Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 35


    సంభాషణ జుగుప్సగా వుంది. అయినా వినకుండా వుండలేకపోయింది సశ్య.

 

    "ఆ తర్వాత నీ బ్రెస్ట్ బిగువుగా వుండడానికి చేయాల్సిన ఎక్సర్ సైజుతో పాటు ఓ మందూ సజెస్ట్ చేశాను"

 

    "మందూ అంటే మళ్లీ ఆయుర్వేదమా?"

 

    "అంత తేలిగ్గా తీసిపారేయకు. నేను చెప్పేది ఫాలో అయితే ఎంత వయసొచ్చినా నాలాగా దిట్టంగా వుంటావు."

 

    "సో........ ఏం వాడాలి?"

 

    "వ్వాట్" ఆశ్చర్యపోయింది మార్గరేట్.

 

    "నీకు తెలీదు మిస్ మిర్గీ! వెల్లుల్లి అమృతంతో సమానం అన్నారు ఒకనాటి మా ఆయుర్వేద పండితులైన శుశుత్రుడు, కాశ్యపుడు ఇద్దరూను. అశలు అమృతంతో సమానమైందన్నమాట ఎలా వచ్చిందని అడగవేం?"

 

    "చెప్పు"

 

    "ఇందాక చెప్పానే ఇంద్రుడి భార్య శచీదేవని. ఆవిడ చాలాకాలం పాటు ప్రెగ్నెంట్ కాలేదు.

 

    దాంతో ఇంద్రుడు ఆమెకి అమృతం తాగించబోయాడు. శచీదేవి చాలా సుకుమారి  కావడంతో అమృతం కొద్దిగా తాగేసరికి కళ్లు కిరిగి తూలి పడిపోయింది.

 

    అలా కొద్దిగా తాగినందుకే ఆమె తల్లిగా మారి చాలామందికి జన్మనిచ్చిందటగానీ, ఆమె తూలి పడినప్పుడు నేలమీద ఒలికిన అమృతం ఆనక గొప్ప రసాయనంగా పెరిగిందట. అదే వెల్లుల్లి."

 

    ఫకాల్న నవ్వింది మార్గరేట్.


 
    "ఇవన్నీ నీకెలా తెలుస్తుంటాయ్?"

 

    "నీ లాంటి అందమైన ఆడదానితో లింకు పెట్టుకున్నప్పుడు జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలిగా."

 

    క్షణం ఆగిన ఆ వ్యక్తి ఇప్పుడు అసలు పాయింట్ కి వచ్చాడు.

 

    "అంచేత నువ్వు అర్జంట్ గా రోజూ వెల్లుల్లి వాడితే నీ బ్రెస్ట్ పటుత్వంగా వుంటుంది.

 

    సెక్స్ లో అలసట వుండదు. నడుము, పొట్లల్లో లేడీస్ ఫేట్ పెరగదు.


 
    రిజువనేటర్ గా ఆరోగ్యాన్ని కాపాడి నీ గ్లామర్ ని పెంచుతుంది. నువ్వు ఇబ్బంది లేదనుకుంటే అర్జంటుగా సంతానప్రాప్తికి అది కారణం అవుతుంది చెప్పు నువ్వు రెడీనా?"

 

    అతడు రెడీనా అని అన్నది సంతానానికో, లేక వెల్లుల్లి వాడకానికో అర్దం కాని సశ్య  ఇక నిభాయించుకోలేనట్టు కార్డ్ లెస్ బటన్ ఆఫ్ చేసి -

 

    "అంతే!" అంది కోపంగా.

 

    ఉలికిపడిన మార్గరేట్ ఫోన్ క్రెడిల్ చేస్తూ -

 

    "నువ్వొచ్చి ఎంత సేపయింది?" అంది తత్తరపాటుగా.

 

    "ఎవరతను?"

 

    ఇలా అడగడం ఇబ్బందిగా వుంది.

