మంచి మూడ్ లో వుండి రచన చేస్తోన్నప్పుడు హాస్పటల్ నుంచి ఫోన్ వస్తుంది ఏ కేసో సీరియస్ గా వున్నట్లు. ఆ కేసు ఎటెండయి రావడంతో సాహిత్య వ్యాసంగంకోసం కేటాయించుకొన్న టైము కాస్తా పూర్తయి పోతుంది. మళ్ళీ కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పటల్ కి పరిగెత్తుకు పోవాలి.
ఒక ప్రక్కనుంచి రాబోయే సంచికకు మేటర్ పంపించే టైమయిపోతోంది. పత్రికాధిపతులు ఫోన్ మీద ఫోన్ చేస్తూ వుంటారు. ప్రతి నిమిషానికి ఎంతో విలువనిచ్చి, అత్యంత పొదుపుగా వాడుకుంటూ, తెల్లవారుఝామున నాలుగున్నరనుంచి రాత్రి పన్నెండుగంటలదాకా నిర్విరామంగా పనిచేస్తున్నా టైము సరిపోక ఆమె సతమతమైపోతూ ఉండేది.
సంకేతినికి ముప్పయి అయిదేళ్ళుంటాయి. అందంగా, ఆకర్షణీయంగా హుందాగా వుండే పర్సనాలిటీ. ఆమెను చూడగానే ఎవరికైనా ఇంకోసారి చూడాలనిపిస్తోంది. ఎవరయినా ఆమె అంటే ఇష్టపడతారు.
డాక్టర్ సంకేతిని అవివాహిత. ఆమె ఎమ్.బి.బి.ఎస్. చదివేరోజుల్లో ప్రద్యుమ్న అనే తోటి స్టూడెంట్ ను గాఢంగా ప్రేమించిందనీ, ఇద్దరిమధ్యా ప్రేమగాథ గాఢంగా సాగి పరిణయందాకా వచ్చిందనీ, చివరి నిమిషంలో ప్రద్యుమ్న ఏవో కారణాల వల్ల పెళ్ళి కాన్సిల్ చేసుకుని ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడనీ వాళ్ళని గురించి తెలిసినవాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత ఆమె పెళ్ళి చేసుకోకుండా వుండిపోయి ఎం.బి.బి.ఎస్. అయాక ఎం.డి. పెడియాట్రిక్స్ చదివి ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రద్యుమ్న ఎం.బి.బి.ఎస్. అయ్యాక ఎం.ఎస్. ఆన్ థల్ మాలజీ చేశాడనీ విన్నదిగాని, ఆ తర్వాత ఎక్కడున్నదీ తెలియలేదు.
సంకేతిని జీవితాన్ని ప్రేమిస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తుంది. మనసులో ఎలాంటి అల్లకల్లోలాలు చెలరేగుతున్నా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎవర్నయినా చిరునవ్వుతో పలకరిస్తుంది.
* * *
ఎప్పటిలా సంకేతిని తెల్లవారుఝామున నాలుగున్నరకల్లా లేచింది. లేవగానే మొహం కడుక్కుని టీ కలుపుకుని త్రాగటము అలవాటు. తర్వాత రచనా కార్యక్రమం ప్రారంభిస్తుంది.
లేచి బెడ్ లైట్ వెలుగులో స్విచ్ బోర్డు దాకా నడిచి బోర్డు మీద వరసగా వున్న స్విచ్ లలో ట్యూబ్ లైట్ స్విచ్ మీద వ్రేలు పెట్టబోతే ఎందుకో తడుముకున్నట్లయింది. ఒక స్విచ్ వెయ్యబోయి ఇంకొక స్విచ్ నొక్కింది. బెడ్ లైట్ కూడా ఆరిపోయి గదంతా గాఢాంధకారం అలుముకుంది. ఎందుకిలా జరిగింది? తన చూపులో ఏదయినా దోషమొచ్చిందా? చీకట్లోనే ఒకటి రెండు నిమిషాలు అలాగే నిలబడి గబగబ ఆలోచిస్తూ మధ్య జరిగిన సంఘటనలు గబగబ జ్ఞాపకం చేసుకుంటోంది.
తన కళ్ళకి ఇదివరకు తళతళ మెరుస్తూన్నట్టు కనిపించే మొజాయిక్ ఫ్లోరింగ్ మాసిపోయినట్లు, వెలసిపోయినట్లు కనబడుతోంది. నేల తడిగుడ్డతో సరిగ్గా తుడవటంలేదని పనిమనిషిని కేకలేసి సర్ఫ్ తో శుభ్రంగా కడిగించింది. అయినా నేలంతా వెలవెలబోతున్నట్లు కనిపించింది. ఆమెకి కోపమొచ్చింది. 'మీరు ఇల్లు సరిగ్గా కడగటంలేదు" అని అరిచింది గట్టిగా. "అదేమిటమ్మ గారూ! ఇల్లంతా తళతళ మెరిసిపోతూంటే అలా అంటారు? నా పని మీకు నచ్చకపోతే చెప్పండి మానేస్తాను" అన్నది పనిమనిషి నిష్ఠూరంగా.
తాను అనవసరంగా తొందరపడ్డానేమోనని బాధపడి ఊరుకుంది సంకేతిని.
