Previous Page Next Page 
జనవరి 5 పేజి 35

 

        హీ కెన్ క్రియేట్ ఎమోషనల్ ఎట్మాస్మియర్.....స్తబ్దుగా వున్న వాతావరణంలో, పరిసరాల్లో చైతన్యాన్ని రగిలించగల ఆశావాది.
   
    మేఖల కూడా లేచి డ్రస్ చేంజ్ చేసుకునేందుకు ప్రక్క గదిలోకి వెళ్ళింది.
   
                     *    *    *    *    *
   
    "వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయాలనుకుని ఢిల్లీ వెళ్ళారు? నాకేం అర్ధం కావడంలేదు" అభిరామ్ మెరీనా బీచ్ లో కూర్చుని ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రపు అలలకేసి చూస్తూ అడిగాడు సాలోచనగా.
   
    "అదే నాకూ అర్ధంకావడంలేదు. మా అన్న కలల మహారాజు....ఇండియా జపాన్ కావాలంటాడు. బాహ్య ప్రపంచపు స్పృహ లేనివాడు. ఉన్నట్లుండి తననితానే మర్చిపోతాడు. మరి మీ అక్క సంగతి నాకంతగా తెలీదు" అంది తడి ఇసుకతో పిచ్చికగూళ్ళు నిర్మిస్తూ.
   
    ఆ ఇద్దరూ అలా మాట్లాడుకుంటుండగా....అచ్యుత్ మద్రాసు నగరానికి మకుటం లేని మహారాజైన వరద రాజన్ తో మాట్లాడేందుకు మెరీనా బీచ్ కి దగ్గరలో వున్న అతని అడ్డాకేసి బయలుదేరాడు.
   
                     *    *    *    *    *
   
    విమల్ బయలుదేరే ముందు తాను వస్తున్నట్లు ఫోన్ చేయడంతో మంత్రి ఆర్యభట్టు ఇంటిముందు ఒక వ్యక్తి తమ కోసమే అన్నట్లు ఎదురు చూస్తూ కనిపించాడు.
   
    విమల్, మేఖల, టాక్సీ దిగి గేట్ దగ్గరకు వెళ్ళారు. గేట్ తలుపులు పూర్తిగా వేసున్నాయి. మెయిన్ గేట్ కున్న చిన్న తలుపు మాత్రం ఒకింత ఓపెన్ చేసుంది.
   
    అప్పటి వరకూ ఎదురు చూసిన వ్యక్తి వడివడిగా విమల్, మేఖల దగ్గరకు వచ్చి, "యూ ఆర్ ఫ్రమ్" అడిగాడు కన్ ఫర్మ్ చేసుకునేందుకన్నట్లు.
   
    'ఏ.పి. గెస్ట్ హౌస్.....టైమ్స్ ఆఫ్ ఇండియా...." మేఖల మధ్యలోనే ఆగిపోయింది. ఆ పైన చెప్పకపోయినా తామెవరైందీ గ్రహించగలడని.....
   
    "ప్లీజ్..... ప్లీజ్ కమ్" అంటూ అతను లోపలకు దారితీశాడు. అతని వెనుకే విమల్, మేఖల బయలుదేరారు.
   
    "ఎవరా ఏడ్ ఇచ్చింది? మేం తెలుసుకోవచ్చా?" విమల్ పరిసరాల్ని గమనిస్తూ అతని వెనుకే నడుస్తూ అడిగాడు.
   
    "ఏ సేస్....మంత్రిగారి కొడుకు...... పేరు సెల్వరాజ్?"
   
    "ఆ వెయ్యి ఎకరాలు బురదతో నిండిన ఫారెస్ట్ లేండ్ వున్నది ఆయనకేనా?" మేఖల అడిగింది.
   
    "ఎస్.... మేడమ్! అయితే మీరొక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ మేటర్ తో మంత్రిగారికి సంబంధం లేదు. ఇది కేవలం సెల్వరాజ్ గారికి సంబంధించినదే....." అతను మెయిన్ బంగ్లాకేసి దారితీస్తూ అన్నాడు.
   
    ఈ ఇద్దరూ మౌనంగా అతను చెప్పేది వింటుండిపోయారు.
   
