శేఖర్ ని మంచంమీదకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి "ఇప్పుడే వస్తానయ్యగారూ!" అంటూ వెళ్ళిపోయాడు గోపయ్య.
మరో అయిదునిముషాలకు మాలతి చేతిలో పాలగ్లాసుతో, టాబ్లెట్టుతో గదిలోకి వచ్చింది.
ఆమె చేతి గలగల అతనికి వినిపించి "ఎవరూ? దుర్గా! ఏంకావాలి?" అని అడిగాడు.
ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. అతనికి పాలు ఇవ్వాలి. తను మాట్లాడకూడదు. ఏం చెయ్యాలో తెలియక సందిగ్ధావస్ధలో పడింది.
"దుర్గా! మాట్లాడవేం? ఓ! నీకు మాటలురావు కదూ? విథి మన ఇద్దర్నీ విచిత్రంగా ఒక దగ్గరకు చేర్చింది. నాకు చూపులేదు, నీకు మాటలేదు. గోపయ్య నా బాధ్యత నీకప్పజెప్పాడు. తమాషాగా వుందికదూ? నాకు తెలుసు నువ్వు దేనికొచ్చావో! గోపయ్య ఏ పాలో హార్లిక్సో పంపించి వుంటాడు. మీ అందరకూ కావాల్సింది నేనన్ని త్రాగటమూ, తినటమేగా? ఇలా ఇయ్యి" చెయ్యిజాపి తడుముకుంటూ పాలగ్లాసు పట్టుకోబోయాడు.
మాలతి "ఉహుఁ" అంటూ గ్లాసు వెనక్కి లాక్కుంది.
"ఏమిటి? ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు? అర్ధమైంది. పాలతోబాటు నాకు మందుబిళ్ళలుకూడా తీసుకొచ్చావు. ఆ బిళ్ళ మ్రింగి ఈ పాలు త్రాగాలి. కానీ..." మళ్ళీ అతని ధోరణి మారింది. "నేను మ్రింగను. అసలు నాకు పాలూ, బిళ్ళలూ ఏమీవద్దు. వీటిని ఇక్కడ్నుంచి తీసుకుపో....గోపయ్యా!...."
ఏమిటో అనుకుని గోపయ్య లోపలకు పరిగెత్తుకువచ్చాడు. మాలతి అతన్ని సౌంజ్ఞతో వారించి తిరిగి పంపించేసింది.
"రాడు, ఇంకెందుకు వస్తాడు? ఈవిడగార్ని నాకంటగట్టి తాను తప్పించుకుపోయాడు....వెళ్ళవా? ఇంకా నిలబడే వున్నావా?...."
ఆమె వున్నదో లేదో తెలుసుకునేందుకు చేతికర్ర గాలిలో కదిలించాడు. అది ఠక్కుమని ఆమె తలకి కొట్టుకుంది.
మాలతి బాధతో కేక వెయ్యబోయి, ఓర్చుకుని మెదలకుండా అలాగే నిలబడింది.
అతనికి చాలా సిగ్గుకలిగింది. "దుర్గా! నీకు దెబ్బతగిలిందా?" అని చేతిని ముందుకుచాచి తడుముకుంటూ ఆమెతలని స్పృశించాడు.
"ఎవరివో, ఎక్కడిదానివో....ఈ నిర్భాగ్యుడికోసం నీకెందుకీ అవస్థ? నిన్ను చూస్తే జాలేస్తోంది" అంటూ ఆమె తల నిమిరాడు.
"దుర్గా! మూగదానివైనా నీలో ఏదో శక్తి వుందనిపిస్తుందేమిటి?"
చెయ్యి తీసేసి "నువ్వు నాకంటే మొండిదానిలా వున్నావే? సరే ఇలా ఇవ్వు."
టాబ్లెట్ అందుకుని గబుక్కున మ్రింగేసి, గ్లాసు తీసుకుని గబగబ త్రాగేశాడు.
"తృప్తిగా వుందా? ఇహ వెళ్ళు!"
మాలతి నవ్వు మొహంతో కదలబోయింది.