ఓసారి రాత్రివేళ పేషంటును చూసి కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తిరిగివస్తోంది. ఎదురుగా ఓ కారు వస్తోంది. తాను డిమ్ లోనే వస్తోంది. ఎదురుగా వచ్చేవాడు డిమ్ చేసుకోకుండా బ్రైట్ లోనే వస్తున్నాడు. కళ్ళలోకి కాంతికిరణాలు చొచ్చుకు వచ్చి ఎదురంతా అంధకార బందురమైపోయినట్లు కనిపించింది. దారి ఏమీ కనబడటంలేదు. ఒక్క అడుగుకూడా కారు ముందుకు డ్రైవ్ చెయ్యలేక బ్రేక్ వేసుకోవాల్సి వచ్చింది.
"యూస్ లెస్ ఫెలో. బ్రైట్ లో వెళ్ళకపోతే డిమ్ లోపెడితే ఏమయింది? అంత రోడ్ సెన్స్ లేకుండా..." అనుకుంటూ బ్రేక్ మీద కాలువేసి యాక్సిలేటర్ నొక్కింది.
అప్పుడు గుర్తొచ్చింది. అంతకుముందు ఎదుటి కారు వాళ్ళు బ్రైట్ లైట్సుతో వచ్చినా కళ్ళకి కొంత ఇబ్బంది కలిగి, స్లో చేసుకోవాల్సి వచ్చేది. ఆరుబయటంతా అంధకారబంధురమైపోయి. బ్రేక్ వేసుకోవలసి వచ్చేదికాదు. ఇప్పుడలాకాదు. ఏదో తేడావుంది. తెలియటల్లేదు.
అలాగే ఇంట్లో కూర్చుని టి.వి. చూస్తున్నప్పుడు టి.వి.స్క్రీన్ మీద బొమ్మలు మసగ్గా కనిపించసాగాయి. అంతేకాదు. టి.వి.ఆన్ లో వున్నప్పుడు వెలిగే రెడ్ లైటు కనబడటం లేదు. అంతకు కొన్ని రోజుల క్రితం వరకూ రెడ్ లైటు స్పష్టంగా కనబడుతూ వుండేది.
తన కళ్ళకేదో జరుగుతోంది. వార్ధక్యపు చిహ్నాలు ప్రవేశిస్తున్నాయా? డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చూసుకుంటే అలాంటి లక్షణాలేమీ కనబళ్ళేదు. వార్ధక్యం! దాన్ని గురించి ఆలోచించడానికే తన మనస్సంగీకరించడం లేదు. తన మనస్సు, శరీరం ఇంకా చలాకీగా, యవ్వన ఉల్లాసంతో పొంగిపోతున్నట్లే అనిపిస్తూంది.
అలాగే చేతిలో పుస్తకం పట్టుకొని చదవటానికి ప్రయత్నిస్తే అక్షరాలూ అలికేసినట్లు మసకమసగ్గా వున్నట్లు తెల్లగా-అచ్చు సరిగ్గాపడకపోతే వున్నట్లు కనిపించాయి. రాయబోతే అదే సమస్య ఎదురయింది. తానెప్పుడూ బ్లూ యింక్ తో రాయటమలవాటు. అక్షరాలూ నీలిరంగుతో ప్రకాశించకుండా తెల్లగా వెలవెలా పోతున్నట్లు, పెన్ లో ఇంక్ అయిపోతే, సిరా మంచిది కాకపోతే రాయబడినట్లు గోచరించేది. తన వ్రాత తనకే కనిపించేదికాదు.
ఐ స్పెషలిస్టు దగ్గరకు వెళ్ళాలి. కాని హాస్పిటల్ పనివల్లా, నవలా కార్యక్రమంవల్లా ఊపిరిసలపక కుదరటంలేదు. అంతేకాక సంకేతినికి తన రొటీన్ వర్క్ కు అదనంగా, భిన్నంగా ఏమి చెయ్యాలన్నా తగని చిరాకు. అది ఎంత చిన్నపని అయినాసరే ప్రళయం ముంచుకొచ్చినంత బీభత్సంగా ఫీలయ్యేది. కళ్ళడాక్టర్ల దగ్గరకు వెళితే కంట్లో డ్రాప్స్ వేసి కూచోబెడతారు. మధ్యలో వచ్చి టార్చిలైటు వేసి చూసి ఇంకా డై లేటు కాలేదని మళ్ళీ డ్రాప్స్ వేసి దూది ఇచ్చి అద్దుకుంటూ కళ్ళు మూసుకుని కూచోమంటారు.
అలా కళ్ళు మూసుకుని కూచునే కార్యక్రమం ఒక్కోసారి డాక్టర్ బిజీగా వుండటాన్ని బట్టి ఒకటి రెండు గంటలదాకా కొనసాగుతుంది. మిగతా డాక్టర్ల దగ్గర పేషెంట్లలాగా ఇక్కడ మాకు టైమయిపోతుందని, తొందరగా చూడమనటానికి అవకాశంలేదు. ఎందుకంటే ప్యూపుల్స్ డైలేట్ కాలేదు అంతే. అసలు పేషెంట్సు గంటల తరబడి కళ్ళు మూసుకొని, నోరుకూడా మూసుకుని కూచోటానికే ఈ డ్రాప్స్ కనిపెట్టారా అనిపిస్తుంది.