    విశాలమైన ఆవరణలో నిర్మించిన పెద్ద బంగ్లా.....చుట్టూ పచ్చటి లాన్స్. గ్రీన్ బోర్డర్స్.....ఫ్లవర్ బోర్డర్స్.....ఎత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు, ఆ చెట్ల ఆకులపై రాత్రంతా కురిసిన మంచు తాలూకు తడి ఇంకా ఆరలేదు. సూర్యకిరణాలు ఆ తడిపైకి ప్రసరించి రెయిన్ బోను సృష్టిస్తూ రెఫ్లెక్ట్ అవుతున్నాయి. వాతావరణం మనోహరంగా వుంది.
   
    బంగ్లా అంతా ప్రశాంతంగా వుంది.
   
    సెంట్రల్ కేబినెట్ రేంక్ మినిస్టర్ ఇంట్లో ఉండే సహజమైన హడావుడిగాని, గందరగోళంగాని, పైరవీకారుల సందడిగాని లేదు.
   
    మెయిన్ బంగ్లా ప్రధాన ద్వారం ప్రక్కనుంచే పైకివున్న మెట్ల కేసి సాగాడు ఆ వ్యక్తి.
   
    బహుశా సెల్వరాజ్ కార్యాలయం పైన ఉందేమో అనుకుంటూ మెట్లెక్కసాగారు విమల్, మేఖల.
   
    "నా ఏడ్ కి రియాక్ట్ అయ్యింది మీరేనా?" ముఫ్ఫై ఏళ్ళ యువకుడైన సెల్వరాజ్ తనకు ఎదురుగా వున్న సోఫాలో కూర్చున్న విమల్, మేఖలను చూస్తూ ప్రశ్నించాడు.
   
    "ఎస్.....మేమే" అన్నాడు విమల్.
   
    "నా సమస్యకు సంబంధించిన వేరే వివరాలేమన్నా ఇంకా కావలసి వుందా?" సెల్వరాజ్ విమల్ కేసి చూస్తూ అడిగాడు.
   
    "ఉంది" అన్నాడు ఎక్కడో ఆలోచిస్తూ విమల్.
   
    అంతలో బ్రాస్ గ్లాసుల్లో కాఫీ వచ్చింది.
   
    సెల్వరాజ్ సెక్రటరీ ముగ్గురికీ కాఫీ సర్వ్ చేసి తనో గ్లాసు తీసుకున్నాడు.
   
    నలుగురూ మౌనంగానే కాఫీ తీసుకున్నారు.
   
    గ్లాసుని టీపాయ్ మీద పెడుతూ "అడగండి" అన్నాడు సెల్వరాజ్.
   
    ఆ మార్షీలేండ్ ఢిల్లీకి ఎంత దూరంగా వుంది" విమల్ మొదటి ప్రశ్న అది.
   
    షుమారు 80 కిలోమీటర్ల దూరంలో వుంది. సెల్వరాజ్ కి విమల్ తన సమస్యకు పరిష్కారం చూపిస్తాడనే నమ్మకం లేదు.
   
    "ఆ భూమికి వెళ్ళేందుకు రోడ్ ఉందా?"
   
    విమల్ ఆ సమస్యకు పరిష్కారం చూపగలడనే నమ్మకం మేఖలకు వున్నా ఎలా అన్నదే ఆమెకు అర్ధం కావడం లేదు.
   
    "వుంది కాని మెటల్ రోడ్"
   
    "ఇక్కడి నుంచి అక్కడకు వెళ్ళేందుకు ఎన్ని గంటలు సమయం పడుతుంది?"
   
    "మూడు గంటలు."
   
    విమల్ కొద్దిసేపు మౌనంగా వుండిపోయాడు.
   
    అతను ఆలోచిస్తున్నాడని అర్ధం చేసుకున్న సెల్వరాజ్ మాట్లాడేందుకు ప్రయత్నించలేదు.
   
                      *    *    *    *    *
   
    చీకటి పడిపోవడంతో అభిరామ్, క్రాంతి లేచి బట్టలకు అంటుకున్న ఇసుకను దులుపుకుంటూ చీచ్ రోడ్ కేసి సాగారు.
   
