ముకుందరావు చిన్నగా నవ్వి "ఇంకో మూడు నెలలదాకా రానంటూంది" అన్నాడు.
ప్రకాశరావుకు ఇంకా కొంచెం కోపంవచ్చి "ఎందుకు రానంటూంది. నీకు అక్కడ ఇబ్బందిగా వుండదా? ఎంత పుట్టిల్లు అయితే మట్టుకు పెళ్ళయిన పిల్లలు నెలల తరబడి తిష్ఠ వేసుకొని కూర్చుంటారా?" అన్నాడు.
"ఎందుకని?" అని అడిగాడు.
ముకుందరావు జవాబు చెప్పకుండా మరికొంచెం నవ్వి వూరుకున్నాడు.
అతను ఎందుకు నవ్వుతున్నాడో ప్రకాశరావుకు అర్థంకాలేదు. ఇంటికి పోయాక తల్లి దగ్గరకుపోయి చంటిపిల్లాడిలా అడిగాడు.
ఆవిడకూడా నవ్వేసి "అది అంతేలే" అన్నది.
ప్రకాశరావు ఉక్రోషంతో చూస్తున్నాగా! అందరూ నవ్వటం తప్ప సరిగ్గా చెప్పరేం?" అన్నాడు.
ఆ సమయానికి రాధ కూడా అక్కడే వుంది. ఆమెకూడా నవ్వుతూ అందికదా "మద్రాసులో నువ్వు నేర్చుకొనేది ఈ మాత్రం జ్ఞానమేనా?"
"అయితే రాధా! నీ ఉద్దేశం నే నక్కడ వుండి వాళ్ళూ, వీళ్ళూ ఎందుకు నవ్వుతుంటారో నేర్చుకుంటున్నాననేగా?"
"లేకపోతే నీకు మాత్రం తెలియదేమిటన్నాయ్. అక్కయ్య ఇంకో మూడు నెలల్లో బుజ్జిగాడ్ని ఎత్తుకొంటుంది."
ప్రకాశరావు ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తను ఇంత తెలియనివాడు ఏమిటా అనుకొని అక్కడే వుంటే వాళ్ళింకా నవ్వుతారని బయటకు వెళ్ళిపోయాడు. లోపలినుంచి ఈ సంభాషణ ఆలకిస్తున్న అన్నపూర్ణ ముసి ముసి నవ్వులు నవ్వుకొంది.
మరునాడు ఉదయం పెళ్ళివారంతా బళ్ళమీద స్టేషన్ కు వెళ్ళారు. అక్కడనుంచి.......
* * *
మరీ ముహూర్తం రాత్రి ఒంటిగంటా ఇరవై అయిదు నిముషాలకి. పన్నెండురయింది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. పెళ్ళివారి ఇల్లు చాలా పెద్దదే. చుట్టూ విశాలమైన ప్రదేశం చాలా వుంది.
రాధ నిద్ర వస్తూంటే ఆపుకునే ప్రయత్నంలో బయటకు వచ్చి నిలబడింది. లోపల ఉక్కబోస్తోంది. రాధ ప్రాణానికి ఇక్కడ హాయిగా అనిపించింది. లోపలనుంచి బయటకూ, బయటనుంచి లోపలకూ అప్పుడప్పుడూ మనుష్యులు తిరుగుతున్నా, లోపలి హడావుడి అలవాటుపడి వచ్చి వుండటం వల్ల నిశ్శబ్దంగా వున్నట్లు అనిపించింది ఆమెకు. ఒకచోట స్థంభానికి అనుకొని నిలబడి పోతూ ప్రక్కనుంచి వస్తున్నా ప్రకాశరావుని చూసి ఆశ్చర్యపడింది.
"అన్నాయ్" అంది.
"ఇదేమిటి రాధా? ఇక్కడున్నావేం?" అని అతను ఆశ్చర్యంతో అడిగాడు.
"నువ్విక్కడ ఉన్నావేం?"
"లోపల ఆ గోల భరించలేక, కాసేపు ఊపిరి పీల్చుకొందామని ఇక్కడకు వచ్చాను. నువ్వూ?"
"నేనూ అంతే."
"లోపలకు పోదాం రా."
"ఇప్పుడే వచ్చాను. కొంతసేపు వుండి వస్తాను."
"సరే" అని ప్రకాశరావు వెళ్ళిపోబోయాడు. రాధకు ఏదో సందేహం తోచి, "ఉండు, ఒక్క విషయం అడుగుతాను చెబుతావా అన్నాయ్" అంది.
