Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 35


    రాధ నవ్వి అంది. "ఎవరు శ్రద్ధ వహిస్తారు? మా ఇంట్లో అంతా అదోరకం తత్వం వదినా! ఎవరి గొడవ వారిదేగాని ఇటువంటివాటిల్లో శ్రద్ధ వహించరు. ఇదంతా బాగుచేయాలని నాకూ వుంది. కాని ఎప్పటికీ?"

    సుగుణ మౌనంగా తలూపింది.

    "నేను వేసిన మొక్కలు చూడు. ఈ గులాబీ మొక్క అప్పుడే మొగ్గలు వేస్తోంది"

    సుగుణ మౌనంగా తలూపింది.

    "అయ్యో? ఈ కనకాంబరం చచ్చిపోయినట్టుంది. రెండురోజులు ఇక్కడ లేకుండేసరికి నీళ్ళు పోసే దిక్కులేదాయె."

    సుగుణ మోము విచారంతో ముకుళించుకుంది.

    ఇద్దరూ ఇంకా కొంచెం ముందుకు సాగిపోయారు. ఒకచోట ఏదో కనిపించి ఆగి పోయింది.

    "ఈ గొయ్యి చూశావా? యిక్కడ ఎవరో దొంగతనంగా గొయ్యి తవ్వారు"

    "దొంగతనంగానా? ఎందుకు?"

    "ఈ వూళ్ళో ఒక వెర్రిబాగుల అబ్బాయి వున్నాడు. వాడిపేరు కృష్ణుడు. ఇక్కడ నిధి వుందని వాడికెవరో చెప్పారట. అప్పట్నుంచీ యిక్కడ ఒక కన్నేసి వుంచాడు. మేము వూళ్ళో లేకపోవటం చూసి వచ్చి తవ్వినట్టున్నాడు. రేపు వాడి పని పడతాను" అన్నది రాధ కోపంతో.

    సుగుణ కళ్ళు ఆశ్చర్యంగా ప్రకాశించాయి.

    ఇంతలో టక్కుటక్కుమని చప్పుడు చేసుకుంటూ అరుగుమీదికి వాసు వచ్చి "అక్కా!" అని పిలిచాడు. ముందు వాడు వదినను చూసుకోలేదు. తరువాత గమనించి, సిగ్గుపడి లోపలకు వెళ్ళిపోయాడు.

    రాధ తలయెత్తి అంది. "ఎందుకు వెళ్ళిపోతావు? వదినను చూశా? ఆమె ముందు సిగ్గేమిట్రా?"

    తరువాత ఆమె సుగుణని చేయిపట్టుకొని వాడి దగ్గరకు తీసుకువెళ్ళి "ఒరేయి, వదినా అని పిలు" అంది.

    మొదట సిగ్గుపడ్డాడు.

    "పిలు!"

    "వదినా!"

    సుగుణ అర్థనేత్రాలతో వాడికేసి చూసింది.

    "అభాగ్యుడైన మా తమ్ముడు" రాధ కంఠం వొణికింది.

    తర్వాత వాడిని చూస్తూ "నువ్వు లోపలికిపోయి పడుకోమ్మా! మేమిద్దరం కొంచెంసేపు మాట్లాడుకొని వస్తాము" అంది రాధ. వాడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు.

    మళ్ళీ ఇద్దరూ పూలమొక్కలున్న ప్రదేశంలోకి పోతూంటే సుగుణ "అలా ఎందుకు జరిగింది?" అంది.

    వాసుగాడి విషాద గాథనంతా రాధ వివరంగా చెప్పింది. చివరకు "వాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది వదిన! కొన్ని నెలలక్రితం వరకూ వాడు మనలా రెండు  కాళ్ళూ వున్నవాడు. వాడి స్థితిని చూసుకొని వాడు ఎంత సిగ్గుపడతాడో తెలుసా? తనని గురించి యితరుల ఏమని అసహ్యించుకుంటారోనని ఒక్కటే  యిది. నీతో మాట్లాడటానికి కూడా వాడందుకే జాడిశాడు. కొత్తవాళ్ళు కనిపిస్తే పోయి దాక్కుంటాడు" అని చెప్పింది.

    సుగుణ కళ్ళు చెమర్చాయి. "పాపం" అంది నిట్టూర్పుతో.

