"అదేంటండి. ఒంట్లో బాగుండలేదా?"
"బాగున్నా లేవడండీ. లేస్తే నాకు డబ్బులివ్వాలిగా. అందుకే రెండు మూడు రోజులుగా అలా నిద్రపోతూనే వున్నాడు."
అంత ప్రముఖ రచయితకి ఈ అప్పుల బాధేమిటా అనుకుంది. అవసరమయితే తను ఆ అప్పు తీర్చేద్దామనుకుంది కూడా.
"ఇంతకీ మీరెవరు?' అడిగింది.
"ఘోస్ట్ రైటర్ ని" టక్కున జవాబు వచ్చింది.
ఉలిక్కిపడ్డ విజూష. "ఘోస్ట్ రైటరా? అంటే?" అంది ఆశ్చర్యంగా.
"అంటే" ఉక్రోషంగా అన్నాడు అవతలివైపు వ్యక్తి.
"తాడూ బొంగరం లేకుండా తిరుగుతున్న బొంగరాల రంగారావుకి నవల్సు మొదలుకుని అభిమానుల వుత్తరాలదాకా రాసే వాడి నీడని.
వెనక వుండి వాడిని ఈ దశకి తీసుకొచ్చిన ప్రేతాత్మని. అంటే ఘోస్ట్ని"
డబ్బులు సరిగ్గా ఇవ్వడంలేదన్న వుక్రోషంతో సదరు ఘోస్ట్ రైటర్ ఓ ప్రముఖ రచయితని అవమానిస్తున్నాడనకుంటూ -
"మీకు అంత టేలెంట్ వుంటే మీరే రచయితగా ఎస్టాబిల్ష్ కావొచ్చుగా" అంది చిరుకోపంతో.
"లేదమ్మా - టేలెంట్ వున్న మాకు పత్రికల ఎడిటర్లనీ, పబ్లిషర్లనీ మేనేజ్ చేసే మార్కెటింగ్ టెక్నిక్ తెలీదు.
అందుకే నవలకింతని తీసుకుంటూ మేం తెరవెనుక వుండి తనువులు చాలిస్తుంటాం"
అతడి గొంతులో నిజాయితీ అణువంత స్పదించిన విజూష అసలు విషయం మరిచిపోయింది.
"అంటే బొంగరాల రంగారావుకి రాయడం చేతకాదన్నమాట."
"వాడి బొంద. తెలుగులో అక్షరాలు ఎన్నున్నాయో తెలీని సన్నాసికి అక్షరాలకి ఒత్తులు ఎక్కడ పెట్టాలో అర్దంకాని దద్దమ్మ. రాయడం కూడానా?"
విసుగుతో క్షణమాగి అన్నాడు. "తెలుగు సాహిత్యానికి ఇంత ద్రోహం చేస్తున్న సరస్వతీ ద్రోహికి కనీసం నా డబ్బులన్నా సిరిగా ఇస్తే మీ ముందంతా ఇలా కక్కేవాడ్ని కాదు."
" మీ పేరు?"
"ఘోస్ట్ లకి పేరులుండవు."
"అసలు ఘోస్ట్ రైటర్ అనే పదం ఎలా వచ్చింది?"
"పాఠకులకి మేం కనిపించని రచయితలం కాబట్టి మమ్మల్ని ఘోస్ట్ లంటారు.
మాకు డబ్బు అవసరం. మమ్మల్ని వుపయోగించుకునే సోకాల్డ్ రచయితలకి పబ్లిసిటీ పాఠకుల ముందు పాపులారిటీ అవసరం."
"తమది కాని రచన్ని ఏ పాఠకుడైనా అభినందిస్తుంటే వాళ్లకి గిల్టీగా వుండదూ?"
సాహిత్యంలో ఇలాంటి ఓ నీచ సంస్కృతి వుందని తొలిసారి తెలుసుకున్నట్లు చీదరింపులా అంది -
"తను రాయని రచన్ని తనదిగా చెప్పుకోవడానికి తనకు కాక మరెవడికో పుట్టిన బిడ్డని నా కొడుకే అని సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి తేడా ఏముంది? ఈజిట్ నాట్ ఇంపోటెన్స్."
"కరెక్ట్ గా చెప్పావు తల్లీ!"
చల్లారిన ఉక్రోషంతో ప్రశాంతంగా అన్నాడు.
"ఇంకో రహస్యం చెప్పనా? ఇలా రాయడం చేతకాకుండా రచయితలుగా చెలామణి అయ్యేవాళ్లు ఒరిజినల్ తండ్రులకి కాక ఘోస్ట్ ఫాదర్స్ కి పుట్టాడంటుంది ఓ వర్గం."
"ఓ. కే.!"
నిట్టూర్పుగా క్షణం ఆగి చెప్పింది విజూష.
"మీకు డబ్బిస్తాను నాకో సాయం చేయగలరా?"
రుత్వి ఇచ్చిన కవితా పంక్తుల్ని తెలియజేసి అవి రాసిందెవరో కనుక్కుని చెప్పమని తన ఫోన్ నెంబర్ ఇచ్చింది విజూష.
పది నిముషాల్లో చెబుతానన్నాడు ఘోస్ట్ రైటర్.
టైన్స్ గా ఒక్కో లిప్తని లెక్కపెట్టుకుంటూ కూర్చుంది విజూష.
అప్పుడు టైం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏభై నిముషాలు.
* * * *
సరిగ్గా ఇదే సమయానికి....
దూకుడుగా బంగళాలోకి అడుగుపెట్టిన సశ్య తన రాకని సైతం పట్టించుకోనంత పారవశ్యంతో ఫోన్లో మాట్లాడుతున్న మార్గరేట్ ని ఆవేశంగా చూసింది.
సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి లైబ్రేరియన్ సాయంతో చాలా తెలుగు కవితల పుస్తకాల్ని ఓ అరగంట సేపు వెదికించినా ప్రయోజనం లేకపోవడంతో అసలే ఉక్రోషంగా వున్న సశ్య వెంటనే అరిచేదే.
కానీ ఆగిపోయింది చెవులు రిక్కిస్తూ.
"యూ సిల్లీ..... నేను శచీదేవిలా వుంటానా?" రిసీవర్ చెంపలకి ఆనించుకుంది మార్గరేట్ బిడియంగా.
"శచీదేవి అంటే నీకు తెలుసుగా?"
"ఇందాక నువ్వు చెప్పావ్ మీ పురాణాల్లోని ఇంద్రుని భార్యని."
మార్గరేట్ కి తెలీదు సశ్య పేరలల్ ఫోన్ అందుకుని అంతా వింటోందని.
"ఆ శచీదేవికి అంతమంది సంతానం ఎలా పుట్టారో తెలుసా?"
స్వచ్చమైన ఇంగ్లీషులో దారాళంగా మాట్లాడుతున్న అవతలి వ్యక్తి!
"అమృతం తాగబట్టి"
"ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు?'
మార్గరేట్ గొంతు మార్దవంగా పలికింది.
"నేనూ నీకు పిల్లల్ని కనాలనా?"
"నువ్వు ఓకే అంటే నేను రెడీ."
"యూ డర్టీ గూస్! మొన్న నా బ్రెస్ట్ లో పటుత్వం తగ్గిందన్నావ్?"
చిరుకోపాన్ని ప్రదర్శించింది.