ప్రకాశరావు తెల్లబోయి నిలబడి "అడుగమ్మా" అన్నాడు.
"ఎంతయినా నీ దగ్గర డబ్బు ఉండదు కదా! ఈ కొత్త బట్టలు ఎక్కడనుంచి వచ్చాయి?"
అక్కడకూడా స్థంభాలకికట్టివున్న బల్బులవల్ల అక్కడక్కడా వెల్తురుగానే వుంది. ప్రకాశరావు ఒకసారి తన దుస్తులకేసి చూసుకున్నాడు. అది ఆనాడు తనకు శకుంతల ఇచ్చిన గుడ్డ. తర్వాత కుట్టించుకున్నాడు. హఠాత్తుగా చెల్లి నోటినుంచి యీ ప్రశ్న వస్తుందని అతను ఊహించలేదు. తెల్లబోతూ ఏం చెప్పనా అని ఆలోచించసాగాడు.
రాధ అతను ఏం చెబుతాడా అని చూస్తోంది. కొంచెం ఆగి ఏదో ఊహించుకొని అతనన్నాడు. "నేను ప్రయివేట్టు చెబుతాగా! అందులో ఒకబ్బాయి నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. అన్నయ్య పెళ్ళి అని తెలిసికొని కుట్టించాడు.
ఈ జవాబు చెబుతూ తనని తాను నీచపరచుకొంటున్నందుకు ప్రకాశరావు చాలా బాధపడ్డాడు. నిజంగా ఏ ప్రయివేటు కుర్రాడి తండ్రయినా అలా ఇస్తే తను తీసుకొంటాడా?
రాధ అతని మాటలు నమ్మింది. మనసులో జాలికూడా పడింది. ఇంకా అక్కడవుంటే ఇటువంటి ప్రశ్న ఏమి వేస్తుందోనని భయపడి ప్రకాశరావు మెల్లగా లోపలకు వెళ్ళిపోయాడు.
రాధ ఒక్క అయిదు నిమిషాలు ఆలోచించుకొంటూ అక్కడే నిలబడింది. ఇంతలో లోపలనుంచి మంగళవాయిద్యాలు వినిపించసాగాయి. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. అటువైపు చూసింది. ఇల్లంతా లైట్లతో కళకళలాడుతూ వైభవంగా వుంది. లోపల అందరితోనూ సరదాగా వుండకుండా ఇక్కడకు వచ్చినందుకు తననుతాను నిందించుకుంటూ కదలబోయింది. ఇంతలో వెనుకనుంచి "రాధా!" అన్న పిలుపు మృదువుగా వినబడి, త్రుళ్ళిపడి ఆగిపోయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో వెనుదిరిగి చూసింది.
అక్కడ ఆనందరావు నిలబడి వున్నాడు. అతను నారాయణరావు స్నేహితుడు అవటంవల్ల పెళ్ళికి వచ్చాడు.
"చాలా రోజుల తర్వాత నిన్ను మళ్ళీ రాధ అని పిలవటానికి సాహసిస్తున్నాను. క్షమించండి."
ఆమె అక్కడ్నుంచి ఒక్క దూకులో లోపలకు పోదామనుకుంది. అతను అలాగే తొందరపడి తనని కదలనియ్యకుండా పట్టుకుంటాడన్న భయంతో కదలలేక కొయ్యబారి నిలబడిపోయింది.
"చాలా రోజు తర్వాత మళ్ళీ చీకతిరాత్రే అయోమయ పరిస్థితిలోనే మనం కల్సుకోవటం ఆశ్చర్యంగా వుందికదూ?"
రాధ విసుక్కుంటూ "ఈ ఉపోద్ఘాతాలన్నీ యెందుకు? ఏమయినా చెప్పదల్చుకొంటే త్వరగా చెప్పండి" అంది.
"అవును. మనం ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు?"
త్రుళ్ళిపడి - అతనిని నఖశిఖపర్యంతం చూడాలని వ్యర్థప్రయత్నం చేసింది.
