రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్ కొచ్చాడతను. అతనిని చూసేసరికి ఎక్కడలేని ఉత్సాహమూ కలిగింది... లోలోపల అతని కోసమే ఎదురుచూస్తోంది తనకు తెలీకుండా...
"కొంచెం మీ క్యాంటీన్ కాఫీ తాగిస్తారా?" అడిగాడతను నవ్వుతూ.
"ఓ..." అంటూ ఓసారి చుట్టూ చూసింది. అందరి కళ్ళూ తామిద్దరి వైపే...
ఓ విధమయిన గర్వంగా కూడా వుంటుంది అతను పక్కనుంటే.
ఇద్దరూ క్యాంటీన్ కెళ్ళారు.
తనే టోకెన్స్ తీసుకుంది. యిద్దరూ ఓ టేబుల్ దగ్గర కూర్చుని "టీ" తాగసాగారు.
"ఇవాళ మీలో ఏదో కొంచెం మార్పు కనబడుతోంది..." అన్నాడతను.
"ఏం మార్పు?"
"అదే తెలీటం లేదు__కానీ రోజూ కంటే మరీ అందంగా వున్నారు..."
సావిత్రి సిగ్గుపడింది.
చనువు తీసుకుంటున్నాడతను.
మిగతా వాటన్నిటికీ యిది నాంది.
శ్రీరామ్ కూడా ఆరోజు హోటల్లో యిలాగే.
ఆ తరువాత మరింత దగ్గరకు...
పర్సనల్ విషయాలు, పార్కులు, సినిమాలు...చివరకు ఆరోజు రానేవస్తుంది.
ఒకరికొకరు తమ మనసులు విప్పి చెప్పుకోవటం తరువాత__
అక్కడే తను భయపడేది!
శ్రీరామ్ వలన ఏర్పడిన భయం, సంకోచం ఎంత దారుణం! అంత డీప్ గా ఇన్వాల్వ్ అయి కూడా ఒక్క విషయంలో అంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాడతను?
తను ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతుంది.
అతనిది నిజంగా సిన్సియర్ ప్రేమేనా? అంత గాఢంగా తనను ప్రేమిస్తే...అంత త్వరగా, క్రూరంగా తనకు దూరమవుతాడా?
ప్రేమకు మెజర్ మెంట్ సెక్స్ ఎలా అవుతుంది?
నమ్మకానికి మెజర్ మెంట్ సెక్స్ ఎలా అవుతుంది.
ఇదెక్కడి క్వాలిఫికేషన్స్?
"మీకో విషయం చెప్పమంటారా?" అడిగాడు శంకర్.
"ఏమిటండీ అది?" వేగంగా కొట్టుకుంటోంది గుండె.
ఏం చెప్పబోతున్నాడతను...
"అదేనా? ఇంత త్వరగానా?"
"ఈ రెండు రోజుల్నించీ మీతో మాట్లాడకపోయేసరికి...ఏమిటోగా వుంది నాకు. నాకే ఆశ్చర్యంగా ఉంది అలాంటి ఫీలింగ్ రావటం. మిమ్మల్ని రోజూ చూస్తూనే వున్నాను. అయినా మీతో మాట్లాడాలని అనిపించటం..."
సావిత్రి మనసు గాలిలో తేలిపోతోంది...
అచ్చం తను అనుభవిస్తున్న పరిస్థితే అది.
"యిలా మాట్లాడుతున్నందుకు మీరేమీ అనుకోరు కదా?"
తల అడ్డంగా వూపిందామె.
ఆమె పెదాల మీద చిరునవ్వు చూశాక ధైర్యం కలిగిందతనికి.
"నిజం చెప్పాలంటే నాకు తెలీకుండానే నేను మీకోసం ఎదురుచూస్తున్నాను, వస్తే బాగుండునని"
అతని ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా తెలుస్తుంది...
"నిన్నే మీకోసం ఆఫీస్ కొద్దామనుకున్నాను. కానీ రోజూ వస్తే బాగుండదేమో అని_"
"ఆమాట నిజమే_అయినా మీరు ఇంటికెందుకు కావడం లేదు?"
"ఏమోనండీ_ఇంకోవ్యక్తి ముందు మీతో ఫ్రీగా మాట్లాడలేనేమో అనిపిస్తుంది"
"శాంత వచ్చేవారం వెళ్ళిపోతుంది మీకు చెప్పలేదు కదూ?"
"మీకు చాలా బాధగా వుంటుంది కొద్దిరోజులపాటు..."
"అప్పటి సంగతేమోగాని ఇప్పుడే ఏడుపొచ్చేస్తుంది తల్చుకుంటేనే__నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్, ఆఫీసులో నేను జాయినయిన రోజునుంచీ ఎంతో ప్రాణంగా వుంటున్నాం_"
"ఉద్యోగం మానేస్తున్నారా?"
"ఇంచుమించుగా మానేసినట్లే. లేకపోతే పెళ్ళి చేసుకుని ఉపయోగమేముంది? అతనక్కడ_శాంత ఇక్కడ ఎంతకాలం గడిచినా ఇది సమస్యే కదా!"
"అవును, లవ్ మ్యారేజ్ అన్నారు కదూ?"
"ఆ. ఊ!"
"లవ్ మ్యారేజ్ గురించి మీ అభిప్రాయమేమిటి?"
హఠాత్తుగా అతనాప్రశ్న అడిగేసరికి తృళ్ళిపడింది ఆమె. ఏం జవాబు చెప్పాలో తెలీలేదు.
"ఇటీజ్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ..." అన్నది నెమ్మదిగా.
"అవునండీ! ఈ వరకట్నాల ప్రాబ్లెమ్ కీ! ఆత్మహత్యలకూ, అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్! కాని దానివలన మరికొన్ని సమస్యలు తలెత్తుతాయేమో"