Previous Page Next Page 
తదనంతరం పేజి 34


    ఒక్కసారిగా ఉలికిపడి, నిలువునా వణికాడు.


    "చూడండీ. ఈ పిచ్చి సమాజంలో అందరూ పవిత్రంగా బ్రతుకుతున్నారనుకోవటం, పవిత్రతకు అతీతమైన విలువనివ్వటం ఓ వెర్రి భ్రమ. మీరు నన్ను పెళ్ళిచేసుకునే ముందు నేనెవరో. నా జీవితమేమిటో, నా చరిత్ర ఏమిటో మీకు తెలీదు. అయినా పవిత్రురాలినని సరిపెట్టుకుంటూ మీరు బ్రతికేస్తున్నారు. అసలు నిశితంగా చూస్తే జీవితమంతా ఈ సరిపెట్టుకోవటంలోనే, రాజీపడటంలోనే ఉంది. పట్టించుకుంటే అన్నీ తప్పులుగా, నేరాలుగా తోస్తాయి. మనసులోంచి కొన్ని పాతుకుపోయిన ఉపద్రవాలు బయటకు తోసేస్తే ప్రపంచమే కొత్తరకంగా కనబడుతుంది. ఎప్పుడో ఎక్కడో చదివాడు. ఒక స్త్రీకి నువ్వు మొదటి పురుషుడు కాదు, ఆఖరివాడివీ కాదని. ఈ సత్యం కఠోరంగా ఉన్నదనిపిస్తే_శారీరకంగా కాకపోయినా మానసికంగా అనుకుందాం. ఇంకో చిత్రం చూశారా? క్యారెక్టర్ అంటే శీలం ఒకటి కాదు. ప్రవర్తనకు సంబంధించిన అనేక అంశాలుంటాయి. ఒక స్త్రీ పరమ నీచురాలుగా, అమిత గయ్యాళిదయినా అణువణువునా అహంకారం, విషపు ఆలోచనల్లో మునిగి తేలుతున్నా, స్వార్థంతో నిండిపోయివున్నా ఆ ఒక్క విషయంలోమాత్రం చెడిపోకుండా వుంటే, అలాంటి లోపం వున్న తోటి ఆడదానికన్నా_అవతలి వ్యక్తిలో ఎన్ని యితర సుగుణాలున్నా వుండనీ కానీ, ఆ ఒక్క లోపాన్నే పెనుభూతంగా సృష్టిస్తూ తనలో గొప్ప సుపీరియారిటీ క్లయివు చేస్తూ వుంటుంది. ఏ వ్యక్తికూడా ప్రక్కవాడి పరిస్థితినర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు. ఇతరుల్ని కాల్చుకు తినడమే జీవిత పరమావధిగా కనిపిస్తుంది. ఇలాంటి వికృత మనస్తత్వమున్న ప్రపంచంలో జీవిస్తున్నందుకు ఒక్కొక్కసారి వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. కాని, చాలా వున్నతంగా ముందుకు సాగిపోతూందనుకుంటున్న యీ నాగరికతే... ప్రాచీన అనాగరికత కన్నా భయంకరమైనది"


    సుదర్శనం ఆశ్చర్యంగా, మౌన్మగా వింటున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా తనకు ఏ సందర్భంలో కూడా ఎదురుచెప్పకుండా, ఎప్పుడో తప్ప మనసులో వున్న లోతుల్ని బయటకు వ్యక్తం చేయని అరుంధతి యీనాడు మహోన్నతమైన హిమాలయంలా గోచరించింది. ఆమెనుచూస్తే గర్వమనిపించింది. ఆమె అంటే భయంవేసింది.


    "అరూ" అన్నాడు నెమ్మదిగా.


    ఆమె నుంచి ఏ జవాబు లేదు.


    తలెత్తి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. బెడ్ లైట్ వెల్తుర్లో...ఆమె కళ్ళవెంట కారుతోన్న నీటి బిందువులు అస్పష్టంగా కనిపించాయి.


    ఆ నిశ్శబ్ద దుఃఖంలో ఎంతటి జ్వాలాయుత వేదన మిళితమై వుందో అర్థం చేసుకున్నాడు.


    ఆమెను డిస్టర్బ్ చెయ్యటం యిష్టంలేక భారమైన గుండెతో, నిస్సహాయంగా ప్రక్కకి వాలి పడుకున్నాడు.


                                                                         8


    పొద్దుట ఏడు గంటలకి రాజశేఖర్ నిద్రలేచాడు. అతను రోజూ రాత్రి పదకొండు దాటితేగాని యింటికిరాడు. స్నేహితుల్తో గడిపి, అక్కడా ఇక్కడా తిరిగి అందరూ నిద్రపోయేవేళకు ఇంటికి చేరుకుంటాడు. అప్పటికి భార్య సీతాదేవి గాఢనిద్రలో మునిగి ఉంటుంది. ఆమె పది దాటితే నిద్ర మేలుకుని వుండలేదు. ఆ సంగతి అతనికి తెలుసు. అందుకని కావాలని ఆలస్యంగా వస్తాడు ఎందుకంటే మనిషి కనిపిస్తే ఆమె ఏదో ఒకటి అంటుంది. ఒక్క నిముషం కన్నా ఆమె ఎవరితోనూ స్వాభావికంగా వుండలేదు. ఆమెకు జీవితంలో ప్రియాతి ప్రియమైనవి రెండు ఎప్పుడూ ఎవరోఒకర్ని సాధిస్తూ ఉండటం, నిద్రపోవటం.


    రాజశేఖర్ నిద్రలేచి టూత్ పేస్ట్ కోసం వెతుక్కుంటున్నాడు. అది ఎప్పుడూ వుండవల్సిన స్థానంలో వుండదు. మొదటిగా దాన్ని వాడుకున్నవారు ఎక్కడ వీలయితే అక్కడ వదిలేసి, యిహదాన్ని గురించి మరిచిపోతూ ఉంటారు.


    "ఏమిటి వెతుక్కుంటున్నారు?" అని పిలిచింది వెనక నుండి సీతాదేవి గొంతు.

 Previous Page Next Page