Previous Page Next Page 
జనవరి 5 పేజి 34

  

      అలా అని ప్రేమకు, మమతకు, అనురాగానికి దూరంగా....జీవితమంటే సంపాదించడమే అనే పచ్చి మెటీరియలిజాన్ని ఆశ్రయించటం కూడా తప్పే.
   
    లవ్ ఈజ్ పార్ట్ అండ్ పార్శిల్ ఆఫ్ లైఫ్.
   
    అది జీవితంలో ఒక భాగం మాత్రమే....
   
    అదే జీవితం కాదు-కారాదు. హిపోక్రసీకి దూరంగా, లైక్ కి లస్ట్ కి దూరంగా లక్ష్యసాధన కోసం ముక్కూ మొహం తెలీని యువతీ యువకులు కలిసి ముందుకు సాగడం ఏ జాతికయినా, ఏ జాతి ఆర్ధిక వ్యవస్థకయినా శుభ పరిణామమే.
   
    గతంలో మేఖలను చూసి చాలామంది తమని తాము మరచి ఆమె చేరువకై తపించేవారు.
   
    అప్పుడు ఆమె చిరాకుపడేది.
   
    పరోక్షంగా తను అందర్నీ ఆకర్షించగలుగుతున్నందుకు గర్వపడేది. చివరకు అది ఒక అబ్సెషన్ గా మారి ఆ రంగులరాట్నంలో యిరుక్కుపోయింది.
   
    అంతకంటే పెద్ద ప్రపంచం, గొప్ప ప్రపంచం కూడా వుందని విమల్ ని చూశాక తెలిసింది.
   
    అప్పటి తన చిన్న పిల్లల మనస్తత్వానికి ఇప్పుడు నవ్వుకుంటోంది.
   
    ఈ ప్రపంచాన్ని నడిపించేది మేఖల అందమా?
   
    ఆఫ్ కోర్స్! ఆమె గొప్ప అందగత్తే కావచ్చు-శృంగార ప్రపంచానికి మొదటి మైలు రాయే కావచ్చు-కాని ఆమె అందమే ఒక మహాశక్తయి అట్లాస్ మహావీరుడి భారాన్ని తగ్గించడం లేదుగా?
   
    అణుయుద్దాన్ని ఆపలేదుగా?
   
    ప్రపంచ పేద ప్రజల అవసరాలకు తీర్చటం లేదుగా?
   
    దుఃఖ భాజకమయిన జీవితాల్లోని క్లేశాన్ని తొలగించడం లేదుగా?
   
    ఎదిగీ ఎదగని సమాజంలో ఆమె అద్భుతమైన అందం అందరిచేత నీరాజనాలు పలికించుకుంది.
   
    ఎదిగిన వ్యక్తి ముందు.... ఎంత నామమాత్రమయిపోయింది?
   
    సర్వమానవాళి శ్రేయస్సును ఒక స్త్రీ అందం తెచ్చిపెట్టగలదా?
   
    చరిత్ర పుటల్లో స్త్రీకోసం యుద్దాలు జరిగి వుండవచ్చు. హెలెన్ ఆఫ్ ట్రాయ్....
   
    హెలెన్ అద్భుతమైన అందగత్తే కావచ్చు-
   
    కానీ ఒక్కస్త్రీ కోసం ఎన్ని లక్షల ప్రాణాలు విలవిల్లాడాయి?
   
    ఈజ్ ఇట్ రిజర్వ్స్!
   
    ఒక అందమైన స్త్రీ కోసం లక్షల మందిని బలి పెట్టవచ్చా?
   
    అంత విలువయినదా అందం?
   
    మహావీరుల్ని మట్టి ముద్దలుగా చేయగల అర్హత క్లియోపాత్రాకు వుందా?
   
    ఎదిగీ ఎదగని మనస్తత్వాలతో, వెర్రి వ్యామోహాలతో, తెలీని తనంతో, ఆమెచ్యూర్ ఆలోచనలతో, ప్రేమ ప్రపంచమే సర్వస్వమనుకొని చరిత్ర పుటల్ని అమాయక ప్రజల ఆర్తనాదాలతో లిఖింపజేశారు. అలనాటి రాజులు, రాజ్యాధినేతలు.
   