ఈ ప్రశ్నకి యేమని జవాబు చెప్పాలో రాధకు తెలియదు. ఏ సమాధానమూ చెప్పకుండానే అక్కణ్నుంచి జారుకుందామనుకుంటోంది. అలా చేయటం కూడా ఆమెకు సాధ్యంకాలేదు. ఈ ఆనందరావు ఎప్పుడూ ఇంతేనని అయోమయ పరిస్థితుల్లోకి అమాంతంగా పడవేస్తాడు. అంచేత అతన్నామె యెప్పుడూ అభినందించలేదు. కొంచెం కటువుగా సమాధానం చెబుదామనుకుంది. కాని హఠాత్తుగా ఏదో యోచన ఆమెకు రాగానే నిలువునా వణికి, ఆ అభిప్రాయాన్ని మార్చుకోసాగింది. అసలు యీ పెళ్ళీ, ఈ హడావుడీ అంతా చూస్తుంటేనే ఆమె మనసు అదో విధంగా అయింది. పెళ్ళి అనేది మానవుని విధ్యుక్త ధర్మాలలో ఒకటి. ఆలోచించగా అతను అడిగిన దాంట్లో తప్పేమీలేదని ఆమెకు తోచింది. జీవితాని కంతటికీ సంబంధించిన సమస్య కాబట్టి పెంకిగా కాకుండా మృదువుగా జవాబు చెప్పాలనుకుంది.
"మీరు దూరదృష్టితో మాట్లాడుతున్నారా?"
"అంటే నేను అంత తెలియనివాడినని నీ ఉద్దేశమా?"
"కాకపోవచ్చు. ఈ విషయంలో మీకు మీ ఇంట్లో సర్వస్వతంత్రం లేదనుకుంటాను."
అతను యేమీ చెప్పకముందే తిరిగి ఆమె అంది; "చూడండి. మీకూ మాకూ చాలా భేదాలున్నాయి. ముఖ్యంగా మీకు డబ్బుంది. మాకు లేదు. బీదపిల్లలకు బీదమొగుడే రావటం సాధారణంగా రివాజు. పెద్వవాళ్ళ ఇష్టా ఇష్టాలను గమనించకుండా ఉద్రేకం కొద్దీ మనం లోతుగా ఆలోచించటం మంచిపనికాదు. ముందు మీవాళ్ళను వొప్పించేందుకు ప్రయత్నంచేసి సఫలులు కండి. తిరిగి ఆనాడు కబురు చేయండి, వస్తాను" అని అక్కడ్నుంచి బిరబిర లోపలికి వచ్చేసింది. ఆమె ఏమయినా అవతలి వారిదీ కాదు. ఆ పరిస్థితిదే. వెనుకటికన్నా ఈసారి ఆ యువకుడి మనస్తాపాన్నీ, మనోవ్యధనూ బాగానే అర్థం చేసుకోగలిగింది. ఆమె చేసిన పనల్లా ఏమిటంటే; అతని మనస్సులోని భావాలకు తగినట్లు, అతనిచేత ఆకర్షించబడేటట్టు మృదువుగా మాట్లాడక పోవటం. ఉద్రేకాలకు లోనై సహజంగా మాట్లాడింది.
రాధ లోపలికి వెళ్ళేసరికి అక్కడ చాలా సందడిగా వుంది. మధ్య ఒకచోట కూర్చున్న ప్రమీల రాధను చేయపట్టుకుని లాగుతూ "ఎక్కడకు పోయావు ఇంతసేపు?" అని అడిగింది. "కాస్త ఊపిరి పీల్చుకుందామని" అని అన్నను చూసింది ఆమె. నిజంగా పెళ్ళి కళ అంటే ఏమిటో రాధకు ఇప్పుడే తెలిసింది. నారాయణ ఇంత కళగా, ఆనందంగా యెప్పుడూ కనబడలేదు. లైటు వెలుగులో ఉత్సాహంతో ప్రజ్వరిల్లిపోతూన్న నారాయణ ముఖంకేసి తేరిపారచూసి రాధ "మా అన్నయ్యకేం?" అనుకుంది గర్వముగా. తెర ఇవతల కూర్చున్న సుగుణకేసి చూసింది. తన వదిన! ఆమెకు వొళ్ళంతా పులకరించింది.
పెళ్ళికి ప్రమీల ఒక్కతే వచ్చింది. ఆమె రాధ ప్రక్కనే కూర్చుని జరిగేదంతా శ్రద్ధగా పరికిస్తోంది.