"చూడూ!.....ఎన్నో రోజులు....కనీసం కొన్ని రోజులయినా మనమిక్కడ కలిసి గడపాల్సి వుంటుంది. నీ సౌంజ్ఞలు నాకు కనిపించవు. నీ భావాలు నేను చూడలేను. నిన్నేమన్నా అడగాలన్నా , నీ దగ్గర్నుంచి సమాధానం కావాలన్నా ప్రశ్న - జవాబు రెండూ నేనే చెబుతూ వుంటాను" అంటూ శేఖర్ తన కుడిచేతిని తన రెండు వ్రేళ్ళు ముందుకు జాచాడు. "అవునంటే చూపుడువ్రేలూ, కాదంటే మధ్యవ్రేలూ పట్టుకోవాలి నువ్వు. అంటే ఎలాగో చెబుతాను. నాతో ఇవేళ మందు త్రాగించినందుకు నీకు చాలా గర్వంగా వుంది అవునా?" అంటూ వ్రేళ్ళు రెండూ ఆమెముందుకు ఉంచాడు. మాలతి సిగ్గుపడుతూ చూపుడువ్రేలు మృదువుగా పట్టుకుని వదిలేసింది. "అది నాకు తెలుసు."
"చూడూ! మళ్ళీ ఇన్నాళ్లకి నాకేదో కొత్తగా వుందీవేళ. నీకు మాటలు రాకపోయినా నాకు నచ్చావు. నిన్ను చూడకపోయినా నువ్వు నా వెంటవుంటే బాగుండుననిపిస్తోంది. బహుశా ఈ దాగుడుమూతలు, ఇందులో చిలిపితనం నేనిష్టపడుతున్నానేమో! నిజం, నాకిదే బాగుంది. నాకు కళ్ళు లేకపోయినా, నువ్వు నన్ను మోసం చెయ్యవన్న ధైర్యం ఏర్పడుతోంది. మనుషుల మంచితనం మీద నమ్మకం ఏర్పడుతోంది. నాకెందుకో ఓదార్పు దొరుకుతోంది..."
ఆవేశం వచ్చింది. గుండెలో కొద్దిగా నొప్పి మొదలై క్రమంగా అబ్బా! అంటూ గుండెదగ్గర చేత్తో నొక్కుకుంటూంటే వగర్పుకూడా వస్తోంది. మాలతి గ్లాసు క్రిందపెట్టి ముందుకెళ్ళి అతన్ని పోదివిపట్టుకుని ఛాతిమీద రాయసాగింది. గుండెమీద అతనిచేతి ప్రక్కగా ఆమె చెయ్యి కదులుతుంది. కాసేపట్లో అతనికి నొప్పి తగ్గినట్లనిపించింది. కానీ అనేకమయిన అనుభూతుల సమ్మేళనంతో అలసటగా, నీరసంగా వుంది. మాలతి అతనిస్థితి గ్రహించి మెల్లగా ప్రక్కమీద పడుకోబెట్టింది.
16
రోజులు గడిచినకొద్దీ శేఖర్ మీద దుర్గ ప్రభావం కాస్త ప్రసరించి, అతని జీవితాన్ని తిరిగి ప్రభావితం చెయ్యసాగింది.
మనసులోని మసి మెల్లగా చెరిగి వెలుతురు రవ్వంత చోటు చేసుకుంటున్నది.
ప్రొద్దుటే లేచినదగ్గర్నుంచీ "దుర్గా, "దుర్గా" అని కలవరిస్తాడు. దుర్గ కాఫీ ఇవ్వాలి. దుర్గా అతనికి అన్ని వస్తువులూ అందివ్వాలి. దుర్గ అతని ప్రక్కన తిరుగుతూ వుండాలి.
ఓ రాత్రి అతని ప్రక్కసర్ది మంచంమీద పడుకోబెట్టి అవతలకు వెళ్లిపోతుంటే ఆమెచెయ్యి అతని చేతిలో ఇరుక్కుపోయినట్లయింది.
అతనిచేతి పులకింత ఆమెకు తెలుస్తుంది. మెదలకుండా నిలబడింది.
"దుర్గా! ప్రపంచంలో ఒకర్నిమించిన దేవతలు మరొకరు అలా వుంటారని తెలుసుకున్నాను."
అతని వ్రేళ్ళు ఆమె చేతిని క్రమంగా సవరిస్తున్నాయి.
"నువ్వు నాకు కావాలనిపిస్తోంది. ఈ వంటరితనం భరించలేకుండా వున్నాను" అని చెబుదామనుకున్నాడు.
ఆమెను తన బాహుబంధంలో ఇరికించుకుని, తనలో ఇమిడిపోయేటట్లు చేయాలనుకున్నాడు.
ఆమెను తను అన్నివిధాలా కోరుకున్నాడు. కానీ బయటకు వ్యక్తం చేయలేకపోయాడు.
ఆమె మృదువుగా విడిపించుకుని, అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
* * *