 

    ఎంబర్రాసింగ్ గానూ అనిపిస్తూంది.

 

    కానీ  ప్రేమించే వయసులో వున్న తను ఒక పక్క రుత్వి పరీక్షలో విఫలమవుతుంటే ఎప్పుడో భర్తకి విడాకులు ఇచ్చిన మార్గరేట్ ఇప్పుడు శృంగారం గురించి ఫోన్లో మరెవరితోనో రెచ్చిపోయి మాట్లాడటం నచ్చలేదు.

 

    "నేను నిన్నే అడుగుతున్నాను ఆంటీ" రెట్టించింది సశ్య.

 

    "ఏమిటదోలా వున్నావ్?"

 

    పసిపిల్లలా కనిపిస్తున్న సశ్యని తల్లిలా సమీపించిన మార్గరేట్ కేజువల్ గా అడిగింది.

 

    "ఏం జరిగింది? ఎవరితోనైనా గొడవపడ్డావా?"

 

    అవును...పడింది.

 

    దాన్ని గొడవనాలో లేక యుద్దమనాలో ఆమెకే తెలీదు.

 

    కానీ రుత్విని సాధించుకోవడమనే ఓ జీవిత లక్ష్యానికి బలంగా విఘాతం ఏర్పడిపోయింది.

 

    రసరమ్యం కావాల్సిన జీవితంలో మరో ఆడపిల్ల నీడ మాటున పీడ కలలా మారి నిర్వీర్యమై తనని వూరట నుంచి దూరాల దారాల చిక్కుల్లోకి నెట్టి ఏ ఆశల వెచ్చని పాన్పుపై నుంచో నేలపైకి తోస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

    ఆ క్రోదంలో, ఆక్రోశంలో అడిగింది మరోసారి-

 

    "ఎవరతను?"

 

    మార్గరేట్ ఆందోళనగా చూసింది.

 

    సశ్య ఇలా ప్రవర్తించడం  తొలిసారి.

 

    ఏదో చెప్పలేక మరేదో అడుగుతున్నట్లుగా వుంది.

 

    "నా భర్త"

 

    గొణిగింది మార్గరేట్.

 

    "హోమియోపతి డాక్టరన్నావ్. ఆయుర్వేదం గురించి ఎలా మాట్లాడుతున్నాడు?

 

    అయినా విడాకులు తీసుకున్నాక అసలిదంతా" అసహనంగా తల పట్టుక్కూర్చుంది సశ్య ఓ సోఫాలో.

 

    మార్గరేట్ మవునంగా వుండిపోయింది తప్ప తను అంతసేపూ మాట్లాడింది గౌరీనాధం అనే ఓ వృద్దుడితో అని చెప్పలేదు.

 

    ఆ గౌరీనాధం విజూష తాతయ్యని మార్గరేట్ కి తెలీదు.


                                                    *    *    *    *

    
    సరిగ్గా ఒంటిగంట కావస్తుండగా...

 

    ఫోన్ రింగయింది.

 

    పది నిముషాలుగా దానికోసమే ఎదురు చూస్తున్న విజూష ఒక్క ఉదుటున రిసీవర్ అందుకుంది.

 

    అవతలి వేపునున్న ఘోస్ట్ రైటర్ తోమాట్లాడాలనుకుందిగానీ అప్పటికే పేరలర్ ఫోన్ లో తాతయ్య గొంతు వినిపించింది.

 

    "హలో నేనే."

 

    "నేను రుత్విని మాట్లాడుతున్నాను."

 

    పక్కలో బాంబు పడ్డట్టయింది విజూషకి.

 

    తాతయ్యకి రుత్వి ముందే పరిచయమా?

 

    "చెప్పండి ఫోన్ చేయమన్నారట" రుత్వి అడుగుతుంటే అలా వినడం సభ్యతకాదనిపించినా.... రిసీవర్ క్రెడిల్ చేయలేకపోయింది విజూష.

 Previous Page Next Page