                       *    *    *    *    *
   
    "నేను మీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాను" తన ఆత్మవిశ్వాసాన్ని ధ్వనింపజేస్తూ స్థిరంగా అన్నాడు విమల్.
   
    అక్కడున్న ముగ్గురూ విస్తుపోయారు.
   
    "కాని నేనిప్పుడు మీరు చూపించబోయే పరిష్కారానికి ఎక్కువ మొత్తాల్లో ఖర్చు పెట్టలేను. అంత స్థోమతా నాకు లేదు." అన్నాడు నెమ్మదిగా సెల్వరాజ్.
   
    "ఎంతవరకు ఖర్చు పెట్టగలరు?" విమల్ కంఠం గంభీరంగా వుంది.
   
    "పరిష్కారం ఆమోద యోగ్యమైనదయితే అది భవిష్యత్ లో నాకు లాభాన్ని తెచ్చిపెట్టగలిగేదయితే నాకున్న పూచిక పుల్లతో సహా అమ్మి సొమ్ము చేస్తాను. బహుశా పది లక్షల దాకా రావచ్చు. మీరా పది లక్షల తోటే పరిష్కారాన్ని చూపించగలగాలి. లేదంటే నేను చేయగలిగిందేమీ లేదు" అన్నాడు సెల్వరాజ్ ఒకింత నిస్ప్రుహగా.
   
    అక్కడ సంభాషణను క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న మరో వ్యక్తి మైక్రోఫోన్ ద్వారా వింటున్నాడని వారికి తెలీదు.
   
    అలా వింటున్న వ్యక్తి మంత్రి ఆర్యభట్టు!
   
    తన కొడుకు తన పేరును, పదవిని అడ్డం పెట్టుకుని ఏమయినా అనుచితమైన లాభాలని పొందుతాడేమో, తద్వారా తనకు చెడ్డపేరు వస్తుందానే భయంతో రహస్యంగా సెల్వరాజ్ రూమ్ లో మైక్రో ఫోన్ ని అరేంజ్ చేయించాడు.
   
    కొత్త వ్యక్తులెవరైనా తనకోసం కాక తన కొడుకు కోసం వచ్చినట్లు ఆయన గమనిస్తే, తన గది తలుపులు వేసుకుని, హియరింగ్ సెట్ ని ఆన్ చేస్తాడు.
   
    ఇప్పుడదే జరిగింది.
   
    "ఆ పది లక్షలతోటే మీ సమస్యను పరిష్కరించగలను" అన్నాడు విమల్ బేస్ వాయిస్ లో.
   
    ఆర్యభట్టు అలర్టు అయిపోయాడు.
   
    "ఈ సందర్భంలో మా నాన్నగారి పదవి, పలుకుబడి మనకే మాత్రం ఉపయోగపడవు"
   
    "నాకు తెలుసు..... ఇలామ్టి పనులకు వారు ఇష్టపడరని, అలాంటి విశిష్టమైన వ్యక్తిత్వం వారికుందనీ నాకు తెలుసు."
   
    "బాగు చేయకపోయినా, చెడును ప్రోత్సాహించటం నాకూ యిష్టముండదు."
   
    "ఆ సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పండి" ఆతృతను కనబరుస్తూ అన్నాడు సెల్వరాజ్.
   
    "ఆ లాండ్ కి సంబంధించి ఏవైనా ఫోటోలు తీసారా....?" విమల్ తిరిగి అడిగాడు.
   
    "ఆ....తీయించాను" అంటూ సోఫా ప్రక్కనే వున్న బ్రీఫ్ కేసుని అందుకొని, దాన్ని ఓపెన్ చేసి ఫోటో ఆల్బమ్ నొకదానిని బయటకు తీసి విమల్ కి అందించాడు.
   
    విమల్ ఆ ఆల్బమ్ ని అందుకొని ఒకింత సేపు పరిశీలనగా చూశాడు.
   
    "ఆ వెయ్యి ఎకరాలలో చెట్లు, బురదగుంటలు కాక ఇంకేమున్నాయి?"

 Previous Page Next Page