    ఆమె మనస్సుని కలవరం చేశానని రాధ బాధపడుతూ ఆ ప్రసక్తి మార్చాలని "కొద్దిరోజుల్లో ఈ చోటు అంతా పూలచెట్లతో నింపివేస్తే బాగుండదూ వదినా?" అంది.

    "మరి ఇన్నాళ్ళనుంచీ నువ్వెందుకు ప్రయత్నించలేదు?"

    రాధ నవ్వుతూ "ఎలాగ? ఈ పనిని అన్నయ్య ఒకరికోసం ఉద్దేశించి అట్టే పెట్టాడు" అంది.

    "ఎవరికోసం?" అని సుగుణ అడిగింది.

    "అబద్ధాలు ఎప్పటినుంచి నేర్చావు రాధా?" ఆ గొంతు విని సుగుణ యిహ ముందూ వెనకా కూడా చూసుకోకుండా తుర్రుమని లోపలికి పారిపోయింది. కొంటె నవ్వుతో రాధ అక్కడే నిలబడి "పాపం, నిన్ను చూస్తే ఎంత సిగ్గొ! బుర్రుపిట్టలా తుర్రుమంది"

    నారాయణతోపాటే షికారుకు వెళ్ళివచ్చిన ముకుందరావు "ఉంటే ఏం, సిగ్గు? నీకు లేదని అందరికీ లేదంటే ఎలా?" అన్నాడు.

    "నేను ఎవర్ని చూసి సిగ్గుపడాలి? నిన్ను చూసేనా?" అని విరగబడి నవ్వింది రాధ.

    "ఏం, బావకి సిగ్గుపడటం సహజం కాదంటావా మరదలా?"

    "ఇదిగో చెబుతున్నాను బావా! నాకటువంటివి తెలీవు"

    ముకుందరావు నవ్వుతూ "నన్ను చూసి సిగ్గుపడేరోజు నీకు రాకపోదులే" అన్నాడు.

    నారాయణ ఈ సంభాషణ ఆలకించటంలేదు! అతని దృష్టంతా ఎక్కడో వుంది. అతని మనసిప్పుడు చాలా తీయగా, హాయిగా వుంది. బావతో లోపలికి నడిచాడు.

    ఆ మూడు రోజులూ రాధకు చాలా హాయిగా నడిచాయి. సుగుణకు తామందరి యెడలా ఆదరాభిమానాలు కలగాలని నిజానికి ఆమె ప్రయత్నించింది. శారదాంబ కూడా అంతే. బయటికి ఏమీ అనకపోయినా కోడల్ని చూసి లోలోపలే ఆమె మురిసిపోయింది. కోడలితో వచ్చేందుకు ఆమెకు అక్కడెవరూ లేకపోవటంవల్ల వంటరిగానే వచ్చింది. శారదాంబే రెండు పూటలా జడేసి పూలు చక్కగా అమర్చి అలంకరించేది. వాసు వదిన దగ్గరయితే కొంచెంగా అలవాటు పడ్డాడు. కాని ఛాయ అమితమైన సిగ్గుతో మూల మూలకు దాక్కోవటం మొదలుపెట్టింది.

    ఆ మూడు రోజులూ జరగవలసిన తతంగం అంతా యధావిధిగా జరిగింది. వచ్చేపోయే పేరంటాళ్ళతో, పెళ్ళికూతుర్ని చూసిపోవటానికి వచ్చేపోయే వాళ్ళతో ఇల్లంతా కలకలలాడసాగింది. చిదంబరం ఈ గొడవలన్నీ ఏమీ పట్టించుకునేవాడు కాదు. చుట్టకాల్చుకొంటూనో, ఆలోచించుకొంటూనో అరుగుమీద చతికిలబడి వుండేవాడు. ఎవరయినా వచ్చి డబ్బు అవసరమని చెబుతేచాలు "ఇదిగో" అని అలా బయటకు వెళ్ళి ఒక అరగంటలో తిరిగివచ్చి డబ్బు చేతికిచ్చేవాడు. ఈ హడావుడిలో ఎవరు ఏం చేస్తున్నదీ తెలియనందునా డబ్బు ఏ విధంగా తెస్తున్నదీ, ఏమిటీ ఎవరూ పట్టించుకోలేకపోయారు.