    అవిప్పుడు సిల్లీగా కనిపించడం లేదూ?
   
    చిరాకనిపించడం లేదూ?
   
    విశ్వమానవాళి శ్రేయస్సు ముందు, సర్వమానవ సమానత్వం ముందు-
   
    ప్రేమ త్యాగాల్ని నించోబెట్టి బారోమీటర్ అందుకుంటే ఎవరయినా వాటి మధ్య తేడాల్ని కొలవగలరా.
   
    మానవాళి బుద్ది వికసించింది.
   
    మనిషి ఇంగిత జ్ఞానాన్ని అలవర్చుకున్నాడు. విచక్షణా జ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు.
   
    ఇప్పుడు సయితం ఒక అందమయిన అందగత్తె కోసం అమెరికా రష్యాల అధినేతలు కలహించుకోగలరా?
   
    కసిగా, ఉక్రోషంతో కాలుదువ్వగలరా?
   
    అదే జరిగితే ప్రపంచ ప్రజ నవ్విపోదూ?
   
    ఆ యిద్దరినీ అల్పుల క్రింద జమకట్టదూ?
   
    ప్రేమ కోసం, ప్రేమించిన యువతి కోసం తన ప్రజ ప్రాణాలను తృణప్రాయంగా భావించే అంధకార యుగం నుంచి మనిషి యెదిగాడు.
   
    ఎదిగిన మనిషిలో వ్యామోహం రూపాంతరం చెందింది.
   
    ఇప్పుడిక అధికారం కోసం, ఆధిపత్యం కోసం, కులం కోసం, మతం కోసం రక్తార్పణకు సిద్దపడుతున్నారు.
   
    ప్రపంచ శాంతి కోసం, సామరస్యం కోసం, విశ్వమానవాళి శ్రేయస్సు కోసం మాత్రమే యెప్పుడు మనిషి శ్రమిస్తాడు?
   
    శాంతి కోసమయినా యుద్ధం చేయక తప్పదు.
   
    వార్ ఫర్ పీస్....
   
    ఇవి సాధించకుండానే కలియుగాంతం జరిగిపోతే మానవజాతి పుట్టుకాకు ఏదయినా అర్ధం పరమార్ధం వుంటుందా?
   
    పుట్టారు ఆపైన గిట్టారు.
   
    "ప్చ్....
   
    తల విదిలించి జ్ఞాపకాల నుంచి తేరుకుంది మేఖల.
   
    ఆ రోజు ఉదయం ట్రైన్ లో వస్తుండగా విమల అన్న మాటలివి.
   
    మనం ఒకరంటే ఒకరం యిష్టపడితే ఆ ఇష్టాన్ని కష్టం లేకుండా కాలహరణం చేయకుండా తీర్చుకుందాం.
   
    ఇప్పటికే జపాన్ మనకన్నా 130 సంవత్సరాల ముందుంది అభివృద్ధి పరంగా.
   
    బాధే సౌఖ్యమైన భావన సొంతమయితే బాగుపడటం గురించి ఆలోచించడం వృధా....
   
    విమల్ అన్న మాటలు ఆమెను తీవ్రంగానే ఆలోచింప జేస్తున్నాయి.
   
    ఆమె తేరుకొని చూసేసరికి విమల్ ఫోన్ తో కుస్తీ పడుతూ కనిపించాడు.
   
    కొద్ది సేపటికి టెలిఫోన్ డైరెక్టరీ సర్వీస్ ఆపరేటర్ ఆ అడ్రస్సు కేంద్ర ఆర్ధికమంత్రి ఆర్యభట్టు అఫీషియల్ రెసిడెన్స్ ది అని చెప్పడంతో విమల్ దిగ్ర్భమలో మునిగిపోయాడు.
   
    "ఏమయింది? ఎవరిదా అడ్రస్....?" మేఖల ఫోన్ ని క్రెడిల్ చేసి ఆలోచిస్తున్న విమల్ కేసి చూస్తూ అడిగింది.
   
