకాలకు పాల్పడుతున్న దుర్మార్గులను మట్టు పెట్టడానికే అవతరించాను. అసలు హంతకులను చిత్రవధ చేయటమే నా ధ్యేయం-"
కళ్ళు మూసుకుని ఊగిపోతూ అంది ఆ బాలిక.
"మాకు చాలా ఆనందంగా ఉంది తల్లీ! అసలు హంతకులను పోలీసులు రక్షిస్తోన్న ఈ సమయంలో నువ్వే సరైనా న్యాయం చెయ్యగలవ్ తల్లీ- నమస్కారం తల్లీ! నీ చల్లని చూపే మాకు శ్రీరామరక్ష-"
వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులను ఇంటర్ వ్యూ చేశాడు భవానీ.
"పుట్టినప్పుడు మా పాప నవ్విందండీ! మాకు భయం వేసి జ్యోతిష్యులను పిలిపించాం! వాళ్ళు పాపను చూడగానే భక్తితో కాళ్ళకు మొక్కారు.
"మీరు పుణ్యదంపతులమ్మా! సాక్షాత్తూ ఆ కాళీమాతకే జన్మనిచ్చారు" అని మా కాళ్ళు కూడా కళ్ళ కద్దుకున్నారు. అయినా మేము వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. కానీ పెద్దదవుతున్న కొద్దీ పాప చిత్రవిచిత్రమయిన పనులు చేస్తుండే సరికి మాకు ఆమె కాళీ మాతా అవతారమే అని నమ్మకం కలిగింది - ' చెప్పింది ఆ బాలిక తల్లి.
"మీ పాప పేరెంటమ్మా?"
"ఆ జ్యోతిష్యుల కోరిక మేరకు 'చాముండి ' అని పెట్టాం -' చెప్పాడు తండ్రి.
"చాముండి ఎలాంటి విచిత్రాలు చేస్తోంది ?"
"రెండేళ్ళ వయసులో ఒకసారి బయట ఆడుకుంటున్న మా పాప దగ్గరకు ఒక నాగుపాము వచ్చింది. మా పాప ఆ పాముని పట్టుకునేసరికి ఆ పాము మా పాప మెడకు చుట్టుకుని కొద్దిసేపాగి వెళ్ళిపోయింది. అలాగే ఒకసారి మా ఇంటి దగ్గర్లో ఉన్న గుడిసెలు ఒక చిన్న పిల్లడు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు. అతఃని పరిస్టితి క్షీణించడంతో ఇంక బ్రతకడు ఇంటికి తీసుకెళ్ళి పొమ్మని డాక్టర్లు చెప్పారు. ఆ అబ్బాయి తల్లి దండ్రులు ఏడుస్తూ ఆ బాబుని తీసుకొచ్చి మా పాప ముందు పెడుకోబెట్టారు. మా పాప అతని నెత్తి మీద చేయి పెట్టింది. అంతే ఆ పిల్లాడు క్షణాల్లో లేచి తిరగటం మొదలు పెట్టాడు -"
వెంటనే భవానీ ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఆ పాప మహిమల గురించి అడుగుతుంటే వాళ్ళు ఆ పాపను అమ్మవారిగానే భావిస్తోన్న విషయం ఆ అమ్మ దయవల్ల ఎంతమంది వ్యాధులు బారి నుండి రక్షించబడిందీ , ఎంతమందికి కోరిన కోరికలు నేరవేరిందీ- అన్నీ చెప్పటం ప్రారంభించారు. ఆరోజంతా ఆ బాలిక వార్తలతోనే బృందావనం చానెల్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మిగతా చానెల్స్ కెమెరాలు తీసుకుని ఆ కొండ మీద కెళ్ళేసరికి ఒకరోజు ఆలస్యమయిపోయింది. దాంతో వాళ్ళంతా బృందావనం చానెల్ చూపించే దృశ్యాలనే కాపీ చేసి తమ చానెల్స్ లో టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టారు.
కానీ ఆ దృశ్యాలు ఏ చానెల్లో టెలికాస్ట్ చేసినా, వాటి మీద బృందావనం చానెల్ లోగో ఉండడంతో చానెల్ పేరు మార్మోగిపోసాగింది.
అదేరోజు సాయంత్రం కొబ్బరి చిప్పలు తీసుకుని జైరాజ్, అతని భార్య, రోజా చానెల్ కొచ్చారు.
"వెల్ కమ్ అంకుల్! తిరుపతి వెళ్లివచ్చారా?" అడిగాడు భవానీ.
"లేదు రాకేష్! చాముండిగా అవతరించిన ఆ కాళీమాతా దర్శనం చేసుకోచ్చాం -"
భవానీ ఉలిక్కిపడ్డాడు.
"వ్వాట్! చాముండి దగ్గరకా? చాముండి కాళీమాతని ఎవరు చెప్పారు మీకు ?"
రోజా ఆశ్చర్యపోయింది.
"అదేంటి! మన చానేలె గా ఆ కధ ప్రచారం చేస్తోంది? పైగా నువ్వే ఆ అమ్మాయితోనూ, వాళ్ళ తల్లిదండ్రులతోనూ ఇంటర్ వ్యూ కూడా చేశావ్?"