వధూవరుల తలంబ్రాలు పోసుకొంటూన్న సమయానికి రాధ నాయనమ్మ వైపు చూసింది. ఆవిడను ఒక మూల మంచంవేసి జరిగేదంతా కనబడేటట్లు పడుకోబెట్టారు. ఆవిడను రైల్లో యెక్కించి ఇక్కడకు తీసుకురావటం చాలా ప్రయాసైన పనిగా పరిణమించింది. ఇప్పుడు అక్కడ కూర్చుని పత్తికాయలంత కళ్ళు చేసుకొని, లేని ఓపికతో కార్యక్రమాన్నంతటినీ ఉత్సాహంతో పరిశీలిస్తోంది. రాధ వృద్ధురాలి నేత్రాలనుండి నీరు ధారగా ప్రవహించటం గ్రహించింది.
'ఈవిడ ఈ భూమ్మీద ఇంక యెక్కువరోజులు వుండదు" అని ఆమె అనుకుంది.
ఆ రాత్రి పెళ్ళి చాలా దిగ్విజయంగా అతిపోయింది.
మరునాడు పెద్దలూ, పిన్నలూ అంతా సమూహంగా కూర్చున్నప్పుడు ఆనందరావును ఒకరిద్దరు బుల్ బుల్ వాయించమని బలవంతం చేశారు. వాళ్ళ బలవంతంచేత అతను శ్రమ అనుకోకుండా ఆ జంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చాడు. ఒకవైపు మగవాళ్ళు, మరోవైపు ఆడవాళ్ళూ కూర్చున్నారు. రాధ కలకల్లాడిపోతున్న ముఖంతో ప్రమీల ప్రక్కగా ఒకచోట కూర్చుంది. ఆనందరావు ద్విగుణోత్సాహంతో తన చాతుర్యాని చూపటానికి సిద్ధపడ్డాడు. ఒక అరగంటసేపు అక్కడున్న వాళ్ళందరిని ముగ్ధుల్ని చేసివేశాడనటంలో అతిశాయోక్తికూడా ఏమీలేదు. ఆ సమయములో అంతమంది ఆడవాళ్ళ మధ్య కూర్చున్న రాధ కళ్ళు చెమర్చటం అతను కనిపెట్టలేక పోలేదు.
ఈ పెళ్ళిలో వాసు ఏమీ జోక్యం కలగజేసుకోలేదు. ఒకమూల కూర్చుని చూడటం తప్పితే వాడి పని ఏమీలేదు. అలా చెయ్యమని రాధ వాడితో చెప్పింది. ఆ సాయంత్రం పెళ్ళివారంతా ఇంటికి మరలారు.
మూడు నిద్రలకోసం వచ్చిన సుగుణతో రాధ పరిచయం అభివృద్ధి చేసుకుంది. కొత్త పెళ్ళికూతురు కావటంవల్ల ఆమె అడుగుతీసి అడుగు పెట్టటానికి కూడా బిడియపడుతోంది. ఈ సమయంలో రాధ సహకారం గనుక లేకపోతే ఆమె పరిస్థితి మరీ దుర్భరంగా వుండేది.
ఇంటికి వచ్చాక నారాయణ పరిస్థితి విచిత్రంగా మారింది. ఇదివరకటి మాదిరి స్వేచ్చగా ఇంట్లో సంచరించలేకపోతున్నాడు. ఏదో అనుమానంతో అటూ- ఇటూ చూసి నడవవలసిన వస్తోంది! కొన్ని కొన్ని గదుల్లోకి పోవటం అసలు పూర్తిగా మానుకున్నాడు.
రాధకు సుగుణను చూస్తే తృప్తిగా వుంది. తను కోరినలాంటి వదిన వచ్చిందని ఆమె భావించింది. తీరిక చిక్కినప్పుడల్లా వదినతోపోయి మాట్లాడటానికి ఉవ్విళ్ళూరుతోంది రాధ.
మబ్బు పట్టిన ఆ సాయంత్రం ఇంట్లో మగవాళ్ళంతా బయటకు వెళ్ళారు. అన్నపూర్ణ లోపల తల్లి దగ్గర కూర్చుని ఏదో లోకాభిరామాయణం చెబుతోంది. ముసలమ్మగారు ముక్కుతూ, మూలుగుతూ మధ్య గదిలో పడుకొని వుంది. రాధ సుగుణని బలవంతంగా చేయిపుచ్చుకొని బయటవున్న ఖాళీ ప్రదేశంలోకి తీసుకువచ్చింది. కాటుక పెట్టుకున్న ఆమె కళ్ళు, అమ్మ వేసిన పూలదండా, ఆమె ధరించిన వంగపండురంగు చీరలో వదిన చాలా ముచ్చటగా కనబడింది రాధకు.
"ఈ ప్రదేశాన్ని శుభ్రపరచరేం?" అనడిగింది సుగుణ.