    మూడు రోజులు గడిచిపోయాక కూతుర్నీ, మనుగుడుపూలకు అల్లుడ్నీ తీసుకు వెళ్ళేందుకు భార్యతో సహా గోవిందరావుగారు వచ్చారు. అతిధి మర్యాదలు బాగా జరిగినాయి. ఆయనకూడా పేకాటలో సిద్ధహస్తుడని తెలిసి, ఆ రోజు రోజంతా ఆయన్ని చిదంబరం పేక దగ్గర్నుంచి కదలనివ్వలేదు.

    మరునాటి ఉదయం వాళ్ళంతా బయలుదేరారు. నారాయణకు మామగార్ని చూస్తే ఎందుకో గిట్టదు. గంగాధరంగారిని చూసినట్లుగా వుంటుంది. అంతకుముందు వరకూ చిదంబరం, గోవిందరావు ఒకే గదిలో కూర్చుని ఏవేవో విషయాలను గురించి మాట్లాడుకొన్నారు. పెళ్ళి విషయం, స్వవిషయాలూ, పెళ్ళికూతుళ్ళ గురించి మాట్లాడుకొన్నారు. పెళ్ళి విషయం, స్వవిషయాలూ,పెళ్ళికొడుకు పెళ్ళికూతుళ్ళు గురించి ఇటువంటివి వాళ్ళ సంభాషణలో దొర్లిపోయాయి. ఎంచేతో అత్తగారంటే సుగుణకు అమితమైన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. వాళ్ళందరికీ ఇంతకుముందే నమస్కారాలు పెట్టివచ్చింది. నారాయణను చూడకుండా ప్రయత్నిస్తూ రాధకు వెళుతున్నానని చెప్పింది. రాధ అన్నగారితోకూడా వెడదామనుకుంది మొదట. కాని ఇంట్లో నెలలు నిండూతూన్న అక్కయ్య, రోగిష్టివాళ్ళు.... కష్టం. ఊరుకుంది. పెళ్ళికొడుకుతో సహా మెల్లగా వాళ్ళంతా బండి యెక్కి వెళ్ళిపోయారు.

    రాధ నిట్టూర్చి, మరుక్షణంలో సిగ్గుపడి లోపలకు వచ్చేసింది. అన్నగారి ముభావత్వంలో వున్న నూనూగు నూతనత్వం ఆమెను ముగ్ధురాలిని చేసింది.

    ఎన్నాళ్ళనుంచీ 'జరగదు-జరగదు' అనుకున్నదీ, ఎప్పుడు జరుగుతుందా అని సంవత్సరాలు తరబడి ఎదురు చూసిందీ ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోయింది. కాకపోతే ఆనందమూ, తృప్తీ మిగిలాయి. మానవ స్వభావం కాబట్టి వీటి కులాసాలో మిగలకుండా పోయినావాటి విషయం ఎవరూ చూసుకోలేదు.

    క్రమక్రమంగా ఇట్లు  ఖాళీ  అయిపోసాగింది. కొన్ని గంటల వ్యవధిలో ప్రకాశరావు, ముకుందరావులిద్దరూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. బావకు అన్నయ్యమీద చాలా ప్రేమ అని ప్రకాశానికి తెలుసు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో వంటరిగా కూర్చుని గంటలకొద్దీ కబుర్లూ, అతని ముఖభంగిమా  చూసి నవ్వుకున్నాడు కూడా. అతనికి అన్నగారిని చూసినా ఆశ్చర్యంగా వుంది. అతన్ని ఎప్పుడూ ఇంత కళగా, కులాసాగా చూడలేదు.

    ఆ రాత్రి అన్నపూర్ణా, రాధా ఒక గదిలో పడుకున్నారు. ముసలావిడ సరేసరి. చిదంబరం పడుకోబోతూ భార్యతో "నీ కోరిక తీరిందా?" అన్నాడు.

    శారదాంబ ముసిముసిగా నవ్వింది కానీ ఆ జీవికి ఎక్కువగా నవ్వే భాగ్యం నోచుకోలేదేమో! మళ్ళీ ఏదో గుర్తువచ్చి ముఖమంతా విషాదపు ఛాయలు క్రమ్మివేశాయి.