    "ఆర్యభట్టు.....ఏషియన్ డ్రామా ది గ్రేట్ పర్సనాలిటీ.... ఫెంటాబ్యులస్ జీనియస్....భారత జాతి మనుగడ కోసం నిరంతరం శ్రమించే నిత్య శ్రామికుడు. భారతీయులంతా తన బిడ్డలని భావించే గొప్ప మానవతావాది. ఎన్నో సందర్భాలలో రాజకీయ వేత్తలకు, ప్రణాళికా రచయితలకు, అధికారులకు అద్భుతమైన సలహాలిచ్చి ఆదుకున్న మేధావి. భారతీయ సంస్క్తుతిలోని ఔన్నత్యానికి ప్రతీక. తన జాతి మొత్తం బాధల నుంచి, భయాల నుంచి, ఆకలినుంచి, అపనమ్మకాల నుంచి, అశాంతి నుంచి బయటపడి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకునే నిస్వార్ధపరుడు. జాతి ప్రజల్లో దైవత్వాన్ని చూడాలనుకునే ఆశాజీవి. అసూయ, ద్వేషం, అహం, స్వార్ధం, కుచ్చితం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, హింస, ప్రతిహింస, మత మౌఢ్యం, కులపిచ్చి, రోగాలు, రొష్టులు లేని అభివృద్ధికరమైన, ఆరోగ్యకరమైన భారతాన్ని చూడాలనుకున్న, నిరంతరాన్వేషి మేగ్నిఫిషియెంట్ పర్సనాలిటీ ఆయన్ని ఒక్కసారి చూడగలిగితే చాలు తమ జన్మ ధన్యమైందని భావించే విదేశస్తులెందరో శాపగ్రస్తుడై కులమతాల కుమ్ములాటల్లో దిగజారిపోయి ప్రవర్తిస్తున్న, నేటి కుక్కమూతి పిందెల మధ్య పెచ్చరిల్లిన, కుళ్ళు కంపును తప్పక భరిస్తున్న గొప్ప మనిషి ఆయన ఇల్లు అది-ఆడమ్ స్మిత్, మార్షల్ ఆత్మలు సంచరించే పవిత్రమైన ప్రదేశం అది. ఆయన రెసిడెన్షియల్ లో నివసిస్తున్న వ్యక్తులలో ఎవరికో ఈ సమస్య వచ్చి వుండాలి. కనీసం ఈ వంకతో నన్నా ఆయన్ని ఒక్కసారి చూడగలిగితే చాలు." ట్రాన్స్ లో ఉనంట్లుగా విమల్ అంటుంటే మేఖల ఆశ్చర్యంగా చూసింది.
   
    కొందరు కనే కొన్నికలలు దిగజారిపోయి వుంటాయి. ఎక్స్ ట్రా మారిటల్ పెళ్ళయిన స్త్రీతోనో, పురుషుడితోనో సెక్సువల్ ఇంటర్ కోర్సులో పాల్గొన్నట్లు కలలు.
   
    ఫలానా వాళ్ళతో ప్రేమలో విజయం సాధించినట్టు, పెళ్ళి చేసుకున్నట్లు కనే యూత్ ఫుల్ డ్రీమ్స్-షార్ట్ స్పేన్.
   
    ప్రపంచమంతా తన ముంగిట వాలాలనే మేడ్ డ్రీమ్స్....కష్టపడకుండానే వీధి మలుపులో కోట్ల ధనరాసులు తనకు ఎదురయి, సొంతం కావాలనుకునే లేజ్ డ్రీమ్స్....
   
    కష్టపడి, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి పైకెళ్ళిపోవాలనుకునే అస్టిమిస్టిక్ డ్రీమ్స్.
   
    తన జాతిప్రజ అంతా అందలం ఎక్కాలనుకునే మోస్టు ఐడియలిస్టిక్ డ్రీమ్స్....వైజ్ డ్రీమ్స్.....ప్రోగ్రెసివ్ డ్రీమ్స్.....ఇవి అంత తేలిగ్గా ఎవరికీ అర్ధంకావేమో....అర్ధమైనా పిచ్చికలలని భ్రమించే ప్రమాదం కూడా వుంది.
   
    "మనమిప్పుడే బయలుదేరుతున్నాం, కమాన్ గెటప్" అన్నాడు విమల్ సోఫాలోంచి లేస్తూ.

 Previous Page Next Page