    చిదంబరం మాత్రం నిశ్చింతగా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు.

       
                                                          18


    క్రిందటిసారి తమ ఇంటికివెళ్ళి అక్కడ దుర్భర పరిస్థితుల్ని చూసి వచ్చినప్పుడు ప్రకాశరావుకు శకుంతలా వాళ్ళ ఇల్లు అల్లంత దూరంనుంచి బ్రహ్మండంగా, కళగా అనిపించింది. కాని ఈసారి కళాకాంతులు వెదజల్లిపోయిన తమ ఇంటినుంచి వచ్చాక అక్కడ జరిగిన సంఘటనల్ని ఇంకా నెమరు వేసుకొంటూ బండిలోంచి తొంగి శకుంతలా వాళ్ళ ఇల్లు చూశాక విచారంగా, వెలవెలాపోతూ కనిపించింది. మద్రాసుకి వచ్చి అరగంట గడిచినా ఇప్పుడు మాత్రమే అతను నిజంగా వచ్చిపడ్డాడు. ఏమిటది? తను  ఇక్కడినుంచి రాకముందు వున్న పరిస్థితులన్నీ స్మృతిపథంలో మెదలసాగాయి. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. అయిదు రోజులు! అయిదు రోజుల్లో ఇక్కడ స్థితి ఎట్లా వుంది? రామారావుగారి వంట్లో ఎలా వుంది?

    ఇంటిని సమీపించాక బండిలోంచి నడిచాడు. హాల్లోకి ప్రవేశించటంతోనే నిలువునా వొణికాడు. నిశ్శబ్దంగా, భయంకరంగా వుంది. అతనికి ఎవరూ కనబడలేదు. అతనిలో ఆరాటం క్షణక్షణానికీ అధికం కాసాగింది. ఈ నిశ్శబ్దానికి అర్థం ఏమిటి?

    పరాయివాడిలా కొంతసేపు స్తబ్దుగా నిలబడిపోయాడు. ఎవర్ని పలకరించాలో తెలియదు.

    అతను శకుంతలను పేరుపెట్టి పిలుద్దామని స్థిరపడేలోపలే ప్రక్క గదిలోంచి రంగయ్య వస్తూ "బాబూ!" అన్నాడు.

    "రంగయ్యా!" అన్నాడు ప్రకాశరావు అచేతనంగా.

    వాడి ముఖం దిగులుపడిపోయింది. ప్రకాశరావు తన వంక అదేపనిగా చూస్తూండేసరికి తలదించుకున్నాడు. వాడి వదనంలో మితిలేని విషాద ఛాయలు గోచరించేసరికి ప్రకాశరావు "రామారావుగారికి యెలావుంది?" అని అడిగాడు.

    వాడు జవాబు చెప్పలేదు. కాని వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ప్రకాశరావు వాడి భుజం పట్టుకొని గట్టిగా  కదుపుతూ "చెప్పవేం? ఆయనకెలా వుంది?" అని అరిచాడు.

    బొంగురు గొంతుతో వాడు "బాబుగారు పోయారు" అని తలగుడ్డ తీసి అడ్డం పెట్టుకొన్నాడు.


    ప్రకాశానికి కాళ్ళక్రింద భూమి గిరగిర తిరుగున్నట్లనిపించింది. ఒడలంతా ఒక్కసారిగా ఝల్లుమంది. అయిదు రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన రామరావుగారు ఏరి? ఈ స్వల్పకాలంలోనే ఈ ఘోరం జరిగిపోయిందా?

    "ఎప్పుడు?"

    "మూడు రోజులయింది."

    అతను నిల్చోలేక అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. తల తిరుగుతున్నట్లుగా వుంది. రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకున్నాడు.

    చాలాసేపు అయింతర్వత చేతులు తీశాడు. కళ్ళన్నీ యెర్రబడి జ్యోతుల్లా వున్నాయి. పెదాలు వొణుకుతున్నాయి. రంగయ్య ఇంకా అక్కడే నిలబడి దీనంగా ఇతని ముఖంలోకి చూస్తున్నాడు.

    "శకుంతల?" ప్రశ్నార్థకంగా చూశాడు ప్రకాశరావు.

 Previous Page Next Page